బచావత్ కేటాయింపులు ఉమ్మడి ఏపీకే..
సాక్షి, హైదరాబాద్: బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు నీటి కేటాయింపులు చేసిందే తప్ప.. తెలంగాణకు చేయలేదని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి జరిగిన చర్చలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జి.చిన్నారెడ్డి మాట్లాడుతూ.. గోదావరి, కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ వాటాను ప్రస్తావించారు. ఉమ్మడి ఏపీలో కృష్ణా వాటా 811 టీఎంసీలకుగాను.. 211 టీఎంసీలు, గోదావరిలో 1,480 టీఎంసీలకు గాను 700 టీఎంసీలు తెలంగాణకు కేటాయించారని చిన్నారెడ్డి వెల్లడించారు.
ఈ దశలో ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకుంటూ.. ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా నుంచి 368 టీఎంసీలు, గోదావరి నుంచి 950 టీఎంసీలు తెలంగాణకు కేటాయించారన్నారు. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులకు సంబంధించిన వివరాలు తన వద్ద వున్నాయని, సభ నుంచి తప్పుడు వివరాలు వెళ్లకూడదనే ఉద్దేశంతో, సవరణ కోసం జోక్యం చేసుకుంటున్నానని సీఎం వ్యాఖ్యానించారు. ఆ తర్వాత చిన్నారెడ్డి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. నికర జలాల ఆధారంగానే ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని కోరారు.