టెండర్లకు ‘న్యాయ’ పరీక్ష  | State cabinet approved the draft bill | Sakshi
Sakshi News home page

టెండర్లకు ‘న్యాయ’ పరీక్ష 

Published Sat, Jul 20 2019 4:54 AM | Last Updated on Sat, Jul 20 2019 4:54 AM

State cabinet approved the draft bill - Sakshi

శుక్రవారం కేబినెట్‌ సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి:  దేశ చరిత్రలోనే తొలిసారిగా టెండర్ల ప్రక్రియలో ఉత్తమ పారదర్శక విధానానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం అమల్లో ఉన్న టెండర్ల ప్రక్రియను సమూలంగా ప్రక్షాళన చేయనున్నట్లు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అదే వేదికపై ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కొత్త చట్టాన్ని తెచ్చేందుకు శుక్రవారం ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ(కేబినెట్‌) సమావేశంలో ముందడుగు పడింది. టెండర్ల విధానంలో పారదర్శకత, ప్రజాధనం ఆదాకు పెద్దపీట వేయడంతో పాటు అక్రమాలు, పక్షపాతం, అవినీతిని నిర్మూలించడమే లక్ష్యంగా కొత్తగా ‘ఏపీ మౌలిక సదుపాయాల (న్యాయ పరిశీలన ద్వారా పారదర్శకత) చట్టం–2019’ ముసాయిదా బిల్లును కేబినెట్‌ భేటీలో ఆమోదించారు. అవినీతిపై జరుగుతున్న పోరాటంలో ఈ చట్టం ఒక గొప్ప అడుగు అని మంత్రివర్గం అభివర్ణించింది.  

ముసాయిదా బిల్లులోని ప్రధాన అంశాలు..  
మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యం కల్పిస్తూ సంబంధిత టెండర్ల ప్రక్రియలో పారదర్శకతకు పెద్దపీట వేశారు. హైకోర్టు జడ్జి లేదా రిటైర్డ్‌ జడ్జి నేతృత్వంలో టెండర్లను పరిశీలన చేయించనున్నారు. జడ్జి పరిశీలన అనంతరమే మార్పులు, చేర్పులతో టెండర్ల ప్రతిపాదనలను ఖరారు చేస్తూ ఆ తరువాతే బిడ్డింగ్‌కు వెళ్లేందుకు వీలుగా ముసాయిదా బిల్లులో ప్రొవిజన్స్‌ ప్రతిపాదించారు. అందరికీ సమాన అవకాశాలు, నాణ్యతా ప్రమాణాలు, ఖర్చు విషయంలో జాగ్రత్త పాటించడమే లక్ష్యాలుగా ముసాయిదా బిల్లుకు రూపకల్పన చేశారు. రూ.100 కోట్లకు పైగా విలువైన అన్ని మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను హైకోర్టు జడ్జి లేదా హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి పరిధిలోకి తీసుకొస్తున్నారు. పనిని ప్రతిపాదిస్తున్న ప్రతి శాఖ ఆ పత్రాలను జడ్జికి సమర్పించాల్సిందే. టెండర్లను పిలవడానికి ముందే అన్ని ప్రభుత్వ–ప్రైవేట్‌ భాగస్వామ్యం(పీపీపీ), జాయింట్‌ వెంచర్లు(జేవీ), స్పెషల్‌ పర్పస్‌ వెహికల్స్‌ (ఎస్పీవీ) సహా ప్రభుత్వం చేపట్టే అన్ని ప్రాజెక్టులపైనా న్యాయమూర్తి పరిశీలన చేయనున్నారు.

పనులను ప్యాకేజీలుగా విభజించినా సరే మొత్తం పని విలువ రూ.100 కోట్లు దాటితే జడ్జి పరిధిలోకి రావాల్సిందే. జడ్జికి సహాయంగా నిపుణులను ప్రభుత్వం సమకూర్చనుంది. అలాగే, తనకు అవసరమైన నిపుణులను జడ్జి కోరవచ్చు. పనుల ప్రతిపాదనలను వారం రోజుల పాటు ప్రజలు, నిపుణుల పరిశీలనకు అందుబాటులో ఉంచాలి. అనంతరం 8 రోజుల పాటు జడ్జి పరిశీలన చేస్తారు. జడ్జికి సూచనలు, సలహాలు అందిస్తున్న వారికి ప్రభుత్వం తగిన రక్షణ కల్పిస్తుంది. న్యాయమూర్తి సిఫార్సులను సంబంధిత శాఖలు కచ్చితంగా పాటించాలి. మొత్తం 15 రోజుల్లో టెండర్‌ ప్రతిపాదనలను ఖరారు చేయాలి. ఆ తరువాతే బిడ్డింగ్‌కు వెళ్లాలి. ఎవరికీ అనుచిత లబ్ధి చేకూర్చకుండా అర్హత ఉన్న కాంట్రాక్టర్లందరికీ సమాన అవకాశాలు కల్పించాలి. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా, పనిగట్టుకుని టెండర్ల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే.. దాన్ని నిరోధించడానికి తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం జడ్జికి కల్పించారు. న్యాయమూర్తి, న్యాయమూర్తి దగ్గర పనిచేస్తున్న సిబ్బందిని పబ్లిక్‌ సర్వెంట్లుగా భావిస్తారు. దీనివల్ల వారికి రక్షణ ఉంటుందని ముసాయిదా బిల్లులో స్పష్టం చేశారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించడం ద్వారా చట్టబద్ధత కల్పించాలని మంత్రివర్గం నిర్ణయించింది. 

ఏపీఈడీబీ చట్టం రద్దు  
పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా కొత్త చట్టం తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ఎకనమిక్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు (ఏపీఈడీబీ) చట్టాన్ని రద్దు చేస్తూ, దాని స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు వీలుగా ముసాయిదా బిల్లుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొత్తగా ‘ఆంధ్రప్రదేశ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ అండ్‌ మానిటరింగ్‌ చట్టం–2019’ ముసాయిదా బిల్లును కేబినెట్‌ ఆమోదించింది. పెట్టుబడుల ఆకర్షణ, బ్రాండింగ్, పర్యవేక్షణ, ప్రాజెక్టులకు అనుమతులు, నిధుల సమీకరణ, పరిశ్రమల కాలుష్యంపై నియంత్రణ, విధానాల రూపకల్పనలే లక్ష్యాలుగా కొత్త చట్టం ఉండనుంది. కొత్త చట్టంలో భాగంగా సలహా మండలి చైర్మన్‌గా ముఖ్యమంత్రి, మొత్తం ఏడుగురు డైరెక్టర్లు ఉంటారు. డైరెక్టర్లుగా ఆర్థిక, పరిశ్రమల శాఖల మంత్రులు, చీఫ్‌ సెక్రటరీ తదితరులుంటారు. అలాగే ఏపీఐపీఎంఏలో శాశ్వత ప్రత్యేక సలహా మండలి ఉండనుంది. ఇందులో ప్రఖ్యాత కంపెనీల సీఈవోలు, వ్యాపార దిగ్గజాలు, ఆర్థిక నిపుణులు ఉంటారు. ప్రధాన కార్యాలయం విజయవాడలో, మరో కార్యాలయం హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తారు. యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం, శిక్షణ ఇవ్వనున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement