State cabinet
-
ఖరారైన చంద్రబాబు మంత్రివర్గం
సాక్షి, అమరావతి: రాష్ట్ర మంత్రివర్గంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కసరత్తు మంగళవారం అర్ధరాత్రి దాటాక కొలిక్కి వచ్చింది. కేబినెట్లో చంద్రబాబుతో కలిపి మొత్తం 25 మంది పేర్లను ఒకేసారి ప్రకటించారు. ఉపముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు అవకాశం దక్కగా.. ఈ జాబితాలో చంద్రబాబు తనయుడు లోకేశ్‌కు కూడా చాన్స్ ఇచ్చారు. జనసేనకు మొత్తం మూడు, బీజేపీకి ఒకటి చొప్పున మంత్రి పదవులు కేటాయించారు. మంత్రుల జాబితాను గవర్నర్‌కు పంపారు. ఈ మంత్రులు కూడా నేడు చంద్రబాబుతో కలసి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రి పదవులు దక్కించుకున్న వారికి చంద్రబాబు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక సామాజిక వర్గాల వారీగా చూస్తే మంత్రివర్గంలో 8 బీసీ, 5 కమ్మ, 4 కాపు, 3 రెడ్డి, 2 ఎస్సీ, వైశ్య, ఎస్సీ, మైనార్టీలకు ఒక్కొక్కటి చొప్పున కేటాయించారు. ఏపీ కేబినెట్ ఇదే.. 1. నారా చంద్రబాబు నాయుడు (కమ్మ) 2. కొణిదెల పవన్ కళ్యాణ్ (జనసేన–కాపు) 3. కింజరాపు అచ్చెన్నాయుడు (బీసీ) 4. కొల్లు రవీంద్ర (బీసీ) 5. నాదెండ్ల మనోహర్ (జనసేన–కమ్మ) 6. పి.నారాయణ (కాపు) 7. వంగలపూడి అనిత (ఎస్సీ) 8. సత్యకుమార్ యాదవ్ (బీజేపీ–బీసీ) 9. నిమ్మల రామానాయుడు (కాపు) 10. ఎన్.ఎమ్.డి.ఫరూక్ (మైనారీ్ట) 11. ఆనం రామనారాయణరెడ్డి (రెడ్డి) 12. పయ్యావుల కేశవ్ (కమ్మ) 13. అనగాని సత్యప్రసాద్ (బీసీ) 14. కొలుసు పార్థసారధి (బీసీ 15. డోలా బాలవీరాంజనేయస్వామి (ఎస్సీ) 16. గొట్టిపాటి రవి (కమ్మ) 17. కందుల దుర్గేష్ (జనసేన–కాపు) 18. గుమ్మడి సంధ్యారాణి (ఎస్టీ) 19. బీసీ జనార్దన్ రెడ్డి (రెడ్డి) 20. టీజీ భరత్ (వైశ్య) 21. ఎస్.సవిత (బీసీ) 22. వాసంశెట్టి సుభాష్ (బీసీ) 23. కొండపల్లి శ్రీనివాస్ (బీసీ) 24. మండిపల్లి రామ్ ప్రసాద్‌రెడ్డి (రెడ్డి) 25. నారా లోకేశ్ (కమ్మ) -
జూన్ 2న సోనియాతో సభ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటై పదేళ్లు పూర్తవుతుండటం, రాష్ట్రంలో తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. జూన్ 2న భారీ బహిరంగ సభ నిర్వహించి, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాందీతోపాటు తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్న పెద్దలందరినీ పిలిచి సన్మానం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు అనుమతి కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయనుంది. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేసిన తీర్మానాన్ని రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కూడా ఆ సభకు పిలుస్తామని.. ఈ విషయంలో భేషజాలు లేవని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. ‘బీఆర్ఎస్ ప్రభుత్వం గత ఏడాదే తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను నిర్వహించిందని, ఇప్పుడు మళ్లీ నిర్వహిస్తారా?’ అని మీడియా ప్రశ్నించగా.. ‘‘తెలంగాణ వచ్చి 10 ఏళ్లు అయింది అప్పుడా? ఇప్పుడు అవుతోందా అన్న విషయం అందరికీ తెలుసు..’’ అని మంత్రి పొంగులేటి బదులిచ్చారు. తడిసిన ధాన్యమంతా కొనుగోలు.. ఇటీవలి అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించిందని మంత్రి పొంగులేటి చెప్పారు. రైతులెవరూ ఆందోళన చెందవద్దని, మద్దతు ధరకు ఒక్క రూపాయి తగ్గించకుండా తడిసిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. విపక్షాల మాయమాటలను నమ్మవద్దని పేర్కొన్నారు. యాసంగిలో పండించిన 36లక్షల టన్నుల ధాన్యాన్ని పౌర సరఫరాల శాఖ సేకరించిందని.. దేశంలో, రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా రైతులకు 3 రోజుల్లోపే చెల్లింపులు చేసిందని చెప్పారు. కాగా.. ఒక్క గింజ తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేశామని, ఎక్కడైనా తరుగు తీస్తే చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. వర్షాలతో దెబ్బతిన్న పంటల వివరాలను వ్యవసాయ శాఖ సమరి్పంచిందని.. బాధిత రైతులకు పరిహారం చెల్లించాలని నిర్ణయించామని వివరించారు. రైతు భరోసా పథకం ఎప్పుడు ప్రారంభిస్తారని మీడియా ప్రశ్నించగా.. విధివిధానాలను తయారు చేయాల్సి ఉందని చెప్పారు. ఆధునిక పాఠశాలలుగా తీర్చిదిద్దుతాం.. జూన్ 12 నుంచి బడులు పునఃప్రారంభం అవుతున్న నేపథ్యంలో.. అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా ప్రభుత్వ స్కూళ్ల నిర్వహణ చేపట్టాలని కేబినెట్ నిర్ణయించినట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. కమిటీల ఆధ్వర్యంలో నెల రోజుల్లోగా వాటిని ఆధునిక పాఠశాలలుగా తీర్చిదిద్దుతామన్నారు. ఇందుకోసం రూ.600 కోట్లను కేటాయించామని.. అడ్వాన్స్‌గా రూ.120 కోట్లను విడుదల చేశామని తెలిపారు. అమ్మ ఆదర్శ కమిటీల్లో ప్రధానోపాధ్యాయులు, స్వశక్తి సంఘాల మహిళలు ఉంటారన్నారు. ఈ అంశంపై మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. మూసివేసిన పాఠశాలలు తెరుస్తాం హేతుబదీ్ధకరణ పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం మూసివేసిన 5,600 ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి.. విద్యార్థులు వచ్చేవాటిని తిరిగి ప్రారంభించాలని నిర్ణయించినట్టు మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. పాఠశాల, సాంకేతిక, ఉన్నత విద్యతోపాటు ఉపాధి కలి్పంచే నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేయాలని.. మంచి మార్పు చూపించాలని కేబినెట్లో సుదీర్ఘంగా చర్చించామన్నారు. నాణ్యమైన విద్యతోపాటు మౌలిక సదుపాయాలు, బోధన, బోధనేతర అంశాలపై దృష్టి పెడతామని చెప్పారు. మరుగుదొడ్లు, పెయింటింగ్, ఇతర అన్ని హంగులతో ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దుతామన్నారు. విద్యార్థులకు యూనిఫారాలను కుట్టే బాధ్యతను మహిళా సంఘాలకు ఇచ్చామని.. ప్రతి విద్యార్థికి రెండు జతలు సరఫరా చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలోని కమిటీ ఫీజుల నియంత్రణ అంశాన్ని పరిశీలిస్తుందని పొంగులేటి తెలిపారు. టెస్టుల తర్వాతే బ్యారేజీలకు మరమ్మతులు కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల విషయంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నిపుణుల కమిటీ మూడు కీలక సిఫార్సులు చేసిందని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌బాబు తెలిపారు. ‘‘బ్యారేజీల గేట్లన్నీ ఎత్తి ఉంచాలని నిపుణుల కమిటీ చెప్పింది. డబ్బులు ఖర్చు చేసి మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు చేసినా అది ఉంటుందో లేదో నమ్మకం ఇవ్వలేమని పేర్కొంది. బ్యారేజీలకు జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షలు నిర్వహించాలని సిఫారసు చేసింది. బ్యారేజీలకు పరీక్షలు పూర్తయ్యే వరకు తదుపరిగా ఏ రకమైన పనుల చేపట్టవద్దని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మూడు కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పరీక్షలు నిర్వహించాలని.. ప్రతి బ్యారేజీకి రెండు సంస్థలతో పరీక్షలు నిర్వహించి, రెండింటి అభిప్రాయాల ఆధారంగా మరమ్మతులు చేయాలని నిర్ణయించాం..’’ అని వెల్లడించారు. ఈ పరీక్షలు త్వరగా నిర్వహించేలా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లి ఎన్డీఎస్ఏతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపారు. బ్యారేజీల్లో రాళ్ల కట్టతో పంపింగ్‌కు ప్రయతి్నస్తాం.. కాళేశ్వరం బ్యారేజీల పరిధిలో తక్కువ ఖర్చుతో రాళ్ల కట్టను నిర్మించి.. నీళ్లను పంపింగ్ చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులను మంత్రివర్గం ఆదేశించిందని మంత్రి పొంగులేటి చెప్పారు. ప్రాజెక్టుపై గత ప్రభుత్వం చేసిన ఖర్చు వృథా కాకుండా.. నిపుణుల సూచనలతో తాత్కాలిక ఏర్పాట్లు చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. గత ప్రభుత్వ తప్పును సాకుగా చూపి రైతులను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం తమకు లేదన్నారు. ధర్నాల పేరుతో డ్రామాలు.. ధాన్యం కొనుగోళ్ల పరిశీలన కోసం కలెక్టర్లను క్షేత్రస్థాయికి వెళ్లాలని ఆదేశించినట్టు మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. ధర్నాల పేరుతో డ్రామాలు చేశారని, వారు రైతులకు ఏం చేశారో అందరికీ తెలుసని బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేయబోతున్నామని చెప్పారు. సన్న ధాన్యం పండిస్తే రూ.500 బోనస్ వచ్చే వానాకాలంలో సన్న ధాన్యం పండించిన రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ చెల్లించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఆ సన్నవడ్ల రకాలను వ్యవసాయ శాఖ ప్రకటించనుంది. బడుల్లో మధ్యాహ్న భోజనానికి, హాస్టళ్లకు విద్యార్ధి, రెండు రూపాయలకే కిలో బియ్యం వంటి పథకాలకు ఏటా 36 లక్షల టన్నుల బియ్యం అవసరం కాగా.. వాటన్నింటికీ సన్న బియ్యం ఇస్తామని గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చామని మంత్రి పొంగులేటి చెప్పారు. బయటి రాష్ట్రాల నుంచి సన్నబియ్యం కొనుగోలు చేయవద్దని నిర్ణయం తీసుకున్నామని, అందుకే రాష్ట్రంలో సన్నబియ్యం పండించిన రైతులకు బోనస్ చెల్లిస్తామని వివరించారు. విత్తనాలు, ఎరువులు, ఇతర అవసరాలకు ఇబ్బంది రావద్దని.. నకిలీ విత్తనాల తయారీదారులు, విక్రయదారులు, నకిలీ రశీదులు జారీ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారని చెప్పారు. రైతులు లూజు విత్తనాలు కొనవద్దని, కంపెనీల వద్దే కొనాలని, సాగు ముగిసేవరకు రసీదులు దాచిపెట్టుకోవాలని సూచించారు. -
ఎమ్మెల్సీలపై మళ్లీ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్‌కుమార్, కుర్ర సత్యనారాయణలను నియమించాలంటూ రాష్ట్ర కేబినెట్ చేసిన సిఫార్సు లపై గవర్నర్ వ్యవహరించిన తీరు సరికాదని రాష్ట్ర హైకోర్టు పేర్కొంది. సదరు సిఫార్సులను తిరస్క రిస్తూ 2023 సెప్టెంబర్ 19న గవర్నర్ ఇచ్చిన ఆదేశా లను రద్దు చేసింది. దీంతోపాటు గవర్నర్ ఆదేశాల మేరకు కోదండరామ్, ఆమెర్ అలీఖాన్‌లను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ ఈ ఏడాది జనవరి 27న ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌ను కూడా రద్దు చేసింది. మళ్లీ కొత్తగా ఎమ్మెల్సీల నియామకం చేపట్టాలని.. మరోసారి ఎమ్మెల్సీల పేర్లను కేబినెట్ లో ప్రతిపాదించి గవర్నర్‌కు పంపాలని స్పష్టం చేసింది. ఈ మేరకు గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక వివాదంపై దాఖలైన పిటిషన్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్ కుమార్ జూకంటిల ధర్మాసనం గురువారం కీలక తీర్పు వెలువరించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 171 (5) ప్రకారం.. కేబినెట్ సాయం, సలహా మేర కు గవర్నర్ వ్యవహరించాల్సి ఉంటుందని పేర్కొంది. కేబినెట్ సిఫార్సు చేసిన వ్యక్తుల అర్హత, అనర్హత అంశాలను పరిశీలించడానికి గవర్నర్‌కు అధికారం ఉంటుందని.. కావాలంటే అవసరమైన పత్రాలు, సమాచారం కోరవచ్చని తెలిపింది. కేబినెట్ సిఫార్సులను పునఃపరిశీలనకు పంపే అధికారం కూడా ఉంటుందని స్పష్టం చేసింది. వాస్తవానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 361 ప్రకారం కోర్టుకు గవర్నర్ జవాబుదారీ కాదని.. గవర్నర్‌కు కోర్టులు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేవని పేర్కొంది. కానీ హైకోర్టుకు న్యాయసమీక్ష చేసే అధికారం ఉంటుందని వివరించింది. ‘గవర్నర్ కోటా’ పిటిషన్లపై వాదనలను పరిశీలించాక.. రాజ్యాంగంలోని నిబంధనలకు అనుగుణంగా తగిన చర్య తీసుకోవాలని భావించి తీర్పునిస్తున్నట్టు తెలిపింది. ఇక అప్పటి కేబినెట్ సిఫార్సులను అమలు చేయాలన్న పిటిషనర్ల డిమాండ్‌పై చర్చ అనవసరమని.. వారు గవర్నర్ తిరస్కరించడాన్ని మాత్రమే సవాలు చేశారని పేర్కొంది. ‘గవర్నర్ కోటా’వివాదం ఇదీ.. 2023 జూలై 31న భేటీ అయిన గత ప్రభుత్వ కేబినెట్ గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బీఆర్ఎస్ నాయకులు దాసోజు శ్రవణ్‌కుమార్, కుర్ర సత్యనారాయణల పేర్లను గవర్నర్‌కు సిఫార్సు చేసింది. గవర్నర్ ఈ సిఫార్సులను తిరస్కరిస్తూ సెప్టెంబర్ 19న ఆదేశాలు జారీ చేశారు. దీంతో గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లు విచారణలో ఉండగానే.. కొత్త ప్రభుత్వ కేబినెట్ సిఫార్సు మేరకు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరామ్, జర్నలిస్టు ఆమెర్ అలీఖాన్‌ల నియామకానికి గవర్నర్ ఆమోదం తెలిపారు. ఈ ఏడాది జనవరి 27న ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఈ నియామకాలను కూడా శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టులో సవాల్ చేశారు. రెండు అంశాలపైనా హైకోర్టు సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది. కోదండరామ్, ఆమెర్ అలీఖాన్‌ను ప్రధాన పిటిషన్లో ఇంప్లీడ్ చేసింది. వారి ప్రమాణస్వీకారంపైనా స్టే ఇచ్చింది. తాజాగా తీర్పు వెలువరించింది. గవర్నర్ నిర్ణయం అభ్యంతరకరం! ‘‘దాసోజు శ్రవణ్ రాజకీయ నాయకుడన్న కారణంగా గవర్నర్ తిరస్కరించారు. తర్వాత నియామకమయ్యే వారు కూడా రాజకీయాలకు సంబంధం లేకుండా ఉండాలి. కానీ నియామకమైన వారు కూడా రాజకీయ నాయకులే. అందులో ఒకరు రాజకీయ పార్టీనే నడిపిస్తున్నారు’’ అని హైకోర్టులో దాసోజు శ్రవణ్ తరఫున సీనియర్ న్యాయవాది ఆదిత్యా సోంధీ వాదనలు వినిపించారు. ‘‘గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వ అర్హతలకు.. పిటిషనర్ల నామినేషన్ తిరస్కరణ కారణాలకు పొంతన లేదు. మంత్రివర్గ సిఫార్సులను తిరస్కరించే అధికారం గవర్నర్‌కు లేదు. దీనిపై సుప్రీంకోర్టు తీర్పులున్నాయి. గవర్నర్‌కు అభ్యంతరం ఉంటే పునః పరిశీలన కోసం వెనక్కి పంపవచ్చు. గవర్నర్ తిరస్కరణ కారణంగా హక్కును కోల్పోయిన పిటిషనర్‌కు కోర్టును ఆశ్రయించే అర్హత ఉంటుంది. శ్రవణ్, సత్యనారాయణల పేర్లను నెలల తరబడి పరిశీలించిన గవర్నర్.. కోదండరామ్, ఆమెర్ అలీఖాన్‌ల పేర్లను మాత్రం కొత్త కేబినెట్ సిఫార్సు చేసిన వెంటనే ఆమోదించింది’’ అని వివరించారు. కుర్ర సత్యనారాయణ తరఫున సీనియర్ న్యాయవాది మయూర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘‘మంత్రి మండలి సిఫార్సులను గవర్నర్ వెనక్కి పంపడానికి, తిరస్కరించడానికి తేడా లేదని పేర్కొనడం సరికాదు. ప్రభుత్వం సిఫార్సు చేసిన అభ్యర్థులపై గవర్నర్‌గా సంతృప్తి చెందడం వేరు.. ఓ వ్యక్తిగా సంతృప్తి చెందడం వేరు. పిటిషనర్ల పేర్లను గవర్నర్ వ్యక్తిగతంగా తిరస్కరించినట్టు కనిపిస్తోంది’’ అని పేర్కొన్నారు. గవర్నర్.. రబ్బర్ స్టాంప్ కాదు.. ‘‘ఎవరికైనా రాజ్యాంగం అనేది సుప్రీం. దాన్ని ఎవరైనా అనుసరించాలి. భాషాపరమైన, సైన్స్ వంటి రంగాల్లో సేవలందించిన వారిని మంత్రి మండలి సిఫార్సు చేయాలి. అలా కాకుండా రాజకీయ విభాగాలకు చెందిన వారిని సిఫార్సు చేస్తే.. కారణాలను పేర్కొంటూ తిస్కరించే అధికారం గవర్నర్‌కు ఉంటుంది. గవర్నర్ రబ్బర్ స్టాంప్ కాదు. గవర్నర్ తిరస్కరించిన తర్వాత వేరేవారి పేర్లు పంపడానికి ప్రభుత్వానికి అవకాశం ఉన్నా పంపలేదు. మంత్రి మండలి సిఫార్సులను వెనక్కి పంపిన గవర్నర్ చర్యలను అలహాబాద్, బాంబే హైకోర్టులు గతంలో సమర్థించాయి. కోదండరామ్, ఆమెర్ అలీఖాన్‌లను గవర్నర్ నేరుగా ఏమీ నియమించలేదు. మంత్రి మండలి సిఫార్సు చేసిన తర్వాత.. ఆయా రంగాల్లో వారు చేసిన సేవను పరిశీలించి ఆమోదముద్ర వేశారు’’ అని కోదండరామ్, అలీఖాన్‌ల తరఫు సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ కోర్టుకు విన్నవించారు. ప్రభుత్వ సిఫార్సు మేరకే నియామకం.. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) వాదనలు వినిపిస్తూ.. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఇద్దరి పేర్లను ఎమ్మెల్సీలుగా సూచిస్తూ జనవరి 24న ప్రభుత్వం సిఫార్సు చేసిందని, దాన్ని పరిశీలించాకే గవర్నర్ ఆమోదించారని వివరించారు. ఇదంతా చట్టప్రకారమే జరిగిందన్నారు. గతంలో ప్రభుత్వం చేసిన సిఫార్సులను పక్కకుపెట్టే అధికారం ఇప్పుడున్న సర్కార్‌కు ఉంటుందని స్పష్టం చేశారు. – గవర్నర్ కార్యదర్శి తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.అశోక్ ఆనంద్‌కుమార్ వాదనలు వినిపిస్తూ.. ‘‘గవర్నర్ నిర్ణయాలను కోర్టులు విచారించలేవు. రాజ్యాంగం గవర్నర్ విచక్షణాధికారాలకు పూర్తి రక్షణ కల్పించింది. గవర్నర్ విచక్షణ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి మంత్రి మండలి సలహాపై.. మరొకటి సొంత విచక్షణాధికారం. ప్రజాప్రతినిధుల కోటా కింద ఎమ్మెల్సీగా ఎన్నుకునే అవకాశం ఎమ్మెల్యేలకు ఎలా ఉంటుందో.. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలను నియమించే విచక్షణాధికారాలు గవర్నర్‌కు ఉన్నాయి’’ అని వివరించారు. -
9న రాష్ట్ర కేబినెట్ భేటీ!
సాక్షి, హైదరాబాద్: శాసనసభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ప్రస్తుత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమీక్షించడం, కొత్త పథకాలపై నిర్ణయం తీసుకోవడం కోసం రాష్ట్ర కేబినెట్ ఈ నెల 9న సమావేశం కానుంది. ఆ రోజున మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఈ భేటీ మొదలుకానుంది. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం. గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలలో ఇంకా అమలుకాని వాటిని సమీక్షించనున్నట్టు తెలిసింది. నిరుద్యోగ భృతి, సొంత స్థలాలున్న వారికి ఇంటి నిర్మాణం కోసం రూ.3లక్షల చొప్పున ఆర్థికసాయం వంటి పథకాల అమలుకు అవకాశాలపై చర్చించనున్నట్టు సమాచారం. ఇక పేదలకు ఇళ్ల పట్టాలు, గిరిజన రైతులకు పోడు పట్టాల పంపిణీ, దళితబంధు అమలు, రైతు రుణమాఫీ, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి మరిన్ని నోటిఫికేషన్లు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు తదితర అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. చివరిగా గత నెల 5న ప్రగతిభవన్‌లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైనా.. కేవలం బడ్జెట్ ప్రతిపాదనలను ఆమోదానికి పరిమితమైంది. మంత్రివర్గ ఉప సంఘం ప్రతిపాదనలపై చర్చ రుణ పరిమితిపై కేంద్ర ప్రభుత్వ ఆంక్షల కారణంగా రాష్ట్రం కొత్త రుణాలను సమీకరించలేకపోతోంది. రాష్ట్రంలో కీలక సాగునీటి ప్రాజెక్టులు, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పనులు ముందుకు సాగడం లేదు. ఈ క్రమంలో ప్రత్యామ్నాయ మార్గాల్లో ఆదాయ సమీకరణకు ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం పలుమార్లు సమావేశమై ప్రతిపాదనలను సిద్ధం చేసింది. గతంలో బాలానగర్ కో–ఆపరేటివ్ సొసైటీ, హఫీజ్‌పేట మినీ ఇండ్రస్టియల్ ఎస్టేట్, ఆజామాబాద్ ఇండ్రస్టియల్ ఏరియాల నుంచి పలు పరిశ్రమలను నగర శివార్లలోకి తరలించారు. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించిన స్థలాలను క్రమబద్దీకరించాలని మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదించింది. దీనిద్వారా ప్రభుత్వానికి రూ.3వేల కోట్ల ఆదాయం రానుంది. వాలంతరి భూములను ప్లాట్లుగా విభజించి విక్రయించాలనే ప్రతిపాదన కూడా సిద్ధమైంది. వీటిపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. మొత్తంగా కేబినెట్ భేటీలో కీలక ప్రకటనలు వెలువడవచ్చని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
రూ.2.65 లక్షల టిడ్కో ఇల్లు ఒక్క రూపాయికే
సాక్షి, అమరావతి: పాలకుడికి మనసుంటే పేదలకు ఎంత మేలు జరుగుతుందో మరోసారి రుజువైంది. 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఏపీ టిడ్కో ఇళ్లను కేవలం ఒక్క రూపాయికే లబ్ధిదారులకు అందించాలన్న నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించింది. పేదలపై రుణభారం మోపిన టీడీపీ సర్కారు.. రాష్ట్ర పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీ టిడ్కో) 88 మున్సిపాలిటీల పరిధిలో జీ + 3 విధానంలో గృహ సముదాయాలు నిర్మించింది. వాటిల్లో 300 ఎస్ఎఫ్టీ ఇళ్ల యూనిట్ ధర రూ.2.65 లక్షలుగా నిర్ణయించింది. అలా 1,43,600 యూనిట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టింది. ముందుగా రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.500 చొప్పున చెల్లించాలని పేర్కొంది. ఇక ఇళ్ల ధర రూ.2.65 లక్షలు బ్యాంకు రుణంగా ఇప్పిస్తామని, లబ్ధిదారులు ఏళ్ల తరబడి ప్రతి నెలా వడ్డీ చెల్లించాలని తెలిపింది. ఒక్క రూపాయికే ఇచ్చేద్దాం.. 300 ఎస్ఎఫ్టీ విస్తీర్ణంలోని ఇళ్లలో ఉండేందుకు సిద్ధపడ్డారంటేనే ఆ లబ్ధిదారులు పేదవారని సీఎం జగన్ గుర్తించారు. నిరుపేదలపై రూ.2.65 లక్షల చొప్పున రుణభారం మోపితే ఎన్నాళ్లకు తీర్చగలరనే ఉద్దేశంతో ఆ లబ్ధిదారులకు ఇళ్లను కేవలం ఒక్క రూపాయికే ఇవ్వాలని చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. అంటే ఇక బ్యాంకు రుణం లేదు... వడ్డీలూ ఉండవు. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.500 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఎవరైనా రూ.500 చెల్లిస్తే ఆ మొత్తం వెనక్కి ఇచ్చేస్తారు. కేవలం ఒక్క రూపాయి చెల్లించి 300 ఎస్ఎఫ్టీ ఇంటిని సొంతం చేసుకునే అపూర్వ అవకాశాన్ని సీఎం జగన్ పట్టణ పేదలకు కల్పించారు. దీని వల్ల 1,43,600 మందికి రూ.3,812.58 కోట్ల మేర ప్రయోజనం కలగనుంది. -
సంక్షేమమే శ్వాసగా..
