
రాష్ట్ర మంత్రిగా శిద్దా రాఘవరావు
ఒంగోలు, న్యూస్‌లైన్: రాష్ట్ర మంత్రివర్గంలో శిద్దా రాఘవరావుకు స్థానం దక్కింది. ఆదివారం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం శిద్దా రాఘవరావు కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాత డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు(వైద్య,ఆరోగ్యశాఖామంత్రి),గొట్టిపాటి హనుమంతరావు(పౌరసరఫరాలు), డాక్టర్ పాలేటి రామారావు(పశుసంవర్థకశాఖ), ముక్కు కాశిరెడ్డి(పట్టు పరిశ్రమ శాఖ), జాగర్లమూడి లక్ష్మీపద్మావతి(వాణిజ్య పన్నుల శాఖ), దామచర్ల ఆంజనేయులు (దేవాదాయ, ధర్మాదాయ శాఖ - మార్కెటింగ్ శాఖ) మంత్రి పదవులు నిర్వహించారు. ఇప్పటి వరకు నలుగురు కమ్మ సామాజికవర్గానికి చెందిన వారు, ఒకరు రెడ్డి సామాజిక వర్గం, ఒకరు యాదవ సామాజికవర్గానికి చెందిన వారు మంత్రి పదవులు నిర్వహించారు. తాజాగా ఈ జాబితాలో వైశ్య సామాజికవర్గానికి చెందిన శిద్దా రాఘవరావు పేరు చోటు చేసుకుంది.