సాక్షి, అమరావతి: పేదలందరికీ ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు స్థలాల గుర్తింపు, ప్లాట్ల అభివృద్ధి అనుకున్న గడువులోగా పూర్తి చేయాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. ‘స్పందన’పై మంగళవారం ఆయన సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉగాది నాటికి 25 లక్షల ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీపై, పెన్షన్ల డోర్ డెలివరీపై ఈ సందర్భంగా ఆయన సమీక్షించారు. జిల్లాల వారీగా ఇవ్వనున్న ఇళ్ల పట్టాలు, స్థలాల గుర్తింపు, అభివృద్ధిపై విస్తృతంగా చర్చించారు. ఇళ్ల స్థలాల కోసం గుర్తించిన భూముల్లో ప్లాట్లను వేగంగా అభివృద్ధి చేసి, పంపిణీకి సిద్ధం చేయాలని చెప్పారు.
వెనుకబడిన జిల్లాలపై ప్రత్యేక దృష్టి
ఇళ్ల స్థలాల గుర్తింపు, ప్లాట్ల అభివృద్ధిలో వెనుకబడిన జిల్లాలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని సీఎం సూచించారు. ఆయా జిల్లాల్లో ఉన్నతాధికారులు పర్యటించి ఈ విషయంలో ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలన్నారు. ఉగాది రోజున 25 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్న మన కలను నిజం చేసే దిశగా అందరూ శరవేగంగా పని చేయాలని సీఎం ఆదేశించారు. సాధ్యమైనంత వరకు ఇళ్ల స్థలాలే ఇవ్వాలని సూచించారు. ఈ నెల 1న లబ్ధిదారుల ఇళ్ల వద్దే పెన్షన్ల పంపిణీ బాగా జరిగిందని కలెక్టర్లను ప్రశంసించారు. వచ్చే నెల 1వ తేదీన 2 గంటల్లోగా పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. ప్రతి 50 కుటుంబాలకు మ్యాపింగ్ కరెక్టుగా జరగాలని ఆదేశించారు.
గడువులోగా ఇళ్ల స్థలాల గుర్తింపు, ప్లాట్ల అభివృద్ధి
Published Wed, Mar 4 2020 3:55 AM | Last Updated on Wed, Mar 4 2020 3:55 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment