
ఆంధ్ర కేబినెట్‌లో బీజేపీ?
చంద్రబాబు యోచన మంత్రివర్గం కూర్పుపై కసరత్తు
{పొటెం స్పీకర్ రేసులో పతివాడ,
కోడెల, కేఈ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి
కేంద్ర కేబినెట్‌లో చేరతామని బీజేపీ నాయకత్వానికి సంకేతాలు
త్వరలో ఢిల్లీకి టీడీపీ అధినేత..మోడీతోభేటీ
హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గంలో ఎవరెవరిని చేర్చుకోవాలన్న అంశంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అంతర్గత కసరత్తు మొదలుపెట్టారు. రాష్ట్ర మంత్రివర్గంలో బీజేపీని చేర్చుకోవాలా? వద్దా? అనే అంశంపై తర్జనభర్జనలు జరుగుతున్నట్టు సమాచారం. టీడీపీ, బీజేపీ కూటమిగా ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించగా.. త్వరలో ఏర్పాటు చేయబోయే మంత్రివర్గంపై చంద్రబాబు తనదైన మార్గంలో కసరత్తు ప్రారంభించారు. కేంద్రంలో బీజేపీ సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వీలుగా పూర్తిస్థాయి బలం సమకూర్చుకున్న నేపథ్యంలో ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ కేంద్ర మంత్రిమండలి నిర్మాణంపై ఎలాంటి నిర్ణయానికి వస్తారన్న విషయంలో టీడీపీ నేతల్లో స్పష్టత లేదు. అయితే ఎన్‌డీఏ కూటమిలో చేరినందున కేంద్ర ప్రభుత్వంలో ఒకట్రెండు మంత్రి పదవులు తీసుకోవాలన్న ఆలోచనలో టీడీపీ నాయకత్వం ఉంది. కానీ మోడీ కేంద్ర మంత్రివర్గంలో తమకు చోటు కల్పిస్తారా లేదా అన్న అనుమానం టీడీపీని పీడిస్తోంది. ఈ పరిస్థితుల్లో.. రాష్ట్ర మంత్రివర్గంలో బీజేపీకి చోటు కల్పించడం ద్వారా కేంద్రంలో చోటుకు బాటపరచుకోవచ్చన్న ఆలోచనకు వచ్చింది.
ఈ మేరకు బీజేపీ నాయకత్వానికి పరోక్షంగా సంకేతాలు పంపినట్టు టీడీపీ వర్గాలు చెప్పాయి. ఒకటి, రెండు రోజుల్లో ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు.. కేంద్ర మంత్రివర్గంలో తమ పార్టీని చేర్చుకోవాలన్న కోరికను తెలియజేయటంతో పాటు.. రాష్ట్ర మంత్రివర్గంలో బీజేపీని చేర్చుకునే అంశాన్ని ఆ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీకి వివరించే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు తెలిపాయి. సీమాంధ్రలో పొత్తులో భాగంగా బీజేపీ తరఫున పోటీ చేసిన వారిలో పెనుమత్స విష్ణుకుమార్‌రాజు, ఆకుల సత్యనారాయణ, పి.మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్ గెలుపొందారు. వీరిలో ఒకరు లేదా ఇద్దరికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలున్నాయని టీడీపీలో బలంగా వినిపిస్తోంది.
పదవులపై బాబు కసరత్తు: ఇదిలావుంటే.. తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్ష సమావేశం నిర్వహణ, మంత్రివర్గం కూర్పు, శాసన సభాపతి, ఉప సభాపతి, చీఫ్ విప్, విప్‌ల నియామకం వంటి అంశాలపై చంద్రబాబు కసరత్తు ముమ్మరం చేశారు. రాష్ట్ర విభజన అమలులోకి వచ్చే అపాయింటెడ్ డేకు ఒకటి, రెండు రోజుల ముందు ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించి టీడీఎల్‌పీ నేతను ఎన్నుకునే ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నారు. శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్, విప్‌లుగా ఎవరిని నియమించాలి, ఉపముఖ్యమంత్రులు, మంత్రులుగా ఎవ రెవరిని నియమించాలనే అంశంపై చంద్రబాబు పార్టీ నేతలతో సమాలోచనలు జరుపుతున్నారు. మంత్రివర్గ ప్రమాణ స్వీకారం వెంటనే శాసనసభ తొలి సమావేశాలు నిర్వహించి ఆ తరువాత మిగిలిన పనులు చేపట్టాలనే ఆలోచనతో చంద్రబాబు ఉన్నారని టీడీపీ వర్గాల సమాచారం.
ఎన్నికైన శాసనసభ్యులతో ప్రమాణం చేయించేందుకు తొలుత ప్రోటెం స్పీకర్‌ను నియమించాలి. ప్రోటెం స్పీకర్‌గా పతివాడ నారాయణస్వామినాయుడు, కె.ఇ.కృష్ణమూర్తి, డాక్టర్ కోడెల శివప్రసాదరావు, గోరంట్ల బుచ్చయ్యచౌదరిలలో ఒకరికి అవకాశం రావచ్చు. ఇదిలావుంటే.. ఆదివారం పలువురు నేతలు చంద్రబాబును కలిశారు. తమకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని కోరారు. చంద్రబాబుకు సన్నిహితులుగా ఉండే వారిని కలిసి తమ పేరును మంత్రి పదవి కోసం సిఫారసు చేయాల్సిందిగా వీరు కోరుతున్నట్లు సమాచారం.