
హిందూపురం: వెంటిలేటర్‌పై ఉన్న టీడీపీని బతికించుకునేందుకే ఆ పార్టీ నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి షేక్ మహమ్మద్ ఇక్బాల్ మండిపడ్డారు. శనివారం ఆయన అనంతపురం జిల్లా హిందూపురంలోని తన క్యాంప్ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. దేవాలయాలపై దాడులు చేయిస్తూ టీడీపీ నేతలు మత విద్వేషాలు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. దాడుల వెనుక రాజకీయ కుట్ర కోణం దాగి ఉందని డీజీపీ స్పష్టం చేయడంతో తమ పేర్లు ఎక్కడ బయటకు వస్తాయోనని టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, బుద్ధా వెంకన్న, లోకేశ్ తదితరులు భయపడుతున్నారన్నారు. చంద్రబాబు హయాంలో గోదావరి పుష్కరాల్లో 29 మందిని పొట్టన పెట్టుకున్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తమ నాయకుడు సున్నితమైన అంశం కావడంతో ఆచితూచి స్పందించారన్నారు.
రాష్ట్రంలో మతసామరస్యాన్ని కాపాడటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని, విద్వేషాలు సృష్టించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి ఐదేళ్ల కిందటే మతపరమైన వ్యాఖ్యలు చేసినప్పటికీ అప్పటి టీడీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. అయితే ఇప్పుడు వాటిపైనే విష ప్రచారం చేస్తూ దిగజారుడు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖపట్నం జిల్లా ఇడియరామపేట రామాలయంలో విగ్రహాలు విరిగిన ఘటన ఎప్పుడో జరిగితే వాటిపై తప్పుడు ప్రచారాలు చేసిన కిలాడ రమేష్, పైలా సత్తిబాబును అరెస్టు చేస్తే అయ్యన్న పాత్రుడి కుమారుడు వెళ్లి కలిశారన్నారు. దీనిపై సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment