lands distribution
-
దళితులు ధనికులు కావాలె.. ఏ పార్టీ వాళ్లయినా దళితబంధు ఇద్దాం
సిరిసిల్ల: సమాజంలో అణచివేతకు గురై, అట్టడుగున ఉన్న దళితులను ధనికులను చేసే లక్ష్యంతో దేశంలోనే ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ తెలంగాణలో దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గురువారం రాష్ట్ర ఎస్సీ, గిరిజన, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి పోడుభూములకు పట్టాలు, ఎస్సీ చిరువ్యాపారులకు ఆర్థిక సాయం అందించారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ దళితబంధులో తొలి విడతలో ప్రతి నియోజ కవర్గానికి 100 కుటుంబాలకు అందించామని, విప్లవాత్మక మార్పులు వచ్చాయని అన్నారు. రెండో విడతలో ప్రతి నియోజకవర్గానికి 1100 యూనిట్లు అందిస్తామని తెలిపారు. ఏ పార్టీ వారైనా అందరికీ దళితబంధు ఇస్తామన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ధనికులు ఏ నీళ్లు తాగుతారో.. వీర్నపల్లి తండాలోనూ అవే నీళ్లు తాగేలా ఇంటి ముందు నల్లా పెట్టి నీళ్లు అందిస్తున్నామన్నారు. కొమురం భీమ్ స్ఫూర్తితో జల్, జమీన్, జంగల్ నినాదాలతో నీళ్లు సాధించి, పోడుభూములకు పట్టాలిచ్చి, కొత్తగా 5 లక్షల ఎకరాల్లో 8 శాతం పచ్చదనాన్ని పెంచామన్నారు. 70 ఏళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం 9 ఏళ్లలో చేసి చూపించామని, తొమ్మిదేళ్లలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని కేటీఆర్ వివరించారు. రైతులకు బీమా చేయిస్తున్న ఏకైక ప్రభుత్వం మనదే అన్నారు. సీఎం కేసీఆర్ సాహసోపేత నిర్ణయాలతో తెలంగాణ రాష్ట్రం దేశానికి మోడల్‌గా మారిందని రాష్ట్ర ఎస్సీ, గిరిజన, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. వ్యవసాయ కాలేజీకి బాబూ జగ్జీవన్‌రామ్ పేరు తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల వ్యవసాయ కళాశాలకు బాబూ జగ్జీవన్‌రామ్ కళాశాలగా నామకరణం చేశారు. ఆయన వర్ధంతి సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన జగ్జీవన్‌రామ్ విగ్రహాన్ని మంత్రులు ఆవిష్కరించారు. 128 మంది ఎస్సీ చిరువ్యాపారులకు రూ.62 లక్షల మేరకు ఆర్థిక సాయం చెక్కులను పంపిణీ చేశారు. జిల్లాలో 1,614 మంది గిరిజనులకు 2,558.34 ఎకరాల పోడు భూములకు పట్టాలను అందించారు. జెడ్పీ చైర్పర్సన్ అరుణ, వేములవాడ ఎమ్మెల్యే రమేశ్‌బాబు, కలెక్టర్ అనురాగ్ జయంతి, టీపీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
జమునా హేచరీస్ భూములు బాధిత రైతులకు పంపిణీ
మెదక్ జోన్/ వెల్దుర్తి: మెదక్ జిల్లా మాసాయిపేట, చిన్నశంకరంపేట మండలాల్లోని వివాదాస్పద అసైన్డ్ భూములను అధికారులు బుధవారం బాధిత రైతులకు అప్పగించారు. తమ భూములను కాజేశారంటూ ఆయా మండలాల్లోని అచ్చంపేట, హకీంపేట, దరిపల్లి గ్రామాల రైతులు ప్రస్తుత బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (జమునా హేచరీస్)పై గతేడాది ఏప్రిల్‌లో సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కాగా ప్రభుత్వ ఆదేశంతో సర్వే చేయించిన కలెక్టర్ హరీశ్ 66 ఎకరాల అసైన్డ్ భూములు కబ్జాకు గురై నట్లుగా ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందించారు. దీనిపై జమునా హేచరీస్ కోర్టును ఆశ్రయిం చగా, 2021 నవంబర్‌లో మరో సర్వే చేశారు. 85 ఎకరాల 19 గుంటల భూమి కబ్జాకు గురైనట్టు గుర్తించి నివేదిక అందించారు. దీంతో ఈ భూమిని తిరిగి బాధితులకు అప్పగించాలని ఆదేశిస్తూ ప్రభుత్వం ప్రత్యేక జీఓ విడుదల చేసింది. దీంతో బుధవారం రెవెన్యూ అధికారులు మూడు సర్వే బృందాలను ఏర్పాటు చేసి బాధిత రైతులకు ఆయా సర్వే నంబర్లలో డివిజన్ల వారీగా హద్దులు చూపెట్టారు. ఈ ప్రక్రియ పరిశీలించడానికి వచ్చిన మెదక్ ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి బాధిత లబ్ధిదారులకు ఆ మేరకు పట్టా సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. మాసాయిపేట మండ లం అచ్చంపేట శివారులోని 77, 78, 79, 80, 81, 82 సర్వే నంబర్లలో 62 మంది బాధితులకు 84 ఎకరాల 19 గుంటలు, హకీంపేట శివారులో సర్వే నంబరు 97లో ముగ్గురు రైతులకు ఎకరం భూమికి సంబంధించి పట్టాలు అందజేశారు. పట్టాలు సరే.. నిర్మాణాల సంగతేంటి? ప్రభుత్వం పంపిణీ చేసిన పట్టాలతో రైతులు హర్షం వ్యక్తం చేయగా, కొందరు మాత్రం అయోమయంలో ఉన్నారు. వారికి చూపించిన హద్దుల్లో హేచరీస్‌కు చెందిన శాశ్వత కట్టడాలు ఉండటంతో వాటిని ఎవరు..ఎప్పుడు తొలగిస్తారు అందులో తామెలా వ్యవసాయం చేసుకునేదని పలువురు వాపోతున్నారు. ఇదిలా ఉండగా..పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు అడ్డుకుం టారేమోనని తూప్రాన్ డీఎస్పీ యాదగిరిరెడ్డి ఆధ్వ ర్యంలో పోలీసులు జమునా హేచరీస్ ముందు మోహరించారు. ఎవరైనా ఆందోళనలు చేస్తే అరెస్టు లు చేసి అక్కడి నుంచి తరలించేందుకు వీలుగా ప్రైవేట్ బస్సులు, డీసీఎంలను ఏర్పాటు చేశారు. -
మైనార్టీల భూములపైనా లింగమనేని పంజా
మంగళగిరి: రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఐజేఎం సంస్థ పేరుతో ప్రాచుర్యం పొందిన లింగమనేని రమేష్ చివరకు మైనార్టీల భూములనూ వదల్లేదు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజ, చినకాకాని, నిడమర్రు గ్రామాల్లో ఐజేఎం లింగమనేని రియల్ ఎస్టేట్ పేరుతో అపార్ట్మెంట్లు, విల్లాలతో పాటు సుమారు 1,200 ఎకరాలకు పైగా భూములు ఉన్నాయి. వాటిలో వందలాది ఎకరాల ప్రైవేటు భూములతో పాటు ప్రభుత్వ పోరంబోకు భూములు కూడా ఉన్నట్టు ఆరోపణలున్నాయి. తాజాగా పీర్ల మాన్యం భూములను లింగమనేని రమేష్ సతీమణి సుమన పేరిట ఉండటాన్ని గుర్తించిన అధికారులు నోటీసులు జారీ చేశారు. కాజ గ్రామంలో రైల్వే గేటుకు అవతల, ఇవతల పీర్ల మాన్యం పేరుతో ఇనాం భూములు 11.25 ఎకరాలు ఉన్నాయి. పూర్వం దాతలు పీర్ల మాన్యం కింద అందజేసిన భూములను కౌలుకు ఇచ్చి.. వాటిపై వచ్చే ఆదాయంతో ముస్లింలు పీర్ల పండుగలను జరుపుకుంటారు. గ్రామంలో సర్వే నంబర్ 287/5లోని 2.06 ఎకరాలు లింగమనేని సుమన పేరున ఉన్నాయి. 287/1ఏ2, 287/1ఏ2ఏ, 287/1ఏ2బీ, 287/1ఏ2సీ, 287/1ఏ2డీ, 287/1బీ సర్వే నంబర్లలో మరో 9.19 పీర్ల మాన్యం భూములు ఉన్నాయి. అవన్నీ శ్యామల మల్లికార్జునరెడ్డి, సింహాద్రి నాగేశ్వరమ్మ, సింహాద్రి ప్రసాద్‌రెడ్డి, మెట్టు వెంకట కాశీ విశ్వనాథం, శ్యామల విజయలక్ష్మి, శ్యామల శ్రీనివాస్‌రెడ్డి, సింహాద్రి సామ్రాజ్యం, సింహాద్రి ప్రసాద్‌రెడ్డి, సింహాద్రి వెంకటరామారెడ్డి ఆ«దీనంలోకి మళ్లాయి. సదరు భూములను పీర్ల మాన్యం కౌలుకు మాత్రమే ఇచ్చి అనుభవించాల్సి ఉండగా భూములకు పట్టాలు, పాస్ పుస్తకాలు పుట్టించి విక్రయాలు జరిపారు. దానికి అప్పటి పీర్ల మేనేజర్ లావాదేవీలు నిర్వహించడం విశేషం. ఎకరం రూ.3 కోట్లకు పైగా పలుకుతోంది. 2013 రెవెన్యూ చట్టం ప్రకారం భూములకు పట్టాలు ఉన్నా, పాస్ పుస్తకాలు ఉన్నా చెల్లవని, తిరిగి వక్ఫ్ బోర్డు స్వాదీనం చేసుకోవచ్చని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై తహసీల్దార్ జీవీ రాంప్రసాద్ వివరణ కోరగా.. ఆర్ఎస్ఆర్ ప్రకారం పీర్ల మాన్యం భూములు 11 ఎకరాలను గుర్తించి ఆ భూముల్లో ఉన్న యజమానులకు నోటీసులు జారీ చేశామని తెలిపారు. నోటీసులు అందుకున్న వారు తమకు అనుకూలంగా కోర్టు తీర్పు ఉందని చెబుతున్నారన్నారు. కోర్టు తీర్పు ఉన్నా చట్ట ప్రకారం పీర్ల మాన్యం భూములు (ఇనాం భూములు) వక్ఫ్ బోర్డుకు చెందుతాయన్నారు. నోటీసులు జారీ చేసి పూర్తిస్థాయిలో విచారణ చేపట్టామని, విచారణ అనంతరం నిర్ణయం తీసుకుంటామని తహసీల్దార్ తెలిపారు. -
ఉత్సాహంగా పట్టాల పంపిణీ
సాక్షి నెట్వర్క్: రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఇంటిస్థలం పట్టాలు, టిడ్కో ఇళ్ల పత్రాల పంపిణీ కొనసాగుతోంది. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇల్లు’ పథకం కింద 15వ రోజు శుక్రవారం కూడా వీటి పంపిణీ ఉత్సాహంగా సాగింది. ఆయా లే అవుట్ల వద్ద వేలాదిమంది ప్రజలతో కోలాహలం నెలకొంది. స్థలం వచ్చినవాళ్లు, ఇళ్లు మంజూరైనవాళ్లు, టిడ్కో ఇళ్లు వచ్చినవాళ్లు పట్టాలు, పత్రాలు తీసుకుని ఉత్సాహంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పడం కనిపించింది. తూర్పుగోదావరి జిల్లాలో 41,913 మందికి పట్టాలు, పత్రాలు అందజేశారు. కాపు కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ పాల్గొన్నారు. విశాఖలో 16,475 మందికి పట్టాలు అందజేశారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీలు విజయసాయిరెడ్డి, సత్యవతి, ఎమ్మెల్యే కన్నబాబు పాల్గొన్నారు. కృష్ణాజిల్లాలో 7,630 ఇళ్లపట్టాలను పేదలకు అందజేశారు. మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), ఎమ్మెల్యేలు రక్షణనిధి, కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. గుంటూరు జిల్లాలో 4,246 మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో 3,639 మందికి పట్టాలు అందజేశారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 3,383 మందికి ఇంటి స్థలం పట్టాలు, 469 మందికి టిడ్కో ఇళ్ల పత్రాలు అందజేశారు. ఎమ్మెల్యేలు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 2,900 మందికి పట్టాలు పంపిణీ చేశారు. అనంతపురం జిల్లాలో 2,805 మందికి పట్టాలిచ్చారు. ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. వైఎస్సార్ జిల్లాలో 2,133 మందికి పట్టాలు పంపిణీ చేశారు. కర్నూలు జిల్లాలో 1,236 పట్టాలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యేలు తొగురు ఆర్థర్, డాక్టర్ జె.సుధాకర్ పాల్గొన్నారు. విజయనగరం జిల్లాలో 956 మంది లబ్ధిదారులకు ఇంటి స్థలం పట్టాలు, టిడ్కో ఇళ్ల పత్రాలు అందజేశారు. -
స్థలం మాది.. ఇల్లు మాది.. జగనన్న వరం ఇది..
