మజ్లిస్‌తో టీఆర్‌ఎస్ దోస్తీనా?
తెలంగాణను వ్యతిరేకించిన ఆ పార్టీకి సలాం కొడతారా?: కిషన్‌రెడ్డి
ఆ పార్టీ రజాకార్ల వారసత్వమని మరిచారా?
తెలంగాణలో ఖాసీం రజ్వీ అకృత్యాలు గుర్తులేదా..{పజలకు కేసీఆర్ సమాధానం చెప్పాలి
తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో చార్మినార్ బదులు మరేదైనా చారిత్రక గుర్తును వాడాలి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించి, తెలంగాణ ఉద్యమాన్ని కించపరచేలా వ్యవహరించిన మజ్లిస్‌తో దోస్తీకి ఎందుకు తాపత్రయపడుతున్నారో తెలంగాణ రాష్ర్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నీడలో బలపడేందుకు నిన్నటి వరకు యత్నించిన మజ్లిస్ పార్టీ నేతలపై దేశ ద్రోహం కేసులున్న సంగతి కేసీఆర్‌కు తెలియదా అని ప్రశ్నించారు. అయినా వారి మద్దతు కోసం వారికి ఎదురేగి మరీ సలాం కొట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో వివరణ ఇవ్వాలన్నారు. శనివారం సాయంత్రం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఖాసిం ర జ్వీ ఆధ్వర్యంలో తెలంగాణ పల్లెల్లో వందలమంది మహిళలపై అత్యాచారాలు చేసి అడ్డొచ్చిన వారిని ఊచకోత కోసిన రజాకార్ల వారసత్వంగా ఎదిగిన పార్టీ మజ్లిస్ అన్న విషయాన్ని కేసీఆర్ మరిచారా అని ప్రశ్నించారు. తెలంగాణలో సాయుధపోరాటం ఎందుకు వచ్చిందో, నాటి యోధులకు ఎందుకు సమరయోధుల పింఛన్ ఇస్తున్నారో టీఆర్‌ఎస్ అధినేత గుర్తుచేసుకోవాలన్నారు.
కొద్దిసేపు పోలీసులు పట్టించుకోకుంటే భారతీయుల సంగతేంటో చూద్దామంటూ ప్రసంగించి ఒక వర్గం వారిని రెచ్చగొట్టి దేశ ద్రోహం కేసులు ఎదుర్కొంటున్న మజ్లిస్ నేతలకు కేసీఆర్ కుటుంబం సాదరస్వాగతం పలికి ప్రభుత్వానికి మద్దతు కోరటం దారుణమన్నారు. ఎన్నో పోరాటాల తర్వాత సాధించుకున్న తెలంగాణ తొలి ప్రభుత్వాన్ని మజ్లిస్ మద్దతుతో ఏర్పాటు చేయటం ఏమాత్రం శుభం కాదన్నారు. హైదరాబాద్‌లో బలంలేని టీఆర్‌ఎస్ త్వరలో జరిగే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓ పది సీట్లు పొందేందుకు మజ్లిస్ దోస్తీకి ఆరాటపడటం అవకాశవాదమన్నారు. చార్మినార్ ఓ మతానికి సంబంధించిందని గతంలో పదేపదే చెప్పిన మజ్లిస్ నేతల ఒత్తిడితో దాని చిత్రాన్ని తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంలో పొందుపరచాలని చేస్తున్న ప్రయత్నాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోందని తెలిపారు. వాస్తవానికి కూడా చార్మినార్ కట్టడంలో మసీదు ఉన్నందున... అది కాకుండా రాష్ట్ర చరిత్రను ప్రతిబింబించే ఇతర గుర్తులకు ఆ చిహ్నంలో చోటు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
విధివిధానాల ప్రకారమే ఉద్యోగుల విభజన జరగాలి...
రాష్ట్రం విడిపోయినప్పుడు ఉద్యోగుల విభజన ఎలా జరగాలన్న అంశంపై రూపొందించిన విధివిధానాలు, మార్గదర్శకాల ప్రకారమే ఇప్పుడు పంపకం జరగాలని కిషన్‌రెడ్డి అన్నారు. ఈ పంపకం సామరస్యపూర్వకంగా జరిగేలా సహకరించాలే తప్ప రెచ్చగొట్టేలా వ్యవహరించ వద్దని హితవు పలికారు. తెలంగాణ ఉద్యమ నేత విఠల్‌ను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించటం అవివేకమన్నారు.