సాక్షి, అమరావతి: ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో ఇది ప్రతిబింబించిందని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. త్వరలో జరిగే పురపాలక, పరిషత్ ఎన్నికల్లోనూ ఇదే స్ఫూర్తి కొనసాగాలని ఆకాంక్షించారు. శాశ్వత విజయానికి ప్రజల విశ్వాసం పొందడమే నేటితరం రాజకీయమని సూచించారు. ఆ దిశగా ప్రభుత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు క్షేత్రస్థాయిలో పునాదులు పటిష్టం చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. మంగళవారం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సందర్భంగా తాజా పంచాయతీ ఎన్నికల ఫలితాలతో పాటు పలు రాజకీయ అంశాలపై చర్చ జరిగింది. విశ్వసనీయ సమాచారం మేరకు ఆ వివరాలివీ.. ప్రజలే మనకు శ్రీరామరక్ష.. పంచాయతీ ఎన్నికల్లో 81 శాతం విజయంతో వైఎస్సార్సీపీకి జనం మద్దతివ్వడానికి సుపరిపాలనే కారణమని పలువురు మంత్రులు ప్రస్తావించారు. ఏడాదిన్నరగా అమలవుతున్న పథకాల పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. విశ్వసనీయతే కొలమానంగా సరికొత్త రాజకీయాలు తెచ్చామని, ప్రజలను ఓటుబ్యాంకుగా భావించే వారెవరూ ప్రజా మద్దతు కూడగట్టలేరన్న భావనను సీఎం వ్యక్తం చేశారు. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఉన్న ప్రభుత్వాన్ని ఎంతకైనా తెగించి కాపాడుకునేందుకు సిద్ధమవుతారని చెప్పారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని క్షేత్రస్థాయిలో ప్రజల మనోగతాన్ని అన్ని వేళలా గుర్తించాలని సూచించారు. విష ప్రచారాన్నే నమ్ముకున్న విపక్షం ఏ ఎన్నికల్లోనైనా ప్రజల్లోకి వెళ్లేందుకు సంక్షేమ పథకాలే వైఎస్సార్సీపీ బ్రహ్మాస్త్రాలుగా మంత్రివర్గం భావించింది. పథకాల అమలులో లోపాలను గుర్తించే సత్తాలేని టీడీపీ విష ప్రచారాన్ని నెత్తికెత్తుకున్న తీరుపై సమావేశంలో చర్చ జరిగింది. సంక్షేమ పథకాలను అడ్డుకునేందుకు టీడీపీ ఎంతకైనా తెగిస్తుందని సీఎం గుర్తు చేశారు. ఈ దిశగా అన్ని వ్యవస్థలను వాడుకునేందుకు ఏమాత్రం వెనుకాడబోదని, పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకోవడం, మత విద్వేషాలు రెచ్చగొట్టే అంశాలను ముందుకు తేవడం లాంటి కుట్రలు జరిగాయన్నారు. సున్నితమైన అంశాల పట్ల అప్రమత్తంగా ఉంటూ టీడీపీ కుట్రలను తిప్పికొట్టాలని మంత్రులకు సూచించారు. విపక్షం విమర్శలను తిప్పికొట్టడం ఎంత ముఖ్యమో ప్రజలకు సంక్షేమ ఫలాలను నిబద్ధతతో అందించడం కూడా అంతే ముఖ్యమన్నారు. ప్రజా ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం ఏమాత్రం రాజీ పడదన్న బలమైన సంకేతాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్తే తప్పుడు ప్రచారం చేసే విపక్షం వైఖరిని ప్రజలే అర్థం చేసుకుంటారని చెప్పారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు కేంద్రంపై తెస్తున్న ఒత్తిడిని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఏ పోరాటానికైనా సిద్ధమనే సంకేతాలు ఇప్పటికే ఇచ్చిందని, టీడీపీ మాత్రం రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతోందని చెప్పారు. పథకాలే ఊపిరి.. పేదలు, బడుగు వర్గాల స్థితిగతులను మార్చే దిశగా తెస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని మంత్రివర్గం అభిప్రాయపడింది. ముఖ్యమంత్రి ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ పథకాల రూపకల్పనతోనే సరిపోదని క్షేత్రస్థాయిలో అమలు తీరును నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. కులమతాలు, రాజకీయాలకు అతీతంగా ఇంటి వద్దకే చేరవేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, గత ప్రభుత్వాలకు భిన్నంగా సాగుతున్న పారదర్శక పాలనను స్వాగతిస్తున్నారని తెలిపారు. దీన్ని దెబ్బతీసేందుకు విపక్షం చేస్తున్న కుట్రలను అడ్డుకునేందుకు మరింత కృషి చేయాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ మేలు చేసే ప్రయత్నంలో ఎక్కడైనా సమస్యలొస్తే తక్షణం పరిష్కరించాలన్నారు. సంక్షేమమే ఊపిరిగా ముందుకు సాగాల్సిన అవసరాన్ని సీఎం ప్రస్తావించారు. హామీలు నిలబెట్టుకోవడంలో వైఎస్సార్సీïపీ ప్రభుత్వ విశ్వసనీయతను ప్రజలే ప్రశంసిస్తున్న కారణంగా విపక్షం వేలెత్తి చూపలేక పోతోందన్నారు. -
కాకినాడ సెజ్ భూముల్లో 2,180 ఎకరాలు తిరిగి రైతులకే
సాక్షి, అమరావతి: కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్ (కే – సెజ్)కి సంబంధించి రైతుల భూముల విషయంలో గత 15 సంవత్సరాలుగా నెలకొన్న సమస్యలను సీఎం వైఎస్ జగన్ పరిష్కరించారు. నాడు ప్రతిపక్ష నేత హోదాలో పాదయాత్ర సమయంలో రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చి తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. కాకినాడ సెజ్ కోసం గత సర్కారు హయాంలో రైతుల నుంచి బలవంతంగా 2,180 ఎకరాలు తీసుకోవడం తెలిసిందే. దీంతో రైతులు పరిహారం తీసుకునేందుకు నిరాకరించారు. ఈ నేపథ్యంలో సెజ్ కోసం రైతుల నుంచి తీసుకున్న 2,180 ఎకరాలను తిరిగి వారికే ఇవ్వాలని దీనిపై ఏర్పాటైన కమిటీ చేసిన సిఫార్సులను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. ఇతర సిఫారసులు ఇవీ: స్థానిక ప్రజల మనోభావాలను గౌరవించడంలో భాగంగా ఆరు గ్రామాలను తరలించరాదని కమిటీ చేసిన సిఫార్సుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. శ్రీరాంపురం, బండిపేట, ముమ్మిడివారిపోడు, పాటివారిపాలెం, రావివారిపోడు, రామరాఘవాపురం గ్రామాలను తరలించాల్సిన అవసరం లేదని, రామరాఘవాపురంను తరలించాల్సి వస్తే రావివారిపోడు గ్రామానికి తరలించాలని కమిటీ సిఫార్సు చేసింది. ► పునరావాసం లేని నివాసాలకు దగ్గరగా ఉన్న శ్మశాన వాటికలను ఆ గ్రామాలకే వదిలివేయాలని, వాటిని తరలించరాదని కమిటీ పేర్కొంది. అలాంటి శ్మశాసవాటిక స్థలం పరిశ్రమ కోసం అవసరమైతే ప్రత్యామ్నాయ భూమిని కేఎస్ఈజెడ్ గ్రామస్థులకు కల్పించాలని కమిటీ పేర్కొంది. ► నిషేధిత ఆస్తుల జాబితా నుంచి పట్టా భూములను తొలగించడానికి సంబంధించి జిల్లా కలెక్టర్ నిబంధనల ప్రకారం కేసులను పరిష్కరించడానికి అన్ని ప్రయత్నాలు చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. కేఎస్ఈజెడ్ కోసం తీసుకున్న 657 ఎకరాల అసైన్డ్ భూములకు సంబంధించి కోన గ్రామానికి చెందిన రైతులు పరిహారం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో అదనంగా ఎకరానికి రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.పది లక్షలు పరిహారం ఇవ్వాలని కమిటీ సిఫార్సు చేసింది. దివీస్ ల్యాబ్‌కు చెందిన అసైన్డ్ భూములకు ఎకరానికి రూ.పది లక్షల చొప్పున పరిహారం అందించాలని సిఫార్సు చేసింది. ► సెజ్ కోసం భూముల స్వాధీనానికి వ్యతిరేకంగా ఆందోళన చేసిన రైతులపై పెట్టిన క్రిమినల్ కేసులను సమీక్షించడంతో పాటు అవకాశమున్న వరకు కేసులను ఉపసంహరించాలని కమిటీ సిఫార్సు చేసింది. సెజ్‌లో స్థానిక నిరుద్యోగ యువతకు 75% ఉద్యోగాలు కల్పించాలని సిఫార్సు చేసింది. నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది. కే–సెజ్‌తో పాటు దివీస్ భూముల పరిసరాల్లో సరైన ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని, హేచరీస్ ప్రభావం పడకుండా సముద్ర ప్రవాహానికి దూరంగా తరలిం చాలని సూచించింది. పాదయాత్ర హామీ మేరకు కమిటీ పాదయాత్ర హామీ మేరకు కాకినాడ సెజ్‌లో రైతుల సమస్య పరిష్కారానికి మంత్రి కన్నబాబు నేతృత్వంలో కమిటీని సీఎం జగన్ ఏర్పాటు చేయడం తెలిసిందే. ఆ కమిటీ రైతులతో పాటు కాకినాడ సెజ్ వ్యతిరేక పోరాట సమితితో సంప్రదింపులు జరిపి ఆమోదయోగ్యమైన, అన్నదాతలకు మేలు జరిగేలా సిఫార్సులను చేసింది. సీఎం జగన్ అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో సిఫార్సులతో కూడిన కమిటీ నివేదికను కేబినెట్ ఆమోదించింది. ఈ భూములను తిరిగి రైతులకు ఇచ్చేస్తున్నందున కే – సెజ్ కోసం జమ చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలని కమిటీ చేసిన సిఫార్సును కేబినెట్ ఆమోదించింది. సెజ్ బాధితుల హర్షం సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం పిఠాపురం: కేబినెట్ నిర్ణయంపై ఇక్కడి సెజ్ బాధిత రైతులు ఆనందం వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. కొన్నేళ్ల క్రితం కాకినాడ సెజ్ పేరుతో పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలంతో పాటు తుని నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో సుమారు 10 వేల ఎకరాలను స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి స్థానిక రైతులు ఆందోళనలు చేస్తూ వచ్చారు. 2012లో చంద్రబాబు ఇక్కడకు వచ్చి అధికారంలోకి రాగానే ఎవరి భూములు వారికి ఇచ్చేస్తామని ప్రకటించారు. తీరా అధికారంలోకి వచ్చాక తమను కేసులతో ఇబ్బందులకు గురిచేసినట్లు రైతులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో పిఠాపురం వచ్చిన జగన్ దృష్టికి రైతులు తమ సమస్య తీసుకువచ్చారు. సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న సెజ్ గ్రామాల నాయకులు -
బాబు డీఏ బకాయిలకు ఏటా రూ.2,400 కోట్లు
సాక్షి, అమరావతి: టీడీపీ సర్కారు ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించకుండా బకాయిపెట్టిన రెండు డీఏలను చెల్లించేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ రెండు డీఏ బకాయిలు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి ఏకంగా రూ.2,400 కోట్లకుపైనే భరించనుంది. ఈ రెండు డీఏల 30 నెలల తాలూకు బకాయిలు చెల్లించేందుకు రూ.6,034.80 కోట్ల మేర వ్యయం కానుంది. 2018 జూలై నుంచి ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ చెల్లించకుండా చంద్రబాబు సర్కారు బకాయి పెట్టింది. 2019 జనవరి నుంచి మరో డీఏను కూడా చంద్రబాబు సర్కారు బకాయి పెట్టింది. ఈ రెండు బకాయిలను చెల్లించడంతో పాటు 2019 జూలై నుంచి ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించాల్సిన డీఏను కూడా చెల్లించేందుకు శుక్రవారం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2019 జూలై నుంచి ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ.2,011 కోట్లను భరించనుంది. 30 నెలల బకాయిలకు రూ.5,028.90 కోట్లు వ్యయం కానుంది. పెన్షనర్లకు.... ► పెన్షనర్లకు 3.144 శాతం పెంపు జూలై 2018 నుంచి వర్తింపు, జనవరి 2021 నుంచి చెల్లింపు ► 2019 జనవరి నుంచి మరో 3.144 శాతం డీఏ పెంపు వర్తింపు, 2021 జూలై నుంచి చెల్లింపు ► 2019 జూలై నుంచి మరో 5.24 శాతం డీఏ పెంపు, జనవరి 2022 నుంచి చెల్లింపు ఉద్యోగులకు... ► ఉద్యోగులకు జూలై 2018 నుంచి 3.144 శాతం డీఏ పెంపు, 2021 జనవరి నుంచి చెల్లింపు ► 2019 జనవరి నుంచి 3.144 శాతం పెంచిన డీఏ జూలై 2021 నుంచి చెల్లింపు ► 2019 జూలై నుంచి పెంచిన 5.24 శాతం డీఏ జనవరి 2022 నుంచి చెల్లింపు -
ఇక కోరినంత ఇసుక!
