హైదరాబాద్: తెలంగాణ సీఎంగా కేసీఆర్ నేతృత్వంలో కొలువుదీరిన రాష్ట్ర మంత్రివర్గంపై సోమవారం ఉదయం వరకు అధికార టీఆర్‌ఎస్ పార్టీ గోప్యతను పాటించింది.
కేసీఆర్ మంత్రివర్గంపై టీఆర్‌ఎస్‌లో తర్జనభర్జన!
పార్టీ ముఖ్యుల మధ్య వాదోపవాదాలు
హైదరాబాద్: తెలంగాణ సీఎంగా కేసీఆర్ నేతృత్వంలో కొలువుదీరిన రాష్ట్ర మంత్రివర్గంపై సోమవారం ఉదయం వరకు అధికార టీఆర్‌ఎస్ పార్టీ గోప్యతను పాటించింది. మంత్రివర్గ కూర్పుపై పార్టీలోని ముఖ్య నేతలకు కూడా సమాచారం అందలేదు. అయితే ఈ విషయంపై పార్టీలో అంతర్గతంగా తీవ్ర చర్చలు జరిగాయని విశ్వసనీయంగా తెలుస్తోంది. మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు కల్పించాలన్న దానిపై ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా పార్టీ ముఖ్యుల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగినట్టు సమాచారం. దీని వల్లే కేబినెట్‌లో ఉండే సభ్యుల సంఖ్య, ఎవరెవరికి అవకాశం లభిస్తుందన్న విషయాలపై సోమవారం ఉదయం వరకూ స్పష్టత రాలేదు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం కేసీఆర్ అదృష్ట సంఖ్యగా భావించే ఆరుగురితోనే సీఎం సహా మంత్రివర్గం ఉండాలని తొలుత భావించారు. అయితే ఆదివారం ఉదయానికి ఈ సంఖ్య తొమ్మిదికి చేరింది. తీవ్ర తర్జనభర్జనలతో అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన చర్చలతో చివరకు మంత్రుల సంఖ్య 12కు చేరింది. అయితే విధేయతకే కేసీఆర్ పెద్దపీట వేశారు.
పార్టీ ఆవిర్భావం నుంచి తనకు అండగా ఉన్న వారికే మంత్రివర్గంలో స్థానం దక్కింది. మహమూద్ అలీ, నాయిని నర్సింహారెడ్డి, జి.జగదీశ్ రెడ్డి, ఈటెల రాజేందర్, టి.పద్మారావు తదితరులు పార్టీకి కష్ట కాలాల్లోనూ కేసీఆర్‌కు విధేయంగా, అండగా ఉన్నారు. జగదీశ్ రెడ్డి ఆది నుంచీ కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉన్నారు. కాంగ్రెస్‌కు పట్టుండే నల్లగొండ జిల్లాలోని సగం నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించగలిగారు. నాయిని నర్సింహారెడ్డి కూడా అత్యంత విధేయుడు. ఈటెల రాజేందర్ కూడా పార్టీకి అన్ని కాలాల్లో విధేయంగా పనిచేశారు. మహమూద్ అలీకి సమర్థత కన్నా విధేయత, మైనారిటీల్లో సీనియర్ లేకపోవడం వంటి కారణాలతో అవకాశం వచ్చింది. ఇక ఉప ఎన్నికల్లో ఓడిపోయినా, పార్టీకి ప్రతికూల సమయాల్లోనూ కేసీఆర్‌కు అండగా ఉన్న పద్మారావుకు మంత్రివర్గంలో స్థానం దక్కింది. మిగిలిన వారిలో సామాజికవర్గ సమతూకం, సీనియారిటీ, జిల్లాలకు అవకాశం వంటి అంశాల ఆధారంగా మంత్రి పదవి వరించింది. ఆదిలాబాద్ జిల్లాలో జోగు రామన్న కన్నా సీనియర్లు లేరు. బీసీ సామాజికవర్గం కూడా కావడంతో అనివార్యంగానే అవకాశం వచ్చింది. పోచారం శ్రీనివాస్ రెడ్డికీ గతంలో చాలా శాఖలు నిర్వహించిన సీనియారిటీ, సామాజికవర్గం కలిసి వచ్చింది.