కేటీఆర్ కనుసన్నల్లోనే ప్లీనరీ ఏర్పాట్లు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి వార్షికోత్సవ సభ, ప్లీనరీకి ఏర్పాట్లన్నీ రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. రాష్ట్రస్థాయిలో మంత్రులు, ముఖ్యనాయకులతోనే కాకుండా జిల్లా, నియోజకవర్గ స్థాయి నేతలతో నేరుగా మాట్లాడుతూ కేటీఆర్ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా క్రియాశీలంగా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
ఇప్పటిదాకా జరిగిన అన్ని సభల్లోనూ, కార్యక్రమాల్లోనూ అత్యంత క్రియాశీలంగా ఉన్న రాష్ట్ర మంత్రి, కేసీఆర్ మేనల్లుడు టి.హరీశ్‌రావు ఈ కార్యక్రమానికి అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని పార్టీ భావిస్తున్న కార్యక్రమానికి హరీశ్‌రావు దూరంగా ఉండడం, అదే సమయంలో కేటీఆర్ అన్నీ తానై వ్యవహరించడం తీవ్ర చర్చనీయాంశమయింది.