సాక్షి నెట్వర్క్: బెలూన్లు ఎగురవేసేవారు.. మిఠాయిలు పంచేవారు.. పరస్పరం అభినందించుకునేవారు.. పట్టాలను పైకి చూపిస్తూ చేతులు జోడించేవారు.. జై జగన్ అంటూ ప్లకార్డులు పట్టుకున్నవారు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫొటోలు పట్టుకుని కృతజ్ఞతగా చూస్తున్నవారు.. వైఎస్సార్ జగనన్ననగర్ పేరుతో వేసిన ముగ్గులు.. ఎటు చూసినా కోలాహలమే. పండుగ వాతావరణమే. కొత్తబట్టలు ధరించి సంబరంగా స్థలాలు చూసుకుంటూ ‘ఈ స్థలం మాది..’ అనుకుంటూ భావోద్వేగంతో చెమ్మగిల్లిన కళ్లతో కనిపించినవారు లెక్కలేనంతమంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టిన ‘నవరత్నాలు– పేదలందరికీ ఇళ్లు’ పథకంలో జరుగుతున్న పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంగళవారం 12వ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కనిపించిన దృశ్యాలివి. అన్ని జిల్లాల్లోను మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని ఇంటిస్థల పట్టాలు, టిడ్కో ఇళ్ల పత్రాలు పంపిణీ చేశారు. పట్టాల పంపిణీ జరిగిన గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. అందరూ తమ ఇంట్లో శుభకార్యం అన్నట్లుగా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎవరెవరికి స్థలాలు వచ్చాయి, ఇళ్లు ఎంతమందికి మంజూరయ్యాయి.. అంటూ చర్చించుకోవడం కనిపించింది. భార్యాభర్తలు, పిల్లలతో కలిసి తమ స్థలం వద్ద ఫొటోలు తీసుకుంటూ ఆనందంగా కనిపించారు. కొందరు తమ స్థలాల్లో శంకుస్థాపన చేశారు. విజయనగరం జిల్లాలో 43,937 స్థలం పట్టాలు, ఇళ్ల పత్రాలు పంపిణీ చేశారు. విశాఖ జిల్లాలో 39,203 మందికి పట్టాలు, టిడ్కో ఇళ్ల పత్రాలు అందజేశారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు, ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, అన్నంరెడ్డి అదీప్‌రాజ్, గుడివాడ అమర్నాథ్, కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, పెట్ల ఉమాశంకర్‌గణేష్, యూవీ రమణమూర్తిరాజు, శెట్టి ఫాల్గుణ, వాసుపల్లి గణేష్‌కుమార్, తిప్పల నాగిరెడ్డి పాల్గొన్నారు. కృష్ణాజిల్లాలో 35,124 పట్టాలు పంపిణీ చేశారు. మంత్రులు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని), వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 22,968 పట్టాలు పంపిణీ చేశారు. మంత్రులు కురసాల కన్నబాబు, చెల్లుబోయిన శ్రీనివాసవేణుగోపాలకృష్ణ, పినిపే విశ్వరూప్, ఎంపీ వంగా గీతా, రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ జిల్లాలో 11,743 మందికి, కర్నూలు జిల్లాలో 8,831 మందికి పట్టాలు అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 8,649 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని, మంత్రులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, తానేటి వనిత పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో 7,881 పట్టాలు అందజేశారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి హాజరయ్యారు. గుంటూరు జిల్లాలో 7,787 మందికి పట్టాలు పంపిణీ చేశారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 4,762 స్థలపట్టాలు, టిడ్కో ఇళ్ల పత్రాలు అందజేశారు. మంత్రులు అనిల్‌కుమార్‌యాదవ్, గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అనంతపురం జిల్లాలో 4,417 మందికి పట్టాలు పంపిణీ చేశారు. ఎంపీ గోరంట్ల మాధవ్, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో 3,776, శ్రీకాకుళం జిల్లాలో 3,357 మందికి పట్టాలు, ఇళ్ల పత్రాలు అందజేశారు. సీఎంకు రుణపడి ఉంటాను నేను దివ్యాంగుడిని. తల్లిదండ్రులు మృతి చెందడంతో పిన్నమ్మ ఇంట్లో ఉంటున్నా. సొంతిల్లు లేదు. తల్లిదండ్రులు ఉన్న సమయంలోనూ అద్దె ఇంట్లోనే ఉండేవాళ్లం. గతంలో పలుసార్లు ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేదు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక వలంటీర్ మా ఇంటికి వచ్చి స్థలం కోసం దరఖాస్తు చేయించాడు. ప్రస్తుతం ఇంటి పట్టా మంజూరు అయ్యింది. ఎట్టకేలకు సొంతింటి కల నెరవేరుతోంది. జగనన్నకు రుణపడి ఉంటాను. – మహేశ్వరరెడ్డి, తుమ్మలపెంట, కొలిమిగుండ్ల మండలం, కర్నూలు జిల్లా ఐదేళ్ల కల తీరింది మా ఇద్దరిదీ నక్కలదిన్నె గ్రామమే. ఐదేళ్ల కిందట పెళ్లయింది. మేం ఇద్దరు పిల్లలతో పూరి గుడిసెలో నివాసం ఉంటున్నాం. ఇంటి స్థలం కోసం ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు మాకు ఇంటి స్థలంతోపాటు ఇల్లు కూడా మంజూరైంది. ఐదేళ్ల సొంతింటి కల నెరవేరుతోంది. స్థలం, ఇల్లు ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. – చిరంజీవి, నవీన దంపతులు, నక్కలదిన్నె, చాపాడు మండలం, వైఎస్సార్ జిల్లా -
పండుగలా పట్టాల పంపిణీ
సాక్షి నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా నూతన సంవత్సరం తొలిరోజు కూడా నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఇళ్ల పట్టాల పంపిణీ పండుగ వాతావరణంలో జరిగింది. ఇంటిస్థల పట్టాలు, టిడ్కో ఇళ్ల ఒప్పంద పత్రాలు, ఆస్తిహక్కు పత్రాలు పంపిణీ చేశారు. కృష్ణాజిల్లాలో 8వ రోజైన శుక్రవారం 950 పట్టాలను పంపిణీ చేశారు. నందివాడ మండలం జనార్ధనపురంలో మంత్రి కొడాలి నాని పాల్గొని పేదలకు ఇళ్ల పట్టాలను అందజేసి ఇళ్లకు భూమిపూజ చేశారు. కైకలూరు మండలంలో 586 మందికి ఇళ్ల పట్టాలిచ్చారు. ► గుంటూరు జిల్లాలో శుక్రవారం 329 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. డిసెంబర్ 25 నుంచి ఇప్పటివరకు మొత్తం 86,879 మందికి పట్టాలు అందజేశారు. గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం పెదగార్లపాడులో ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, చిలకలూరిపేట మండలం మురికిపూడి గ్రామంలో ఎమ్మెల్యే విడదల రజిని, మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి రూరల్ మండలం ఇప్పటంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ల మండలం మాదలలో ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేదలకు పట్టాలను పంపిణీ చేశారు. ► పశ్చిమగోదావరి జిల్లాలో శుక్రవారం మొత్తం 785 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ జరిగింది. దీంతో ఇప్పటివరకు మొత్తం 59,962 మందికి ఇళ్ల పట్టాలు అందించినట్లయింది. ► తూర్పు గోదావరి జిల్లాలో శుక్రవారం 7,169 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేశారు. వీటితో కలిపి ఇప్పటివరకు 70,553 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ► విశాఖ జిల్లాలో మొత్తం 1,271 మందికి ఇంటిస్థల పట్టాలు, టిడ్కో ఇళ్ల ఒప్పంద పత్రాలు, ఆస్తిహక్కు పత్రాలు శుక్రవారం పంపిణీ చేశారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భీమిలి నియోజకవర్గంలో 1,021 మందికి, ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు ఆధ్వర్యంలో మాడుగులలో 150 మందికి పట్టాలను పంపిణీ చేశారు. ► విజయనగరం జిల్లాలో శుక్రవారం 1,043 ఇళ్ల పట్టాలు, 500 టిడ్కో ఇళ్లు, 236 పీసీ/ఈఆర్ పట్టాలు పంపిణీ చేశారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండలో శుక్రవారం 32 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాల్ని పంపిణీ చేశారు. ఎనిమిది రోజుల వ్యవధిలో మొత్తం 32,592 మంది పేదలు పట్టాలు అందుకున్నారు. ► చిత్తూరు జిల్లావ్యాప్తంగా శుక్రవారం 1,371 ఇళ్ల పట్టాలను పంపిణీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. వైఎస్సార్ జిల్లాలో శుక్రవారం 35 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ► అనంతపురం జిల్లా పెనుకొండ మండలం గుట్టూరులో మంత్రి శంకరనారాయణ 95 మందికి పట్టాలు పంపిణీ చేశారు. ► కర్నూలు జిల్లా నందికొట్కూరు మండల పరిధిలో ఎంపీ పోచా బ్రహా్మనందరెడ్డి, ఎమ్మెల్యే ఆర్థర్, జిల్లా కలెక్టర్ వీరపాండియన్ లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేశారు. ఆదోని మండల పరిధిలో ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి, కర్నూలు మండలం పంచలింగాలలో ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ ఆధ్వర్యంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. -
పేదల కళ్లల్లో ఆనందం
సాక్షి నెట్వర్క్: పేదల జీవితాల్లోకి వేవేల సంక్రాంతి వెలుగులు ఒక్కసారిగా వచ్చినట్లుంది. సొంతింటి కల సాకారం అవుతోందన్న ఆనందం అక్కచెల్లెమ్మల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించినప్పటి నుంచి పట్టాల పంపిణీ నిర్విఘ్నంగా సాగుతోంది. ఏడో రోజైన గురువారం రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో పట్టాల పంపిణీ కార్యక్రమం కొనసాగింది. గురువారం పంపిణీ చేసిన పట్టాలతో సహా ఇప్పటి వరకు గుంటూరు జిల్లాలో 86,488 , కృష్ణాజిల్లాలో, 62,670 పట్టాలను పంపిణీ చేశారు. ప్రకాశం జిల్లాలో 26,476, తూర్పుగోదావరి జిల్లాలో 63,384 మందికి పట్టాలు పంపిణీ పూర్తయింది. పశ్చిమగోదావరి జిల్లాలో 59,177 మందికి ఇళ్ల పట్టాలు అందించారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 32,560, విశాఖ జిల్లాలో 26,345 మందికి పట్టాలు పంపిణీ చేశారు. విజయనగరం జిల్లాలో 17,165 పట్టాల పంపిణీ పూర్తయ్యింది. కర్నూలు జిల్లాలో 14,193 మంది లబ్ధిదారులు పట్టాలు అందుకున్నారు. వైఎస్సార్ జిల్లాలో 54,421 మంది ఇళ్ల పట్టాలు అందుకున్నారు. కాగా, చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 7వ రోజు గురువారం 8,498 ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో గురువారం 2,839 మందికి ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. అనంతపురం జిల్లాలో గురువారం 3,889 మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం నారాయణస్వామి మంత్రులు మేకతోటి సుచరిత ,కొడాలి నాని, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పేర్ని నాని, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, బుగ్గన రాజేంద్రనాథ్, గుమ్మనూరు జయరాం తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు బంధువులు వస్తారేమో! నా భర్త 40 ఏళ్ల క్రితమే చనిపోయాడు. ఇద్దరు ఆడబిడ్డల్లో పెద్ద బిడ్డ అనారోగ్యంతో మృతి చెందింది. మనవడు ఆత్మహత్య చేసుకున్నాడు. చిన్న కూతురి కుటుంబం ఊరు వదిలి వెళ్లిపోయింది. రెక్కల కష్టం చేసే ఓపిక లేదు. పింఛనే ఆధారం. చిన్న ఇంటిలో ఒక్కదాన్నే అద్దెకు ఉంటున్నాను. ఇప్పుడు నాకు ఇంటి పట్టా ఇచ్చి ఇల్లు కట్టిస్తామని జగనయ్య చెప్పాడు. చాలా సంతోషంగా ఉంది. నా సొంత ఇంట్లోనే తనువు చాలిస్తానన్న ధైర్యం వచ్చింది. ఇంటి కోసమైనా దూరంగా ఉన్న బంధువులు వచ్చి నా కర్మకాండలు సక్రమంగా చేస్తారేమో. నాకు ఇల్లు కట్టిస్తున్న ఆ మహానుభావుడు చల్లగా ఉండాలి. – తమ్మిశెట్టి చినకాకమ్మ, నరమాలపాడు, గుంటూరు జిల్లా. -
డిసెంబర్ 25న రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల స్థలాల పంపిణీ
-
డిసెంబర్ 25న ఇళ్ల పట్టాల పంపిణీ
ప్రతిపక్ష కుటిల రాజకీయాల వల్ల పేదల ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసం న్యాయ పోరాటం చేయాల్సి వస్తోంది. పెద్ద పారిశ్రామిక వేత్తలకు ఎకరాలకు ఎకరాలు కట్టబెట్టారు. కానీ ఇప్పుడు పేదలకు సెంటు, సెంటున్నర స్ధలం ఇస్తామంటే అడ్డుకుంటున్నారు. ఈ యుద్ధంలో గెలుస్తాం. దేవుడు మనకు అండగా ఉంటాడు. ఇది చాలా గొప్ప కార్యక్రమం. గ్రామీణ ఇళ్లకు సంబంధించి చంద్రబాబు వదిలి పెట్టి పోయిన బకాయిలు రూ.1,432 కోట్లు ఉన్నాయి. అందులో ఈ వారంలో సుమారు రూ.470 కోట్లు విడుదల చేయబోతున్నాం. ఆ తర్వాత మిగిలిన రూ.962 కోట్లు డిసెంబర్ 25న బటన్ నొక్కి విడుదల చేస్తాం. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ కార్యక్రమాన్ని డిసెంబర్ 25వ తేదీన ప్రారంభించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. కోర్టు స్టేలు ఉన్న చోట మినహా, మిగతా అన్ని చోట్ల ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. అర్హులైన లబ్ధిదారులందరికీ డి–ఫామ్ పట్టా ఇచ్చి, ఇంటి స్థలం కేటాయించాలని స్పష్టం చేశారు. పేదలందరికీ ఇళ్ల స్థలాల పంపిణీ ఏర్పాట్లు, ఇళ్ల నిర్మాణాలపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి నిర్వహించిన స్పందన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలకు మార్గనిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అదే రోజు (డిసెంబర్ 25) తొలి దశలో దాదాపు 15.10 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 30,68,281 మంది లబ్ధిదారులను ఇళ్ల స్థలాల కోసం గుర్తించామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల నుంచే ఈ కార్యక్రమం మొదలు పెట్టామని, గిట్టని వాళ్లు కోర్టులకు వెళ్లి.. పేదలకు ఇంటి స్థలం ఇవ్వకుండా రాజకీయం చేస్తున్నారని చెప్పారు. సీఎం జగన్ ఇంకా ఏం చెప్పారంటే.. స్పందన సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్. చిత్రంలో మంత్రులు, అధికారులు కుటిల రాజకీయం ► తొలుత మార్చి 25న ఉగాది రోజు పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలనుకున్నాం. ప్రతిపక్షం రాజకీయంతో వాయిదా పడింది. ఆ తర్వాత ఏప్రిల్ 14 అంబేడ్కర్ జయంతి రోజున, ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తైన సందర్భంగా మే 30న, దివంగత నేత వైఎస్సార్ జయంతి రోజు జూలై 8న, ఆ తర్వాత ఆగస్టు 15న, చివరగా అక్టోబరు 2 గాంధీ జయంతి రోజున అనుకున్నా వాయిదా పడుతూ వచ్చింది. ► ఇళ్ల స్థలాల కోసం 66,518 ఎకరాలు సేకరించాం. వాటి మార్కెట్ విలువ రూ.23 వేల కోట్లు. మొత్తం 30,68,821 మంది పేదలకు డిసెంబర్ 25న పంచబోతున్నాం. కొత్తగా 1.20 లక్షల మందికి.. ► దరఖాస్తు చేసుకుంటే అర్హులకు 90 రోజుల్లో ఇస్తామన్నాం. ఆ మేరకు 1.20 లక్షల మందిని కొత్తగా జాబితాలో చేర్చాం. ఇందులో 80 వేల మంది కోసం కొత్తగా భూసేకరణ చేయాల్సి ఉంది. కాబట్టి వేగంగా ఆ పని చేయండి. ► డిసెంబర్ 10వ తేదీ లోగా భూసేకరణతో పాటు, ప్లాట్ల గుర్తింపు 100 శాతం పూర్తి కావాలి. అర్హులైన లబ్ధిదారులు ఇంకా ఎక్కడైనా మిగిలిపోతే, వారినీ కొత్త జాబితాలో చేర్చాలి. వచ్చే నెల 25న ఇళ్ల స్థలాలు పంపిణీ చేసే నాటికి ఇంటి నిర్మాణాలకు సంబంధించిన లబ్ధిదారుల జియో ట్యాగింగ్ పూర్తి కావాలి. ► పథకాన్ని అమలు చేసేందుకు ఆ రోజు నాటికి కలెక్టర్లు సిద్ధంగా ఉండాలి. కోర్టు స్టేలు ఉన్న చోట వాటిని వెకేట్ చేయించుకునేలా కలెక్టర్లు గట్టి ప్రయత్నం చేయాలి. సచివాలయాల పాత్ర ► ఇళ్ల నిర్మాణంలో గ్రామ, వార్డు సచివాలయాలు కీలకపాత్ర పోషిస్తాయి. డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్‌తో పాటు, వలంటీర్లు కూడా పని చేస్తారు. లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలు ప్రారంభించడం మొదలు, వారికి అవసరమైన అన్ని పనులు చేస్తారు. ► జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఆ బా«ధ్యత చూస్తారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్లు క్వాలిఫైడ్. వారి సేవలు ఉపయోగించుకోండి. అందుకు తగిన ఎస్ఓపీ ఖరారు చేయండి. ► తొలి దశలో నిర్మించనున్న ఇళ్లను 18 నెలల్లో (2022 జూన్ నాటికి) పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. రెండో దశలో గ్రామీణ ప్రాంతాల్లో 13 లక్షల ఇళ్లు నిర్మిస్తారు. వచ్చే ఏడాది 2021 డిసెంబర్లో వాటి నిర్మాణం ప్రారంభించి 2023 జూన్ నాటికి పూర్తి చేయాలనేది లక్ష్యం. వచ్చే ఏడాది ఇళ్ల నిర్మాణం అనేది ప్రభుత్వ అతి పెద్ద కార్యక్రమం. తొలి దశలో 167 నియోజకవర్గాలలో ఇళ్ల నిర్మాణాలు మొదలు కానున్నాయి. ► ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, శ్రీరంగనాథరాజు, ఆదిమూలపు సురేష్, డీజీపీ గౌతమ్ సవాంగ్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అత్యంత నాణ్యతతో కొత్త ఇళ్ల నిర్మాణం ► నవరత్నాలులో చెప్పిన మరో కార్యక్రమం అమలు చేయబోతున్నాం. తొలి దశలో దాదాపు 15.10 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నాం. ఒక్కో ఇంటిని రూ.1.80 లక్షల వ్యయంతో, అన్నీ ఒకే మాదిరిగా నిర్మిస్తారు. ఒక్క రూపాయి కూడా పేదలపై భారం పడదు. ► ఇంటి నిర్మాణానికి అవసరమైన పూర్తి సామగ్రి సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ ద్వారా సరఫరా అవుతుంది. నాణ్యతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తాం. క్వాలిటీ అనేది ప్రభుత్వానికి ట్రేడ్ మార్క్. బ్రాండ్ ఇమేజ్. కాబట్టి ఎక్కడా రాజీ పడొద్దు. ► పేదల ఇళ్ల నిర్మాణానికి ఇసుక ఉచితంగా సరఫరా చేస్తారు. 67.50 లక్షల టన్నుల సిమెంట్, 7.20 లక్షల టన్నుల ఇనుము అవసరం అవుతుంది. ఈ ఇళ్ల నిర్మాణం వల్ల 21 కోట్ల పని దినాలు లభించనున్నాయి. మెటీరియల్ ఇస్తాం. లేబర్ కాంపొనెంట్ వారికే ఇస్తాం. ఆ విధంగా దగ్గరుండి పేదలకు ఇళ్లు కట్టించి ఇస్తాం. -
ఇళ్ల స్థలాలిస్తుంటే అభ్యంతరాలెందుకు?
