ట్యాంకర్ల కేటాయింపులో గోల్‌మాల్!
గిరాకీ ఉన్న ఫిల్లింగ్ కేంద్రాల కోసం
పక్కదారులు...
భారీగా ముడుపులు చెల్లిస్తున్న వైనం
కొందరికే ‘గిరాకీ కేంద్రాల’ కేటాయింపు
చోద్యం చూస్తున్న జలమండలి అధికారులు
సిటీబ్యూరో: జలమండలి ట్యాంకర్లకు నీటి ఫిల్లింగ్ కేంద్రాల కేటాయింపు వ్యవహారంలో అవినీతి చోటుచేసుకుంటోంది. చేతులు తడిపిన వారికే గిరాకీ అధికంగా ఉన్న ఫిల్లింగ్ కేంద్రాలను కేటాయిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహా నగరం పరిధిలో జలమండలికి ఉన్న 53 ఫిల్లింగ్ కేంద్రాల వద్ద సుమారు 900 ట్యాంకర్లు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా మంచినీటి కొరత ఉన్న కాలనీలు, బస్తీల్లో ఉన్న గృహ వినియోగదారులు, వాణిజ్య సముదాయాలకు నీటిని సరఫరా చేస్తున్నారు. అయితే ఆయా ఫిల్లింగ్ కేంద్రాల వద్ద నీటిని సరఫరా చేసేందుకు ముందుకొచ్చిన ట్యాంకర్ యజమానులకు కొందరు అధికారులు చుక్కలు చూపుతున్నారు. తమను ప్రసన్నం చేసుకున్నవారికే అధికంగా గిరాకీ(ట్యాంకర్ బుకింగ్‌లు)ఉన్న ఫిల్లింగ్ కేంద్రాలను కేటాయిస్తున్నట్లు పలువురు యజమానులు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా కూకట్‌పల్లి, మాదాపూర్, భరత్‌నగర్, మియాపూర్, ఎన్‌టీఆర్‌నగర్, వైశాలీనగర్ తదితర ఫిల్లింగ్‌కేంద్రాల వద్ద తిష్టవేసేందుకు కొందరు ట్యాంకర్ యజమానులు ట్యాంకరుకు రూ.25 వేల చొప్పున అధికారులకు ఆమ్యామ్యాలు ఇస్తూ ప్రసన్నం చేసుకుంటున్నారని తెలిసింది. దీంతో వారికే తొలిప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిసింది.ఇటీవల ఆన్‌లైన్ ద్వారా ట్యాంకర్లకు దరఖాస్తులు స్వీకరించిన అధికారులు ఫిల్లింగ్ కేంద్రాల కేటాయింపుల్లో మాత్రం పారదర్శకంగా వ్యవహరించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదీ అక్రమాల జాతర...
అధిక గిరాకీ ఉన్న ఫిల్లింగ్ కేంద్రాల వద్ద తిష్టవేసేందుకు కొందరు ట్యాంకర్ యజమానులు ఉన్నతాధికారుల చేతులు తడుపుతున్నారు. డిమాండ్ అధికంగా ఉండే ఫిల్లింగ్ కేంద్రం వద్ద ఒక్కో ట్యాంకరుకు రోజుకు సగటున 8 నుంచి 10 ట్రిప్పుల గిరాకీ ఉంటుంది. మరోవైపు బహుళ అంతస్తుల భవంతులు, మాల్స్, ఆస్పత్రులు, రెస్టారెంట్లు, హాస్టళ్లు, మెస్‌లు,సినిమా, ఫంక్షన్‌హాళ్లకు అదనంగా నీటిని సరఫరా చేసి అందినకాడికి దండుకునే వెసులుబాటు ఉంటుంది. అంతగా గిరాకీ లేని ఫిల్లింగ్ కేంద్రం వద్ద గరిష్టంగా ఐదు ట్రిప్పులు మాత్రమే దక్కుతాయి. దీంతో ట్యాంకర్ యజమానులు గిరాకీ అధికంగా ఉండే ఫిల్లింగ్ కేంద్రం వద్దే తిష్ట వేసేందుకు ముందుకొస్తారు. ఇదే అదనుగా సదరు యజమానుల నుంచి కొందరు అధికారులు లంచం తీసుకుని సదరు ఫిల్లింగ్ కేంద్రాన్ని కేటాయిస్తున్నట్లు తెలిసింది. ఇక అధికారుల కనుసన్నల్లో మెలిగే ట్యాంకర్ యజమానులు గృహవినియోగానికి సరఫరా చేసే ట్యాంకరు(ఐదువేల లీటర్ల సామర్థ్యం)ను వాణిజ్య అవసరాలకు తరలించి అదనంగా దండుకుంటున్నా అధికారులు చోద్యం చూస్తుండడం గమనార్హం.
సాధారణంగా గృహవినియోగానికి ఐదువేల లీటర్ల నీటిని తరలించే ట్యాంకర్‌కు రూ.400, వాణిజ్య అవసరాలకు సరఫరా చేస్తే ప్రతి ట్రిప్పుకు రూ.700 వసూలు చేయాల్సి ఉంటుంది. కానీ గృహవినియోగ ట్యాంకర్‌ను వాణిజ్య అవసరాలకు తరలిస్తే ఒక్కో ట్రిప్పుపై రూ.500 వరకు యజమానికి గిట్టుబాటవుతుంది. ఇలా సగటున ఐదు ట్రిప్పులను పక్కదారి పట్టిస్తే నిత్యం ఒక్కో ట్యాంకరుకు రూ.2500 అదనంగా దండుకునే అవకాశం ఉంటుంది.
మా దృష్టికి రాలేదు
జలమండలి పరిధిలో ఉన్న ఫిల్లింగ్ కేంద్రాల వద్ద ఎన్ని ట్యాంకర్లు అవసరమో స్థానిక జనరల్ మేనేజర్లు నిర్ణయిస్తారు. కానీ ట్యాంకర్లకు ఫిల్లింగ్ కేంద్రాలను కేటాయించే ప్రక్రియ ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయం నుంచే జరుగుతుంది. గిరాకీ లేనందునే కొన్ని ఫిల్లింగ్ కేంద్రాల వద్ద అదనపు ట్యాంకర్లను అనుమతించడంలేదు. ఈవిషయంలో పారదర్శకంగానే వ్యవహరిస్తున్నాం. అక్రమాలు జరుగుతున్నట్లు మా దృష్టికి రాలేదు. ట్యాంకర్ల సంఖ్య అధికంగా ఉండడంతో ప్రస్తుతానికి నూతనంగా ఎవరికీ అవకాశం ఇవ్వడంలేదు. ఆన్‌లైన్‌లో స్వీకరించిన పలు దరఖాస్తులు మావద్ద పెండింగ్‌లో ఉన్నాయి. - పీఎస్.సూర్యనారాయణ,
జలమండలి రెవెన్యూ విభాగం డెరైక్టర్