ఏపీ: 26 లక్షల మందికి ఇళ్ల స్థలాలు | Andhra Pradesh Cabinet Taken Key Decisions On Housing Land Distribution | Sakshi
Sakshi News home page

26 లక్షల మందికి ఇళ్ల స్థలాలు

Published Thu, Mar 5 2020 3:49 AM | Last Updated on Thu, Mar 5 2020 9:07 AM

Andhra Pradesh Cabinet Taken Key Decisions On Housing Land Distribution - Sakshi

బుధవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉగాది రోజున సుమారు 26 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పంపిణీకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎన్‌పీఆర్‌లోని కొన్ని అంశాల్లో మార్పులు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించింది. వెలగపూడిలోని సచివాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన బుధవారం సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం భోగాపురం ఎయిర్‌పోర్ట్, రామాయపట్నం పోర్టు నిర్మాణం, ఖరీఫ్‌లో రైతులకు విత్తనాలు, తదితర కీలక నిర్ణయాలు తీసుకుంది. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) పేర్ని వెంకట్రామయ్య(నాని) విలేకరులకు వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. 
 
నాలుగేళ్లలో 26 లక్షల ఇళ్ల నిర్మాణం 
ఉగాది రోజున రాష్ట్రంలో సుమారు 26 లక్షల మందికి ఇళ్ల స్థలాలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం 43,141 ఎకరాల భూమిని యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేసి.. మార్కింగ్, ప్లాట్లు వేసి సర్వం సిద్ధం చేసింది. గతంలో సర్కార్‌ పంపిణీ చేసే ఇళ్ల స్థలాలపై లబ్ధిదారులకు కేవలం వారసత్వ అనుభవ హక్కు మాత్రమే ఉండేది. ప్రస్తుతం ఇళ్ల స్థలాలు పొందే లబ్ధిదారులు ఇంటిని కట్టుకోవడానికి, బ్యాంకులో తనఖా పెట్టి రుణం తీసుకోవడానికి.. ఐదేళ్ల తర్వాత వ్యక్తిగత అవసరాల కోసం విక్రయించుకోవడానికి వీలుగా ప్రభుత్వం న్యాయపరమైన హక్కులు కల్పిస్తోంది. ఈ మేరకు నిర్దేశిత ఫార్మాట్‌లో స్టాంప్‌ పేపర్‌పై రిజిస్ట్రేషన్‌ చేసి పట్టాలు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రక్రియను సులభతరం చేయడం కోసం ఎమ్మార్వోలకు జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్ల హోదా కల్పించాలని, ఎమ్మార్వో కార్యాలయాలను జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలుగా గుర్తించాలని నిర్ణయించింది. ఏటా 6 లక్షలకుపైగా ఇళ్ల చొప్పున వచ్చే నాలుగేళ్లలో 26 లక్షల ఇళ్లు నిర్మించాలని.. వీటికి వైఎస్సార్‌ జగనన్న కాలనీలుగా పేరు పెట్టాలని తీర్మానం చేసింది.   
లబ్ధిదారులకు ఇచ్చే ఇంటి పట్టాను చూపిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ 
 
అభయన్స్‌లో ఎన్‌పీఆర్‌ 
నేషనల్‌ పాపులేషన్‌ రిజిస్టర్‌ (ఎన్‌పీఆర్‌)పై మూడు నెలలుగా దేశ వ్యాప్తంగా కోట్లాది మంది మైనార్టీ వర్గాల ప్రజలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటం, రాష్ట్రంలోని మైనార్టీ వర్గాల ప్రజల్లో అదే రీతిలో అభ్యంతరాలు వ్యక్తం కావడం పట్ల మంత్రివర్గం చర్చించింది. ఎన్‌పీఆర్‌పై మైనార్టీ వర్గాల ప్రజల్లో అభద్రతాభావం తొలగించాలంటే 2010 నాటి జనాభా గణన ప్రశ్నావళికే పరిమితం కావాలని.. ఆ మేరకు ప్రస్తుతం ఉన్న ఎన్‌పీఆర్‌ ప్రశ్నల నమూనాలో మార్పు చేయాలని కేంద్రాన్ని కోరుతూ మంత్రివర్గం తీర్మానం చేసింది. అలా మార్పు చేసే వరకు ఎన్‌పీఆర్‌ ప్రక్రియను అభయన్స్‌లో ఉంచాలని నిర్ణయించింది. 
 
పీపీపీ విధానంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి  
ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి పనులను టెండర్ల ప్రక్రియలో హెచ్‌–1గా నిలిచిన జీఎమ్మార్‌ ఎయిర్‌పోర్ట్స్‌ లిమిటెడ్‌ సంస్థకు అప్పగించడానికి మంత్రివర్గం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. గతంలో జీఎమ్మార్‌ ఎయిర్‌పోర్ట్స్‌ లిమిటెడ్‌కు 2,703 ఎకరాల భూమిని అప్పగించాలని టెండర్లలో పెట్టిన నిబంధనను సడలించింది. ఆ సంస్థకు 2,200 ఎకరాల భూమిని మాత్రమే అప్పగించాలని నిర్ణయించింది. మిగిలిన 503 ఎకరాల భూమిని ప్రభుత్వ అవసరాల కోసం అధీనంలోకి తీసుకోనుంది. అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి అవసరమైన భూమిలో మరో 362.55 ఎకరాలను సేకరించాల్సి ఉంది. ఈ భూసేకరణకు అవసరమైన రూ.280 కోట్లను రుణం రూపంలో తెచ్చుకోవడానికి ఆంధ్రప్రదేశ్‌ ఎయిర్‌పోర్ట్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఏడీసీఎల్‌)కు అనుమతి ఇచ్చింది. 
 
కాకినాడ గేట్‌ వే పోర్టు నిర్మాణానికి కాల వ్యవధి పొడిగింపు 
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలో తొండంగి మండలం కోన గ్రామం వద్ద పోర్టు నిర్మాణం కోసం 9 నెలల కాల వ్యవధిని పొడిగిస్తూ.. ఆ మేరకు కాకినాడ గేట్‌వే పోర్టు లిమిటెడ్‌కు అనుమతి ఇవ్వడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కాకినాడ ఎస్‌ఈజెడ్‌ లిమిటెడ్‌లో 49 శాతం ఈక్విటీని అదానీ పోర్టు అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌ లిమిటెడ్‌కు బదిలీ చేస్తూ చేసుకున్న ఒప్పందాన్ని ఆమోదించింది.  
 
‘సిట్‌’కు విస్తృత అధికారాలకు ఆమోదం 
రాజధాని అమరావతి ప్రాంతంలో జరిగిన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్, భూ అక్రమాలపై కేబినెట్‌ సబ్‌ కమిటీ నివేదికలోని అంశాలపై దర్యాప్తు బాధ్యతలను ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌)కు అప్పగిస్తూ ఇటీవల సర్కార్‌ జారీ చేసిన ఉత్తర్వులను మంత్రివర్గం ఆమోదించింది. సిట్‌ కార్యాలయాన్ని పోలీసుస్టేషన్‌గా గుర్తించడానికి, అక్రమాలకు పాల్పడిన వారిపై ఎఫ్‌ఆర్‌ఐలు నమోదు చేసి.. కోర్టుల్లో చార్జ్‌షీట్‌ ఫైల్‌ చేసే విస్తృత అధికారాలు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలిపింది.  
  
మంత్రివర్గం నిర్ణయాల్లో మరికొన్ని.. 
– రామాయపట్నం, భావనపాడు, మచిలీపట్నంలలో పోర్టులను రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా రామాయపట్నం పోర్టు నిర్మాణానికి అడ్డంకులను తొలగించడానికి సంబంధించిన ఉత్తర్వులకు ఆమోదం. 
– ఖరీఫ్‌ పంటల సాగుకు రైతులకు విత్తనాలను పంపిణీ చేయడానికి.. అవసరమైన విత్తనాలను సేకరించుకోవడానికి ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ సీడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు రూ.500 కోట్ల రుణం తీసుకోవడానికి ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చేందుకు సమ్మతి. 
– ఏపీ జెన్‌కో, ఏపీపీడీసీఎల్‌ (ఆంధ్రప్రదేశ్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌) చెరో రూ.1,000 కోట్లు చొప్పున, మొత్తంగా రూ.2 వేల కోట్ల రుణం తీసుకోవడానికి ప్రభుత్వం నుంచి బ్యాంకు గ్యారంటీ ఇచ్చేందుకు కేబినెట్‌ ఆమోదించింది. రూ.2 వేల కోట్ల రుణంతో కృష్ణపట్నంలో 800 మెగావాట్లు, వీటీపీఎస్‌లో 800 మెగావాట్ల థర్మల్‌ కేంద్రాల నిర్మాణాన్ని పూర్తి చేసి.. 1600 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేయాలని నిర్ణయం. 
– ప్రకాశం జిల్లా ఒంగోలులో గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం 1.96 ఎకరాల భూమి కేటాయింపు రద్దు చేస్తూ ఇటీవల సర్కార్‌ జారీ చేసిన ఉత్తర్వులకు ఆమోదం. ఆ భూమిని జలవనరుల శాఖకు అప్పగించాలని, ఎన్‌ఎస్‌పీ కాలనీ విస్తరణకు ఆ భూమిని వినియోగించాలని నిర్ణయం. 
– కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం సున్నిపెంటలో నాలుగు గ్రామ సచివాలయాల ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్‌. అందులో 44 పోస్టుల భర్తీకి అనుమతి.  

నీతిమాలిన రాజకీయాల్లో చంద్రబాబు నంబర్‌ వన్‌  
నీతిమాలిన రాజకీయాలు చేయడంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నంబర్‌ వన్‌ అని మంత్రి పేర్ని నాని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు ఎవరూ కనిపించరని, అధికారం కోల్పోగానే నెత్తి మీద ఉన్న కళ్లు నేల చూపులు చూస్తాయన్నారు. గత ప్రభుత్వ మంత్రివర్గంలో ఒక మైనార్టీకి.. ఒక ఎస్టీకి స్థానం కల్పించని చంద్రబాబు ఇప్పుడు ఆ వర్గాల ప్రజలపై లేని ప్రేమను ఒలకబోస్తున్నారని దుయ్యబట్టారు. 2019 శాసనసభ ఎన్నికల్లో ఎంత మంది బీసీలకు టికెట్లు ఇచ్చారో చెప్పాలని నిలదీశారు. అన్ని వర్గాల ప్రజలను, వ్యక్తులను అవసరాలకు వాడుకోవడం.. అవసరం తీరగానే కసుక్కున కత్తితో పొడవడంలో చంద్రబాబు నేర్పరి అన్నారు. హైకోర్టు తీర్పు మేరకే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తున్నామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీలతోపాటు మున్సిపల్‌ ఎన్నికలనూ నిర్వహిస్తామన్నారు. ఇళ్ల స్థలాల పంపిణీ నిర్ణయం ముందే తీసుకున్నామని, వాటికి స్థానిక సంస్థల ఎన్నికల నియమావళికి సంబంధం ఉండదని మరొక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఎన్‌పీఆర్‌పై మైనార్టీ వర్గాల ప్రజల అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement