రాష్ట్ర మంత్రివర్గంలో జిల్లాకు ప్రాధాన్యం
- ముగ్గురు ఎమ్మెల్యేలకు చాన్స్
- టీడీపీ నుంచి దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర
- బీజేపీ నుంచి కామినేని శ్రీనివాస్
- ముగ్గురికీ తొలిసారి మంత్రి పదవులు
ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం రోజునే జిల్లాలో మంత్రి పదవులు కూడా ఖరారు కావడంతో దీనిపై చర్చకు తెరపడింది. ఇప్పటివరకు జిల్లా నుంచి సీనియర్లకు అవకాశం లభిస్తుందని అందరూ భావించగా, అనూహ్యంగా కొల్లు రవీంద్ర, కామినేని శ్రీనివాస్ పదవులు దక్కించుకున్నారు. దీంతో సీనియర్లకు ఈ వ్యవహారం మింగుడుపడని అంశంగా మారింది.
సాక్షి, విజయవాడ : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పురిటిగడ్డ కృష్ణాజిల్లాకు చంద్రబాబు తన మంత్రివర్గంలో ప్రాధాన్యత ఇచ్చారు. రాష్ట్రంలో అత్యధికంగా ముగ్గురు ఎమ్మెల్యేలకు మంత్రి వర్గంలో చోటు దక్కిన జిల్లా ఇదే కావడం విశేషం. ఇందులో ఇద్దరు టీడీపీ వారు కాగా, ఒకరు బీజేపీ ఎమ్మెల్యే.
మైలవరం ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు, మచిలీపట్నం ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర టీడీపీ నుంచి, కైకలూరు నుంచి గెలుపొందిన కామినేని శ్రీనివాస్ బీజేపీ కోటాలో మంత్రి పదవులు దక్కించుకున్నారు. ఉమామహేశ్వరరావు నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలుపొందగా, కొల్లు రవీంద్ర, కామినేని శ్రీనివాస్‌లు తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచారు. వీరికి వెంటనే మంత్రి పదవి వరించటం విశేషం. వీరు ముగ్గురూ తొలిసారి మంత్రి పదవులకు ఎంపికవడం మరో ఆసక్తికర అంశం.
కొత్త రాజధాని ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత...
రాబోయే రోజుల్లో కృష్ణా-గుంటూరు జిల్లాల మధ్యలోనే కొత్త రాజధాని ఏర్పడే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు విజయవాడలోని స్టేట్ గెస్ట్‌హౌస్‌ను తన క్యాంపు కార్యాలయంగా చేసుకుని పారిపాలన సాగించాలని భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇక్కడ రాజధాని వస్తే విజయవాడకు ప్రాధాన్యత పెరుగుతుంది. ఈ విషయాన్ని ముందుగానే ఊహించిన చంద్రబాబు ఈ జిల్లాకు మూడు మంత్రి పదవులు కట్టబెట్టారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఈ జిల్లాలో పార్టీని పటిష్టం చేయడం ద్వారా రాబోయే రోజుల్లో రాజధానిలో పార్టీ పట్టుపెంచడానికే మూడు మంత్రి పదవులు ఇచ్చారని సమాచారం.
వైఎస్ హయాంలోనూ...
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మంత్రివర్గంలోనూ జిల్లా నుంచి ముగ్గురికి అవకాశం కల్పించారు. తొలి మంత్రివర్గంలో కోనేరు రంగారావు, పిన్నమనేని వెంకటేశ్వరరావు పదవులు దక్కించుకోగా, రెండున్నరేళ్ల తర్వాత చేపట్టిన మంత్రివర్గ విస్తరణలో మండలి బుద్ధప్రసాద్ మంత్రిగా ఎంపికయ్యారు.
మామ తరహాలోనే...
బందరు నుంచి తొలిసారిగా అసెంబ్లీలోకి అడుగుపెడుతున్న కొల్లు రవీంద్రకు చంద్రబాబు కేబినెట్‌లో మంత్రి పదవి కూడా లభించటం విశేషం. తొలిసారే ఆయన గెలిచినప్పటికీ కులసమీకరణాల్లో భాగంగా పదవి దక్కి ఉండవచ్చని భావిస్తున్నారు. కాగిత వెంకట్రావ్‌ను పక్కనపెట్టి బీసీ-మత్స్యకార సామాజిక వర్గానికి చె ందిన రవీంద్రకు ప్రాధాన్యత ఇవ్వడంపై పార్టీలో చర్చ జరుగుతోంది. ఆయన మామగారు నడకుదిటి నరసింహారావు ఇదే తరహాలో గెలిచిన తొలిసారే చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రి పదవి దక్కించుకున్నారని, రవీంద్రకూ అదే తరహాలో లభించిందని ఒక సీనియర్ ఎమ్మెల్యే వ్యాఖ్యానించడం గమనార్హం.
వెంకయ్యకు సన్నిహితుడుగా కామినేనికి గుర్తింపు...
జిల్లాలో ఇద్దరు బీజేపీ అభ్యర్థులు పోటీ చేసినా కైకలూరు నుంచి కామినేని శ్రీనివాస్ మాత్రమే గెలుపొందారు. ఆయన కేంద్రమంత్రి కె.వెంకయ్యనాయుడుకు అత్యంత సన్నిహితుడు. రాబోయే రోజుల్లో బీజేపీతో తమ పార్టీకి, ప్రభుత్వానికి ఎంతో అవసరం ఉంటుందని భావించిన చంద్రబాబు కామినేని శ్రీనివాస్‌కు మంత్రి పదవి ఇచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.