సాక్షి, అమరావతి: ప్రజలకు కోరినంత నాణ్యమైన ఇసుకను అందించేందుకు సవరించిన ఇసుక పాలసీని గురువారం రాష్ట్ర మంత్రివర్గం చర్చించి ఆమోదించనుంది. ఇసుక విధానం మెరుగుపరచడం కోసం సిఫార్సుల నిమిత్తం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంత్రుల కమిటీని నియమించిన విషయం విదితమే. ఈ కమిటీ సభ్యులు ఇసుక విధానంపై లోతుగా అధ్యయనం చేసింది. ప్రజల సౌలభ్యం కోసం ఇసుకను రీచ్‌ల నుంచే ఇవ్వాలని మంత్రుల కమిటీ సూచించింది. పట్టాభూముల్లో నాణ్యత లేని ఇసుక వస్తున్నందున అక్కడ తవ్వకాలకు స్వస్తిచెప్పి నదుల్లో డ్రెడ్జింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని సిఫార్సు చేసింది. వీటితో పాటు మంత్రుల కమిటీ చేసిన పలు సూచనలను పరిశీలించిన సీఎం జగన్ లోపరహితమైన ఇసుక విధాన రూపకల్పన కోసం ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించాలని భావించారు. సీఎం సూచన మేరకు ఈ అంశాలపై ప్రజల నుంచి సలహాలు కోరుతూ అధికారులు పత్రికా ప్రకటనలు ఇచ్చారు. ప్రజల నుంచి వచ్చిన సూచనలకు అనుగుణంగా ఇసుక పాలసీని ప్రభుత్వం సవరించింది. నూతన పాలసీలోని ముఖ్యమైన అంశాలు ► ప్రభుత్వమే ఇసుక ధర నిర్ణయిస్తుంది. ప్రజలు నేరుగా రీచ్‌ల వద్ద డబ్బు చెల్లించి ఇసుక తీసుకెళ్లవచ్చు. స్టాక్ యార్డులు ఉండవు. ► రీచ్‌ల నుంచి తమకు నచ్చిన వాహనాల్లో ఇసుక తీసుకెళ్లే స్వేచ్ఛ ప్రజలకు ఉంటుంది. ► అవసరాలకు అనుగుణంగా నదుల్లో పెద్దఎత్తున డ్రెడ్జింగ్ ద్వారా ఇసుక వెలికితీతకు ప్రాధాన్యం ఇస్తారు. ► రీచ్‌ల నిర్వహణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలకు అప్పగించాలన్నది పాలసీలో మరో అంశం. అవి ముందుకురాని పక్షంలో వేలం ద్వారా పెద్ద సంస్థలకు ఈ బాధ్యత ఇస్తారు. -
సముద్ర వాణిజ్యంలో ఏపీ నంబర్ 1
సాక్షి, అమరావతి: దేశ సముద్ర ఆధారిత (మారిటైమ్) వాణిజ్యంలో మొదటి స్థానం కైవసం చేసుకోవడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా పోర్టులు నిర్మించడం ద్వారా ప్రస్తుతం సుమారు 100 మిలియన్ టన్నులుగా ఉన్న కార్గో హ్యాండలింగ్ సామర్థ్యాన్ని 2024 నాటికి 400 మిలియన్ టన్నులకు చేర్చాలని ఏపీ మారిటైమ్ బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా కొత్తగా నాలుగు పోర్టులు, 8 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టింది. తొలిదశలో రామాయపట్నం, భావనపాడు పోర్టులు, ఉప్పాడ, జువ్వెలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టనున్నారు. వీటి తొలిదశ నిర్మాణాలకు 15 రోజుల్లో టెండర్లు జారీ చేయనున్నారు. ఈ ఏడాది డిసెంబర్లో శంకుస్థాపన చేయడం ద్వారా రెండేళ్లలో వీటిని అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రామాయపట్నం, భావనపాడు పోర్టుల డిటైల్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)కు ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పోర్టుల నిర్మాణ పనులు, నిధుల సేకరణ పర్యవేక్షణకు ప్రాజెక్టు మేనేజ్మెంట్ కన్సల్టెన్సీల(పీఎంసీ)నూ నియమించింది. భావనపాడు పీఎంసీగా టాటా కన్సల్టింగ్ ఇంజనీర్స్ లిమిటెడ్– ఇన్‌రోస్ లాక్కనర్ ఎస్ఈ కన్సార్టియం, రామాయపట్నానికి ఏఈకామ్ సంస్థ వ్యవహరించనుంది. వైఎస్సార్ తర్వాత వైఎస్ జగనే.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రంలో మూడు మైనర్ పోర్టులు నిర్మించిన తర్వాత ఇప్పటి వరకు కొత్తగా ఒక్క ఓడరేవు నిర్మాణం జరగలేదు. వైఎస్సార్ హయాంలో గంగవరం, కాకినాడ డీప్ వాటర్ పోర్టు, కృష్ణపట్నం పోర్టులను అభివృద్ధి చేశారు. ఆ తర్వాత ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొత్తగా రామాయపట్నం, భావనపాడు, మచిలీపట్నం, కాకినాడ సెజ్‌ల్లో ఓడ రేవుల నిర్మాణంతో పాటు ఎనిమిది ఫిషింగ్ హార్బర్లను నిర్మించనున్నారు. మారిటైమ్లో అపార అవకాశాలు రాష్ట్రంలో సముద్ర ఆధారిత వాణిజ్యంలో ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకోవడంపై దృష్టిసారిస్తున్నాం. ఇప్పటికే రామాయపట్నంలో 1,000 ఎకరాల్లో పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేయడానికి జపాన్ ఆసక్తి చూపిస్తోంది. కొత్త రేవుల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయడం ద్వారా పారిశ్రామికంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాం. – మేకపాటి గౌతమ్ రెడ్డి, పరిశ్రమలు, ఐటీ, స్కిల్ డెవలప్మెంట్ శాఖ మంత్రి గుజరాత్‌తో పోటీపడుతున్నాం రాష్ట్రంలో పోర్టుల నిర్మాణం ద్వారా 2024 నాటికి కార్గో హ్యాండలింగ్ సామర్థ్యాన్ని 400 మిలియన్ టన్నులకు చేర్చాలన్నది లక్ష్యం. ప్రస్తుతం దేశంలో మొదటి స్థానంలో ఉన్న గుజరాత్‌తో పోటీ పడుతున్నాం. – రాష్ట్ర మారిటైమ్ బోర్డు సీఈఓ ఎన్పీ రామకృష్ణారెడ్డి -
'నిమ్మగడ్డ'ను నియంత్రించండి
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా కొనసాగకుండా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను నియంత్రించాలంటూ హైకోర్టులో మంగళవారం మరో పిటిషన్ దాఖలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నియామకం విషయంలో గవర్నర్దే విచక్షణాధికారమని.. ఈ విషయంలో రాష్ట్ర మంత్రిమండలికి ఎటువంటి అధికారం లేదంటూ ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ కొనసాగడానికి వీల్లేదంటూ రిటైర్డ్ ఐజీ డాక్టర్ ఎ.సుందర్‌కుమార్ దాస్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పును అమలుచేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని.. అందువల్ల ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించకుండా నిమ్మగడ్డ రమేశ్‌ను నియంత్రిస్తూ ఆదేశాలు జారీచేయాలని కోరుతూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిమ్మగడ్డను సంజాయిషీ అడగండి 2016లో అప్పటి మంత్రి మండలి సిఫారసు మేరకు నియమితులైన నిమ్మగడ్డ.. ఇటీవల హైకోర్టు తీర్పు ఇచ్చిన తరువాత కూడా ఏ అధికారంలో ఆ పదవిలో కొనసాగుతున్నారో సంజాయిషీ అడగాలని దాస్ తన కో–వారెంటో పిటిషన్లో హైకోర్టును అభ్యర్థించారు. ఈ వ్యాజ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, ఎన్నికల సంఘం కార్యదర్శులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. అలాగే, నిమ్మగడ్డను వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చారు. అంతేకాక.. 2016లో నిమ్మగడ్డ రమేశ్‌ను ఎన్నికల కమిషనర్‌గా నియమిస్తూ అప్పటి ప్రభుత్వం జారీచేసిన జీఓ 11ను కొట్టేయాలని కోరారు. ఎస్ఈసీగా ముఖ్య కార్యదర్శి స్థాయికి తక్కువ కాని అధికారిని ప్రభుత్వ సిఫారసు మేరకు గవర్నర్ నియమించాలంటున్న ఏపీ పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్–200 (2)ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి, దీనిని రద్దుచేయాలని అభ్యర్థించారు. రాజ్యాంగంలోని అధికరణ 243కే(1) ప్రకారం.. ఎన్నికల కమిషనర్ నియామకం విషయంలో విచక్షణాధికారం గవర్నర్దేనని, రాష్ట్రం చేసే చట్టానికి లోబడి కమిషనర్‌గా నియామకం ఉండాల్సిన అవసరంలేదని వివరించారు. కానీ, ఏపీ పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 200 (2) మాత్రం.. మంత్రి మండలి సిఫారసు మేరకు ఎన్నికల కమిషనర్ నియామకం జరగాలని చెబుతోందని, దీని ప్రకారమే 2016లో అప్పటి మంత్రి మండలి సిఫారసు మేరకు నిమ్మగడ్డ రమేశ్ ఎన్నికల కమిషనర్ అయ్యారన్నారు. కానీ, ఎస్ఈసీ నియామకం పూర్తిగా గవర్నర్ విచక్షణపైనే ఆధారపడి ఉంటుందే తప్ప, మంత్రి మండలి సిఫారసు మేరకు కాదని హైకోర్టు తీర్పునిచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ కొనసాగడానికి వీల్లేదని దాస్ అన్నారు. -
ఏపీ: 26 లక్షల మందికి ఇళ్ల స్థలాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉగాది రోజున సుమారు 26 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పంపిణీకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎన్పీఆర్లోని కొన్ని అంశాల్లో మార్పులు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించింది. వెలగపూడిలోని సచివాలయంలో సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన బుధవారం సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం భోగాపురం ఎయిర్పోర్ట్, రామాయపట్నం పోర్టు నిర్మాణం, ఖరీఫ్‌లో రైతులకు విత్తనాలు, తదితర కీలక నిర్ణయాలు తీసుకుంది. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) పేర్ని వెంకట్రామయ్య(నాని) విలేకరులకు వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. నాలుగేళ్లలో 26 లక్షల ఇళ్ల నిర్మాణం ఉగాది రోజున రాష్ట్రంలో సుమారు 26 లక్షల మందికి ఇళ్ల స్థలాలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం 43,141 ఎకరాల భూమిని యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేసి.. మార్కింగ్, ప్లాట్లు వేసి సర్వం సిద్ధం చేసింది. గతంలో సర్కార్ పంపిణీ చేసే ఇళ్ల స్థలాలపై లబ్ధిదారులకు కేవలం వారసత్వ అనుభవ హక్కు మాత్రమే ఉండేది. ప్రస్తుతం ఇళ్ల స్థలాలు పొందే లబ్ధిదారులు ఇంటిని కట్టుకోవడానికి, బ్యాంకులో తనఖా పెట్టి రుణం తీసుకోవడానికి.. ఐదేళ్ల తర్వాత వ్యక్తిగత అవసరాల కోసం విక్రయించుకోవడానికి వీలుగా ప్రభుత్వం న్యాయపరమైన హక్కులు కల్పిస్తోంది. ఈ మేరకు నిర్దేశిత ఫార్మాట్లో స్టాంప్ పేపర్‌పై రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రక్రియను సులభతరం చేయడం కోసం ఎమ్మార్వోలకు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ల హోదా కల్పించాలని, ఎమ్మార్వో కార్యాలయాలను జాయింట్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలుగా గుర్తించాలని నిర్ణయించింది. ఏటా 6 లక్షలకుపైగా ఇళ్ల చొప్పున వచ్చే నాలుగేళ్లలో 26 లక్షల ఇళ్లు నిర్మించాలని.. వీటికి వైఎస్సార్ జగనన్న కాలనీలుగా పేరు పెట్టాలని తీర్మానం చేసింది. లబ్ధిదారులకు ఇచ్చే ఇంటి పట్టాను చూపిస్తున్న సీఎం వైఎస్ జగన్ అభయన్స్‌లో ఎన్పీఆర్ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (ఎన్పీఆర్)పై మూడు నెలలుగా దేశ వ్యాప్తంగా కోట్లాది మంది మైనార్టీ వర్గాల ప్రజలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటం, రాష్ట్రంలోని మైనార్టీ వర్గాల ప్రజల్లో అదే రీతిలో అభ్యంతరాలు వ్యక్తం కావడం పట్ల మంత్రివర్గం చర్చించింది. ఎన్పీఆర్పై మైనార్టీ వర్గాల ప్రజల్లో అభద్రతాభావం తొలగించాలంటే 2010 నాటి జనాభా గణన ప్రశ్నావళికే పరిమితం కావాలని.. ఆ మేరకు ప్రస్తుతం ఉన్న ఎన్పీఆర్ ప్రశ్నల నమూనాలో మార్పు చేయాలని కేంద్రాన్ని కోరుతూ మంత్రివర్గం తీర్మానం చేసింది. అలా మార్పు చేసే వరకు ఎన్పీఆర్ ప్రక్రియను అభయన్స్‌లో ఉంచాలని నిర్ణయించింది. పీపీపీ విధానంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి పనులను టెండర్ల ప్రక్రియలో హెచ్–1గా నిలిచిన జీఎమ్మార్ ఎయిర్‌పోర్ట్స్ లిమిటెడ్ సంస్థకు అప్పగించడానికి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో జీఎమ్మార్ ఎయిర్‌పోర్ట్స్ లిమిటెడ్‌కు 2,703 ఎకరాల భూమిని అప్పగించాలని టెండర్లలో పెట్టిన నిబంధనను సడలించింది. ఆ సంస్థకు 2,200 ఎకరాల భూమిని మాత్రమే అప్పగించాలని నిర్ణయించింది. మిగిలిన 503 ఎకరాల భూమిని ప్రభుత్వ అవసరాల కోసం అధీనంలోకి తీసుకోనుంది. అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి అవసరమైన భూమిలో మరో 362.55 ఎకరాలను సేకరించాల్సి ఉంది. ఈ భూసేకరణకు అవసరమైన రూ.280 కోట్లను రుణం రూపంలో తెచ్చుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ఎయిర్‌పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఏడీసీఎల్)కు అనుమతి ఇచ్చింది. కాకినాడ గేట్ వే పోర్టు నిర్మాణానికి కాల వ్యవధి పొడిగింపు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలో తొండంగి మండలం కోన గ్రామం వద్ద పోర్టు నిర్మాణం కోసం 9 నెలల కాల వ్యవధిని పొడిగిస్తూ.. ఆ మేరకు కాకినాడ గేట్‌వే పోర్టు లిమిటెడ్‌కు అనుమతి ఇవ్వడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కాకినాడ ఎస్ఈజెడ్ లిమిటెడ్‌లో 49 శాతం ఈక్విటీని అదానీ పోర్టు అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ లిమిటెడ్‌కు బదిలీ చేస్తూ చేసుకున్న ఒప్పందాన్ని ఆమోదించింది. ‘సిట్’కు విస్తృత అధికారాలకు ఆమోదం రాజధాని అమరావతి ప్రాంతంలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్, భూ అక్రమాలపై కేబినెట్ సబ్ కమిటీ నివేదికలోని అంశాలపై దర్యాప్తు బాధ్యతలను ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)కు అప్పగిస్తూ ఇటీవల సర్కార్ జారీ చేసిన ఉత్తర్వులను మంత్రివర్గం ఆమోదించింది. సిట్ కార్యాలయాన్ని పోలీసుస్టేషన్‌గా గుర్తించడానికి, అక్రమాలకు పాల్పడిన వారిపై ఎఫ్ఆర్ఐలు నమోదు చేసి.. కోర్టుల్లో చార్జ్‌షీట్ ఫైల్ చేసే విస్తృత అధికారాలు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. మంత్రివర్గం నిర్ణయాల్లో మరికొన్ని.. – రామాయపట్నం, భావనపాడు, మచిలీపట్నంలలో పోర్టులను రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా రామాయపట్నం పోర్టు నిర్మాణానికి అడ్డంకులను తొలగించడానికి సంబంధించిన ఉత్తర్వులకు ఆమోదం. – ఖరీఫ్ పంటల సాగుకు రైతులకు విత్తనాలను పంపిణీ చేయడానికి.. అవసరమైన విత్తనాలను సేకరించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు రూ.500 కోట్ల రుణం తీసుకోవడానికి ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చేందుకు సమ్మతి. – ఏపీ జెన్కో, ఏపీపీడీసీఎల్ (ఆంధ్రప్రదేశ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్) చెరో రూ.1,000 కోట్లు చొప్పున, మొత్తంగా రూ.2 వేల కోట్ల రుణం తీసుకోవడానికి ప్రభుత్వం నుంచి బ్యాంకు గ్యారంటీ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదించింది. రూ.2 వేల కోట్ల రుణంతో కృష్ణపట్నంలో 800 మెగావాట్లు, వీటీపీఎస్‌లో 800 మెగావాట్ల థర్మల్ కేంద్రాల నిర్మాణాన్ని పూర్తి చేసి.. 1600 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేయాలని నిర్ణయం. – ప్రకాశం జిల్లా ఒంగోలులో గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం 1.96 ఎకరాల భూమి కేటాయింపు రద్దు చేస్తూ ఇటీవల సర్కార్ జారీ చేసిన ఉత్తర్వులకు ఆమోదం. ఆ భూమిని జలవనరుల శాఖకు అప్పగించాలని, ఎన్ఎస్పీ కాలనీ విస్తరణకు ఆ భూమిని వినియోగించాలని నిర్ణయం. – కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం సున్నిపెంటలో నాలుగు గ్రామ సచివాలయాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్. అందులో 44 పోస్టుల భర్తీకి అనుమతి. నీతిమాలిన రాజకీయాల్లో చంద్రబాబు నంబర్ వన్ నీతిమాలిన రాజకీయాలు చేయడంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నంబర్ వన్ అని మంత్రి పేర్ని నాని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు ఎవరూ కనిపించరని, అధికారం కోల్పోగానే నెత్తి మీద ఉన్న కళ్లు నేల చూపులు చూస్తాయన్నారు. గత ప్రభుత్వ మంత్రివర్గంలో ఒక మైనార్టీకి.. ఒక ఎస్టీకి స్థానం కల్పించని చంద్రబాబు ఇప్పుడు ఆ వర్గాల ప్రజలపై లేని ప్రేమను ఒలకబోస్తున్నారని దుయ్యబట్టారు. 2019 శాసనసభ ఎన్నికల్లో ఎంత మంది బీసీలకు టికెట్లు ఇచ్చారో చెప్పాలని నిలదీశారు. అన్ని వర్గాల ప్రజలను, వ్యక్తులను అవసరాలకు వాడుకోవడం.. అవసరం తీరగానే కసుక్కున కత్తితో పొడవడంలో చంద్రబాబు నేర్పరి అన్నారు. హైకోర్టు తీర్పు మేరకే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తున్నామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీలతోపాటు మున్సిపల్ ఎన్నికలనూ నిర్వహిస్తామన్నారు. ఇళ్ల స్థలాల పంపిణీ నిర్ణయం ముందే తీసుకున్నామని, వాటికి స్థానిక సంస్థల ఎన్నికల నియమావళికి సంబంధం ఉండదని మరొక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఎన్పీఆర్పై మైనార్టీ వర్గాల ప్రజల అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. -
చర్చంతా మూడు చుట్టే..
సాక్షి, అమరావతి: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆలోచనంతా మూడు రాజధానుల మధ్యే తిరుగుతోంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఈ అంశమే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అభివృద్ధి, పరిపాలనా వికేంద్రీకరణ చేసి తీరాల్సిందేనన్న చర్చ పట్టణాల నుంచి గ్రామసీమల వరకూ పాకింది. కొత్తగా ఏర్పాటైన గ్రామ సచివాలయాల దగ్గరా ఇదే అంశంపై జనం మాట్లాడుకుంటున్నారు. అటు ఒడిశా సరిహద్దులోని శ్రీకాకుళం నుంచి ఇటు కర్ణాటక సరిహద్దులోని అనంతపురం వరకూ ఎక్కడికి వెళ్లినా ఎవరి నోట విన్నా ఇదే మాట నానుతోంది. అభివృద్ధి, పరిపాలనా వికేంద్రీకరణ జరిగి తీరాల్సిందేనని, లేకపోతే వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర మరింత వెనుకబడిపోయి మరోసారి విభజన వాదం పుట్టుకురాక తప్పదనే వాదన ప్రబలంగా వినిపిస్తోంది. - రాష్ట్ర సమగ్రాభివృద్ధి, రాజధాని అభివృద్ధిపై సూచనల కోసం ఏర్పాటైన జీఎన్ రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ, ప్రపంచ ప్రఖ్యాత బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు(బీసీజీ) సైతం మూడు రాజధానులు ఏర్పాటు చేయడంతోపాటు అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని తమ నివేదికల్లో నొక్కి చెప్పాయి. - ఆ రెండు నివేదికలపై అధ్యయనం కోసం మంత్రులు, ఉన్నతాధికారులతో ఏర్పాటైన హైవపర్ కమిటీ కూడా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్న విషయాన్ని గుర్తించింది. - రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల ప్రజలు తమ జిల్లాలను అభివృద్ధి చేయాలని ముక్తకంఠంతో కోరుతున్నారని హైపవర్ కమిటీ ప్రతినిధులు ప్రకటించారు. - అభివృద్ధి, పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులు ఏర్పాటు చేయాల్సిందేనంటూ ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు, సభలు జరుగుతున్నాయి. - పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఇదే డిమాండ్‌ను ముక్తకంఠంతో వినిపిస్తున్నారు. - బీసీజీ, జీఎన్ రావు కమిటీల నివేదికలను అధ్యయనం చేసిన హైపవర్ కమిటీ ప్రజల ఆలోచనలకు అనుగుణంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెబుతోంది. - నాలుగుసార్లు సమావేశమైన హైపవర్ కమిటీ ఎక్కడెక్కడ ఏయే వనరులు ఉన్నాయో గుర్తించి, వాటిని వినియోగించుకోవడం ద్వారా అన్ని జిల్లాల సమగ్రాభివృద్ధికి రోడ్ మ్యాప్ రూపొందించే కసరత్తు జరుగుతోందని ప్రకటించింది. - విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని, అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యుడీషియల్ క్యాపిటల్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ నానాటికీ తీవ్రతరమవుతోంది. - అభివృద్ధి, పరిపాలనా వికేంద్రీకరణ ఎజెండాగా సోమవారం రాష్ట్ర మంత్రివర్గం, అసెంబ్లీ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజల దృష్టంతా దీనిపైనే కేంద్రీకృతమై ఉంది. -
టెండర్లకు ‘న్యాయ’ పరీక్ష
సాక్షి, అమరావతి: దేశ చరిత్రలోనే తొలిసారిగా టెండర్ల ప్రక్రియలో ఉత్తమ పారదర్శక విధానానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం అమల్లో ఉన్న టెండర్ల ప్రక్రియను సమూలంగా ప్రక్షాళన చేయనున్నట్లు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అదే వేదికపై ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కొత్త చట్టాన్ని తెచ్చేందుకు శుక్రవారం ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ(కేబినెట్) సమావేశంలో ముందడుగు పడింది. టెండర్ల విధానంలో పారదర్శకత, ప్రజాధనం ఆదాకు పెద్దపీట వేయడంతో పాటు అక్రమాలు, పక్షపాతం, అవినీతిని నిర్మూలించడమే లక్ష్యంగా కొత్తగా ‘ఏపీ మౌలిక సదుపాయాల (న్యాయ పరిశీలన ద్వారా పారదర్శకత) చట్టం–2019’ ముసాయిదా బిల్లును కేబినెట్ భేటీలో ఆమోదించారు. అవినీతిపై జరుగుతున్న పోరాటంలో ఈ చట్టం ఒక గొప్ప అడుగు అని మంత్రివర్గం అభివర్ణించింది. ముసాయిదా బిల్లులోని ప్రధాన అంశాలు.. మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యం కల్పిస్తూ సంబంధిత టెండర్ల ప్రక్రియలో పారదర్శకతకు పెద్దపీట వేశారు. హైకోర్టు జడ్జి లేదా రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో టెండర్లను పరిశీలన చేయించనున్నారు. జడ్జి పరిశీలన అనంతరమే మార్పులు, చేర్పులతో టెండర్ల ప్రతిపాదనలను ఖరారు చేస్తూ ఆ తరువాతే బిడ్డింగ్‌కు వెళ్లేందుకు వీలుగా ముసాయిదా బిల్లులో ప్రొవిజన్స్ ప్రతిపాదించారు. అందరికీ సమాన అవకాశాలు, నాణ్యతా ప్రమాణాలు, ఖర్చు విషయంలో జాగ్రత్త పాటించడమే లక్ష్యాలుగా ముసాయిదా బిల్లుకు రూపకల్పన చేశారు. రూ.100 కోట్లకు పైగా విలువైన అన్ని మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను హైకోర్టు జడ్జి లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జి పరిధిలోకి తీసుకొస్తున్నారు. పనిని ప్రతిపాదిస్తున్న ప్రతి శాఖ ఆ పత్రాలను జడ్జికి సమర్పించాల్సిందే. టెండర్లను పిలవడానికి ముందే అన్ని ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ), జాయింట్ వెంచర్లు(జేవీ), స్పెషల్ పర్పస్ వెహికల్స్ (ఎస్పీవీ) సహా ప్రభుత్వం చేపట్టే అన్ని ప్రాజెక్టులపైనా న్యాయమూర్తి పరిశీలన చేయనున్నారు. పనులను ప్యాకేజీలుగా విభజించినా సరే మొత్తం పని విలువ రూ.100 కోట్లు దాటితే జడ్జి పరిధిలోకి రావాల్సిందే. జడ్జికి సహాయంగా నిపుణులను ప్రభుత్వం సమకూర్చనుంది. అలాగే, తనకు అవసరమైన నిపుణులను జడ్జి కోరవచ్చు. పనుల ప్రతిపాదనలను వారం రోజుల పాటు ప్రజలు, నిపుణుల పరిశీలనకు అందుబాటులో ఉంచాలి. అనంతరం 8 రోజుల పాటు జడ్జి పరిశీలన చేస్తారు. జడ్జికి సూచనలు, సలహాలు అందిస్తున్న వారికి ప్రభుత్వం తగిన రక్షణ కల్పిస్తుంది. న్యాయమూర్తి సిఫార్సులను సంబంధిత శాఖలు కచ్చితంగా పాటించాలి. మొత్తం 15 రోజుల్లో టెండర్ ప్రతిపాదనలను ఖరారు చేయాలి. ఆ తరువాతే బిడ్డింగ్‌కు వెళ్లాలి. ఎవరికీ అనుచిత లబ్ధి చేకూర్చకుండా అర్హత ఉన్న కాంట్రాక్టర్లందరికీ సమాన అవకాశాలు కల్పించాలి. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా, పనిగట్టుకుని టెండర్ల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే.. దాన్ని నిరోధించడానికి తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం జడ్జికి కల్పించారు. న్యాయమూర్తి, న్యాయమూర్తి దగ్గర పనిచేస్తున్న సిబ్బందిని పబ్లిక్ సర్వెంట్లుగా భావిస్తారు. దీనివల్ల వారికి రక్షణ ఉంటుందని ముసాయిదా బిల్లులో స్పష్టం చేశారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించడం ద్వారా చట్టబద్ధత కల్పించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఏపీఈడీబీ చట్టం రద్దు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా కొత్త చట్టం తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డు (ఏపీఈడీబీ) చట్టాన్ని రద్దు చేస్తూ, దాని స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు వీలుగా ముసాయిదా బిల్లుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొత్తగా ‘ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ అండ్ మానిటరింగ్ చట్టం–2019’ ముసాయిదా బిల్లును కేబినెట్ ఆమోదించింది. పెట్టుబడుల ఆకర్షణ, బ్రాండింగ్, పర్యవేక్షణ, ప్రాజెక్టులకు అనుమతులు, నిధుల సమీకరణ, పరిశ్రమల కాలుష్యంపై నియంత్రణ, విధానాల రూపకల్పనలే లక్ష్యాలుగా కొత్త చట్టం ఉండనుంది. కొత్త చట్టంలో భాగంగా సలహా మండలి చైర్మన్‌గా ముఖ్యమంత్రి, మొత్తం ఏడుగురు డైరెక్టర్లు ఉంటారు. డైరెక్టర్లుగా ఆర్థిక, పరిశ్రమల శాఖల మంత్రులు, చీఫ్ సెక్రటరీ తదితరులుంటారు. అలాగే ఏపీఐపీఎంఏలో శాశ్వత ప్రత్యేక సలహా మండలి ఉండనుంది. ఇందులో ప్రఖ్యాత కంపెనీల సీఈవోలు, వ్యాపార దిగ్గజాలు, ఆర్థిక నిపుణులు ఉంటారు. ప్రధాన కార్యాలయం విజయవాడలో, మరో కార్యాలయం హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తారు. యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం, శిక్షణ ఇవ్వనున్నారు. -
