గవర్నర్ ప్రసంగంపై కేబినెట్ భేటీ లేనట్లే!
ఇప్పటికే సర్క్యులేషన్ పద్ధతిలో మంత్రివర్గం ఆమోదం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ, మండలి ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ చేసే ప్రసంగాన్ని రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. బడ్జెట్ సమావేశాల తొలి రోజున రెండు సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. ఆనవాయితీ ప్రకారం గవర్నర్ ప్రసంగాన్ని ఆమోదించేందుకు బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ఒకట్రెండు రోజుల ముందు మంత్రివర్గం భేటీ అవుతుంది. ఈనెల 10 నుంచి అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. దీంతో 8, 9 తేదీల్లో కేబినెట్ భేటీ జరగాల్సి ఉండగా ఈలోపే సర్క్యులేషన్ పద్ధతిలో సంతకాలు చేసి గవర్నర్ ప్రసంగాన్ని మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.
హైదరాబాద్‌లో అందుబాటులో లేని కారణంగా మంత్రి జూపల్లి కృష్ణారావు తప్ప మిగతా మంత్రులందరూ సంతకాలు చేసినట్లు తెలిసింది. ఈనెల 13న రాష్ట్ర ప్రభుత్వం 2017–18 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ముందు రోజు సాయంత్రం, లేదా 13న ఉదయం అసెంబ్లీ ప్రాంగణంలోనే కేబినెట్ భేటీ అయి బడ్జెట్‌ను ఆమోదించే అవకాశాలున్నాయి.