టీఆర్‌ఎస్...ఆపరేషన్ ఆకర్ష్‌! | trs start to open operation akarsh | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్...ఆపరేషన్ ఆకర్ష్‌!

Published Tue, May 20 2014 12:36 AM | Last Updated on Wed, Aug 15 2018 9:20 PM

trs start to open operation akarsh

‘అధికార పార్టీ’ హోదాలో ఎత్తుగడ  తెలంగాణలో తిరుగులేని పట్టు సాధించే వ్యూహం
 
కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలకు వల
జడ్పీ చైర్మన్లను కైవసం చేసుకునే యత్నాలు
తెరవెనుక మంతనాల్లో గులాబీ నేతలు బిజీ
బెంబేలెత్తుతున్న విపక్ష నేతలు

 
హెదరాబాద్: తెలంగాణ పగ్గాలు దక్కించుకున్న టీఆర్‌ఎస్ అదే ఊపులో తన ‘పవర్’ ఏంటో చూపించే పనిలో పడింది. కొత్త రాష్ర్టంలో తిరుగులేని పార్టీగా అవతరించేందుకు పక్కావ్యూహాన్ని సిద్ధం చేసుకుంది. భవిష్యత్తులో ప్రభుత్వ మనుగడకు ఢోకా లేకుండా ఇప్పుడే ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరదీసింది. ముందుగా ‘స్థానికం’గా పట్టు సాధిం చేందుకు గులాబీ నేతలు ముమ్మర యత్నాలు చేస్తున్నారు. ఇటీవలి పరిషత్ ఫలితాల్లో హంగ్ ఏర్పడిన చోట్ల పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడ్డారు. ‘అధికార పార్టీ’ హోదాను అడ్డుపెట్టుకుని ఎలాగైనా జడ్పీటీసీ చైర్మన్ పదవులను కైవసం చేసుకోవాలని చూస్తున్నారు. బలమైన నేతలను తమవైపు ఆకర్షించి విపక్ష పార్టీలను కకావికలం చేసే లక్ష్యంతో గులాబీదళం ముందుకు సాగుతోంది. ఈ వ్యూహంలో టీఆర్‌ఎస్‌కు మొదటి టార్గెట్‌గా నిలుస్తోంది కాంగ్రెస్సే. ఎన్నికల ఫలితాలతో కోలుకోలేని విధంగా దెబ్బతిన్న ఆ పార్టీ పెద్దలు.. టీఆర్‌ఎస్ ఎత్తులను పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంతో అడ్డుకోవాలని చూస్తున్నారు.

గులాబీ నేతల ముందు జాగ్రత్త

తెలంగాణలోని 119 అసెంబ్లీ సీట్లకుగాను 63 స్థానాలను దక్కించుకున్న టీఆర్‌ఎస్ సంపూర్ణ మెజారిటీని సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు ఆ పార్టీకి ఎలాంటి ఢోకా లేదు. అయితే తాజా ఎమ్మెల్యేల్లో సుమారు 20మంది తెలంగాణ ఉద్యమం తో సంబంధంలేని, చివరి నిమిషం వరకు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం. అందుకే గులాబీ నేతలు జాగ్రత్త పడుతున్నారు. ఆఖరు నిమిషంలో ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు భవిష్యత్తులో పార్టీని వీడినా ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు వలవేసే పనిలో ఉన్నారు. కాంగ్రెస్, టీడీపీతోపాటు వరంగల్ జిల్లా నర్సంపేట నుంచి గెలిచిన ఇండిపెండెంట్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డితో ఇప్పటికే మంతనాలు కూడా మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌లో చేరేందుకు  ఆయన సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం.  మాధవరెడ్డి అనుచరులైన నలుగురు జడ్పీటీసీలు కూడా టీఆర్‌ఎస్‌కే మద్దతివ్వడం ఖాయమైంది. తద్వారా వరంగల్ జిల్లా జడ్పీ చైర్మన్ పదవిని కైవసం చేసుకోవచ్చని భావిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో బీఎస్పీ తరఫున ఎన్నికైన ఇంద్రకరణ్‌రెడ్డి, కోనేరు కోనప్పలను కూడా ఇదివరకే సంప్రదించినట్లు తెలిసింది.