-
పేదలకు ఇళ్ల స్థలాలిస్తుంటే అభ్యంతరాలెందుకు?
గుడివాడ రూరల్: అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలిస్తుంటే ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలకు, అమరావతి జేఏసీలకు అభ్యంతరాలేంటని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. బుధవారం కృష్ణా జిల్లా గుడివాడ మండలం లింగవరంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. ► విజయవాడ, గుంటూరు పరిసరాల్లోని 55 వేల మంది పేదలకు అమరావతిలో ఇళ్లు నిర్మించి ఇస్తామని సీఎం జగన్ ప్రకటించారు. ► అమరావతి జేఏసీ మాత్రం అమరావతిలో పేదవాళ్లుంటే రాజధాని కళ రాదని, మురికివాడలను తలపిస్తాయని అభ్యంతరం వ్యక్తం చేసింది. అమరావతిలో ఉండాలనుకునేవాళ్లు 600, 1000 గజాల్లోనే ఇళ్లు కట్టుకోవాలని, పేదలకు ఇళ్ల స్థలాల అంశం సీఆర్డీఏ చట్టంలో లేదని కోర్టుకెక్కి ఆర్డర్ తెచ్చుకుంది. ► దీనికి దిక్కుమాలిన ప్రతిపక్ష నేత చంద్రబాబు మద్దతుగా నిలిచారు. పేదలకు ఇళ్ల స్థలాలివ్వకుండా సీఆర్డీఏ చట్టం చేసింది కూడా చంద్రబాబే. ఆ చట్టాన్ని సీఎం వైఎస్ జగన్ రద్దు చేసి అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలిస్తానంటే జేఏసీ, టీడీపీ, రైతులు ఒప్పుకోవడం లేదు. ఇలా అయితే రాజధాని ఎలా అభివృద్ధి చెందుతుంది? దాదాపు రెండు లక్షల మందికి ప్రభుత్వం అమరావతిలో స్థిర నివాసం కల్పిస్తుంటే అడ్డుకోవడం దారుణం. ► పేదలుండటానికి వీల్లేదంటున్న ప్రాంతంలో చట్టసభలు మాత్రం ఎందుకు? ఈ విషయాన్ని సీఎం జగన్‌కు రాతపూర్వకంగా వివరిస్తాను. ఇప్పటికైనా అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి అమరావతి జేఏసీ, టీడీపీ నేతలు, ఫ్యూడల్ మనస్తత్వం ఉన్నవాళ్లు అంగీకరించాలి. ► అమరావతిలో పేద ప్రజలకిచ్చే ఇళ్ల స్థలాలకు జేఏసీ, ఇతర పార్టీలు అడ్డుపడితే శాసనసభను ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ నిర్వహించడానికి వీల్లేదు. ► బీజేపీ, జనసేన, సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్, ప్రజాసంఘాలు కూడా 1500 ఎకరాల్లో పేదలకు ఇచ్చే ఇళ్ల పట్టాలపై మాట్లాడి కోర్టులో కేసులను వాపసు తీసుకునేలా చేయాలి. పేదలకు ఇళ్ల పట్టాలివ్వాలని ఉద్యమాలు చేసే కమ్యూనిస్టులు అమరావతి దగ్గరకు వచ్చేసరికి బాబుకు మదతివ్వడం దారుణం. -
సైంధవ రాజకీయం
ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుందా.. అదీ సర్వహక్కులతోనా.. వీల్లేదు.. వెంటనే అడ్డుకోండి ..అంతే ఓ లిటిగేషన్. వికేంద్రీకరణతో రాష్ట్రంలో మూడు ప్రాంతాలను అభివృద్ధి చేస్తారా.. అదెలా.. మా అవినీతి సామ్రాజ్యం ఏమైపోవాలి.. అడ్డుపడండి ..వెంటనే పదులు, వందల్లో లిటిగేషన్ల వరద అది ప్రజా సంక్షేమం అయినా, రాష్ట్ర అభివృద్ధి అయినా ఠక్కున సైంధవుడిలా అడ్డుపడిపోవడమే.. ప్రజా ప్రభుత్వాన్ని పని చేయనివ్వకుండా విలువైన కాలాన్ని హరించడమే. ఇదీ నడుస్తున్న తంత్రం. ఏడాదికిపైగా సాగుతున్న కుతంత్రం. సాక్షి, అమరావతి: ఎక్కడైనా ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే డిమాండ్‌తో ప్రతిపక్ష పార్టీలు ఆందోళనలు చేస్తాయి. కానీ మన రాష్ట్రంలో విచిత్ర పరిస్థితి. ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తాం.. ఇళ్లు కూడా కట్టించి ఇస్తాం అంటే ప్రతిపక్షం అభ్యంతరం పెడుతోంది. లిటిగేషన్లు పెట్టి పేదల సొంతింటి ఆశలకు అడ్డుపడుతోంది. ఏ రాష్ట్రంలో అయినా అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలని ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వాన్ని నిలదీస్తుంది. కానీ మన రాష్ట్రంలో ప్రభుత్వం ప్రాంతీయ సమగ్రాభివృద్ధి సాధిస్తాం అంటుంటే ప్రతిపక్షం ససేమిరా అంటూ లిటిగేషన్లతో అడ్డంకులు సృష్టిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విప్లవాత్మక విధాన నిర్ణయాలను అడ్డుకునేందుకు చంద్రబాబు తీవ్ర యత్నాలు చేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో ప్రతిపక్ష టీడీపీ తీరు కారణంగా రాష్ట్రంలో వింత రాజకీయ పరిస్థితి నెలకొందని పరిశీలకులు విమర్శిస్తున్నారు. రాజ్యాంగ పరంగా విప్లవాత్మక నిర్ణయాలు ► ప్రజా సంక్షేమం, రాష్ట్ర ప్రగతి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విప్లవాత్మక విధాన నిర్ణయాలకు శ్రీకారం చుట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో కేవలం హైదరాబాద్‌నే అభివృద్ధి చేయడంతో రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయింది. ఆ తప్పు పునరావతం కాకూడదని రాష్ట్రంలో మూడు ప్రాంతాలను సమానంగా అభివద్ధి చేయాలని సీఎం జగన్ సంకల్పించారు. ► అందుకోసం జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో కూడిన జీఎన్‌రావు కమిటీ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఇచ్చిన నివేదికలను ప్రభుత్వం అధ్యయనం చేసింది. వాటిపై శాసనసభ, శాసన మండలిలో చర్చించి బిల్లులను ఆమోదింపజేసుకుని రాజ్యాంగ బద్ధంగా మూడు రాజధానుల ఏర్పాటుకు నిర్ణయించింది. ► రాష్ట్ర రాజధాని అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని రాజ్యాంగం స్పష్టం చేస్తున్న విధానాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం పాటించింది. రాజ్యాంగ పరంగా అది సరైన ప్రక్రియ అని, ఇందులో తమ జోక్యం ఉండదని కేంద్ర ప్రభుత్వం కూడా న్యాయస్థానానికి తెలిపింది. ► ఈ అంశం రాష్ట్ర పరిధిలోనిదే కాబట్టి, గతంలో చంద్రబాబు ప్రభుత్వం తన అధికారంతో అమరావతిని రాజధానిగా ఎంపిక చేసింది. రాష్ట్రంలోలో అన్ని ప్రాంతాల అభివద్ధిని కాంక్షిస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం పరిపాలన వికేంద్రీకరణ కోసం మూడు రాజధానుల బిల్లును ఆమోదింపజేసింది. ఇందులో ఎక్కడా రాజ్యాంగ ఉల్లంఘన లేదని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సీఎం నిర్ణయంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ► ఇప్పటికే దేశంలో ప్రముఖ నగరంగా ఉన్న విశాఖపట్నంను పరిపాలన రాజధాని చేయడం ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రణాళిక రూపొందించారు. ► శాసన రాజధానిగా అమరావతిని కొనసాగిస్తూ, ఆ ప్రాంతాన్ని అభివద్ధి చేసి రైతులకు న్యాయం చేయాలని విధాన నిర్ణయం తీసుకున్నారు. వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి న్యాయం చేసేందుకు కర్నూలును న్యాయ రాజధానిగా నిర్ణయించారు. ► దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 30 లక్షల మంది పేదలకు పూర్తి హక్కులతో ఇళ్ల స్థలాల పంపిణీతోపాటు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుంది. గతంలో పేదలకు అసైన్డ్ స్థలాలు ఇచ్చేవారు. తమ అవసరాలకు వాటిని అమ్ముకునే హక్కు పేదలకు ఉండేది కాదు. దాంతో అనధికారికంగా అమ్ముకుంటే సరైన ధర వచ్చేది కాదు. ► ఈ పరిస్థితి ఉండకూడదని పేదలకు సర్వ హక్కులతో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించారు. ఆ స్థలాల్లో సమగ్ర లే అవుట్‌తో ‘వైఎస్సార్ జగనన్న కాలనీ’ల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. ఓ బెడ్రూం, పెద్ద హాలు, వరండా, వంటగదితో ఇంటి నిర్మాణ మోడల్‌ను కూడా ఆమోదించారు. తద్వారా 30 లక్షల మంది పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు సిద్ధమయ్యారు. సీఎం సంక్షేమ బాటతో గుబులు ► సంక్షేమం, అభివద్ధి అజెండాతో సీఎం వైఎస్ జగన్ దూసుకుపోతుండటంతో ప్రతిపక్ష నేత చంద్రబాబులో గుబులు మొదలైంది. 2019 ఎన్నికల్లో కేవలం 23 సీట్లకు పరిమితమైన టీడీపీకి ఇక భవిష్యత్ కూడా ఉండదని ఆయనకు అవగతమైంది. ► కరోనా సంక్షోభ కాలంలో రాష్ట్రంలో ఉండకుండా హైదరాబాద్‌కు పరిమితమైన చంద్రబాబు అక్కడి నుంచే కుతంత్రానికి తెరతీశారు. తనకు అలవాటైన రీతిలో ‘లిటిగేషన్ల’ను ఆచరణలో పెట్టారు. ► ప్రజల ప్రయోజనాలను కాపాడాలన్న సదుద్దేశంతో రూపొందించిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాల విధానాన్ని టీడీపీ స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటోందని న్యాయ నిపుణులు విమర్శిస్తున్నారు. లిటిగేషన్లే.. లిటిగేషన్లు.. ► ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే తరువాయి. వెంటనే ఓ లిటిగేషన్‌తో టీడీపీ అడ్డుపడుతోంది. ఈ నేపథ్యంలో 2019 జనవరి నుంచి 2019 డిసెంబర్ 31 వరకు రాష్ట్రంలో 188 ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ► ఇందులో 2019 జనవరి 1 నుంచి మే 22లోపు (వైఎస్సార్సీపీ అధికారంలోకి రాక ముందు) దాఖలైనవి కేవలం 83 మాత్రమే. ► వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇంత వరకు రాష్ట్ర హైకోర్టులో ఏకంగా 320 ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు కావడం గమనార్హం. వాటిలో 2020 జనవరి నుంచి ఆగస్టు 25లోగా దాఖలైనవే 215 ఉన్నాయి. 8 నెలల్లో ఇన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు కావడం హైకోర్టు చరిత్రలో ఇదే తొలిసారి. అవినీతి సామ్రాజ్యానికి ముప్పు ఏర్పడిందని ఆందోళన ► అమరావతిలో తమ అవినీతి సామ్రాజ్యం కుప్పకూలుతుందని చంద్రబాబు ఆందోళన చెందారు. అందుకే మూడు రాజధానుల నిర్ణయాన్ని అడ్డుకునేందుకు ఈ ఒక్క అంశంపై దాదాపు 90కి పైగా కేసులు వేయించడం చంద్రబాబు పన్నాగాన్ని తెలియజేస్తోంది. ► పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీని కూడా అడ్డుకోవడానికి చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు తెగించారు. ఇళ్ల స్థలాల పంపిణీకి వ్యతిరేకంగా కనీసం జిల్లాకు ఓ లిటిగేషన్ పెట్టడం విస్మయపరుస్తోందని నిపుణులు విమర్శిస్తున్నారు. ► రాష్ట్రంలో ప్రజాప్రయోజన వ్యాజ్యాల సంఖ్య ఏడాదిగా అమాంతం పెరుగుతుండటం వెనుక చంద్రబాబు పాత్ర ఉందని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. అందుకోసం దేశంలో ప్రముఖ న్యాయవాదులకు భారీగా ఫీజులు చెల్లిస్తూ టీడీపీ ఓ పెద్ద బందాన్నే నిర్వహిస్తోందని కూడా చెబుతున్నారు. చంద్రబాబుది మొసలి కన్నీరే ► తన ఐదేళ్ల పాలనలో అవినీతి, అరాచకాలకు పాల్పడ్డ చంద్రబాబు ప్రస్తుతం మొసలి కన్నీరు కారుస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. శివరామకష్ణన్ కమిటీ నివేదికకు విరుద్ధంగా ఏకపక్షంగా అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారని ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు గుర్తు చేస్తున్నారు. ► అమరావతి రాజధాని నిర్మాణం పట్ల చిత్తశుద్ధి చూపించారా.. అంటే అదీ లేదు. ఆ ముసుగులో వేల ఎకరాల అవినీతి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారని అమరావతి ప్రాంత ప్రజలే చెబుతున్నారు. ► తాత్కాలిక నిరా>్మణాలతో కనికట్టు.. స్విస్ ఛాలెంజ్ విధానాలు సింగపూర్ కంపెనీ వ్యవహారాలతో యథేచ్ఛగా అవినీతి జరగడం తమకు తెలుసని తేల్చి చెబుతున్నారు. ఐదేళ్లలో కనీసం తమకు కేటాయించిన ప్లాట్లను కూడా అభివద్ధి చేయని చంద్రబాబు రాజధానిని ఏం నిర్మిస్తారని అమరావతి రైతులు ప్రశ్నిస్తున్నారు. ► రూ.లక్ష కోట్ల అంచనా వ్యయంతో ప్రణాళిక రూపొందించి ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసిన చంద్రబాబు నిర్వాకం తమకు తెలుసని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు స్పష్టం చేస్తున్నారు. మూడు రాజధానులే ఉత్తమం ► చంద్రబాబు ప్రణాళిక ప్రకారం రాజధాని నిర్మించాలంటే 20 ఏళ్లు పడుతుంది. వ్యయం ఎన్నో లక్షల కోట్ల రూపాయలకు చేరుతుంది. అంతవరకు రాష్ట్రంలో ఎన్నో తరాలు తీవ్రంగా నష్టపోతాయని పరిశీలకులు కుండబద్దలు కొడుతున్నారు. ► ప్రస్తుతం రెడీమేడ్‌గా ఉన్న విశాఖపట్నంను పరిపాలన రా«జధానిగా చేసుకుని శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలును అభివద్ధి చేయడం ఉత్తమ మార్గమన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ► ఇదే జరిగితే టీడీపీ ఉనికి ప్రశ్నార్థక మవుతుందన్న భయంతో చంద్రబాబు ‘లిటిగేషన్ల రాజకీయం’ చేస్తున్నారు. తద్వారా విలువైన ప్రభుత్వ కాలాన్ని వృథా చేయించాలనే వ్యూహం స్పష్టమవుతోంది. వెనుకబడిన ప్రాంతాల అభివద్ధికి చంద్రబాబు మోకాలడ్డటం పట్ల రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
పేదల ఇళ్ల స్థలాలకు బాబే అడ్డంకి
-
పేదల ఇళ్ల స్థలాలకు బాబే అడ్డంకి
సాక్షి, అమరావతి: పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ వంటి మంచి కార్యక్రమానికి శత్రువులు ఎక్కువగా ఉన్నారని, దీనిపై వివిధ వేదికలపై పోరాటం చేయాల్సి వస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా చంద్రబాబునాయుడు, ఆయన పార్టీకి చెందిన వారు నానా రకాలుగా కేసులు వేసి అడ్డుకుంటున్నారన్నారు. అయినప్పటికీ చివరకు న్యాయం, మంచే గెలుస్తుందని సీఎం జగన్ స్పష్టం చేశారు. అప్పటి వరకు మనో స్థైర్యం కోల్పోకూడదని అన్నారు. మంగళవారం ఆయన స్పందన కార్యక్రమంపై తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై ఆయన అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. అతి త్వరలో మంచి రోజు వస్తుంది ► ఆగస్టు 15న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించాలనుకున్నాం. కానీ వాయిదా పడింది. అతి త్వరలోనే ఆ కార్యక్రమాన్ని చేపట్టే మంచి రోజు వస్తుంది. ► ఆలోగా ప్లాట్ల అభివృద్ధి, మార్కింగ్, లాటరీ తదితర ప్రక్రియలన్నీ పూర్తి కావాలి. బ్యాంకర్లు ఇబ్బంది పెట్టకుండా చూడాలి ► వైఎస్సార్ చేయూత సొమ్ముపై బ్యాంకులకు హక్కు లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన మహిళలకు ఆ సొమ్ము నేరుగా అందేలా కలెక్టర్లు బ్యాంకర్లతో మాట్లాడాలి. ► మహిళలకు స్థిరమైన జీవనోపాధి మార్గాలను చూపడానికి హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, ప్రోక్టర్ అండ్ గ్యాంబల్, రిలయన్స్, అమూల్, అల్లానా గ్రూపులతో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నాం. ► 19 లక్షల మంది మహిళలు వివిధ జీవనోపాధి మార్గాల కింద ఆప్షన్లు ఎంపిక చేసుకున్నారు. ఈ కార్యక్రమం అమలుపై రాష్ట్ర స్థాయిలో ప్రతి 15 రోజులకోసారి 8 మంది మంత్రులతో కూడిన బృందం సమీక్ష చేస్తుంది. ప్రతి వారం కంపెనీ ప్రతినిధులు, కలెక్టర్, సెర్ప్ ప్రతినిధులు, బ్యాంకర్లు సమీక్ష చేయాలి. ► సెప్టెంబర్ నెలలో ఆసరాకు సంబంధించిన లబ్ధిదారులు కూడా ఈ కార్యక్రమంతో అనుసంధానం అవుతారు. ఆ సమయంలోగా ‘చేయూత’ మహిళలు తమ జీవనోపాధి కార్యక్రమాలను గ్రౌండ్ చేసుకునేలా చూడాలి. ఇ– క్రాప్ బుకింగ్‌పై దృష్టి పెట్టండి ► ఇ– క్రాపింగ్ పూర్తి కాకపోతే తర్వాత కార్యక్రమాలు దెబ్బ తింటాయి. సంబంధిత జేసీలు దీనిపై దృష్టి పెట్టాలి. మండలాన్ని, ఆర్బీకేను ఒక్కో యూనిట్‌గా తీసుకుని ఎరువుల పంపిణీలో ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. ► వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించి కస్టమర్ హైరింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. మండల స్థాయిలో కూడా రైతుల గ్రూపుల ఏర్పాటుతో పాటు, యంత్రాలను డెలివరీ చేయాలి. హై వ్యాల్యూ యంత్ర పరికరాలతో హబ్స్ ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకోవాలి. ► ప్రతి ఆర్బీకే పరిధిలో ఒక ఎకరా భూమిని గుర్తించాలి. ఇక్కడ గోడౌన్లు, పంటను ఆరబెట్టుకోవడానికి ప్లాట్ ఫాం, ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్స్, పశువుల శాల, కలెక్షన్ సెంటర్ తదితర కార్యకలాపాల కోసం ఇక్కడ వసతులు కల్పిస్తాం. ‘నాడు–నేడు’ పనుల్లో వేగం పెరగాలి ► ఉపాధి హామీ పనుల కింద రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాలు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్, వైఎస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్స్ పనులు వేగంగా జరగాలి. గ్రామ సచివాలయాల భవనాల నిర్మాణం 2021 మార్చి నాటికి పూర్తి కావాలి. ► అంగన్ వాడీలను 10 రకాల సదుపాయాలతో వైఎస్సార్ ప్రీప్రైమరీ స్కూల్స్‌గా మారుస్తున్నాం. 