నేటి నుంచే బడ్జెట్ సమావేశాలు
♦ తొలి రోజున అసెంబ్లీ, మండలి సంయుక్త సమావేశం
♦ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం
♦ 13న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న సర్కారు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభ మవుతున్నాయి. తొలి రోజున శాసనసభ, శాసన మండలిల సంయుక్త సమావేశం జరగనుంది. ఉదయం 10 గంటలకు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ నర సింహన్ ప్రసంగిస్తారు. అనంతరం సభలు వాయిదా పడనున్నాయి. 13న (సోమ వారం) ప్రభుత్వం శాసన సభలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ వ్యయాలతో పాటు వివిధ శాఖలు, పథ కాలు, కార్యక్రమాలకు కేటాయించే నిధుల పద్దులను ప్రకటించనుంది. మరోవైపు ప్రభుత్వాన్ని వివిధ అంశాలపై నిలదీసేం దుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. దీంతో సమావేశాలపై ఉత్కంఠ నెలకొంది.
గవర్నర్ ప్రసంగానికి మూడు రోజుల కిందే ఆమోదం
గతేడాది ప్రభుత్వం వివిధ రంగాల్లో సాధించిన విజయాలతో పాటు ఎంచుకున్న ప్రాధాన్యతలు, ప్రభుత్వ లక్ష్యాలను గవర్నర్ తన ప్రసంగంలో వివరించనున్నారు. ప్రభుత్వం గ్రామీణ ఆర్థికాభివృద్ధి, సంక్షేమమే ఎజెండాగా కొత్త కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్న నేపథ్యంలో గవర్నర్ ప్రసంగంలో ఉండే అంశాలు ప్రాధాన్యాన్ని సంతరించు కోనున్నాయి. కాగా గవర్నర్ ప్రసంగానికి రాష్ట్ర మంత్రివర్గం మూడు రోజుల కిందే ఆమోదం తెలిపింది. బడ్జెట్ సమావేశాలకు ముందు కేబినెట్ భేటీ ఏర్పాటు చేసి గవర్నర్ ప్రసంగాన్ని ఆమోదించే ఆనవా యితీ ఉంది. కానీ అందుకు భిన్నంగా ఈసారి సర్క్యులేషన్ పద్ధతిలోనే మంత్రుల సంతకాలు సేకరించి ఆమోదం తెలిపారు.
బీఏసీలో పనిదినాల ఖరారు
తొలిరోజున సభలు వాయిదా పడిన తర్వాత స్పీకర్ మధుసూదనాచారి సమక్షం లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన అసెంబ్లీలో బీఏసీ సమావేశం జరుగనుంది. బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, బడ్జెట్‌పై సాధారణ చర్చకు ఎన్ని రోజులు.. వివిధ పద్దులపై చర్చకు ఎంత సమయం కేటాయించాలనేది ఆ భేటీలో ఖరారు చేస్తారు.