మహిళా సాధికారత దిశగా కీలక ముందడుగు
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడుతూ వైఎస్సార్ సీపీ మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు రాజకీయంగా, ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తూ ప్రభుత్వంలోని అన్ని నామినేటెడ్ పోస్టులు, నామినేషన్ పనుల్లో వారికి 50 శాతం కేటాయించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. అంతేకాకుండా ఈ కేటాయింపుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకు సగం దక్కేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు మిగిలిన 50 శాతంలో కూడా సగం మహిళలకే కేటాయించాలని నిర్ణయించడం ద్వారా ముఖ్యమంత్రి జగన్ వారికి పెద్దపీట వేశారు. రాష్ట్రంలో నిరుద్యోగాన్ని రూపుమాపేందుకు వీలుగా పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే కల్పిస్తూ కూడా ముఖ్యమంత్రి మరో విప్లవాత్మక నిర్ణయాన్ని తీసుకున్నారు. టెండర్లలో అవినీతి, అక్రమాలను అరికట్టడంతోపాటు పారదర్శతకు పెద్దపీట వేస్తూ న్యాయపరిశీలనపై మరో కీలక నిర్ణయాన్ని ముఖ్యమంత్రి తీసుకున్నారు. న్యాయపరిశీలన–పారదర్శకత చట్టం–2019 ముసాయిదా బిల్లును మంత్రివర్గం ఆమోదించింది. ఈ నిర్ణయాలన్నింటికీ ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టబద్ధత కల్పించేందుకు వీలుగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశం ముసాయిదా బిల్లులకు ఆమోద ముద్ర వేసింది. మంత్రివర్గం తీసుకున్న కీలక నిర్ణయాలు ఇలా ఉన్నాయి... ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీల అభ్యున్నతికి గొప్ప నిర్ణయం.. ప్రభుత్వ కార్పొరేషన్లు, బోర్డులు, సొసైటీలు, ట్రస్టులు, మార్కెట్ యార్డుల పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం కేటాయించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు సగం కేటాయింపులు చేయాలని నిర్ణయించారు. అలాగే దేవాలయాల కమిటీల్లో 50 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీలకే కేటాయించాలని నిర్ణయించారు. ప్రజాసంకల్ప పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీకి చట్టబద్ధత కల్పించాలని నిర్ణయించడమే కాకుండా ఇందుకు సంబంధించిన ముసాయిదా బిల్లును ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం మంత్రివర్గ సమావేశంలో ఆమోదింప చేశారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకు నామినేషన్ పనుల్లో 50 శాతం ప్రభుత్వ నామినేషన్ కాంట్రాక్టులు, సర్వీసుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం కేటాయించాలని ముఖ్యమంత్రి విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు చట్టబద్ధత కల్పించేందుకు ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు కేటాయించే 50 శాతం పనుల్లో ఆయా వర్గాలకు చెందిన మహిళలకు సగం కేటాయించాలనే నిబంధన విధించారు. నిరుద్యోగాన్ని రూపుమాపే దిశగా కీలక అడుగు నిరుద్యోగ సమస్యను పరిష్కరించడమే లక్ష్యంగా పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే కల్పించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. ఇందుకు చట్టబద్ధత కల్పించేందుకు వీలుగా రూపొందించిన ముసాయిదా బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పీపీపీ ప్రాజెక్టుల కింద చేపట్టిన పరిశ్రమలు లేదా ఫ్యాక్టరీలు, జాయింట్ వెంచర్లు, ప్రాజెక్టుల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కనున్నాయి. పరిశ్రమల కోసం భూములు కోల్పోయినవారికి, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ బిల్లు దోహదపడనుంది. నిర్వాసితుల జీవనోపాధికి గ్యారంటీ కల్పించడం కూడా ఈ ముసాయిదా బిల్లులో ముఖ్యాంశం. పరిశ్రమల కోసం ‘వైఎస్సార్ నవోదయం’... సూక్ష్మ, చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమలకు ఊరట కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రకటించింది. ‘‘వైఎస్సార్ నవోదయం’’ పథకానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది, మూడేళ్లుగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఎంఎస్ఎంఈలను ఆదుకునేలా ఈ పథకాన్ని రూపొందించారు. జిల్లాలవారీగా 86,000 ఎంఎస్ఎంఈల ఖాతాలను గుర్తించారు. ఈ ఖాతాలకు చెందిన రూ.4 వేల కోట్ల రుణాలను వన్‌టైమ్ రీ స్ట్రక్చర్ చేయాలని నిర్ణయించారు. నిరర్థక ఆస్తులు(ఎన్పీఏ)గా మారకుండా, ఖాతాలు స్తంభించకుండా అవకాశం కల్పించడంతోపాటు ఎంఎస్ఎంఈలకు మరింత రుణం, తక్షణ పెట్టుబడికి అవకాశం కల్పిస్తారు. దీన్ని వినియోగించుకునేందుకు 9 నెలల వ్యవధి ఇవ్వనున్నారు. త్వరలోనే ఈ పథకం ప్రారంభం కానుంది. విద్యాసంస్థల పర్యవేక్షణ, నియంత్రణ బిల్లుకు ఆమోదం రాష్ట్రంలో స్కూళ్లు, ఉన్నత విద్యాసంస్థల పర్యవేక్షణ, నియంత్రణకు సంబంధించి ముసాయిదా బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ బిల్లుకు చట్టబద్ధత కల్పించనున్నారు. తద్వారా విద్యాసంస్థల పర్యవేక్షణ, నియంత్రణకు త్వరలో కమిషన్లు ఏర్పాటు అవుతాయి. నాణ్యతా ప్రమాణాలు, ఫీజుల నియంత్రణ, విద్యాహక్కు చట్టం అమలుపై ఇవి దృష్టి సారిస్తాయి. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ నియామకం 1993 నాటి బీసీ కమిషన్ చట్టాన్ని రద్దు చేస్తూ కొత్త చట్టాన్ని తీసుకు రావాలని మంత్రివర్గం నిర్ణయించింది. దీనివల్ల బీసీ కమిషన్ శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు కానుంది. తద్వారా బీసీ వర్గాల స్థితిగతులపై నిరంతరం అధ్యయానికి వీలు కలుగుతుంది. పలు వర్గాలను బీసీల్లో చేర్చాలంటూ వస్తున్న డిమాండ్లు, కేటగిరీల్లో మార్పులపై వస్తున్న వినతులను కమిషన్ పరిశీలిస్తుంది. బీసీలకు మరో బొనాంజా.. రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలకు ఆర్థిక సాయంగా ఏడాదికి రూ.10 వేలు చొప్పున ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనిద్వారా పాదయాత్రలో ఈ వర్గాలకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి జగన్ నిలబెట్టుకున్నట్లైంది. 200 యూనిట్ల వరకు ఎస్సీలకు ఉచిత విద్యుత్ రాష్ట్రంలో ఎస్సీ కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 15,62,684 మంది ఎస్సీలకు రూ.411 కోట్ల మేర ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది. లోకాయుక్త చట్ట సవరణ 1993 నాటి లోకాయుక్త చట్టాన్ని సవరించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ పదవిలో హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ లేదా మాజీ జడ్జీల నియామకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. లోకాయుక్తగా ఇప్పటివరకు హైకోర్టు జడ్జి లేదా మాజీ చీఫ్ జస్టిస్‌లకు మాత్రమే అవకాశం ఉంది. ఈ అర్హత ఉన్నవారు అందుబాటులో లేకపోవడంతో చాలా సందర్భాల్లో లోకాయుక్త ఖాళీగా ఉంటోంది. ఈ నేపథ్యంలో అర్హతలను సడలిస్తూ హైకోర్టు మాజీ జడ్జిని కూడా నియమించేందుకు వీలు కల్పిస్తూ రూపొందించిన ముసాయిదా బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వ్యవసాయ మార్కెట్ గౌరవ చైర్మన్లుగా ఎమ్మెల్యేలు వ్యవసాయ మార్కెట్ల్లో గౌరవ చైర్మన్లుగా స్థానిక ఎమ్మెల్యేలను నియమించేందుకు వీలుగా 1966 ఏపీ మార్కెట్ చట్టానికి సవరణలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇందుకు సంబందించిన ముసాయిదా బిల్లుకు ఆమోద ముద్ర వేసింది. టీటీడీ ఎక్స్అఫీషియో సభ్యుడిగా తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫీషియో సభ్యుడిగా తుడా చైర్మన్‌ను నియమించేందుకు వీలుగా దేవదాయ చట్టంలో సవరణలు తేవడాన్ని రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. -
‘పుర’ బిల్లుకు కేబినెట్ ఆమోదం
సాక్షి, హైదరాబాద్: పురపాలనలో సమూల ప్రక్షాళన కోసం రూపొందించిన కొత్త మునిసిపల్ చట్టాల ముసాయిదా బిల్లుకు రాష్ట్రమంత్రివర్గం ఆమోదించింది. కొత్త మునిసిపాలిటీల చట్టం, కార్పొరేషన్ల చట్టం, జీహెచ్ఎంసీ చట్టం, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల చట్టం, టౌన్‌ప్లానింగ్ చట్టంతో కూడిన ముసాయిదా బిల్లును సీఎం కేసీఆర్ గురువారం రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టను న్నారు. శుక్రవారం శాసనసభ, శాసనమండలిలో చర్చించి కొత్త మునిసిపల్ చట్టాల బిల్లుకు ఆమోదం తెలపనున్నారు. కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో బుధవారం సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం.. కొత్త మునిసిపల్ చట్టాల బిల్లుకు ఆమోదంతో పాటు పలు నిర్ణయాలు తీసుకుంది. ఈ సుదీర్ఘ భేటీలో కొత్త మునిసిపల్ చట్టాల ముసాయిదా బిల్లుపై చర్చ నిర్వహించారు. కొత్త మునిసిపల్ చట్టాలను తీసుకురావడం ద్వారా పురపాలనలో జిల్లా కలెక్టర్లకు కీలక బాధ్యతలు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. అవినీతి నిర్మూలనతోపాటు విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులు, ఉద్యోగులపై చర్యలు తీసుకోవడానికి వీలు కల్పించేందుకు ఈ కొత్త చట్టాలను రూపొందించినట్లు సీఎం కేసీఆర్ మంత్రివర్గానికి వివరించినట్లు తెలిసింది. హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కల్లో కనీసం 85% వాటిని సంరక్షించాలని, లేనిపక్షంలో సంబంధిత అధికారులను బాధ్యులు చేయాలని కొత్త చట్టాల్లో పొందుపరిచినట్లు సమాచారం. మునిసిపల్ ఎన్నికల రిజర్వేషన్లను పదేళ్ల పాటు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. నగర శివార్లలోని కొన్ని మునిసిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయడం లేదా వాటిని కొత్త మునిసిపల్ కార్పొరేషన్లుగా ఏర్పాటు చేసే అంశాన్నీ కేబినేట్లో చర్చించినట్లు తెలిసింది. కేబినెట్ కీలక నిర్ణయాలు.. - వృద్ధులు, వితంతువులు, బీడీ, గీత, నేత కార్మికులు, ఒంటరి మహిళలు, బోదకాలు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఇస్తున్న పింఛన్ రూ.1,000 నుంచి రూ.2,016కు పెంపు. - దివ్యాంగులు, వృద్ధ కళాకారుల పింఛన్ రూ.1,500 నుంచి 3,016కు పెంపు. ఈ పింఛన్ జూన్ నుంచి అమలు. జూలై నుంచి లబ్ధిదారులకు అందజేత. - వృద్ధాప్య పింఛన్ల అర్హత వయోపరిమితిని 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గిస్తామనే టీఆర్ఎస్ ఎన్నికల హామీని అమలుకు నిర్ణయం. మరికొన్ని మంత్రివర్గ నిర్ణయాలు - రాష్ట్రంలో వృద్ధులు, వితంతువులు, ఇతరులకు పంపిణీ చేస్తున్న సామాజిక పింఛన్ల పెంపునకు సంబంధించిన ఉత్తర్వులను ఈ నెల 20న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల వారీగా లబ్ధిదారులకు అందించాలని మంత్రిమండలి నిర్ణయించింది. - వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, గీత కార్మికులు, నేత కార్మికులు, ఒంటరి మహిళలు, బోదకాలు వ్యాధిగ్రస్తులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఇస్తున్న పింఛన్‌ను రూ.1,000 నుంచి రూ.2,016కు పెంచాలని నిర్ణయించారు. దివ్యాంగులు, వృద్ధ కళాకారుల పింఛన్‌ను రూ.1,500 నుంచి రూ.3,016కు పెంచాలని నిర్ణయించారు. పెంచిన పింఛన్‌ను 2019 జూన్ నుంచి అమలు చేస్తారు. జూలై నెలలో లబ్ధిదారులకు అందిస్తారు. జూలై 20న అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా లబ్ధిదారులకు పెంచిన పింఛన్లకు సంబంధించిన ప్రొసీడింగ్స్ అందిస్తారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు పాల్గొంటారు. నియోజకవర్గాల వారీగా ప్రొసీడింగ్స్ అందచేయడం కోసం సమావేశాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం కోరింది. ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమం ముగిసిన వెంటనే లబ్ధిదారుల పింఛను సొమ్మును వారి బ్యాంకు ఖాతాల్లో జమచేస్తారు. - వృద్ధాప్య పింఛన్ల అర్హత వయోపరిమితిని 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గిస్తామనే టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల హామీని అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. 57 సంవత్సరాలు నిండిన పేద వృద్ధుల జాబితాను వెంటనే రూపొందించాలని అధికారులను మంత్రివర్గం కోరింది. వీలైనంత త్వరలో లబ్ధిదారుల జాబితా రూపొందించి, దాని ప్రకారం పెంచిన పింఛను అందించాలని మంత్రివర్గం నిర్ణయించింది. - బీడీ కార్మికుల పీఎఫ్ కటాఫ్ డేట్‌ను తొలగించాలని కేబినెట్ నిర్ణయించింది. బుధవారం (17–07–2019) నాటి వరకు కూడా పీఎఫ్ ఖాతా ఉన్న కార్మికులకు పింఛన్లు అందించాలని అధికారులను ఆదేశించింది. - రుణ ఉపశమన కమిషన్ చట్ట సవరణ ఆర్డినెన్స్ బిల్లు, జీఎస్టీ చట్ట సవరణ ఆర్డినెన్స్ బిల్లుతో పాటు పాత మునిసిపల్ చట్టాల సవరణ ఆర్డినెన్స్ బిల్లును సైతం మంత్రివర్గం ఆమోదించినట్లు తెలిసింది. -
ఈ నెల 8న రాష్ట్ర మంత్రివర్గం ఏర్పాటు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. అంతేవేగంతో పాలనాపరమైన అంశాలతో పాటు ప్రజలకిచ్చిన నవరత్నాల హామీలు నెరవేర్చడంపై దృష్టిసారించారు. ఈ నెల 8వ తేదీన మంత్రివర్గాన్ని ఏర్పాటుచేయాలని ఆయన నిర్ణయించినట్లు తెలిసింది. ఆ రోజు ఉదయం 11.39 గంటలకు సచివాలయం దగ్గరే మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. వర్షం వచ్చినా సమస్య లేకుండా ఉండేలా వేదికను ఏర్పాటు చేయాలని అధికారవర్గాలకు సంకేతాలందాయి. అసెంబ్లీ సభ్యుల ఆధారంగా నిబంధనల ప్రకారం ముఖ్యమంత్రితో పాటు 26 మంది మంత్రులు ఉండొచ్చు. అయితే పూర్తి స్థాయిలో అంతమందితో మంత్రివర్గం ఏర్పాటుచేస్తారా.. లేదా తొలుత కొంతమందితో ఏర్పాటుచేసి, ఆ తర్వాత విస్తరణ చేపడతారా.. అనేది పూర్తిగా ముఖ్యమంత్రి విచక్షణాధికారంగా ఉంటుంది. మంత్రివర్గ కూర్పుపై ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టిసారించారని.. ఏ జిల్లాలో ఎవరికి స్థానం కల్పించాలనే అంశంపై కసరత్తు చేస్తున్నారని సమాచారం. 8.39 గంటలకు సచివాలయంలోకి అడుగుపెట్టనున్న సీఎం జగన్ ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా వైఎస్ జగన్ 8వ తేదీ ఉదయం 8.39 గంటలకు సచివాలయంలోకి వెళ్లనున్నారు. ముహూర్తం మేరకు సచివాలయంలోని ఒకటో బ్లాకు తొలి అంతస్తులో ఉన్న సీఎం కార్యాలయంలోకి ఆయన ప్రవేశించనున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న విదేశాలకు చెందిన, సింగపూర్‌కు చెందిన గ్రాఫిక్స్ బొమ్మలను తొలగించాలని అధికారులు నిర్ణయించారు. -
కిడారి శ్రావణ్ రాజీనామా... ఆమోదం
సాక్షి, అమరావతి: గిరిజన, కుటుంబ సంక్షేమ శాఖ మం త్రి కిడారి శ్రావణ్ కుమార్ రాజీనామాను గవర్నర్ ఆమో దించారు. ఈ మేరకు గవర్న ర్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. గురువారం ఉదయం కిడారి శ్రావణ్ తన మంత్రి పదవికి రాజీనామా చేస్తూ ఆ పత్రాన్ని సీఎంవో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్రకు అందజేశారు. సీఎం చంద్రబాబు అనుమతితో దాన్ని సీఎంవో గవర్నర్ నరసింహన్‌కు పంపించింది. అరకు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కిడారి సర్వేశ్వరరావు 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఎన్నికయ్యారు. ఆ తరువాత చంద్రబాబు ప్రలోభాలకు లోనై టీడీపీ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. గత ఏడాది సర్వేశ్వరరావును మావోయిస్టులు హత్య చేశారు. దీంతో సర్వేశ్వరరావు కుమారుడు శ్రావణ్ కుమార్‌ను గత ఏడాది నవంబర్ 11న చంద్రబాబు మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అయితే కిడారి శ్రావణ్‌కుమార్ ఏ చట్టసభకు ఎన్నిక కాలేదు. దీంతో శుక్రవారం నాటికి కిడారి మంత్రి పదవి చేపట్టి ఆరు నెలలు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో కిడారి శ్రావణ్ కుమార్ చేత మంత్రి పదవికి రాజీనామా చేయించాల్సిందిగా సీఎంవో కార్యాలయానికి బుధవారం గవర్నర్ కార్యాలయం సూచించింది. ఈ నేపథ్యంలో గురువారం కిడారి శ్రావణ్ కుమార్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. రాజ్యాంగ నిబంధనల మేరకు మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు శ్రావణ్ కుమార్ తెలిపారు. -
మద్యం కంపెనీలకు మేలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మద్యం తయారీ కంపెనీలకు ప్రయోజనం కలిగిస్తూ రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మద్యం తయారీ కంపెనీల దగ్గరే ఎక్సెజ్ డ్యూటీని వసూలు చేస్తున్నారు. ఆ తరువాత సేల్ పాయింట్, రిటైలర్ సరుకు తీసుకున్నప్పుడు ఎక్సైజ్ డ్యూటీని వసూలు చేసి తిరిగి మద్యం తయారీ కంపెనీలకు చెల్లించేవారు. అయితే ఇప్పుడు మద్యం తయారీ కంపెనీలకు ఆర్థిక వెసులుబాటు కల్పిస్తూ ఏపీ ఎక్సైజ్ చట్టంలో నిబంధనలను మార్చాలని మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో పలు నిర్ణయాలను తీసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. - గత కేబినెట్ సమావేశంలో రాజధానిలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు కేటాయించిన 30 ఎకరాలను రద్దు చేశారు. దాని స్థానే 15 ఎకరాలను కేటాయిస్తూ అందులో అపార్ట్మెంట్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయం. అలాగే తిరుపతి, విజయవాడ జర్నలిస్టులకు పట్టణ పేదల పథకం కింద టిడ్కో ద్వారా అపార్ట్మెంట్లు నిర్మించి ఇచ్చేందుకు గ్రీన్‌సిగ్నల్. - ఎక్స్ సర్వీస్‌మెన్ సంక్షేమానికి రూ.10 కోట్ల కార్పస్ నిధితో కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు - స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేసే ఏపీ మినరల్ ఎక్స్ఫ్లొరేషన్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు. - అనంతపురం జిల్లా ముతువకుంటగ్రామంలో పది మెగావాట్ల నిల్వ సామర్థ్యంతో కూడిన 160 మెగావాట్ల విండ్ సోలార్ హైబ్రీడ్ ప్రాజెక్టు ఏర్పాటుకు 75.25 ఎకరాల భూమి మార్కెట్ ధరకు కేటాయింపు. - అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం ఉరిచింతలలో 50.95 ఎకరాలు, వెలమకూరులో 2.99 ఎకరాలు పవన విద్యుత్ కేంద్రాలకు కేటాయింపు. - గుంటూరు జిల్లా పిడుగురాళ్ల సమీపంలో 5 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ విద్యుత్ ప్లాంటు ఏర్పాటుకు లెటర్ ఆఫ్ ఇండెంట్ ఇవ్వడానికి నిర్ణయం. - అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లలో పథకాలు సాధించిన ముగ్గురు క్రీడాకారులను గ్రూప్–2 పోస్టుల్లో నియమించాలని నిర్ణయం. ఇందులో రాగల వెంకట రాహుల్ (వెయిట్ లిఫ్టర్), బుడ్డారెడ్డి అరుణ (జిమ్నాస్టిక్), ఇండియన్ డెఫ్ టెన్నిస్ టీమ్ కెప్టెన్ జఫ్రీన్ ఉన్నారు. - గత ఏడాది సౌతాఫ్రికాలో జరిగిన వరల్డ్ జూనియర్ అండ్ సబ్ జూనియర్ ఉమెన్స్ ఛాంపియన్షిప్ పవర్ లిఫ్టింగ్ పోటీలలో సిల్వర్ మెడల్ సాధించిన డి.అనూషకు పది లక్షలు, గోల్డెన్ డిస్క్ అవార్డ్ విన్నర్, యంగ్ ఆర్చర్ డాలీ శివానీకి రూ.25 లక్షలు, అంతర్జాతీయ యోగా ఛాంపియన్ ఏకాంబరం జోష్ణవికి రూ.ఐదు లక్షలు ఇవ్వాలని నిర్ణయం. - విశాఖపట్టణం, విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లు, సీఆర్డీఏ పరిధిలో ఉద్యోగులకు బస్‌పాస్ రాయితీ కొనసాగించాలని నిర్ణయం. - ఢిల్లీలో ధర్మపోరాట దీక్షకు రూ.42,80,477లతో పాటు, విశాఖ దీక్షకు రూ.5,08,498, అనంతపురం దీక్షకు రూ.8,32,000లు వ్యయానికి ఆమోదం. ధర్మపోరాట దీక్షలో పాల్గొన్న ఉద్యోగులు, అధికారులకు ఐదు రోజులు ఆన్ డ్యూటీగా పరిగణింపు. - రాష్ట్రంలో సింగిల్, డబుల్, ట్రిబుల్ యూనిట్ అగ్నిమాపక కేంద్రాల్లోని 204 ఫైర్‌మెన్ పోస్టులు ఉన్నతీకరణ. -రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు తిరిగి రీ ఎంప్లాయిమెంట్ పొందిన ఎల్ ప్రేమచంద్రారెడ్డి, ఎస్. బాలసుబ్రహ్మణ్యం, డాక్టర్ లక్ష్మీనారాయణ, డి.చక్రపాణి, అశుతోష్ మిశ్రాకు రాజధానిలో ఇళ్ల స్థలాల కేటాయింపు. - విజయవాడలో మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం, నెల్లూరులో డా.జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్ర నిర్మాణాలకు మున్సిపల్ టాక్స్ నుంచి 75 శాతం మినహాయింపు - విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులు, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులకు జీతభత్యాలతో పాటు పెన్షన్లు కూడా ట్రెజరీ ద్వారా చెల్లింపు. - విశాఖపట్నం జిల్లా మధురవాడ గ్రామంలో ఐదు ఎకరాల స్థలాన్ని ఫిలింనగర్ కల్చరల్ సొసైటీ కేంద్రానికి ఎకరానికి రెండు లక్షలు చొప్పున అద్దెకు ఇవ్వాలని నిర్ణయం. - చండ్ర రాజ్వేరరావు ఫౌండేషన్‌కు సీఆర్డీఏ పరిధిలో మూడు ఎకరాలు ఇవ్వాలని నిర్ణయం. - బైరైటీస్ గనుల ముడి పదార్ధాల ప్రాసెసింగ్, రసాయనిక యూనిట్ల ఒప్పందం మేరకు మొత్తం పరిమాణంలో 50 శాతం లక్ష్యాన్ని సాధించకపోతే ఐదు శాతం అపరాధ రుసుము విధించేందుకు ఆమోదం. - తెలంగాణ నుంచి రావాల్సిన బకాయిలపై చర్యలు తీసుకోవాలని కేబినేట్ సమావేశంలో నిర్ణయం. -
‘నాలుగున్నరేళ్లు అవమానించి ఇప్పుడు ఓట్ల కోసం ఎర’
సాక్షి, హైదరాబాద్: ముస్లింలకు, ఎస్టీలకు నాలుగన్నరేళ్లు మంత్రివర్గంలో స్థానం కల్పించని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ముంగిట ఓటు రాజకీయాల్లో భాగంగానే మంత్రి పదవులు ఇచ్చారని వైఎస్సార్సీపీ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త మహ్మద్ ఇక్బాల్ విమర్శించారు. హైదరాబాద్‌లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఓటుబ్యాంకు రాజకీయాలకు వాడుకోవడం తప్ప ఈ వర్గాల అభివృద్ధి గురించి ఏనాడూ ఆలోచించలేదని ఆయన దుయ్యబట్టారు. ముస్లింలను చంద్రబాబు ఎప్పుడూ ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తూ వచ్చారన్నారు. ఓట్ల కోసం స్వార్థంతోనే ఎన్నికల ముంగిట తమకు మంత్రి పదవులు ఇచ్చారని తాజాగా మంత్రులైన వారు సైతం వారి అనుయాయుల వద్ద వాపోతున్నారని ఇక్బాల్ చెప్పారు. వైఎస్సార్సీపీ మతతత్వపార్టీతో పొత్తుపెట్టుకోదని ఇక్బాల్ స్పష్టం చేశారు. -
మంత్రులుగా ఫరూక్, శ్రావణ్ ప్రమాణం