55 వేల అంగన్వాడీల్లో నాడు–నేడు కింద పనులు చేపడతాం. వచ్చే వారానికి ప్రణాళిక సిద్ధం అవుతుంది. ► స్కూళ్లలో నాడు–నేడుపై కలెక్టర్లు, జేసీలు ప్రత్యేక దృష్టి పెట్టాలి. ప్రస్తుతానికైతే సెప్టెంబర్ 5న స్కూళ్లు తెరవాలని ఆలోచిస్తున్నాం. ఈలోగా పనులన్నీ నాణ్యతతో పూర్తి చేయాలి. స్కూళ్లకు ఫర్నిచర్ చేరడం మొదలవుతోంది. ► సెప్టెంబర్ 1న సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ్ ప్లస్, సెప్టెంబర్ 5న జగనన్న విద్యాకానుక, సెస్టెంబర్ 11న వైఎస్సార్ ఆసరా ప్రారంభిస్తున్నాం. రూ.22 వేల కోట్ల విలువైన ఆస్తులను దాదాపు 30 లక్షల మంది అక్కచెల్లెమ్మల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయబోతున్నాం. దేశంలో ఎక్కడా ఇలాంటి కార్యక్రమం జరగలేదు. చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు అదేపనిగా కేసులు వేయిస్తున్నారు. కలెక్టర్లు సమీక్షలు నిర్వహించి, కౌంటర్లు ఫైల్ చేసి కేసులు త్వరగా ముగిసేలా చూడాలి. కొంత సమయం పట్టినా, చివరకు మంచే గెలుస్తుంది. -
ఉగాదికి పండుగే
-
ముచ్చటైన లేఅవుట్లు
సాక్షి, అమరావతి: ఆహ్లాదకరమైన వాతావరణం.. అద్దంలా చదును చేసిన ప్లాట్లు.. చక్కటి రోడ్లు.. అందమైన పార్కులు.. పాఠశాల, ఆస్పత్రి తదితర మౌలిక వసతుల కల్పనకు విశాలమైన స్థలాలతో కూడిన లేఅవుట్లు.. ప్రతి ప్లాటుకూ నంబర్.. ఇదేదో రియల్టర్ సంస్థల ప్రకటన కాదు. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో భాగంగా ఉగాది పర్వదినం రోజున పేదలకు నివాస స్థలాలిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తున్న లేఅవుట్లలో కల్పిస్తున్న సౌకర్యాలివి. రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 26.6 లక్షల మందికి వీటిని విక్రయ దస్తావేజుల (కన్వేయన్స్ డీడ్ల) రూపంలో రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేందుకు అధికార యంత్రాంగం చకచకా ఏర్పాట్లుచేస్తోంది. రాష్ట్రంలో ఎవరికీ ఇల్లులేదనే మాట వినిపించకూడదు.. ప్రతిఒక్కరికీ నివాస యోగ్యం కల్పించాలనే ఉదాత్త ఆశయంతో సీఎం వైఎస్ జగన్ సర్కారు యజ్ఞంలా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా అధికారులు అహరహం శ్రమిస్తున్నారు. ఇందులో భాగంగా అన్ని జిల్లాల్లో భూమి చదును ముమ్మరంగా జరుగుతోంది. ప్రధాన రహదారులు 30 అడుగులు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం రూపొందిస్తున్న వైఎస్సార్ జగనన్న కాలనీలకు 30 అడుగుల వెడల్పుతో ప్రధాన రహదారులు ఏర్పాటుచేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో అక్కడి పరిస్థితులు, లేఅవుట్ పరిమాణాన్ని బట్టి మరింత విశాలంగా నిర్మించేందుకు యోచిస్తున్నారు. ఇక పెద్దపెద్ద లేఅవుట్లు అన్నింటిలో ఆస్పత్రులు, విద్యా సంస్థలు, పార్కులు లాంటి మౌలిక సదుపాయాల కోసం ప్రత్యేకంగా స్థలాలు కేటాయిస్తున్నారు. చుట్టూ పచ్చని చెట్లు.. కొండలు ఇక రాష్ట్రంలో అనేకచోట్ల గ్రామాలకు, పట్టణాలకు వెలుపల పచ్చని చెట్లు, కొండలు, పొలాల పక్కన వైఎస్సార్ జగనన్న కాలనీల కోసం స్థలాలు ఎంపిక చేశారు. దీంతో స్వచ్ఛమైన, ఆహ్లాదకరమైన గాలి వస్తోంది. పచ్చదనంతో వాతావరణం కూడా చల్లగా ఉంటోంది. వైఎస్సార్ జిల్లా రాజంపేట మండలం ఊటుకూరులో ఏర్పాటుచేస్తున్న కాలనీ కొండను ఆనుకుని సుందరంగా ఉంది. కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో చాలాచోట్ల ఇలాగే ఉన్నాయి. ఉభయగోదావరి జిల్లాల్లో తోటలు, పొలాల పక్కన కాలనీలు సుందరంగా రూపుదిద్దుకోనున్నాయి. 22,43,561 మంది లబ్ధిదారులు.. 43,457 ఎకరాలు – ఈనెల రెండో తేదీ నాటికి జిల్లాల నుంచి ప్రభుత్వానికి అందిన సమాచారం ప్రకారం మొత్తం 22,43,561 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. – వీరికి ప్లాట్ల కోసంతోపాటు రహదారులు, సామాజిక అవసరాలకు కేటాయించిన దానితో కలిపి మొత్తం 43,457.27 ఎకరాలు అవసరమని అధికారులు లెక్కగట్టారు. (సాంకేతిక కారణంలో మూడు, నాలుగు ప్రాంతాల వివరాలు వీటిలో చేర్చలేదు) – కానీ, 26,976.68 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నట్లు వారు గుర్తించారు. – మిగిలిన 12,693.29 ఎకరాలను ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరిస్తున్నారు. నివాసానికి పూర్తి అనుకూలంగా ఉండాల్సిందే పేదలకు స్థలాలిచ్చి కట్టించే ఇళ్లు వారికి పూర్తి అనుకూలంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లక్ష్యం. ఇందులో భాగంగానే అన్ని విధాలా లబ్ధిదారులకు సౌకర్యవంతమైన ప్రాంతాలనే ఎంపిక చేయాలని ఆయన పదేపదే ఆదేశించారు. ఈ విషయంలో సీఎం ఏమి చెప్పారంటే.. – 26.6 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఒకేరోజు ఇచ్చి 30 లక్షల మందికి (సొంతంగా స్థలాలు ఉన్న వారితో కలిపి) నాలుగేళ్లలో ఇళ్లు కట్టించి ఇవ్వడమన్నది మహా యజ్ఞం లాంటిది. – ఈ గొప్పపనికి సార్థకత ఏర్పడాలంటే ఇళ్లను లబ్ధిదారులు వినియోగించుకోవాలి. అందువల్ల ఎంపిక చేసిన ప్రాంతాలను లబ్ధిదారులకు చూపించి వారు అంగీకరిస్తేనే ముందుకెళ్లండి. ఒకే నమూనాలో ఇళ్లు – వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇళ్లన్నీ ఒకే నమూనాలో నిర్మించనున్నారు. – ఒక్కో ఇంట్లో ఒక బెడ్రూమ్, హాలు, కిచెన్, వరండా, టాయిలెట్ సదుపాయాలతో ప్లాన్ రూపొందిస్తున్నారు. – ప్రతి కాలనీలో డ్రైనేజి, తాగునీటి పైపులైను, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. – దశల వారీగా నాలుగేళ్లలో 30 లక్షల ఇళ్లు నిర్మించాలన్నది సర్కారు లక్ష్యం. ‘తూర్పు’లో అత్యధికంగా లబ్ధిదారులు ఇళ్ల స్థలాలకు ఎంపికైన లబ్ధిదారుల సంఖ్య విషయంలో తూర్పు గోదావరి జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంది. – ఈ జిల్లాలో ఇప్పటివరకు 3,29,532 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. – అధికారులు ఈ జిల్లాలో మొత్తం 1,129 లేఅవుట్లు రూపొందిస్తున్నారు. – ఇతర జిల్లాలతో పోలిస్తే ఇక్కడే ఎక్కువ భూసేకరణ జరుగుతోంది. – ఇక లబ్ధిదారుల సంఖ్య పరంగా చూస్తే కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. పులివెందులలో 7,284 ప్లాట్లతో ఒకే కాలనీ.. మరోవైపు.. వైఎస్సార్ జిల్లా పులివెందులలో కూడా 7,284 మందికి నివాస స్థలాలిచ్చేందుకు 257.53 ఎకరాల్లో అధికార యంత్రాంగం మరో భారీ లేఅవుట్ రూపొందించింది. – ఈ కాలనీ ప్రధాన రహదారిని 98.42 అడుగుల (30 మీటర్లు) వెడల్పుతో నిర్మించనున్నారు. – ఇందులో కొన్ని రోడ్లను 65.61 అడుగులు, మరికొన్ని రహదారులను 39.37 అడుగులు, కొన్ని అంతర్గత రహదారులను 30 అడుగుల వెడల్పుతో ప్లాన్ చేశారు. – కాలనీలో మొత్తం 33,390 మీటర్ల పొడవున రోడ్లు నిర్మిస్తారు. ప్రజలకు అన్ని సౌకర్యాలతో కాలనీలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని కాలనీలకు సకల సౌకర్యాలతో ఏర్పాటుచేస్తున్నాం. ప్రజలకు సౌకర్యంగా ఉండే ప్రాంతాలనే ఇళ్ల స్థలాల పంపిణీ కోసం ఎంపిక చేసి చదును చేసి లేఅవుట్లు రూపొందిస్తున్నాం. – హరికిరణ్, వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్ భూములిచ్చిన రైతులకు కృతజ్ఞతలు తూర్పు గోదావరి జిల్లాలో ఇళ్ల స్థలాలకు ఎక్కువ డిమాండు ఉంది. భూమి ధర కూడా ఎక్కువే. అందువల్ల ఇక్కడ భూసేకరణకే రూ.2వేల కోట్లకుపైగా వెచ్చించాల్సి వస్తోంది. ఇళ్లు లేని వారందరికీ ఇళ్లు కట్టించి ఇవ్వాలన్నది సీఎం వైఎస్ జగన్ ఉన్నతాశయం. భూములిచ్చిన రైతులందరికీ జిల్లా యంత్రాంగం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. – మురళీధర్ రెడ్డి, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ అతిపెద్ద లేఅవుట్.. విజయనగరం జిల్లా గుంకలాం గ్రామంలో 341 ఎకరాల్లో రాష్ట్రంలోకెల్లా అతిపెద్ద లేఅవుట్ రూపుదిద్దుకుంటోంది. 