ప్రశ్నిస్తే సస్పెన్షన్లు.. అందుకే కోర్టుకు: ఇంద్రసేనా రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ వచ్చిన తర్వాత దాదాపు మూడు వేలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి తెలిపారు. రైతుల కోసం ఒక కమిషన్ వేసి అది ఇచ్చిన నివేదికను తుచా తప్పకుండా పాటిస్తామని ప్రభుత్వం గతంలో చెప్పిందన్నారు. చట్టం తెచ్చి ఏడాదిన్నార అయినా కమిటీ వేయలేదని ఆయన విమర్శించారు. అందుకే బీజేపీ తరపున హైకోర్టులో పిల్ వేశానని తెలిపారు. తెలంగాణలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రజాప్రతినిధులను సస్పెండ్ చేస్తున్నారంటూ అందుకే వారు కోర్టులను ఆశ్రయిస్తున్నారన్నారు.
అసెంబ్లీని సీఎం సరిగా నడిపిస్తే కోర్టుకు ఎందుకు వెళ్తామని ప్రశ్నించారు. కమిటీ ఎందుకు వేయలేదో సీఎం సమాధానం చెప్పాలని నిలదీశారు. జీఎస్టీపై కేంద్రం నిర్వహించిన సమావేశానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి ఎందుకు వెళ్లలేదని ఆయన ప్రశ్నించారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ను పంపడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. జీఎస్టీ చట్ట సవరణకు అసెంబ్లీలో ఆ రోజు ఆమోదించి ఇప్పుడు జీఎస్టీతో రాష్ట్రానికి నష్టమని సీఎం అంటున్నారు. ఏ రకంగా నష్టం వస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వాన్ని బద్నామ్ చేయాలని చూస్తే నిధులను ఎలా పక్కదారి పట్టిస్తున్నావో చెప్పవలసి వస్తుందని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయలేక కేంద్రంపై నెట్టివేయడానికి కుట్రలు చేస్తున్నారన్నారు. దీన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు. మంత్రి కేటీఆర్కు నెల రోజుల తర్వాత బాధితులు గుర్తుకొచ్చినందుకు సంతోషమన్నారు. బాధితుల డిమాండ్ ప్రకారం ఎస్పీని సస్పెండ్ చేయాలని, బాధితులకు పరిహారం ప్రకటించి ఎస్పీపై చర్యలు తీసుకోవాలని ఇంద్రసేనారెడ్డి డిమాండ్ చేశారు.