కొత్త ఎమ్మెల్యేలు పట్టు బిగిస్తారా?
- మంత్రుల కంటే ఎమ్మెల్యేలే సీనియర్లు
- జిల్లాను చుట్టేస్తున్న మంత్రి దేవినేని ఉమా
- ప్రతిపక్షంలో ముగ్గురు పాత.. ఇద్దరు కొత్త
సాక్షి,విజయవాడ : అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన వారంతా ఎమ్మెల్యేలుగా బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలో సగం మంది కొత్తగా అసెంబ్లీలో అడుగు పెట్టినవారే. కొల్లురవీంద్ర(బందరు) కామినేని శ్రీనివాస్(కైకలూరు), ఉప్పులేటి కల్పన(పామర్రు), కె.రక్షణనిధి(తిరువూరు), వల్లభనేని వంశీమోహన్(గన్నవరం), బొడే ప్రసాద్(పెనమలూరు) బొండా ఉమామహేశ్వరరావు( విజయవాడ- సెంట్రల్) తొలిసారిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు.
గతంతో పోల్చితే ప్రస్తుతం జిల్లా రాజకీయాల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. అటు కాంగ్రెస్‌లో, ఇటు తెలుగుదేశంలోనూ సీనియర్లుగా చెలామణి అయిన వార్ని పక్కన పెట్టి కొత్తగా ఎన్నికైన వారికి కీలక మంత్రి పదవులు దక్కడం విశేషం. కొల్లు రవీంద్ర, కామినేని శ్రీనివాస్‌కు గెలిచిన మొదటిసారే కీలకమైన మంత్రి పదవులు దక్కడం విశేషం.
కాంగ్రెస్‌లో మంత్రి పదవిని నిర్వహించిన మండలి బుద్ధప్రసాద్ డిప్యూటీ స్పీకర్‌గానూ, సీనియర్ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావ్ కేవలం ఎమ్మెల్యే పదవితోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు నియోజకవర్గాలపై పట్టుబిగించాల్సి ఉంది. రాజకీయంగా తమ నియోజకవర్గాల గురించి ఆయా నేతలకు పూర్తిగా అవగాహన ఉన్నా...రాజకీయాలను పక్కన పెట్టి నియోజకవర్గంలోని సమస్యలపై దృష్టి సారించి ప్రజలకు చేరువ కావాల్సి ఉంది.
మంత్రుల కంటే ఎమ్మెల్యేలే సీనియర్లు.....
రాష్ట్ర ఎక్సైజ్, బీసీ సంక్షేమశాఖ మంత్రి కొల్లు రవీంద్ర, వైద్య ఆరోగ్యశాఖ, వైద్యవిద్యాశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ కంటే సీనియర్ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. సీనియర్ నేత, పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావ్ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రభుత్వ చీఫ్ విఫ్‌గా పనిచేశారు. శ్రీరాంతాతాయ్య(జగ్గయ్యపేట), గద్దెరామ్మోహన్(విజయవాడ-ఈస్ట్) ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు.
తమకంటే జూనియర్లు మంత్రులుగా వ్యవహరిస్తూ ఉండటంతో వారి వద్దకు నియోజకవర్గంలోని అభివృద్ధి కోసం వెళ్లి చర్చించడమంటే సీనియర్ ఎమ్మెల్యేలకు కొంత అసౌకర్యంగానే ఉంటుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. పార్టీ కీలక సమావేశాల్లోనూ తమ మాట కంటే మంత్రుల మాటకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందనే భావన సీనియర్ ఎమ్మెల్యేల్లో ఉంటుందని సమాచారం. అయితే మంత్రి ఉమా మాత్రం నాలుగుసార్లు విజయం సాధించిన అనంతరం మంత్రి పదవి పొందారు.
మంత్రుల పట్టు బిగిసేనా!
తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన ఇరువురు మంత్రులు ఇటు నియోజకవర్గ బాధ్యతలతో పాటు తమకు కేటాయించిన శాఖ బాధ్యతలను చూసుకోవాల్సి ఉంటుంది. రెండింటిలో దేన్ని అశ్రద్ద చేసినా ప్రజలకుఅన్యాయం చేసిన వారవుతారు. ఇప్పటికే నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దేవినేని ఉమా అన్ని తానై జిల్లాను చుట్టేస్తున్నారు. దుర్గగుడి, గవర్నమెంట్ హస్పటల్, పులిచింతల ప్రాజెక్టులను తనిఖీలు చేసి హడావిడి చేస్తున్నారు. ఆయనతో పాటు కొత్త మంత్రులు ఇద్దరు పరుగు పెట్టకపోతే వెనుకబడి పోయి ప్రజల్లో పలచనయ్యే అవకాశం ఉంది.
ప్రతిపక్షంలో ముగ్గురు సీనియర్లు...ఇద్దరు జూనియర్లు
జిల్లా నుంచి ఐదుగురు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు గెలుపొందారు.వీరిలో కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని)(గుడివాడ) అందరి కంటే సీని యర్. మేకాప్రతిప్ అప్పారావు(నూజీవీడు), జలీల్‌ఖాన్(విజయవాడ-పశ్చిమ) రెండవసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఉప్పులేటి కల్పన, కె.రక్షణనిధి తొలిసారిగా ఎమ్మెల్యేగాగెలి చారు. వీరంతా ఏకతాటిపై ఉండి ఆయా నియోజకవర్గాలో అభివృద్ధిపై దృష్టి సారించాల్సి ఉంది.