అడ్డగోలు ఆరోపణలు చేస్తే..!
♦ చట్టపరంగా చర్యలు: సీఎం కేసీఆర్
♦ అందుకోసం ‘ప్రూవ్ ఆర్ పెరిష్’ చట్టం తెస్తాం
♦ రాష్ట్రం అభివృద్ధి చెందితే వారికి మనుగడ ఉండదని ప్రతిపక్షాల భయం
♦ అందుకే ప్రజలను తప్పుదారి పట్టించే యత్నం
♦ ప్రాణాన్ని పణంగా పెట్టి తెచ్చిన రాష్ట్రానికి నేను నష్టం చేస్తానా?
♦ గవర్నర్ ప్రసంగంలో ఒక్క అబద్ధం కూడా లేదు..
♦ ఉన్నాయని నిరూపిస్తే ఐదు నిమిషాల్లో రాజీనామా చేస్తా
♦ ప్రతిపక్షాలకు ఓపిక లేకపోతే ఎలాగని నిలదీత
♦ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానం సందర్భంగా సుదీర్ఘ ప్రసంగం
సాక్షి, హైదరాబాద్: కష్టపడి తెచ్చిన తెలంగాణను ఇష్టపడి అభివృద్ధి చేస్తుంటే ప్రతిపక్షాలకు కంటగింపుగా మారిందని.. అనవసరపు ఆరోపణలతో ప్రజలను తప్పు దారి పట్టించే యత్నం చేస్తున్నాయని ముఖ్య మంత్రి కేసీఆర్ మండిపడ్డారు. దీన్ని ఇక సహిం చబోమని.. రుజువులు చూపకుండా ఆరోప ణలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకునేలా ‘ఫ్రూవ్ ఆర్ పెరిష్’చట్టాన్ని తీసుకొస్తామని హెచ్చరించారు. శనివారం శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా కేసీఆర్ సుదీ ర్ఘంగా ప్రసంగించారు. శుక్రవారం నాటి గవ ర్నర్ ప్రసంగం సందర్భంగా విపక్ష సభ్యులు వ్యవహరించిన తీరును తప్పుబట్టారు.
అక్కసు వెళ్లగక్కుతున్నారు
తెలంగాణ సత్వర అభివృద్ధి కోసం చెరువులను బాగు చేసే పని చేపట్టామని.. నాటి కాకతీయ రాజుల ఆశయాలకు తగ్గట్టుగా మిషన్ కాక తీయ పేరు పెట్టామని కేసీఆర్ చెప్పారు. కానీ ప్రతిపక్షాలు దాన్ని కమీషన్ కాకతీయగా అభి వర్ణిస్తూ అక్కసు వెళ్లగక్కుతున్నాయని మండి పడ్డారు. ‘‘ముగ్గురు సభ్యులుండే పార్టీ కూడా అసెంబ్లీలో తాను చెప్పినట్టే జరగాలంటే.. 90 మంది సభ్యులముండే అధికారపక్షం ఏమనుకోవాలి. వాటి ఆటలు సాగనివ్వం. నిరాధారంగా నిందలేస్తే ఇకపడం. అందుకే ‘ప్రూవ్ ఆర్ పెరిష్’చట్టం తెస్తాం. రుజువులు చూపకుండా ఆరోపణలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం..’’అని ముఖ్యమంత్రి ప్రతిపక్షాలను హెచ్చరించారు.
టెన్షన్లు లేని జీవితాన్ని బలిపెట్టి వచ్చా
తన ఇద్దరు పిల్లలు అమెరికాలో స్థిరపడి, ఎలాంటి టెన్షన్లు లేని జీవితాన్ని కాదనుకుని తెలంగాణ సాధన కోసం పోరాటం ప్రారంభించానని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఓ దశలో రాష్ట్రం కోసం ప్రాణాన్నే బలిపెట్టేందుకు సిద్ధపడ్డ తాను తెలంగాణకు నష్టం చేస్తానని ప్రతిపక్షాలు ఎలా అంటాయని ప్రశ్నించారు. ‘‘మంచి చేయకపోయినా పర్వా లేదు. రాష్ట్రానికి చెడు చేసే అధికారం నాకు లేదు. అందుకే పరిస్థితిని గమనిం చేందుకు ఏడాదిన్నర పాటు వేచి చూసి 2016–17లో ప్రణాళికలను పట్టాలెక్కించాం.
సుపరిపాలన వల్ల వృద్ధి రేటు 21 శాతానికి చేరుకుంది. ఇది గుజరాత్‌లో తనవల్ల సాధ్యం కాని వేగమంటూ స్వయంగా ప్రధాని మోదీ భుజాలు తట్టి అభినందించారు. ఇక తెలంగాణ ప్రగతి వేగాన్ని ఎవరూ అడ్డుకోలేరు. కోర్టు కేసులు, స్టేలతో కాంగ్రెస్ నేతలు వేస్తున్న అడ్డుపుల్లలు కేవలం స్పీడ్ బ్రేకర్ల లాంటివే. అవి వేగాన్ని కొంత తగ్గిం చగలవు, కానీ నిలువ రించలేవు..’’అని స్పష్టం చేశారు. గ్రామీణ ఆర్థికవ్యవస్థను పరిపుష్టం చేసేందుకు వ్యవ సాయం, చేపలు, గొర్రెల పెంపకం వంటి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టు తెలిపారు.
నా రాజకీయ జీవితంలో తొలిసారి
గతంలో అసెంబ్లీ సమావేశాలనగానే ఎండిన పైర్లు, ఖాళీ బిందెలు, వెలుగు లేని కందిళ్లు తెచ్చి ప్రదర్శించడం ప్రతిపక్షాలకు అలవాటుగా ఉండేదని సీఎం కేసీఆర్ చెప్పారు. తెలంగాణ వచ్చాక తన రాజకీయ జీవితంలో తొలిసారిగా అలాంటివేవీ లేకుండా సభలు జరగటం చూస్తున్నానని వ్యాఖ్యానించారు. ‘‘విశేష అనుభవం, సేవాభావం ఉన్న అధికారులకు కరెంటు కష్టాలు తీర్చే బాధ్యత అప్పగించా. వారు అద్భుతాలు చేశారు. కరెంటు సమస్య లేకుండా రైతు కళ్లలో ఆనందం నింపటమే కాకుండా పరిశ్రమలు తెలంగాణకు క్యూ కట్టేందుకు కారణమయ్యారు. ఇందుకు కారణమైన ఉన్నతాధికారి నుంచి చిరుద్యోగి వరకు సభ సాక్షిగా చేతులు జోడించి నమస్కరిస్తున్నా..’’అని పేర్కొన్నారు.
నిరూపిస్తే ఐదు నిమిషాల్లో రాజీనామా చేస్తా..
గవర్నర్ ప్రసంగంలో ఒక్క వాక్యం తప్పు లేదని... అబద్ధం చెప్పాల్సిన అవసరం తమకు లేదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ‘‘మేం చెప్పినట్లుగానే 2019 కల్లా లక్ష ఉద్యోగాలు ఇచ్చి తీరుతం. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో 20–24 వేలకు మించి ఉద్యోగాలు ఇవ్వలేదు. అలాంటి మీరు (కాంగ్రెస్ సభ్యులు) గవర్నర్ మాట్లాడితే అపహాస్యం చేస్తారా? ఇదేనా సంస్కారం? నేను చాలెంజ్ చేస్తున్నా. గవర్నర్ ప్రసంగంలో ఒక్క వాక్యం తప్పు ఉన్నా, అతిశయోక్తి ఉన్నట్టు నిరూపించినా.. ఐదు నిమిషాల్లో రాజీనామా చేసి ఇంటికి వెళతా..’’అని సవాల్ చేశారు.
వెకిలిగా ప్రవర్తించినందుకే చర్యలు
గవర్నర్ ప్రసంగించే సమయంలో టీడీపీ సభ్యులు వెకిలిగా, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించడం వల్లే చర్యలు చేపట్టామని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. వారిపై చర్యలు తీసుకుంటే కాంగ్రెస్ వాకౌట్ చేసి వెళ్లిందని.. ప్రతిపక్షాలకు ఓపిక లేకపోతే ఎలాగని ప్రశ్నించారు. గతంలో మైకులు విరగగొట్టలేదా? గవర్నర్‌పై పేపర్లు చించి వేయలేదా అని సభ్యులు మాట్లాడుతున్నారని.. అది ఏపీ శాసనసభ, అప్పుడు పరిస్థితి వేరని చెప్పారు. ఇప్పుడు కూడా అలా జరగాలనడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.
ప్రస్తుత సమావేశాల్లోనే ముస్లిం రిజర్వేషన్ బిల్లు
ముస్లింలు, ఎస్టీల రిజర్వేషన్ల హామీకి కట్టుబడి ఉన్నామని, ఈ సమావేశాల్లోనే బిల్లులు ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పునరుద్ఘాటించారు. సుధీర్ కమిషన్ నివేదిక ఆధారంగా రాష్ట్రంలో ముస్లింల వెనుకబాటును అం చనా వేసేందుకు బీసీ కమిషన్ వివరాలు సేకరిస్తోందని, త్వరలోనే నివేదిక సమర్పిస్తుందని ఆయన పేర్కొన్నారు. జాతీయ రహదారుల విస్తరణ, కాంట్రాక్టు సిబ్బంది సేవల క్రమబద్ధీకరణ, వీఆర్‌ఏల జీతం పెంపు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం, కేజీ టు పీజీ, కొత్త జిల్లాల ఆవిర్భావం, లక్ష ఉద్యోగాల కల్పన తది తర అంశాలపైనా కేసీఆర్ ప్రసంగించారు. హోంగార్డుల క్రమబద్ధీకరణ అంశంపై ఈ సమావేశాల్లోనే ప్రకటన ఉంటుందన్నారు. తమది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని కేసీఆర్ పేర్కొన్నారు.