సాక్షి, అమరావతి: మరో కొద్ది నెలల్లోనే ఎన్నికలు రానున్న తరుణంలో రాష్ట్ర మంత్రివర్గంలో ముస్లిం, గిరిజన వర్గాలకు చెందిన వారికి ప్రాతినిధ్యం కల్పించారు. రాష్ట్ర మంత్రులుగా ఎన్ఎండీ ఫరూక్, కిడారి శ్రావణ్‌కుమార్ ఆదివారం ప్రమాణం చేశారు. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ వారిద్దరితో ప్రమాణస్వీకారం చేయించారు. ఉండవల్లిలోని గ్రీవెన్స్ హాలులో ఉదయం 11.45 నిమిషాలకు ఈ కార్యక్రమం నిర్వహించారు. తొలుత ఫరూక్ తెలుగులో, ఆ తర్వాత శ్రావణ్‌కుమార్ ఇంగ్లిష్‌లో తమ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తామంటూ దైవ సాక్షిగా ప్రమాణం చేశారు. కొత్త మంత్రులు ఇద్దరినీ గవర్నర్ అభినందించారు. కిడారి శ్రావణ్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. శ్రావణ్‌కుమార్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రెండుసార్లు పాదాభివందనం చేశారు. ప్రమాణం సందర్భంగా తెలుగు పదాలను ఉచ్చరించడానికి ఫరూక్ కొద్దిగా తడబడ్డారు. ఏడు నిమిషాల్లో ఈ కార్యక్రమం ముగిసింది. అనంతరం మంత్రివర్గ సభ్యులతో గవర్నర్, ముఖ్యమంత్రి గ్రూప్ ఫొటో దిగారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. -
పాఠశాల విద్య పాక్షికంగా ప్రైవేటు పరం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ విద్యా రంగంలోకి ప్రైవేటు సంస్థల ప్రవేశానికి రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలుపుతూ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఉన్నత పాఠశాలన్నింటిలో వర్చువల్ క్లాస్ రూమ్స్ ద్వారా విద్యార్థులకు పాఠాలను బోధించే ప్రాజెక్టును ట్రిజిన్ టెక్నాలజీస్‌కు కట్టబెట్టనుంది. రూ.160 కోట్ల వ్యయమయ్యే ఈ ప్రాజెక్టును డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో సమావేశమైన రాష్ట్ర మంత్రి మండలి పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. మంత్రి మండలి నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు మీడియాకు వివరించారు. వర్చువల్ క్లాస్ రూమ్స్ కోసం ప్రతి జిల్లా కేంద్రంలో క్లౌడ్ ఆధారిత రిసోర్స్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. చంద్రన్న పెళ్లి కానుక.. బడుగు, బలహీన వర్గాల అమ్మాయిల పెళ్లిళ్లకు అందిస్తున్న ఆర్థిక సహాయాలన్నిం టినీ ‘చంద్రన్న పెళ్లి కానుక’ కిందకు తీసుకువస్తూ నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు. ఈ పథకం కింద మైనార్టీలు, గిరిజనులు, దళితులు, బలహీన వర్గాల వారికి ఏడాదికి లక్ష మందికి ఎక్కువ కాకుండా అమ్మాయిల వివాహాలకు ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు. మైనార్టీలకు ఇస్తున్న రూ.50,000, దళితులకు రూ.40,000 అదే విధంగా కొనసాగుతాయని, బలహీన వర్గాలకు రూ.30,000 లేదా రూ.35,000 ఇవ్వాలన్న దానిపై చర్చలు జరుగుతున్నట్లు తెలిపారు. తెల్ల రేషన్ కార్డు ఉండి, 18 ఏళ్లు దాటిన వారికే పథకం వర్తిస్తుందని చెప్పారు. మంత్రి మండలి మరిన్ని నిర్ణయాలు.. - విదేశాల్లో పని చేస్తున్న ప్రవాసీ తెలుగు వారి కోసం ఏపీ మైగ్రెంట్స్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ పాలసీకి ఆమోదం. - ఉపాధి కోసం విదేశాలకు వేళ్లే వారికి తగిన శిక్షణ ఇవ్వడానికి, పని చేస్తున్న చోట ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. లేక అక్కడ మరణించిన వారిని తరలించడానికి అయ్యే వాటి కోసం రూ.40 కోట్లతో నిధిని ఏర్పాటు. బీసీలకు పెళ్లి కానుక సరిపోదు: కేఈ పెళ్లి కానుక పథకం కింద బీసీలకు రూ.30 వేలు ఇస్తే సరిపోదని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి స్పష్టం చేశారు. మంత్రివర్గ సమావేశంలో పెళ్లి కానుక పథకం కింద ఏ వర్గానికి ఎంత మొత్తం ఇవ్వాలనే దానిపై చర్చ జరుగుతున్నప్పుడు బీసీలకు రూ.30 వేలు ఇవ్వాలని ప్రతిపాదించారు. ఈ సమయంలో కేఈ కృష్ణమూర్తి జోక్యం చేసుకుని బీసీలకు రూ.30 వేలు సరిపోదని, ఇంకా పెంచాలని సూచించారు. దీనిపై ఆర్థిక మంత్రి యనమల స్పందిస్తూ కేఈ మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారేమో అని జోకు పేల్చడంతో పెళ్లి కోసం ఆయన కంటే మీకే ఎక్కువ ఉత్సాహం ఉన్నట్లుందన్నారు. కొద్దిసేపు సరదా సంభాషణ జరిగినా బీసీలకు ఇంకా ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉందని కేఈ చెప్పడంతో అన్ని వర్గాలకు కలిపి ఏడాదికి లక్ష మందికి ఇవ్వాలని నిర్ణయించామని సీఎం చెప్పారు. ఎమ్మెల్యేల అపార్ట్మెంట్లకు డిజైన్లు రాజధాని పరిపాలనా నగరంలో ఎమ్మెల్యేలకు నిర్మించే అపార్ట్మెంట్ల డిజైన్లను మంత్రివర్గం పరిశీలించింది. ఆర్కాప్ ఆర్కిటెక్చర్ సంస్థ డిజైన్లను రూపొందించి తీసుకు రాగా వాటిని ముఖ్యమంత్రి, మంత్రులు పరిశీలించారు. బుధవారం జరిగే సమావేశంలో ఒక డిజైన్‌ను ఎంపిక చేయాలని నిర్ణయించారు. -
ఇసుకపై మళ్లీ వార్నింగ్
- ఇసుక అక్రమ రవాణా చేస్తున్నవారిపై పీడీ చట్టం కింద కేసులు - రాష్ట్ర కేబినెట్ సమావేశం హెచ్చరిక సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్రప్రభుత్వం మరోసారి హెచ్చరించింది. వారిపై పీడీ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని పేర్కొంది. వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన శనివారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఉచిత ఇసుక విధానంతోపాటు పలు అంశాలపై చర్చ జరగడంతోపాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రివర్గ సమావేశ వివరాలను సమాచార, పౌర సంబంధాలశాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు మీడియాకు వెల్లడించారు. ఉచిత ఇసుక పథకాన్ని సమర్థంగా అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించినట్టు ఆయన చెప్పారు. మంత్రివర్గం తీసుకున్న మరికొన్ని నిర్ణయాలివీ.. ►రాష్ట్రంలోని బోగస్ వ్యవసాయ కళాశాలలపై చర్యలు. దీనిపై ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీ వేసి అదిచ్చే సిఫారసులకనుగుణంగా అక్రమ కళాశాలల్ని రద్దు చేయాలని వ్యవసాయశాఖ మంత్రికి ఆదేశం. ► ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా రాష్ట్రంలోని మెడికల్, డెంటల్ కళాశాలల్లో పనిచేస్తున్న ఫ్యాకల్టీలకు కెరీర్ అడ్వాన్స్మెంట్ పథకం అమలుకు ఆమోదం. ► తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం కోన గ్రామంలోని క్యాప్టివ్ పోర్టును స్విస్ చాలెంజ్ విధానంలో వాణిజ్య పోర్టుగా మార్పు చేసేందుకు అనుమతి. ► ఐపీసీలోని 376, 354 సెక్షన్లకు సంబంధించి న్యాయవిచారణలో ఉన్న మహిళా కేసుల్ని సత్వరం పరిష్కరించేందుకు 13 ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు గతంలో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను నిర్ధారిస్తూ నిర్ణయం. 13 జిల్లాల్లోని ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల సిబ్బందిని ఈ కోర్టుల్లో సర్దుబాటు చేసేందుకు అనుమతి. ► ఏపీడబ్ల్యూఆర్డీసీ ద్వారా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులకోసం ప్రభుత్వ గ్యారంటీతో తక్కువ వడ్డీకి బహిరంగ మార్కెట్ నుంచి రూ.3వేల కోట్ల రుణ సమీకరణకు జల వనరులశాఖ చేసిన ప్రతిపాదనకు ఆమోదం. ► నెల్లూరు జిల్లా దగదర్తిలో నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్, ఫ్రిల్స్ ఎయిర్‌పోర్టు పనులు ఎస్సీఎల్ టర్బో కన్సార్టియంకు అప్పగిస్తూ నిర్ణయం. రూ.368.38 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ ఎయిర్పోర్టుకోసం 1,352 ఎకరాల భూమి గుర్తింపు. ► సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్, యాక్సిస్ వెంచర్స్ ఇండియా లిమిటెడ్ నుంచి 2017–18 సంవత్సరానికిగాను 837.20 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి ప్రాథమిక ఆమోదం. దీనికి సంబంధించిన ధరలను నిర్ణయించే బాధ్యత ఏపీఈఆర్సీకి అప్పగింత. ► భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంకోసం సేకరించిన 448.88 ఎకరాల భూమికి ఎకరం రూ.12.5 లక్షల చొప్పున భూయజమానులకు పరిహారం చెల్లించేందుకు అనుమతి. భారీగా భూకేటాయింపులు.. ► నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం బొద్దువారిపాలెంలో మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటుకు 110 ఎకరాల్ని ఎకరం రూ.4 లక్షల నామమాత్రపు ధరకు కేటాయింపు. ► వైఎస్సార్ జిల్లా సీకే దిన్నె మండలం కొప్పర్తిలో వంద ఎకరాల్ని మెగ్నీషియం ఇన్ గార్డ్స్ అండ్ అల్లాయీస్, ఫెర్రో సిలికాన్ పరిశ్రమ ఏర్పాటుకోసం ట్రెమాగ్ ఎల్లాయీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి కేటాయింపు. ► విశాఖపట్నం మధురవాడలోని మూడోనంబర్ కొండలోని రెండెకరాల భూమిని ఇన్నోమైండ్స్ సాఫ్ట్వేర్ కంపెనీకి ఇచ్చేందుకు ఆమోదం. ► అనంతపురం జిల్లా రాప్తాడు మండలం రాప్తాడులో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు 14.79 ఎకరాలు ఏపీఐఐసీకి ఉచితంగా కేటాయింపు. పెనుకొండ మండలం ఎర్రమంచిలో 91.22 ఎకరాలు, రాప్తాడు మండలం రాప్తాడులో 32.42 ఎకరాలు ఉచితంగా కేటాయింపు. చిత్తూరు జిల్లా వరదయ్యపాలెం మండలం విట్టయ్యపాలెంలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు 32.32 ఎకరాలు ఏపీఐఐసీకి ఉచితంగా కేటాయింపు. విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం వెదురువాడలో 30 ఎకరాల్ని ఏపీఐఐసీకి ముందస్తు స్వాధీనం చేసేందుకు అనుమతి. ► తిరుపతిలో క్యాన్సర్ సెంటర్ ఏర్పాటుకు టీటీడీకి చెందిన 25 ఎకరాల్ని టాటా ట్రస్టుకు నామమాత్రపు ధరకు 33 ఏళ్లకు లీజుకిచ్చేందుకు అనుమతి. -
నీటి సంఘాలపై ‘పచ్చ’ముద్ర
- సాధారణ పద్ధతిలో ఎన్నికల నిర్వహణ రద్దు - రాష్ట్ర కేబినెట్ నిర్ణయం సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సాగునీటి సంఘాలను తమ చెప్పుచేతల్లో ఉంచుకునేందుకు ప్రభుత్వం చట్టాన్నే మార్చే యాలని నిర్ణయించింది. నీటి సంఘాల పాలకవర్గాల కు సాధారణ పద్ధతిలో నిర్వహించే ఎన్ని కలను రద్దు చేసింది. ఇకపై తమ పార్టీకి చెందినవారే అధ్యక్షులు, సభ్యులుగా ఉండేం దుకు వీలుగా చేతులెత్తే విధానానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఫార్మర్స్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇరిగేషన్ సిస్టమ్స్ చట్టం–1997 (ఏపీఎఫ్ఎంఐఎస్)లో మార్పులు చేయాలని నిర్ణయించింది. వెలగపూడి సచివాలయంలో సీఎం అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ఈ మార్పులకు ఆమోదం తెలిపింది. ఆ వివరాలను చంద్రబాబు మీడియాకు వివరించారు. ► ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పనిచేస్తున్న టీచింగ్ మెడికల్ ఫ్యాకల్టీ పదవీ విరమణ వయసును 60 నుంచి 63 సంవత్సరాలకు పెంచుతూ నిర్ణయం. నవ నిర్మాణ దీక్ష సందర్భంగా 13 లక్షల 21 వేల మంది రైతులకు రూ.1680.2 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు అనుమతి. ఈ నెల 4వ తేదీన రైతులందరికీ ఈ సొమ్ము వారి అకౌంట్లలో జమ చేయాలని నిర్ణయం. కనీసం రూ.15 వేలు రైతులకు ఇవ్వాలని, అందులో బీమా కూడా ఉండేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖకు ఆదేశం. -
నేడు రాష్ట్ర కేబినెట్ భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గం మంగళవారం సాయంత్రం భేటీ కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో ఈ సమావేశం జరగనుంది. ఈ భేటీలో బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టాల్సిన బిల్లులపై చర్చించి ఆమోదం తెలుపనున్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్ట సవరణతో పాటు, మైనారిటీ, గిరిజన రిజర్వేషన్ల బిల్లు, సెంట్రల్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ (రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్)ను రాష్ట్రానికి అన్వయించుకునే బిల్లు, రాష్ట్ర మార్కెటింగ్ చట్టానికి సంబంధించిన బిల్లులకు ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి.