
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఓటమి భయంతో టీడీపీ దారుణమైన కుట్రలకు పాల్పడుతోందని.. ఐటీ గ్రిడ్ డేటా స్కాం సూత్రధారి సీఎం చంద్రబాబేనని వైఎస్సార్ సీపీ నాయకుడు, రిటైర్డు ఐపీఎస్ అధికారి మహమ్మద్ ఇక్బాల్ దుయ్యబట్టారు. నాలుగున్నరేళ్లు సహజ వనరులతో సహా అన్నింటినీ దోచుకున్న టీడీపీ నేతలు అవినీతి డబ్బును వెదజల్లి గెలవాలని పథకం పన్నారని, ఇది సాధ్యంకాదని తేలడంతో ఇప్పుడు భారీ కుట్రపన్ని వైఎస్సార్‌సీపీ మద్దతుదారులను ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నారని ఆయన విమర్శించారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎలాగైనా అధికారంలోకి రావాలనే దాహంతో ఓటర్ల జాబితా నుంచి వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల పేర్లను భారీగా తొలగించేందుకు తెగబడ్డారని ఇక్బాల్ ఆరోపించారు. ఇందుకోసం ఏపీ ప్రజల ఆధార్ వివరాలతో సహా వ్యక్తిగత సమాచారాన్ని చంద్రబాబు ప్రభుత్వం హైదరాబాద్‌లోని ఐటీ గ్రిడ్ అనే ఓ చిన్న సంస్థకు అప్పగించిందన్నారు.
ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి ఓట్లను తొలగించే కార్యక్రమాన్ని ఈ సంస్థ చేపట్టినట్లు నిపుణుల విచారణలో తేలిందని ఇక్బాల్ చెప్పిరు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ప్రైవేటు సంస్థకు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని మహ్మద్ ఇక్బాల్ వివరించారు. ఈ వ్యవహారం హైదరాబాద్ కేంద్రంగా జరిగినందునే నగరానికి చెందిన విజిల్ బ్లోయర్ లోకేశ్వరరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారని ఆయన చెప్పారు. అలాగే హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న ఓట్ల తొలగింపు అక్రమాలపై వైఎస్సార్‌సీపీ కూడా చేసిన ఫిర్యాదుతో తెలంగాణ పోలీసులు విచారణ చేపట్టారన్నారు. అనైతిక కార్యకలాపాలు సాగించడానికే సీఎం చంద్రబాబు తన తనయుడికి ఐటీ శాఖ కట్టబెట్టినట్లుందన్నారు. డేటా స్కామ్ బాగోతాన్ని సీరియస్‌గా తీసుకోవాలని, కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకుని తెలుగుదేశం పార్టీ గుర్తింపును రద్దుచేయాలని ఇక్బాల్ డిమాండు చేశారు. గవర్నరు కూడా దీనిపై దృష్టి సారించాలన్నారు.