16,043 మందికి ఇక్కడ ప్లాట్లు ఇచ్చేందుకు భూమిని చదును చేస్తున్నారు. విజయనగరానికి సమీపంలోనే ఉన్నందున ఈ ప్రాంతం పట్టణంలో కలిసిపోనుంది. -
నాలుగేళ్లలో 26 లక్షల ఇళ్ల నిర్మాణం
-
ఏపీ: 26 లక్షల మందికి ఇళ్ల స్థలాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉగాది రోజున సుమారు 26 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పంపిణీకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎన్పీఆర్లోని కొన్ని అంశాల్లో మార్పులు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించింది. వెలగపూడిలోని సచివాలయంలో సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన బుధవారం సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం భోగాపురం ఎయిర్పోర్ట్, రామాయపట్నం పోర్టు నిర్మాణం, ఖరీఫ్‌లో రైతులకు విత్తనాలు, తదితర కీలక నిర్ణయాలు తీసుకుంది. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) పేర్ని వెంకట్రామయ్య(నాని) విలేకరులకు వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. నాలుగేళ్లలో 26 లక్షల ఇళ్ల నిర్మాణం ఉగాది రోజున రాష్ట్రంలో సుమారు 26 లక్షల మందికి ఇళ్ల స్థలాలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం 43,141 ఎకరాల భూమిని యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేసి.. మార్కింగ్, ప్లాట్లు వేసి సర్వం సిద్ధం చేసింది. గతంలో సర్కార్ పంపిణీ చేసే ఇళ్ల స్థలాలపై లబ్ధిదారులకు కేవలం వారసత్వ అనుభవ హక్కు మాత్రమే ఉండేది. ప్రస్తుతం ఇళ్ల స్థలాలు పొందే లబ్ధిదారులు ఇంటిని కట్టుకోవడానికి, బ్యాంకులో తనఖా పెట్టి రుణం తీసుకోవడానికి.. ఐదేళ్ల తర్వాత వ్యక్తిగత అవసరాల కోసం విక్రయించుకోవడానికి వీలుగా ప్రభుత్వం న్యాయపరమైన హక్కులు కల్పిస్తోంది. ఈ మేరకు నిర్దేశిత ఫార్మాట్లో స్టాంప్ పేపర్‌పై రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రక్రియను సులభతరం చేయడం కోసం ఎమ్మార్వోలకు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ల హోదా కల్పించాలని, ఎమ్మార్వో కార్యాలయాలను జాయింట్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలుగా గుర్తించాలని నిర్ణయించింది. ఏటా 6 లక్షలకుపైగా ఇళ్ల చొప్పున వచ్చే నాలుగేళ్లలో 26 లక్షల ఇళ్లు నిర్మించాలని.. వీటికి వైఎస్సార్ జగనన్న కాలనీలుగా పేరు పెట్టాలని తీర్మానం చేసింది. లబ్ధిదారులకు ఇచ్చే ఇంటి పట్టాను చూపిస్తున్న సీఎం వైఎస్ జగన్ అభయన్స్‌లో ఎన్పీఆర్ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (ఎన్పీఆర్)పై మూడు నెలలుగా దేశ వ్యాప్తంగా కోట్లాది మంది మైనార్టీ వర్గాల ప్రజలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటం, రాష్ట్రంలోని మైనార్టీ వర్గాల ప్రజల్లో అదే రీతిలో అభ్యంతరాలు వ్యక్తం కావడం పట్ల మంత్రివర్గం చర్చించింది. ఎన్పీఆర్పై మైనార్టీ వర్గాల ప్రజల్లో అభద్రతాభావం తొలగించాలంటే 2010 నాటి జనాభా గణన ప్రశ్నావళికే పరిమితం కావాలని.. ఆ మేరకు ప్రస్తుతం ఉన్న ఎన్పీఆర్ ప్రశ్నల నమూనాలో మార్పు చేయాలని కేంద్రాన్ని కోరుతూ మంత్రివర్గం తీర్మానం చేసింది. అలా మార్పు చేసే వరకు ఎన్పీఆర్ ప్రక్రియను అభయన్స్‌లో ఉంచాలని నిర్ణయించింది. పీపీపీ విధానంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి పనులను టెండర్ల ప్రక్రియలో హెచ్–1గా నిలిచిన జీఎమ్మార్ ఎయిర్‌పోర్ట్స్ లిమిటెడ్ సంస్థకు అప్పగించడానికి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో జీఎమ్మార్ ఎయిర్‌పోర్ట్స్ లిమిటెడ్‌కు 2,703 ఎకరాల భూమిని అప్పగించాలని టెండర్లలో పెట్టిన నిబంధనను సడలించింది. ఆ సంస్థకు 2,200 ఎకరాల భూమిని మాత్రమే అప్పగించాలని నిర్ణయించింది. మిగిలిన 503 ఎకరాల భూమిని ప్రభుత్వ అవసరాల కోసం అధీనంలోకి తీసుకోనుంది. అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి అవసరమైన భూమిలో మరో 362.55 ఎకరాలను సేకరించాల్సి ఉంది. ఈ భూసేకరణకు అవసరమైన రూ.280 కోట్లను రుణం రూపంలో తెచ్చుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ఎయిర్‌పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఏడీసీఎల్)కు అనుమతి ఇచ్చింది. కాకినాడ గేట్ వే పోర్టు నిర్మాణానికి కాల వ్యవధి పొడిగింపు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలో తొండంగి మండలం కోన గ్రామం వద్ద పోర్టు నిర్మాణం కోసం 9 నెలల కాల వ్యవధిని పొడిగిస్తూ.. ఆ మేరకు కాకినాడ గేట్‌వే పోర్టు లిమిటెడ్‌కు అనుమతి ఇవ్వడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కాకినాడ ఎస్ఈజెడ్ లిమిటెడ్‌లో 49 శాతం ఈక్విటీని అదానీ పోర్టు అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ లిమిటెడ్‌కు బదిలీ చేస్తూ చేసుకున్న ఒప్పందాన్ని ఆమోదించింది. ‘సిట్’కు విస్తృత అధికారాలకు ఆమోదం రాజధాని అమరావతి ప్రాంతంలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్, భూ అక్రమాలపై కేబినెట్ సబ్ కమిటీ నివేదికలోని అంశాలపై దర్యాప్తు బాధ్యతలను ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)కు అప్పగిస్తూ ఇటీవల సర్కార్ జారీ చేసిన ఉత్తర్వులను మంత్రివర్గం ఆమోదించింది. సిట్ కార్యాలయాన్ని పోలీసుస్టేషన్‌గా గుర్తించడానికి, అక్రమాలకు పాల్పడిన వారిపై ఎఫ్ఆర్ఐలు నమోదు చేసి.. కోర్టుల్లో చార్జ్‌షీట్ ఫైల్ చేసే విస్తృత అధికారాలు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. మంత్రివర్గం నిర్ణయాల్లో మరికొన్ని.. – రామాయపట్నం, భావనపాడు, మచిలీపట్నంలలో పోర్టులను రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా రామాయపట్నం పోర్టు నిర్మాణానికి అడ్డంకులను తొలగించడానికి సంబంధించిన ఉత్తర్వులకు ఆమోదం. – ఖరీఫ్ పంటల సాగుకు రైతులకు విత్తనాలను పంపిణీ చేయడానికి.. అవసరమైన విత్తనాలను సేకరించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు రూ.500 కోట్ల రుణం తీసుకోవడానికి ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చేందుకు సమ్మతి. – ఏపీ జెన్కో, ఏపీపీడీసీఎల్ (ఆంధ్రప్రదేశ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్) చెరో రూ.1,000 కోట్లు చొప్పున, మొత్తంగా రూ.2 వేల కోట్ల రుణం తీసుకోవడానికి ప్రభుత్వం నుంచి బ్యాంకు గ్యారంటీ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదించింది. రూ.2 వేల కోట్ల రుణంతో కృష్ణపట్నంలో 800 మెగావాట్లు, వీటీపీఎస్‌లో 800 మెగావాట్ల థర్మల్ కేంద్రాల నిర్మాణాన్ని పూర్తి చేసి.. 