కేసీఆర్ సొంత జిల్లాలోనూ ఇదే మంత్రం

 గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే టి.నర్సారెడ్డిని టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడం వెనుక సైతం మెదక్ జడ్పీని కైవసం చేసుకోవాలనే వ్యూహం దాగి ఉంది. జిల్లాలో మొత్తం 46 జడ్పీటీసీ స్థానాలుండగా కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లకు చెరో 21 సీట్లు వచ్చాయి. నర్సారెడ్డిని పార్టీలో చేర్చుకోవడం ద్వారా ఆయన  అనుచరులైన ముగ్గురు జడ్పీటీసీలు కూడా టీఆర్‌ఎస్‌కు మద్దతివ్వడం ఖాయమైంది. తద్వారా మెదక్ జడ్పీ చైర్మన్ పదవిని టీఆర్‌ఎస్ కైవసం చేసుకోవడం లాంఛనమే అవుతుందని గులాబీ పెద్దలు భావిస్తున్నారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లోనూ జడ్పీ పీఠాలను దక్కించుకునేందుకు కాంగ్రెస్, టీడీపీ జడ్పీటీసీ సభ్యులతో రహస్య మంతనాలు జరుపుతున్నారు.

 బలహీనంగా ఉన్న జిల్లాలపైనా దృష్టి

 నల్లగొండ, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో పార్టీ బలహీనంగా ఉందని భావిస్తున్న గులాబీ పెద్దలు ఆయా జిల్లాలకు చెందిన టీడీపీ, కాంగ్రెస్, ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో తెరవెనుక చర్చలు జరుపుతున్నారు. టీఆర్‌ఎస్ సీనియర్ ఎమ్మెల్యే లు ఈటెల రాజేందర్, హరీష్, కేటీఆర్ తదితరులు ఆయా జిల్లాల ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి టీఆర్‌ఎస్‌లోకి వస్తే భవిష్య త్తు ఉంటుందని, తెలంగాణలో ఇతర పార్టీల పనైపోయినట్లేనని చెబుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఎమ్మెల్యేలకు పలు ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం.  
 
ఫిరాయింపులను కొట్టిపారేస్తున్న కాంగ్రెస్

 
మరోవైపు తమ పార్టీ ఎమ్మెల్యేలు, జడ్పీటీసీ సభ్యులు టీఆర్‌ఎస్‌లోకి వెళతారని జరుగుతున్న ప్రచారాన్ని కాంగ్రెస్ పెద్దలు కొట్టిపారేస్తున్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఉన్నందున ఏ ఒక్క ఎమ్మెల్యే, జడ్పీటీసీ సభ్యుడు కూడా కాంగ్రెస్‌ను వీడే సాహసం చేసే అవకాశాల్లేవని వారు అభిప్రాయపడుతున్నారు. ‘జడ్పీ చైర్మన్ ఎన్నికల్లో జడ్పీటీసీలకు పార్టీపరంగా విప్ జారీ చేస్తాం. ఎవరైనా దాన్ని ఉల్లంఘిస్తే వెంటనే సభ్యత్వాన్ని కోల్పోతారు’ అని టీపీసీసీ ముఖ్యనాయకుడొకరు వ్యాఖ్యానించారు. మరోవైపు టీఆర్‌ఎస్‌తో మంతనాలు జరుపుతున్న తమ పార్టీ నేతల వివరాలను కాంగ్రెస్ పెద్దలు ఆరా తీస్తున్నారు.   

