విజయవాడ సిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజీలో మహానాడుకు సిద్ధం చేసిన కూలర్లు
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికలకు ముందు అట్టహాసంగా ‘మహానాడు’ నిర్వహించేందుకు టీడీపీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆదివారం ఉదయం 10 గంటలకు మహానాడు ప్రారంభమవుతుందని, మధ్యాహ్నం 12కు టీడీపీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు ప్రసంగం ఉంటుందని తెలుగు దేశం పార్టీ నేతలు తెలిపారు. విజయవాడలో నేటి నుంచి మూడు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమానికి కానూరులోని సిద్ధార్ధ ఇంజనీరింగ్ కళాశాల మైదానాన్ని సిద్ధం చేశారు. ప్రధాన వేదికను రెండు భాగాలుగా నిర్మించి సాంస్కృతిక కార్యక్రమాలకు పక్కనే మరో వేదిక ఏర్పాటు చేశారు. నాయకులు, కార్యకర్తలనే తేడా లేకుండా అందరూ ఒకేచోట కూర్చునేలా ఏర్పాట్లు చేశామని ప్రకటించినా విడిగా గ్యాలరీలు సిద్ధం చేశారు. వీఐపీలు, ప్రత్యేక ఆహ్వానితులకు ఒక్కో బ్లాకు, ఆహ్వానితులకు ఆరు బ్లాకులు ఏర్పాటు చేయగా కార్యకర్తలకు విడిగా ఎనిమిది గ్యాలరీలు నిర్మించారు.
ఏసీలు, ఐస్ కూలర్లు
మహానాడు ప్రాంగణం అంతా అత్యాధునిక లైటింగ్, ఏసీ, విద్యుత్ సౌకర్యాలు కల్పించారు. ఎండ ప్రభావం ఏమాత్రం లేకుండా ఉండేందుకు ప్రధాన వేదిక, వీవీఐపీ, వీఐపీ గ్యాలరీలకు సెంట్రలైజ్డ్ ఏసీ, గ్యాలరీలకు ఐస్ కూలర్లను అమర్చారు. పటిష్టమైన టెంట్లు వేశారు. మూడు వేలకుపైగా ఎల్‌ఈడీ విద్యుత్ దీపాలు, పది భారీ జనరేటర్లు సిద్ధం చేశారు. వీఐపీలు, కార్యకర్తలకు విడిగా భోజన ఏర్పాట్లు చేశారు.
సర్కారు ఖర్చుతో సోకులు
మహానాడు కోసం విజయవాడ నగరాన్ని ప్రభుత్వ నిధులతో పెద్ద ఎత్తున అలంకరించారు. బందరు రోడ్డులోని డివైడర్లకు కొత్త రంగులు వేయడంతోపాటు కొన్నిచోట్ల మొక్కలు నాటారు. రోడ్ల పక్కన చెత్త చెదారాలను తొలగించి శుభ్రం చేశారు. ఎన్టీఆర్ సర్కిల్ నుంచి కానూరు వరకూ పంట కాలువ రోడ్డు డివైడర్‌కు ఆఘమేఘాల మీద రంగులు వేసి మొక్కలు నాటారు. పంటకాలువ రోడ్డులో కొంతభాగాన్ని విస్తరించడంతోపాటు రాత్రికి రాత్రే తారు రోడ్డు వేశారు. బందరు రోడ్డు, పంట కాలువ రోడ్డు, రింగు రోడ్లతోపాటు సిద్ధార్ధ ఇంజనీరింగ్ కాలేజీ పరిసరాల్లోని రోడ్లను నీటి ట్యాంకర్లతో శుభ్రం చేశారు. ఈ పనులన్నింటినీ విజయవాడ కార్పొరేషన్ రూ.ఐదు కోట్లతో అప్పటికప్పుడు చేయించినట్లు నాయకులు చెబుతున్నారు.
11 పార్కింగ్ ప్రదేశాలు
మహానాడుకు వచ్చే వాహనాల కోసం 11 చోట్ల 40 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యాలు కల్పించారు. విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతోపాటు భారీగా ట్రాఫిక్ మళ్లింపు చేపట్టారు. రెండు జాతీయ రహదారుల మీదుగా వెళ్లే లారీలు, భారీ వాహనాలను మూడురోజులు నగరంలోకి రాకుండా ఇతర మార్గంలో వెళ్లాలని నిర్దేశించారు. 2 వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈసారి మహానాడులో 34 తీర్మానాలు చేయాలని టీడీపీ నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment