టీఆర్‌ఎస్‌పై ఇక దూకుడు!
- పోరాటానికి సిద్ధమవుతున్న బీజేపీ
- ‘విమోచన దినోత్సవం’పై నిలదీతకు సన్నద్ధం
- సెప్టెంబర్ 17న రాష్ట్రవ్యాప్తంగా భారీ కార్యాచరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌పై చేస్తున్న రాజకీయ పోరాటాల్లో పదును, వేగం పెంచుతామని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. ఇప్పటిదాకా అధికార పార్టీ పట్ల అధిష్టానం వైఖరిపై అనుమానాలున్న నాయకులు సైతం ఇక సమరానికి సై అంటున్నారు. టీఆర్‌ఎస్ తీరును ఎండగట్టేందుకు సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలనే డిమాండ్‌ను సమర్థంగా ఉపయోగించుకోవాలని బీజేపీ నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా జిల్లా స్థాయిలో సన్నాహక సమావేశాలను నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు ఉంటుందన్న ఆశతో టీఆర్‌ఎస్‌లో ఇప్పటిదాకా జరిగిన చేరికలకు ఇక అడ్డుకట్ట పడినట్టేనని బీజేపీ భావిస్తోంది.
కొత్త చేరికల సంగతి అటుంచితే ఇప్పటిదాకా చేరినవారే పక్క దారులు వెతుక్కోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. టీఆర్‌ఎస్ నేతల్లో అయోమయం నెలకొందని, ఇప్పటిదాకా ఆత్మవిశ్వాసంతో పనిచేసిన నాయకులు కూడా వెనకడుగు వేస్తారని భావిస్తున్నారు. ఈ సమయంలో బీజేపీ రాజకీయ వైఖరిపై స్పష్టత వస్తే వచ్చే ఎన్నికల నాటికి బలమైన శక్తిగా పార్టీ ఎదిగే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటిదాకా అనుసరించిన మెతక వైఖరిని వీడి, ఉద్యమాల వైపు పార్టీని నడిపించాల్సిన అవసరం ఉందనే నిర్ణయానికి బీజేపీ రాష్ట్ర నాయకత్వం వచ్చింది.
విమోచనంపై కేసీఆర్ వ్యాఖ్యలతో ప్రచారం
సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలనే డిమాండ్‌తో ఆ రోజున రాష్ట్రవ్యాప్తంగా భారీ కార్యాచరణకు దిగాలని బీజేపీ నిర్ణయించింది. తెలంగాణలోని 31 జిల్లాల్లో, జిల్లాల వారీగా వ్యూహాత్మక కార్యాచరణతో టీఆర్‌ఎస్ వైఖరిని ఎండగట్టాలని ఇప్పటికే జిల్లా నాయకత్వానికి సూచనలు చేసింది. జిల్లాస్థాయి కార్యాచరణను పర్యవేక్షించడానికి రాష్ట్రస్థాయి నేతలను బాధ్యులుగా నియమించింది. ‘స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించుకోలేని దౌర్భాగ్య స్థితిలో తెలంగాణ జాతి ఉంది.
తెలంగాణలో సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించుకుంటాం’ అని ఉద్యమ సమయంలో చెప్పిన కేసీఆర్ వ్యాఖ్యలను బీజేపీ నేతలు క్షేత్రస్థాయిలో ప్రచారం చేయనున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత విమోచన దినోత్సవాన్ని ఎందుకు అధికారికంగా నిర్వహించడంలేదో ప్రజలే ప్రశ్నించేలా కార్యాచరణకు దిగాలని ఆ పార్టీ భావిస్తోంది.