1600 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేయాలని నిర్ణయం. – ప్రకాశం జిల్లా ఒంగోలులో గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం 1.96 ఎకరాల భూమి కేటాయింపు రద్దు చేస్తూ ఇటీవల సర్కార్ జారీ చేసిన ఉత్తర్వులకు ఆమోదం. ఆ భూమిని జలవనరుల శాఖకు అప్పగించాలని, ఎన్ఎస్పీ కాలనీ విస్తరణకు ఆ భూమిని వినియోగించాలని నిర్ణయం. – కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం సున్నిపెంటలో నాలుగు గ్రామ సచివాలయాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్. అందులో 44 పోస్టుల భర్తీకి అనుమతి. నీతిమాలిన రాజకీయాల్లో చంద్రబాబు నంబర్ వన్ నీతిమాలిన రాజకీయాలు చేయడంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నంబర్ వన్ అని మంత్రి పేర్ని నాని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు ఎవరూ కనిపించరని, అధికారం కోల్పోగానే నెత్తి మీద ఉన్న కళ్లు నేల చూపులు చూస్తాయన్నారు. గత ప్రభుత్వ మంత్రివర్గంలో ఒక మైనార్టీకి.. ఒక ఎస్టీకి స్థానం కల్పించని చంద్రబాబు ఇప్పుడు ఆ వర్గాల ప్రజలపై లేని ప్రేమను ఒలకబోస్తున్నారని దుయ్యబట్టారు. 2019 శాసనసభ ఎన్నికల్లో ఎంత మంది బీసీలకు టికెట్లు ఇచ్చారో చెప్పాలని నిలదీశారు. అన్ని వర్గాల ప్రజలను, వ్యక్తులను అవసరాలకు వాడుకోవడం.. అవసరం తీరగానే కసుక్కున కత్తితో పొడవడంలో చంద్రబాబు నేర్పరి అన్నారు. హైకోర్టు తీర్పు మేరకే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తున్నామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీలతోపాటు మున్సిపల్ ఎన్నికలనూ నిర్వహిస్తామన్నారు. ఇళ్ల స్థలాల పంపిణీ నిర్ణయం ముందే తీసుకున్నామని, వాటికి స్థానిక సంస్థల ఎన్నికల నియమావళికి సంబంధం ఉండదని మరొక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఎన్పీఆర్పై మైనార్టీ వర్గాల ప్రజల అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. -
గడువులోగా ఇళ్ల స్థలాల గుర్తింపు, ప్లాట్ల అభివృద్ధి
సాక్షి, అమరావతి: పేదలందరికీ ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు స్థలాల గుర్తింపు, ప్లాట్ల అభివృద్ధి అనుకున్న గడువులోగా పూర్తి చేయాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. ‘స్పందన’పై మంగళవారం ఆయన సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉగాది నాటికి 25 లక్షల ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీపై, పెన్షన్ల డోర్ డెలివరీపై ఈ సందర్భంగా ఆయన సమీక్షించారు. జిల్లాల వారీగా ఇవ్వనున్న ఇళ్ల పట్టాలు, స్థలాల గుర్తింపు, అభివృద్ధిపై విస్తృతంగా చర్చించారు. ఇళ్ల స్థలాల కోసం గుర్తించిన భూముల్లో ప్లాట్లను వేగంగా అభివృద్ధి చేసి, పంపిణీకి సిద్ధం చేయాలని చెప్పారు. వెనుకబడిన జిల్లాలపై ప్రత్యేక దృష్టి ఇళ్ల స్థలాల గుర్తింపు, ప్లాట్ల అభివృద్ధిలో వెనుకబడిన జిల్లాలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని సీఎం సూచించారు. ఆయా జిల్లాల్లో ఉన్నతాధికారులు పర్యటించి ఈ విషయంలో ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలన్నారు. ఉగాది రోజున 25 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్న మన కలను నిజం చేసే దిశగా అందరూ శరవేగంగా పని చేయాలని సీఎం ఆదేశించారు. సాధ్యమైనంత వరకు ఇళ్ల స్థలాలే ఇవ్వాలని సూచించారు. ఈ నెల 1న లబ్ధిదారుల ఇళ్ల వద్దే పెన్షన్ల పంపిణీ బాగా జరిగిందని కలెక్టర్లను ప్రశంసించారు. వచ్చే నెల 1వ తేదీన 2 గంటల్లోగా పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. ప్రతి 50 కుటుంబాలకు మ్యాపింగ్ కరెక్టుగా జరగాలని ఆదేశించారు. -
‘పట్టాలు’ తప్పిన ప్లాన్
కందుకూరు, న్యూస్‌లైన్ : పట్టణ ప్రజలను ఎంతో కాలంగా ఊరిస్తూ వచ్చిన నివేశన స్థలాల పంపిణీ వ్యవహారం మంత్రి మహీధర్‌రెడ్డికి తలనొప్పిగా మారింది. ఎన్నికలకు ముందు పట్టాలు ఇచ్చి ప్రజల ఓట్లు గుంజాలనుకున్న ఆయన ప్లాన్.. రివర్సైంది. ఓట్లు తెచ్చిపెట్టడం సంగతి అంటుంచి సొంత పార్టీ నాయకులు ఆయనకు దూరమయ్యారు. దీంతో కొందరు నాయకులను మంత్రి బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఇదీ.. జరిగింది గత మంగళవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం వేదికగా మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి పేదలకు పట్టాలు పంపిణీ చేశారు. పట్టణంలోని దాదాపు 1219 మందికి కలెక్టర్‌తో కలిసి పట్టాలిచ్చారు. అధికారులు తయారు చేసిన జాబితాలో అనర్హులు పెద్ద సంఖ్యలో ఉన్నారని పంపిణీకి ముందే విమర్శలు వెల్లువెత్తాయి. ఇవేమీ పట్టించుకోని మంత్రి ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని హాడావుడిగా పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. జాబితాలో దాదాపు 40శాతం మందికి ఇళ్లు ఉన్నా మళ్లీ పట్టాలు ఇవ్వడం బహిరంగ రహస్యం. ఈ వ్యవహారంపై నిజమైన లబ్ధిదారులు గుర్రుగా ఉన్నారు. వీరి సంగతి అటుంచితే.. కనీసం తమ సూచనలు కూడా పరిగణనలోకి తీసుకోకుండా అర్హుల జాబితా ఎలా తయారు చేస్తారని కాంగ్రెస్ పార్టీ ద్వితీయశ్రేణి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ఆగ్రహం మంత్రికి తెలియాలని పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఒక్కరు కూడా హాజరు కాలేదు. పార్టీకి చెందిన వివిధ విభాగాల అధ్యక్షులు, ముఖ్యనాయకులు సైతం మంత్రికి ముఖం చాటేశారు. అవమానించడం ఆయనకు అలవాటే మంత్రి ప్రధాన అనుచరునిగా చెలామణీ అవుతున్న ఓ నేతను కనీసం వేదికపైకి కూడా ఆహ్వానించలేదు. అంతేకాకుండా తనతోటి మండల నాయకుడైన ఏఎంసీ చైర్మన్ తోకల కొండయ్యని వేదికపైకి ఆహ్వానించి, తనను కావాలనే అవమానపరిచే విధంగా మంత్రి వ్యవహరించారని సదరు నాయకుడు సన్నిహితుల వద్ద ఆవేదన చెందుతున్నాడు. గతంలో కూడా ఇలానే వ్యవహరించారని, ఆయనకు ఇది అలవాటేనని సదరు నేత మంత్రిపై కినుకు వహించాడట! దీంతో విషయం మంత్రిగారి దృష్టికి వెళ్లడంతో ఆయనే స్వయంగా సదరు నాయకునికి ఫోన్ చేసి బుజ్జగించే ప్రయత్నాలు మొదలు పెట్టారు. మంత్రి ఫోన్ తీసేందుకు కూడా ఇష్టపడని ఆ నాయకుడు.. ఇంత అవమానం జరిగిన తరువాత ఫోన్ చేసి ఏం లాభమని సన్నిహితుల వద్ద వాపోయాడు. మిగిలిన నాయకులదీ ఇదే పరిస్థితి. ఏన్నో ఏళ్లుగా పార్టీ కంటే మహీధర్‌రెడ్డినే నమ్ముకుని పనిచేస్తున్నామని, ఆయన తమను ఏమాత్రం పట్టించుకోకుండా ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారికి పట్టాలు ఇచ్చారని తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తాము వార్డుల్లో తిరిగే పరిస్థితి కూడా లేకుండా పోయిందంటున్నారు. ఇప్పటి వరకూ తిట్టినా.. అవమానించినా సహించామని, మంత్రి వ్యవహారశైలి మారకపోతే పార్టీలో కొనసాగడం కష్టమేనని నాయకులంతా తేల్చి చెప్తున్నారు. పట్టాల పంపిణీ పార్టీకి ఏమాత్రం లాభం చేకూర్చేలా లేదని మరో వాదన వినిపిస్తున్నారు. అందరూ అర్హులని అధికారులు చెప్పిన మాటలు నమ్మి పెద్ద ఎత్తున అనర్హులకు పట్టాలు ఇచ్చారని నాయకులు ఆరోపిస్తున్నారు. ఇళ్లు లేని పేదలు పట్టణంలో భారీ సంఖ్యలో ఉంటే విచారించి న్యాయం చేయాల్సిన మంత్రి.. అధికారుల మాటలు నమ్మి అనర్హులకు పట్టాలు ఇచ్చారని సదరు నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.