మూడోవారంలో టీఆర్‌ఎస్ ప్లీనరీ
ఎల్‌బీ స్టేడియంలో నిర్వహణ
5 నుంచి సీఎం జిల్లాల పర్యటన
మంత్రులు, ఎంపీల సమావేశంలో కేసీఆర్ నిర్ణయం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీని ఈ నెల మూడోవారంలో హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఆది వారం రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు నివాసంలో ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలతో ఆయన సమావేశమయ్యారు. మూడోవారంలో ఒకరోజు పూర్తిగా పార్టీ ప్లీనరీని నిర్వహించాలని నిర్ణయిం చారు. ప్రభుత్వంతో పార్టీకి సమన్వయాన్ని పెంచాలని కేసీఆర్ భావిస్తున్నారు. ప్రభుత్వం నుంచి పార్టీ ఆశిస్తున్నదేమిటి, ప్రజల్లో ఎలాంటి డిమాండ్లు ఉన్నాయనే సమాచారాన్ని పార్టీ మండలస్థాయి నాయకుల నుంచి తీసుకోవాలంటున్నారు.
పార్టీలో ఉన్న ఖాళీలు, ప్రభుత్వ నామినేటెడ్ పదవుల భర్తీ వంటివాటిపైనా దృష్టి సారించను న్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోవడం, తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం పెంచే విధంగా ప్లీనరీని నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ నెల 19న జరిగే ఇంటింటీ సర్వేను దృష్టిలో పెట్టుకుని ఈ నెల 15నగాని, 22న గాని ఈ ప్లీనరీని నిర్వహిస్తారు.
జిల్లాల పర్యటనలో కేసీఆర్...
సీఎం కేసీఆర్ ఈ నెల 5న కరీంనగర్, 7న నిజామాబా ద్, 8న ఆదిలాబాద్ జిల్లాల్లో పర్యటించనున్నారు. జి ల్లాల వారీగా పార్టీ పరిస్థితిపై సమాచారాన్ని సేకరించే బాధ్యతను మంత్రి హరీశ్‌రావుకు అప్పగించారు.
చానళ్లపై దీటుగా స్పందించండి
కొన్ని ఛానళ్లను తెలంగాణలో ఎంఎస్‌ఓలు నిలిపేయడంపై పార్లమెంటులో చర్చకు వస్తే, టీఆర్‌ఎస్ ఎం పీలు దీటుగా స్పందించాలని సీఎం కేసీఆర్ సూచిం చారు. ఆ ఛానళ్లపై చర్య అంశం స్పీకరు, మండలి చైర్మన్ పరిధిలోనే ఉన్నాయని, తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పాలన్నారు.
ప్రత్యేక హైకోర్టుపై పార్లమెంట్‌లో పోరాటం: కేకే
తెలంగాణకు ప్రత్యేకంగా హైకోర్టును ఏర్పాటు చేయాలని, దీనిపై పార్లమెంటు సమావేశాల్లో పోరాడుతామ ని ఎంపీ కె.కేశవరావు చెప్పారు. ఏపీతో వైరం లేదని, అభివృద్ధిలో పోటీ మాత్రమే ఉందన్నారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, డాక్టర్ టి.రాజయ్య, ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్, సాగునీటిపారుదల, గనుల శాఖల మంత్రి టి.హరీశ్‌రావు, ఎక్సైజ్‌శాఖా మంత్రి టి.పద్మారావు, శాసనమండలి చైర్మన్ కె.స్వామిగౌడ్, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, ఎంపీలు కడియం శ్రీహరి, సీతారాం నాయక్, కె.విశ్వేశ్వర్ రెడ్డి, కె.కవిత, ఎమ్మెల్సీ రాములు నాయక్ పాల్గొన్నారు.
కేసీఆర్‌తో గట్టు, జనక్ ప్రసాద్, విజయారెడ్డి భేటీ
ఇదిలా ఉండగా, కె.చంద్రశేఖర్‌రావుతో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నేతలు గట్టు రామచంద్రరావు, జనక్ ప్రసాద్‌లు ఆదివారం భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో తెరువబోయే కల్లు దుకాణాల్లో పాతవారినే నియమించాలని సీఎంకు వారు విజ్ఞప్తి చేశారు. కల్లు దుకాణాల్లో గతంలో పనిచేసిన వారంతా ఉపాధిని కోల్పో యి చాలా ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. దీనికి సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. తెలంగాణ ప్రభుత్వ పథకాలు, భవిష్యత్ వ్యూహం, ప్రజల సమస్యలు, పరిష్కారాలపై సుమారు గంటన్నర పాటు వీరితో కేసీఆర్ మాట్లాడారు. వీరు చర్చిస్తున్న సమయంలోనే పీజేఆర్ కూతురు విజయారెడ్డి కూడా వచ్చి కేసీఆర్‌తో సమావేశమయ్యారు.
గ్రేటర్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి
రానున్న గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల దృష్ట్యా రాజధానిలో టీఆర్‌ఎస్‌ను బలోపేతం చేయాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నా రు. ఇందుకోసం పార్టీశ్రేణులను సమాయత్తం చేయడంతోపాటు వివిధ పార్టీల ముఖ్యనేతలను, కార్పొరేటర్లను టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవాలని ఆదేశించారు. సుమారు 25 మంది కార్పొరేటర్లు టీఆర్‌ఎస్‌లో చేరడానికి ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారని కేసీఆర్ వెల్లడించారు. పార్టీని డివిజన్ల వారీగా సమాయత్తం చేయాల్సిన బాధ్యతను పార్టీ సెక్రటరీ జనరల్, ఎంపీ కె.కేశవరావుకు కేసీఆర్ అప్పగించారు.