
సాక్షి, హైదరాబాద్: ముస్లింలకు, ఎస్టీలకు నాలుగన్నరేళ్లు మంత్రివర్గంలో స్థానం కల్పించని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ముంగిట ఓటు రాజకీయాల్లో భాగంగానే మంత్రి పదవులు ఇచ్చారని వైఎస్సార్‌సీపీ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త మహ్మద్ ఇక్బాల్ విమర్శించారు. హైదరాబాద్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు ఓటుబ్యాంకు రాజకీయాలకు వాడుకోవడం తప్ప ఈ వర్గాల అభివృద్ధి గురించి ఏనాడూ ఆలోచించలేదని ఆయన దుయ్యబట్టారు. ముస్లింలను చంద్రబాబు ఎప్పుడూ ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తూ వచ్చారన్నారు. ఓట్ల కోసం స్వార్థంతోనే ఎన్నికల ముంగిట తమకు మంత్రి పదవులు ఇచ్చారని తాజాగా మంత్రులైన వారు సైతం వారి అనుయాయుల వద్ద వాపోతున్నారని ఇక్బాల్ చెప్పారు. వైఎస్సార్‌సీపీ మతతత్వపార్టీతో పొత్తుపెట్టుకోదని ఇక్బాల్ స్పష్టం చేశారు.