బేరసారాలు లేకుండా చూడండి: టీ-కాంగ్రెస్

 త్వరలో నిర్వహించబోయే కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్, జెడ్పీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, ఎంపీపీల ఎన్నికలో బేరసారాలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కోరారు. ఈ మేరకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం సోమవారం సాయంత్రం ఎన్నికల కమిషనర్ పి.రమాకాంత్‌రెడ్డిని కలసి విజ్ఞప్తి చేసింది. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. స్థానిక సంస్థల చైర్మన్లు, అధ్యక్షుల ఎన్నికల్లో పార్టీ విప్‌కు వ్యతిరేకంగా వేసే ఓటును పరిగణనలోకి తీసుకోవద్దని, అలాంటి సభ్యులపై అనర్హత వేటు వేయాలని కమిషనర్‌ను కోరినట్లు చెప్పారు. ఓటింగ్‌కు గైర్హాజరైన వారిపైనా అనర్హత వేటు వేయాలని.. దీనికి సంబంధించి కలెక్టర్లకు తగు ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. తమ విజ్ఞప్తులపై రమాకాంత్‌రెడ్డి సానుకూలత వ్యక్తం చేశారని ఉత్తమ్ తెలిపారు.
 
ఫిరాయింపుల నిరోధక చట్టంలో ఏముందంటే..
 
1985లో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వచ్చింది. గతంలో మూడింట రెండు వంతులకు తగ్గకుండా పార్టీ సభ్యులు ఒక పక్షం నుంచి మరోపక్షానికి మారితే ిఫిరాయింపు చట్టం వర్తించేది కాదు. కానీ ఆ తర్వాత రాజ్యాంగ సవరణతో వచ్చిన కొత్తచట్టంతో ఈ వెసులుబాటును తొల గించారు. ఒక పార్టీ తరఫున ఎన్నికై మరో పార్టీలోకి ఎంతమంది చేరినా ఫిరాయింపుల చట్టం వర్తించేలా 2003లో ఎన్డీయే ప్రభుత్వం 52వ రాజ్యాంగ సవరణ చేసింది. దీని ప్రకారం.. చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుడు ఎవరైనా తనపార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛం దంగా వదులుకున్నప్పుడు కూడా అతనికి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తిస్తుంది. ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ పార్టీ సభ్వ త్వాన్ని స్వచ్ఛందంగా వదులుకోవడానికి, ఆ పార్టీకి రాజీనామా సమర్పించడానికి సాంకేతికంగా తేడా ఉంది.  ఒకవ్యక్తి తన పార్టీకిరాజీ నామా చేయనప్పటికీ, స్వచ్ఛం దంగా పార్టీ సభ్యత్వాన్ని వదులుకోవచ్చునని సుప్రీంకోర్టు తేల్చింది. ఈ రెండు వేర్వేరు పరిస్థితులే అయినప్పటికీ, ఫిరాయింపుల నిరోధక చట్టం రెండు సందర్భాల్లోనూ ఒకేలా వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఏదైనా ఒక అంశంపై ఓటింగ్ జరిగినప్పుడు అందులో పాల్గొని పార్టీ ఆదేశాలకు భిన్నంగా ఓటు వేయడం లేదా ఓటింగ్‌కు గైర్హాజరవడం చేసినప్పుడు కూడా ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తిస్తుంది. ఒకవేళ తమ సభ్యుడు విప్‌ని ధిక్కరించడంపై సదరు  పార్టీ 15రోజుల్లోగా ఫిర్యాదు చేయకపోతే మాత్రం ఈ చట్టం వర్తించదు. అంతేకాక ఒక పార్టీ టికెట్ మీద గెలిచిన సభ్యుడు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రత్యర్థి పార్టీ నేతను ఆహ్వానించాలని గవర్నర్‌ను రాతపూర్వకంగా కోరినప్పుడు కూడా సదరు ప్రజా ప్రతినిధికి ఈ చట్టం వర్తిస్తుంది. చట్ట సభలకు ఎన్నికైన వెంటనే ఎవరైనా స్వతంత్ర అభ్యర్థి ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరినప్పుడు కూడా అతనికీ ఫిరాయింపుల చట్టం వర్తిస్తుంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement