Home places
-
హోంగార్డులకు స్థలయోగం
ఇన్నాళ్లకు వారి వెతలు తీరాయి. వారి ఆకాంక్షలు నెరవేరుతున్నాయి. వారి గురించి పట్టించుకునే పాలకులు లభించారు. అచ్చంగా పోలీసు విధులే నిర్వర్తిస్తున్నా ఎలాంటి సౌకర్యాలకు నోచుకోక... అరకొర వేతనాలే లభిస్తున్నా కష్టాలకు వెరవక... ఇబ్బందులు ఎదురవుతున్నా... వాటిని మునిపంటినే దాచుకుని విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డులకు ఇప్పుడు మంచి రోజులు వచ్చాయి. వారికీ స్థలాలిచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అంతేనా... వాటిపై ఇల్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సాయం చేయాలని కూడా ఉత్తర్వులు జారీ చేసింది. విజయనగరం పూల్‌బాగ్: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మంగా చేపట్టిన ఉగాదినాటికి ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో పోలీస్ శాఖలో వివిధ విభాగాల్లో ఎన్నో సేవలు అందిస్తున్న హోంగార్డులకు ఇళ్ల స్థలాలు ఇవ్వనుంది. అందుకోసం ఇటీవల జీఓ 77ను విడుదల చేసింది. దీని ప్రకారం హోంగార్డుల సంవత్సర ఆదాయం రూ.3 లక్షల లోపు ఉన్నవారు అర్హులుగా పేర్కొంది. ఇప్పటికే ఈ జీఓ ప్రకారం జిల్లాకేంద్రంలోని విజయనగరం నియోజకవర్గం పరిధిలో దరఖాస్తుల స్వీకరణ కూడా పూర్తయింది. ఇంకా మండలాల వారీగా ఆయా తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు దరఖాస్తులు స్వీకరించాల్సి ఉంది. చాలా మండలాల్లో తహసీల్దార్లు దీనిపై దృష్టి సారించకపోవటంపై ఆయా మండలాల పరిధిలోగల హోంగార్డులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం తమ కష్టాన్ని గుర్తించి న్యాయం చేసేందుకు ముందుకు వస్తుంటే అధికారుల నిర్లక్ష్యం వల్ల వచ్చిన అవకాశాలు చేతికి అందకుండా పోతున్నాయని ఆందోళన చెందుతున్నారు. తహసీల్దార్లకు ఆదేశాలు ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చిన జీఓ ప్రకారం కలక్టర్ హరిజవహర్‌లాల్, గృహ నిర్మాణశాఖాధికారులకు, తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేశారు. చాలా చోట్ల దరఖాస్తుల స్వీకరణ పూర్తయింది. కొన్ని చోట్ల అసలు ప్రారంభం కాలేదు. ఇదిలా ఉండగా హోంగార్డులకు కూడా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో అందరితో పాటు పట్టాలు అందజేయనున్నారు. వీరికి ప్రధాన మంత్రి ఆవాస్‌యోజన స్కీం ద్వారా గృహ నిర్మాణానికి రూ.1.50లక్షలు అందజేయనున్నారు. వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో, ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా పలు సందర్భాల్లో హోంగార్డుల అసోసియేషన్ ఆధ్వర్యంలో సమస్యలను విన్నవించుకున్నారు. దీనికి స్పందించిన ముఖ్యమంత్రి హోంగార్డులకు కూడా ఇళ్ల స్థలాల పంపిణీ, ఆ తరువాత ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సహాయం అందజేసేందుకు జీఓ నంబర్.77ను విడుదల చేశారు. సీఎంకు రుణపడి ఉంటాం... హోంగార్డుల సమస్యలపై చాలా సార్లు చాలా ముఖ్యమంత్రులకు వినతులు అందజేశాం. ఎవరూ పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం మా సమస్యలు విని వాటిని పరిష్కరించేందుకు, మాకు గూడు కలి్పంచేందుకు ఇప్పుడు జీఓ నెం.77 విడుదల చేశారు. హోంగార్డులందరికీ గృహనిర్మాణంకోసం, ఇళ్ల స్థలాలు అందజేస్తున్నారు. ఆయన సేవలు మరువలేనివి. – పడగల బంగార్రాజు, జిల్లా అధ్యక్షుడు, హోంగార్డులసంక్షేమ సంఘం. విజయనగరం. బీమా పెంచారు. గతంలో కంటే ఇప్పుడు బీమా మొత్తం చాలా ఎక్కువ పెంచారు. హోంగార్డులు ప్రమాద వశాత్తు చనిపోతే రూ.30లక్షలు బీమా సదుపాయం కల్పించారు. దీనివల్ల కొంత భరోసా లభించింది. హోంగార్డుల విషయంలో ముఖ్యమంత్రి ఎంతో సానుకూలంగా వ్యవహరిస్తున్నారు. – ఎస్.గోపాల్, హోంగార్డు, జిల్లా కమిటీ సభ్యుడు, పార్వతీపురం. జీతాలు పెంచారు. వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక హోంగార్డుల జీతాలు పెంచారు. వాటితో పాటు బీమా పెంచారు. ఇప్పుడు నివాసం కోసం ఇళ్ల స్థలాలు, ఇంటి నిర్మాణానికి నిధులు సమకూరుస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. – ఎస్.రవి, హోంగార్డు, జిల్లా కమిటీ సభ్యులు,విజయనగరం. -
గడువులోగా ఇళ్ల స్థలాల గుర్తింపు, ప్లాట్ల అభివృద్ధి
సాక్షి, అమరావతి: పేదలందరికీ ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు స్థలాల గుర్తింపు, ప్లాట్ల అభివృద్ధి అనుకున్న గడువులోగా పూర్తి చేయాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. ‘స్పందన’పై మంగళవారం ఆయన సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉగాది నాటికి 25 లక్షల ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీపై, పెన్షన్ల డోర్ డెలివరీపై ఈ సందర్భంగా ఆయన సమీక్షించారు. జిల్లాల వారీగా ఇవ్వనున్న ఇళ్ల పట్టాలు, స్థలాల గుర్తింపు, అభివృద్ధిపై విస్తృతంగా చర్చించారు. ఇళ్ల స్థలాల కోసం గుర్తించిన భూముల్లో ప్లాట్లను వేగంగా అభివృద్ధి చేసి, పంపిణీకి సిద్ధం చేయాలని చెప్పారు. వెనుకబడిన జిల్లాలపై ప్రత్యేక దృష్టి ఇళ్ల స్థలాల గుర్తింపు, ప్లాట్ల అభివృద్ధిలో వెనుకబడిన జిల్లాలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని సీఎం సూచించారు. ఆయా జిల్లాల్లో ఉన్నతాధికారులు పర్యటించి ఈ విషయంలో ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలన్నారు. ఉగాది రోజున 25 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్న మన కలను నిజం చేసే దిశగా అందరూ శరవేగంగా పని చేయాలని సీఎం ఆదేశించారు. సాధ్యమైనంత వరకు ఇళ్ల స్థలాలే ఇవ్వాలని సూచించారు. ఈ నెల 1న లబ్ధిదారుల ఇళ్ల వద్దే పెన్షన్ల పంపిణీ బాగా జరిగిందని కలెక్టర్లను ప్రశంసించారు. వచ్చే నెల 1వ తేదీన 2 గంటల్లోగా పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. ప్రతి 50 కుటుంబాలకు మ్యాపింగ్ కరెక్టుగా జరగాలని ఆదేశించారు. -
పారదర్శకంగా భూ సమీకరణ..
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో భూ సమీకరణ పారదర్శకంగా జరుగుతోందని విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ పేర్కొన్నారు. అర్హులైన అందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం మేరకు జిల్లాలో ఆరు వేల ఎకరాల భూ సమీకరణ చేస్తున్నట్టు చెప్పారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గ్రామీణ, అర్బన్ ప్రాంతాల్లో సెంట్ల భూమిని ఇళ్లు నిర్మాణం కోసం అర్హులైన పేదలకు కేటాయిస్తున్నట్లు వివరించారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో పేదల ఇళ్ల స్థలాల కేటాయింపు కోసం భూ సేకరణ చేస్తున్నామని అదంతా పూర్తిగా ప్రభుత్వ భూమిలో మాత్రమే జరుగుతోందన్నారు. దీనికోసం నిర్దిష్టమైన లే అవుట్లు కూడా రూపొందించడమే కాకుండా మార్చి 10 నాటికి పూర్తిస్థాయిలో ప్రక్రియ పూర్తి చేయాలన్న లక్ష్యంతో పని చేస్తున్నట్లు ఆయన చెప్పారు. రైతులకు నష్టం కలిగించం.. ప్రభుత్వ భూములను సాగుచేస్తున్న వ్యక్తులు కూడా నిర్దిష్టమైన ఆధారాలను బట్టి అభివృద్ధి చేసిన లే అవుట్లలో 900, 450 గజాల చొప్పున కేటాయించడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో విశాఖ సిటీ లో ఇళ్ల కోసం రూ. 25 వేలు చొప్పున నగదు డిపాజిట్ చేసిన లబ్ధిదారులకు కేటాయింపు జరుగుతుందని వివరించారు. ఎక్కడ ప్రైవేట్ భూములు తీసుకోవడం కానీ, రైతులకు నష్టం కలిగించే రీతిలో భూ సేకరణ గాని సమీకరణ గాని ఉండదని కలెక్టర్ స్పష్టం చేశారు. భూ సమీకరణ కోసం రూ.1300 కోట్లు.. గిరిజన ప్రాంతం నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తులు వచ్చాయని ఆయా ప్రాంతాల్లో వారికి భూములు కేటాయింపు జరుగుతుందని చెప్పారు. ప్రధానంగా ఏజెన్సీలో పాడేరు ప్రాంతంలో ఎక్కువగా ప్రభుత్వ భూమి ఉండడంతో ఆ ప్రాంతంలో ఎక్కువ మందికి ఇళ్ల స్థలాలు కేటాయింపు జరుగుతుందన్నారు. పినగాడి లో పేదల కోసం రూపొందిస్తున్న లే అవుట్ లో మా భూమి పూర్తిగా ప్రభుత్వ ఖాళీ స్థలం గా చెప్పారు. రైతులకు ఇబ్బంది కలిగించే రీతిలో ఎక్కడ భూమి తీసుకోవడం లేదన్నారు. రైతులకు భూ సమీకరణ కింద ఇచ్చే ప్రతి రూపాయి నేరుగా వారి ఖాతాలోనే వేస్తున్నామ ని చెప్పారు.. భూసమీకరణ కోసం రూ. 1300 కోట్లు ప్రభుత్వం నిర్దేశించిందని కలెక్టర్ వెల్లడించారు. -
నిరుపేదకు నీడ కోసం..
శ్రీకాకుళం పాతబస్టాండ్: నిరుపేదకు నీడ కల్పించాలని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం శతథా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఏర్పాట్లను కూడా శరవేగంగా చేస్తోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీ సుకున్నప్పటి నుంచి పేదల సంక్షేమం కోసం వరుసగా పథకాలు తీసుకువస్తున్నారు. ఇదే క్రమంలో నిరుపేదలకు ఇళ్ల పట్టాలను రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేందుకు కూడా రూపకల్పన చేశారు. ఈ పట్టాలను రానున్న ఉగాది నాటికి కుటుంబంలో మహిళ పేరిట అందజేసేందుకు చర్యలు చేపట్టారు. ఎలాంటి పరిమితి లేకుండా అర్హులందరికీ సంతృప్త స్థాయి లో ఇళ్ల పట్టాలను మంజూరు చేసేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. ఈ క్రమంలో ఇప్పటికే జిల్లాలో 56 వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలను మంజూరు చేసేందుకు జాబితాలను సిద్ధం చేశారు. వీరందరికీ తెలుగు నూతన సంవత్సరం సందర్భంగా ఉగాదికి పట్టాలు అందజేయనున్నారు. వీరి కోసం ఎక్కువగా ప్రభుత్వ స్థలాలను గుర్తించారు. ప్రభుత్వ స్థలాలు అందుబాటులో లేని చోట్ల కొనుగోలు చేసేందుకు కూడా భూములు గుర్తించారు. ఈ కొనుగోలు ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. అర్హులకు ఇళ్లు ఇచ్చే ప్రక్రియ ఐదేళ్లూ కొనసాగుతుంది. ఈ ఐదేళ్లలో సొంతిల్లు లేని వారు ఉండకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. నిధులు రెడీ.. పేదల ఇళ్ల పట్టాలకు ఇళ్ల స్థలాల సేకరణ దాదాపు పూర్తయ్యింది. ప్రభుత్వ స్థలాల గుర్తింపుతో పాటు ఆ స్థలాలు అందుబాటులో లేని గ్రామాల్లో రైతుల వద్ద నుంచి అనువైన ఇళ్ల స్థలాలను కొనుగోలు చేసేందుకు కూడా సర్కారు చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో గుర్తించిన ప్రభుత్వ స్థలాలను సేకరించి ఆ స్థలాలను చదును చేయడం, కాలువలు, రోడ్లను కల్పించడం, లే ఔట్‌గా తయారు చేసేందుకు సన్నాహాలు చురుగ్గా సాగుతున్నాయి. వీటికి గాను మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హా మీ పథకంలో మెటీరియల్ కాంపోనెంట్ నిధులు సమకూర్చారు. ఇప్పటికే అవసరమైన నిధులు అంచనాలు వేయడం ద్వారా పనులు ప్రారంభమైన ప్రాంతాలకు నిధుల మంజూరుకు పరిపాలనా ఆమోదం కూడా పూర్తయింది. జిల్లాలో పేదల ఇళ్ల కోసం ప్రభుత్వ స్థలాలు 891.84 ఎకరాలను గుర్తించారు. ఈ భూములు 810 నివాస ప్రాంతాల్లో ఉన్నాయి. వీటిని బాగు చేసేందుకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు రూ.74.54 కోట్లతో అంచనాలను సిద్ధం చేశారు. జిల్లాలో 38 మండలాల్లో ఈ స్థలాలను లే ఔట్లు వేయడం, ఆ స్థలంలో ఉపాధి హామీ నిధులతో చదును చేయడం వంటివి చేస్తారు. తొలివిడతలో జిల్లాలో 301 లే ఔట్లలో(ప్రాంతాల్లో) 357.63 ఎకరాల్లో చదును చేయడానికి గాను రూ.24.95 కోట్లకు పరిపాలన ఆమోదం పొంది పనులు చేసేందుకు అనుమతులు ఇచ్చారు. ఈ పనులు ఇప్పుడిప్పుడే జిల్లాలో ప్రారంభమవుతున్నాయి. పనులు ప్రారంభించాం పేదల ఇళ్ల పట్టాలకు సంబంధించి ప్రభుత్వ భూములు చదును చేసేందుకు నిధులు కేటాయించడం జరిగింది. అంచనాగా రూ.74.54 కోట్లు వేశాం. ఇప్పటికే పరిపాలనా ఆమోదం సుమారుగా రూ.25 కోట్లకు ఇచ్చారు. ఉపాధి హామీ పనుల నిధులతో ఇప్పటికే ఎచ్చెర్ల తదితర మండలాల్లో చదును చేసే కార్యక్రమం ప్రారంభమైంది. జనవరి 3వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా అన్ని పరిపాలన ఆమోదం పొందిన భూముల్లో చదును చేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ఫిబ్రవరి చివరి నాటికి నిర్దేశించిన అన్ని స్థలాలను చదును చేసేందుకు పూర్తిస్థాయి చర్యలు తీసుకుంటాం. – హెచ్.కూర్మారావు, డ్వామా పీడీ -
అర్హులందరికీ ఇళ్ల స్థలాలు
సాక్షి, అమరావతి: ఇల్లులేని అర్హులైన ప్రతి ఒక్కరికీ నివాస స్థల పట్టా ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. అర్హులై ఉండీ..లబ్ధిదారుల జాబితాలో పేరు లేదన్న మాట వినిపించరాదని స్పష్టం చేశారు. వచ్చే ఉగాది పర్వ దినం సందర్భంగా ఇల్లు లేని అర్హులందరికీ ఇంటి స్థల పట్టాలు ఇవ్వాలన్న ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ఇప్పటి వరకు జిల్లాల వారీగా తీసుకున్న చర్యలు, భవిష్యత్ కార్యాచరణపై గురువారం ఆయన సమీక్షించారు. నివాస స్థల పట్టాల పంపిణీకి జిల్లాల వారీగా గుర్తించిన అర్హుల సంఖ్య, అందుబాటులో ఉన్న భూమి, ఇంకా సేకరించాల్సిన భూమి గురించి ఆరా తీశారు. విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఇళ్ల స్థలాల కోసం అధికంగా భూములు సేకరించాల్సి ఉందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. స్థలాల గుర్తింపు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. లబ్ధిదారుల వారీగా ఇళ్ల స్థలాలు మార్కింగ్ చేసి పట్టాలను రిజి్రస్టేషన్ చేసి ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. నివాస స్థల పట్టాలను ఏమాత్రం ట్యాంపరింగ్‌కు అవకాశం లేనివిధంగా అత్యంత ఉన్నత భద్రతా ప్రమాణాలతో రూపొందించాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి పలురకాల నమూనా పత్రాలను అధికారులు ముఖ్యమంత్రికి చూపించారు. ఈ సమీక్షలో రెవెన్యూ శాఖ ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
పది లక్షల ఇళ్లు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇల్లు లేని పేదలందరికీ సొంత గూడు కల్పించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పం మేరకు వడివడిగా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టులకు సంబంధించి గృహ నిర్మాణశాఖ అధికారులు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపకల్పనలో నిమగ్నమయ్యారు. దీన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపి ప్రధాని ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకం కింద ఇళ్లు మంజూరు చేయాలని కోరనున్నారు. పీఎంఏవై ద్వారా రాష్ట్రానికి 10 లక్షల ఇళ్లు మంజూరవుతాయని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ పేదల ఇళ్ల నిర్మాణాలపై ప్రత్యేకంగా దృష్టి సారించడంతో అక్టోబర్‌లో 1,24,624, నవంబర్‌లో 2,58,648 మొత్తం కలిపి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 3,83,272 ఇళ్లు రాష్ట్రానికి మంజూరు చేసిన విషయం తెలిసిందే. 7.86 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఉన్నట్లు గుర్తింపు రాష్ట్రంలో 7.86 లక్షల మంది లబ్ధిదారులకు సొంత ఇళ్ల స్థలాలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వీరందరికీ వెంటనే పక్కా ఇళ్లు మంజూరు చేసేలా గృహ నిర్మాణశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ఇళ్ల స్థలాలు లేని వారిని గుర్తించి ఉగాది నాటికి పంపిణీ చేసి దశలవారీగా నాలుగేళ్లలో నిర్మించి ఇవ్వనున్నారు. ఏడాదికి ఎన్ని ఇళ్లు మంజూరు చేయాలనే అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇళ్ల స్థలాల కోసం ఇప్పటికే గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. ప్రభుత్వ భూమి లభ్యత లేని చోట ప్రైవేట్ వ్యక్తుల నుంచి భూమి కొనుగోలు చేసేందుకు గృహ నిర్మాణ, రెవెన్యూ శాఖల అధికారులు సంయుక్త సమావేశాలు నిర్వహించి నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ, భూసేకరణ, అభివృద్ధి కోసం దాదాపు రూ.11 వేల కోట్లు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. -
ప్రతి లబ్ధిదారుడికీ 1.5 సెంట్ల ఇంటి స్థలం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అర్హులైన ప్రతి లబ్ధిదారుడికీ ఉగాది నాటికి 1.5 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు, పట్టాలు పంపిణీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. సచివాలయంలో మంగళవారం ఆయన గృహ నిర్మాణ శాఖపై సమీక్షించారు. ‘ఇల్లు లేని వారు ఎవ్వరూ ఉండకూడదు. లబ్ధిదారుడు ఒక్క పైసా ఖర్చు చేయాల్సిన పనిలేదు. అన్ని జిల్లాల్లో ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టాలి’ అని సీఎం అధికారులను ఆదేశించారు. వచ్చే సంవత్సరం నుంచి వైఎస్సార్ ఇళ్ల పథకం కింద నాలుగు విడతల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ‘గ్రామ వలంటీర్ల ద్వారా పారదర్శకంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలి. లబ్ధిదారుల జాబితాను గ్రామ సచివాలయంలోనే ప్రదర్శిస్తాం. పెన్షనర్ల జాబితా కూడా గ్రామ సచివాలయాల్లో బోర్డుపై ఉంచుతాం. ఆ జాబితా 365 రోజులు అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలి. దీనివల్ల సోషల్ ఆడిట్ నిరంతరం కొనసాగుతున్నట్టు ఉంటుంది. లబ్ధిదారుల ఎంపికలో పక్షపాతం, అవినీతికి తావులేదు. ఎవరైనా తప్పులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. మా పార్టీకి ఓటు వేయకపోయినా అర్హత ఉంటే ఇల్లు ఇవ్వాల్సిందే. మేం చేసే మంచిని చూసి మాకు ఓటేయాలి అన్నదే మా సిద్ధాంతం. వ్యవస్థ మారాలి, ఆ తపనతోనే పని చేయండి’ అని అధికారులకు సూచించారు. అక్క చెల్లెమ్మల పేరిట రిజిస్ట్రేషన్ ఇళ్ల నిర్మాణం కోసం గ్రామాల్లో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిని వినియోగించాలని, అలా వీలుకాని చోట ప్రభుత్వమే భూమి కొనుగోలు చేసి పేదలకు ఇస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు.‘ కొనుగోలు చేసిన భూమిని ప్లాట్ల రూపంలో విభజించి లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ చేయాలి. కేవలం పట్టా ఇచ్చి, ఇంటి స్థలం ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి లబ్ధిదారుడికి ఉండకూడదు. రాళ్లు పాతి, మార్కింగ్ వేసి పక్కాగా ఇంటి స్థలాన్ని అక్కచెల్లెమ్మల పేరిట రిజిస్ట్రేషన్ చేయాలి. ఆధార్ కార్డుతో లింక్ చేసి ఇళ్ల స్థలాలను పంపిణీ చేయాలి. పట్టణాలు, నగరాల్లో ప్రభుత్వ భూమి ఎంత అందుబాటులో ఉందో చూడాలి. పట్టణాలు, నగరాల్లో భూమి లేకపోతే కొనుగోలు చేయండి. స్థలంలో ఫ్లాట్లు కట్టి లబ్ధిదారులకు ఇవ్వాలి. ఏ ఫ్లాట్ ఎక్కడ కడుతున్నారో ముందుగానే గుర్తించి పలానా ఫ్లాటు, పలానా వారికి వస్తుందని ముందుగానే కేటాయించండి. ఈ ఫ్లాట్ల లబ్ధిదారులకు భూమిలో అన్ డివైడెడ్ షేర్, దీంతోపాటు ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలి’ అని అధికారులను ఆదేశించారు. సచివాలయంలో మంగళవారం గృహ నిర్మాణ శాఖపై సమీక్షింస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘షేర్వాల్’ పేరుతో దోచేశారు.. షేర్వాల్ అనే పేరుతో ఇన్నాళ్లూ దోచేశారని సీఎం వైఎస్ జగన్ అన్నారు. చదరపు అడుగు ఇంటి నిర్మాణానికి రూ.1100 అయ్యే ఖర్చును రూ.2,300కు పెంచి దోచేశారని చెప్పారు. ‘షేర్వాల్ అని పేరుపెట్టి పేదలమీద భారం వేసి ఇలా దోచేస్తే ఎలా? పేదలపై ప్రతి నెలా రూ.3 వేల భారం వేయడం భావ్యమా? ఉచితంగా ఇళ్లు ఇవ్వాల్సిందిపోయి.. పేదవాడి మీద రూ.3 లక్షల భారం వేయడం న్యాయమా? అర్బన్ హౌసింగ్‌లో కడుతున్న ఫ్లాట్లపై రివర్స్ టెండరింగ్‌కు వెళ్లాలి. అదే టెక్నాలజీ, అదే స్పెసిఫికేషన్స్‌తో రివర్స్ టెండరింగ్ నిర్వహించాలి. కాంట్రాక్టర్లను వేధించడం ఉద్దేశం కాదు. మాకు ఎవరిపైనా కక్షలేదు. పేద వాడికి నష్టం రాకూడదు. 20 ఏళ్లపాటు నెలా నెలా డబ్బులు కట్టే పరిస్థితి ఆ పేదవాడికి ఉండకూడడు. లంచాల వల్ల బీదవాళ్లు నష్టపోకూడదన్నదే మా అభిప్రాయం. ఎక్కువ ప్రచారం చేసి, ఎక్కవ మంది రివర్స్ టెండరింగ్‌లో పాల్గొనేలా ఎలిజిబిలిటీ క్రైటీరియాను తగ్గిద్దాం. పునాది స్థాయి దాటని, మంజూరైనా ప్రారంభం కాని ఫ్లాట్ల్ల విషయంలో ఏ టెక్నాలజీ అయినా అనుమతించాలి. ఈ నిర్ణయం వల్ల ఎంత ఆదా చేయగలమో చేయండి. రూరల్ అయినా, అర్బన్ అయినా నాణ్యత విషయంలో, సౌకర్యాల కల్పనలో రాజీ పడొద్దు. ప్రస్తుతం నడుస్తున్న ఇళ్ల నిర్మాణంలో అత్యవసరంగా పూర్తి చేయాల్సిన వాటిని గుర్తించాలి’ అని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. సామాజిక, ఆర్థిక కుల గణనపై రీసర్వేకు ప్రధానికి లేఖ సామాజిక, ఆర్థిక కుల గణన సరిగా లేనందున కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో నష్టం జరుగుతోందని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. రీసర్వే చేయాలని ప్రధానికి లేఖ రాద్దాం అని సీఎం పేర్కొన్నారు. సరిదిద్దిన డేటా ఆధారంగా ఇళ్లను కేటాయించాల్సిందిగా ప్రధాన మంత్రికి లేఖ రాయాలని నిర్ణయించారు. గ్రామ వలంటీర్ల సాయంతో డేటాను పూర్తిగా సేకరించి కేంద్రానికి పంపాలని సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, గృహ నిర్మాణ శాఖ అధికారులు పాల్గొన్నారు. -
కరెంటు బిల్లుపై సోలార్ అస్త్రం!
కరెంటు బిల్లు వందల్లో ఉండటం ఒకప్పటి మాట. ఎండలు పెరిగి... ఇంట్లో రెండు మూడు ఏసీల వాడకం మొదలయ్యాక కనీస బిల్లు నెలకు ఏడెనిమిది వేలకు తగ్గటం లేదు. ఒక ఏసీ ఉన్నవారికి సైతం మూడు నాలుగువేల రూపాయలకన్నా తగ్గటం లేదు. మరి ఇలాంటి వాళ్లు బిల్లు తగ్గించుకోవటం ఎలా? ఈ ప్రశ్నకు సమాధానంగానే వస్తున్నాయిపుడు రూఫ్ టాప్ సోలార్ ప్యానెళ్లు. ఇంటి పైకప్పు మీద సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేసుకోవడం ద్వారా మీ ఇంటి విద్యుత్ అవసరాలను స్వయంగా తీర్చుకోవటమే కాదు!! మిగిలితే గ్రిడ్‌కు సరఫరా చేసి... పర్యావరణ అనుకూల ఇంధన సరఫరాలో మనమూ భాగం కావచ్చు. దీర్ఘకాలంలో కాస్త డబ్బులు ఆదా చేయాలనుకున్న వారికి... తరచూ విద్యుత్ కోతలను అనుభవించేవారికి రూఫ్‌టాప్ సోలార్ మంచి ఆప్షనే. విద్యుత్ ఉత్పత్తి అయిన చోటే వినియోగం కూడా ఉంటుంది కనక సరఫరా నష్టాలూ ఉండవు. మొత్తం మీద సోలార్ రూఫ్‌టాప్ విద్యుత్ ప్లాంట్ గృహ వినియోగదారులకు మంచి ఎంపికే. కాకపోతే దీన్ని ఎంచుకునే ముందు దీన్లో ఉన్న ఇతర అంశాలనూ తెలుసుకోవాలి. – సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం రూఫ్‌టాప్ సోలార్ విద్యుత్ ప్లాంట్లకు సంబంధించి ప్రస్తుతం మూడు విధానాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నది... ఓనర్షిప్ మోడల్. ఈ విధానంలో ఇంటి యజమాని స్వయంగా తన ఖర్చులతో ఎక్విప్మెంట్ను కొనుగోలు చేసి ప్లాంటు ఏర్పాటు చేసుకోవడంతో పాటు, దీనిద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్‌ను తనే వినియోగించుకుంటారు. ఇలా చేయటం వల్ల కిలోవాట్ సామర్థ్యానికి 18వేల రూపాయలు సబ్సిడీగా లభిస్తాయి. కేంద్ర సంప్రదాయేతర ఇంధన వనరుల విభాగం ఈ సబ్సిడీని ఆఫర్ చేస్తోంది. అలాగే, తమిళనాడు తదితర రాష్ట్ర ప్రభుత్వాలు సొంతంగా కూడా సబ్సిడీ పథకాలు నిర్వహిస్తున్నాయి. రెండో విధానంలో... ఇంటి యజమాని తన పైకప్పు స్థలాన్ని ప్రభుత్వం లేదా ప్రైవేటు కంపెనీకి లీజుకు ఇవ్వాల్సి ఉంటుంది. దాంతో వారు సోలార్ విద్యుదుత్పత్తి ఎక్విప్మెంట్ను ఏర్పాటు చేస్తారు. దీనివల్ల వారికి కొంత ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి. ఉదాహరణకు కేరళలో అయితే ఈ విధానంలో ఉత్పత్తయ్యే విద్యుత్‌లో 10 శాతాన్ని ఉచితంగా యజమానికి ఇస్తున్నారు. మిగిలిన విద్యుత్‌ను కావాలనుకుంటే ఆ యజమానే ఫిక్స్డ్ రేటుకు కొనుగోలు చేసుకునే సౌలభ్యం కూడా ఉంది. మూడో విధానం కమ్యూనిటీ యాజమాన్యం కిందకు వస్తుంది. అంటే ఓ సొసైటీ లేదా కాలనీ వాసులు కలసి సామూహికంగా తమ ప్రాంతంలో ఇళ్లపై ప్యానెళ్లు ఏర్పాటు చేసుకుని... ఉమ్మడిగా విద్యుత్తును వినియోగించుకోవడం. మరి ఖర్చెంతవుతుంది? ఈ ప్యానెళ్లు, ప్లాంట్లకు అయ్యే ఖర్చు ఎంతనేది సామర్థ్యంపైనే ఆధారపడి ఉంటుంది. మీకు ఎంత స్థలం అందుబాటులో ఉంది? అందులో ఎంత సామర్థ్యానికి సరిపడా ఎక్విప్మెంట్ను ఏర్పాటు చేసుకోవచ్చు? అనే అంశాలే పెట్టుబడిని నిర్ణయిస్తాయి. సాధారణంగా అయితే కిలోవాట్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం కనీసం 220 చదరపు అడుగుల విస్తీర్ణం కావాలి. దీనివల్ల ఒక రోజులో 5 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తవుతుంది. అది కూడా కనీసం ఐదారు గంటల పాటు సూర్యరశ్మి ఉంటేనే!!. ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశారు? సూర్యరశ్మి తీవ్రత కూడా ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి. ఇక కాంపోనెంట్, ఇన్స్టలేషన్ చార్జీలనూ పరిగణనలోకి తీసుకోవాలి. మొత్తం సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అయ్యే ఖర్చులో సగ భాగం ఫొటో వోల్టాయిక్ మాడ్యూల్స్కే అవుతుంది. కాకపోతే గత కొన్ని సంవత్సరాల్లో ఈ ఖర్చు గణనీయంగా తగ్గుతూ వచ్చింది. ఉదాహరణకు ఐదేళ్ల క్రితం కిలోవాట్ విద్యుత్ తయారీ ఎక్విప్మెంట్కు రూ.లక్ష పెట్టుబడి అవసరమయ్యేది. ఇది ప్రస్తుతం రూ.40,000– 60,000కు దిగొచ్చింది. సోలార్ ప్యానెల్స్ జీవిత కాలం 25– 35 సంవత్సరాల వరకూ ఉంటుంది. పెద్దగా మెయింటెనెన్స్ అవసరం ఉండదు. ఇలా ఇంటి పైకప్పు మీద సోలార్ ప్యానెల్స్ సాయంతో తయారైన విద్యుత్‌ను గృహ వినియోగానికి అనుకూలంగా మార్చాలంటే ఇన్వర్టర్లు అవసరం. మొత్తం ఖర్చులో పావు వంతుకు వీటికి వెచ్చించాల్సి ఉంటుంది. వైరింగ్, ఇతర పరికరాలు, ఇన్స్టలేషన్ తదితరాలకు మిగిలిన పావు శాతం వ్యయం అవుతుంది. అన్ని రకాల ఐటమ్స్‌తో కూడిన కిట్స్ కూడా లభిస్తాయి. సాధారణంగా కిలోవాట్ సామర్థ్యం నుంచి ఇవి లభిస్తాయి. విద్యుత్ ఉత్పత్తిని పర్యవేక్షించేందుకు మొబైల్ యాప్స్‌తో వచ్చేవీ ఉన్నాయి. అదనపు కాలానికి పొడిగించిన వారంటీ, సర్వీస్ గ్యారంటీ ఆఫర్లూ ఉన్నాయి. ఈ వ్యయాలన్నీ గ్రిడ్ అనుసంధానిత విద్యుత్ తయారీ సిస్టమ్‌లకు సంబంధించినవి. వాడుకోగా మిగిలే అదనపు విద్యుత్‌ను నెట్ మీటరింగ్ ద్వారా విద్యుత్ గ్రిడ్‌కు సరఫరా చేయవచ్చు. బ్యాటరీ బ్యాకప్ కోరుకుంటే, ఇందుకోసం ఆఫ్ గ్రిడ్ సొల్యూషన్స్ అవసరం అవుతాయి. దీంతో వ్యయాలు పెరుగుతాయి. బెంచ్ మార్క్ ధరలను గమనిస్తే.. గ్రిడ్ అనుసంధానిత ప్లాంటుకు ఒక వాట్ సామర్థ్యానికి రూ.60 ఖర్చు అయితే, ఆఫ్ గ్రిడ్ వ్యవస్థకు రూ.100 వరకు అవుతుంది. ఈ అదనపు ఖర్చల్లా 6 గంటల బ్యాటరీ స్టోరేజీకే. పెట్టుబడి ఎన్నాళ్లలో తిరిగి వస్తుందన్నది.. ప్లాంట్ ఎక్విప్మెంట్కు మీ ప్రాంతంలో లభించే సబ్సిడీ, స్థానికంగా ఉండే విద్యుత్ చార్జీలపై ఆధారపడి ఉంటుంది. యూనిట్‌కు రూ.8 చెల్లిస్తున్న వారికి కిలోవాట్ యూనిట్‌పై ఏడాదికి రూ.9,600 ఆదా అవుతుంది. కనీసం ఏడాదిలో 8 నెలలైనా రోజూ 5 వాట్ల యూనిట్ల చొప్పున ఉత్పత్తి జరుగుతుందనే అంచనా ఆధారంగా వేసిన లెక్కలివి. సబ్సిడీపోను కిలోవాట్ యూనిట్‌కు రూ.50,000 వరకు పెట్టు బడి అవుతుంది. అంటే ఐదేళ్లలో పెట్టుబడి తిరిగివస్తుంది. ఆ తర్వాత మరో 20–30 ఏళ్లు నామమాత్రపు నిర్వహణ వ్యయాలతో విద్యుత్‌ను ఉచితంగా పొందొచ్చు. గమనించాల్సిన కీలక అంశాలివే... ► రూఫ్ టాప్ సోలార్ యూనిట్ ఏర్పాటు చేసుకునే ముందు గమనించాల్సిన ముఖ్యమైన అంశాలు చాలానే ఉన్నాయి. కేవలం సూర్యరశ్మి సమృద్ధిగా ఉండే ప్రాంతాల్లోనే ఇది అనుకూలం. తమ ప్రాంతంలో సూర్యరశ్మి తీవ్రతను ఒక్కసారి తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. ► బ్యాటరీ సిస్టమ్స్‌లో వచ్చే సమస్యల పట్ల అవగాహన ఉండడం కూడా అవసరమే. వీటికి సంబంధించి క్రమానుగత నిర్వహణ, నిర్ణీత కాలం తర్వాత బ్యాటరీలను మార్చడం వంటి చార్జీలు భరించాల్సి ఉంటుంది. అలాగే, చార్జింగ్ సమయంలో విద్యుత్ నష్టం, డిశ్చార్జ్ అవడం కూడా విద్యుత్ తయారీ వ్యయంపై ప్రభావం చూపుతాయి. ► కేవలం సబ్సిడీనే నమ్ముకుని దిగితే కష్టం. రాష్ట్రాల వారీగా నిబంధనల్లో మార్పులున్నాయి. అలాగే, గ్రిడ్ కనెక్టెడ్ యూనిట్‌కు సంబంధించి నియంత్రణలు, విధి, విధానాలు కూడా తెలుసుకోవాలి. యూనిట్ ఏర్పాటు చేసుకున్న తర్వాత దాని తనిఖీ, నెట్ మీటర్లను అధికారులు తనిఖీ చేసేందుకు సమయం పడుతుంది. ► నెట్ మీటరింగ్‌కు సంబంధించి ప్రభుత్వ విధానాలు ఇప్పటికీ ఆకర్షణీయంగా లేవు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తరహా నిబంధనలు ఉన్నాయి. కనుక వాటి విషయమై స్పష్టత తీసుకోవాలి. ► ఇన్స్టలేషన్ , సర్వీస్ అంశాలు కూడా ఉన్నాయి. నైపుణ్యం లేని వారు ఇన్స్టాల్ చేసినా, అందులో తేడాలొచ్చినా ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది. ఇక దిగుమతి చేసుకున్న ప్యానెల్స్, కాంపోనెంట్స్ దెబ్బతింటే, వాటి స్థానంలో తిరిగి కొత్తవి ఏర్పాటు చేసుకోవాలంటే అవి వెంటనే దొరకటమన్నది ఇప్పటికీ సమస్యగానే ఉంది. ► ఉన్న వాటిల్లో ప్రస్తుతానికి గ్రిడ్ అనుసంధానం కాని, సొంత అవసరాలకు, బ్యాటరీ ఆధారిత యూనిట్ ఏర్పాటు చేసుకోవడం నయం. కాకపోతే పెట్టుబడి వ్యయం ఎక్కువ అవుతుంది. ఈ విషయంలో ఓసారి కన్సల్టెంట్‌ను సంప్రదించి అంచనాల తర్వాత తుది నిర్ణయం తీసుకుంటే మంచిది. -
సర్కారీ నివేదికల డేంజర్ బెల్స్!!
-
సర్కారీ నివేదికల డేంజర్ బెల్స్!!
సాక్షి, అమరావతి: ప్రజల్లో సంతృప్తి శాతం పెరుగుతున్నట్లు సీఎం చంద్రబాబు చెబుతున్నా నిజానికి పెరుగుతోంది అసంతృప్తేనని రాష్ట్ర ప్రభుత్వ నివేదికలే వెల్లడిస్తుండటం గమనార్హం. అధికారంలోకి వచ్చిన తరువాత నాలుగున్నరేళ్లలో ఆరుసార్లు జన్మభూమి–మా ఊరు కార్యక్రమాలను నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని ఖర్చు చేసిన టీడీపీ సర్కారు ప్రజల సమస్యలను తీర్చడంలో దారుణంగా విఫలమైనట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ నివేదిక స్పష్టం చేసింది. ఇళ్లు, ఇళ్ల జాగాలు, పింఛన్లు, రేషన్ కార్డుల కోసం ప్రజల నుంచి పదేపదే పెద్ద ఎత్తున విజ్ఞాపనలు అందినా దాదాపు సగం దరఖాస్తులను ప్రభుత్వం తిరస్కరించినట్లు వెల్లడైంది. అర్హులందరికీ మంజూరు చేసినట్లు ప్రభుత్వం చెబుతున్న మాటలన్నీ బూటకమేనని ఈ నివేదికను పరిశీలిస్తే వెల్లడవుతోంది. పేదల ఇళ్ల నిర్మాణంపై నాలుగున్నరేళ్లు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కేవలం ప్రచారార్భాటంతో కాలక్షేపం చేసిన చంద్రబాబు సర్కారు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇళ్ల నిర్మాణంతోపాటు రెవెన్యూలో ఏ సర్టిఫికెట్ కావాలన్నా లంచం ఇవ్వనిదే పని జరగడం లేదని స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే రియల్‌టైమ్ గవర్నెన్స్‌లో వెల్లడైంది. పలు అంశాలపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోతున్నట్లు తేలటం సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సదస్సులో చర్చనీయాంశమైంది. అర్హులుగా తేలినా ఇవ్వకుండా పెండింగ్‌లో... రాష్ట్రవ్యాప్తంగా పింఛన్లు, రేషన్‌కార్డులు, ఇళ్ల స్థలాలు, రుణమాఫీ కోసం 87.37 లక్షల మందికిపైగా పడిగాపులు కాస్తున్నట్లు రియల్ టైమ్ గవర్నెన్స్ నివేదిక బహిర్గతం చేసింది. పది అంశాలకు సంబంధించి 87.37 లక్షలకుపైగా దరఖాస్తులు అందగా ఏకంగా 37,49,043 దరఖాస్తులను తిరస్కరించినట్లు నివేదిక తెలిపింది. అర్హులుగా తేల్చినప్పటికీ మంజూరు చేయకుండా 49,16,423 దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచడం గమనార్హం. ఇళ్ల మంజూరు కోసం 28,44,510 మంది పేదలు దరఖాస్తు చేసుకోగా 12,66,817 అర్జీలను అర్హత లేదంటూ తిరస్కరించారు. మరో 2,283 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని, అర్హులుగా తేల్చినా మంజూరు చేయకుండా 15,75,410 దరఖాస్తులను ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంచారని ఆర్టీజీఎస్ నివేదిక పేర్కొంది. ఇక ఇంటి జాగాల కోసం దరఖాస్తు చేసుకున్న 21,10,626 మంది పేదలు ప్రభుత్వం ఎప్పుడు కనికరిస్తుందా? అని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తుండగా ఏకంగా 13,50,727 లక్షల దరఖాస్తులను అర్హత లేదంటూ తిరస్కరించడం గమనార్హం. రేషన్‌కార్డులు, మంచినీటి సరఫరా, రుణమాఫీ, రహదారులతోపాటు రుణాలు కావాలంటూ ఎస్సీ కార్పొరేషన్‌కు లక్షల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. టీడీపీ ప్రజాప్రతినిధుల వసూళ్లు... పేదలకు ఇళ్ల మంజూరులో అధికార పార్టీ ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు భారీగా లంచాలు వసూలు చేస్తున్నారని సర్కారు ఆర్టీజీఎస్ సర్వేలో వెల్లడైంది. ఇంతవరకు బేస్మెంట్ బిల్లులు అందలేదని 63.98 శాతం మంది పేదలు తెలిపారు. వైఎస్సార్ జిల్లాలో ఏకంగా 83.33 శాతం మంది బేస్మెంట్ బిల్లులు అందలేదని పేర్కొన్నారు. విశాఖపట్టణం జిల్లాలో 78.13 శాతం మంది, కృష్ణా జిల్లాలో 86.67 శాతం, గుంటూరు జిల్లాలో 80 శాతం, ప్రకాశం జిల్లాలో 66.67 శాతం మంది బేస్మెంట్ బిల్లులు అందలేదని చెప్పారు. అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని 32.90 శాతం మంది చెప్పగా ప్రజాప్రతినిధులు 19.08 శాతం మంది అవినీతికి పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. కొన్ని జిల్లాల్లో అధికారులు 20 శాతం నుంచి 43 శాతం వరకు అవినీతికి పాల్పడుతున్నట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులు కొన్ని జిల్లాల్లో 19 శాతం నుంచి 50 శాతం వరకు అవినీతికి పాల్పడుతున్నట్లు వెల్లడించారు. ఇళ్ల మంజూరు పత్రాలు ఇవ్వడం లేదని 40 శాతం మంది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బేస్మెంట్ స్థాయితో పాటు రూఫ్ లెవల్ బిల్లులు, ఇటుకలకు సంబంధించి రూ.650 కోట్ల మేర బిల్లులు పేదలకు అందలేదని తేలింది. లంచం ఇవ్వనిదే పని కావట్లేదు! మీ–సేవ ద్వారా అన్నీ అందుబాటులోకి తెచ్చామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో భిన్నమైన పరిస్థితులు నెలకొన్నట్లు రియల్‌టైమ్ గవర్నెన్స్ నివేదికలో వెల్లడైంది. దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లోగా రెవెన్యూ సిబ్బంది భూములను సర్వే చేయడం లేదని తెలిపారు. ధృవీకరణ పత్రం మంజూరుకు రెవెన్యూ సిబ్బంది తీవ్ర జాప్యం చేయడంతో పాటు లంచాలు తీసుకుంటున్నారని 54 శాతం మంది చెప్పారు. ఈబీసీ సర్టిఫికెట్ జారీకి తీవ్ర జాప్యం చేస్తున్నారని 67 శాతం మంది పేర్కొనగా, లంచాలు తీసుకుంటునా3్నరని 34 శాతం మంది స్పష్టం చేశారు. కుటుంబ సభ్యుని సర్టిఫికెట్ ఇచ్చేందుకు తీవ్ర జాప్యం చేస్తున్నారని 60 శాతం మంది పేర్కొనగా 40 శాతం మంది లంచాలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఆదాయ సర్టిఫికెట్ జారీకి తీవ్ర జాప్యం చేస్తున్నారని 70 శాతం మంది పేర్కొనగా 30 శాతం మంది లంచాలు తీసుకుంటున్నారని తెలిపారు. ల్యాండ్ మార్పిడి, ఓబీసీ సర్టిఫికెట్, పొజిషన్ సర్టిఫికెట్, ఎటువంటి ఆదాయం లేదని సరిఫికెట్ మంజూరుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నా లంచాలు ఇవ్వకుండా రావడం లేదని వెల్లడైంది. అడంగల్ 1బి మంజూరుకు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, అనంతపురం, విశాఖపట్టణం, కర్నూలు, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నూటికి నూరు శాతం మంది రెవెన్యూ అధికారులు, సిబ్బంది లంచాలు తీసుకుంటున్నారని నివేదిక వెల్లడించడం గమనార్హం. -
పేదలకు అండదండ
⇒ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వ నిర్ణయం ⇒4 లక్షల మందికి లబ్ధి చేకూరే అవకాశం ⇒సర్కారుకు భారీగా ఆదాయం ⇒సాగర్ చుట్టూ ఆకాశహర్మ్యాలకు కార్యాచరణ ⇒మెట్రో అలైన్‌మెంట్‌పై మరోమారు సమావేశం సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని ప్రభుత్వ స్థలాల్లో స్థిర నివాసం ఏర్పరచుకున్న నిరుపేదలకు శుభవార్త. 80 నుంచి 125 చదరపు గజాల విస్తీర్ణంలో ప్రభుత్వ భూముల్లో నిర్మించుకున్న ఇళ్లను ఉచితంగా క్రమబద్ధీకరించాలని సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించింది. సీఎం కేసీఆర్ సమక్షంలో మంగళవారం జరిగిన అఖిల పక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల నగరంలోని సుమారు మూడు లక్షల నిరుపేద కుటుంబాలకు సాంత్వన కలగనుంది. 125 గజాలు దాటిన నిర్మాణాలను సైతం నిర్ణీత రుసుంతో క్రమబద్ధీకరించాలన్న అఖిల పక్షం నిర్ణయంతో మరో లక్ష మందికి మేలు కలగనుంది. గతంలో ఉచితంగా 80 గజాల ఇళ్లను క్రమబద్ధీకరించగా... ఈ మారు దాన్ని 125 గజాలకు పెంచడం విశేషం. గతంలోని నిబంధనలు అడ్డుగా పెట్టుకుని ఒకే కుటుంబ సభ్యులు, కొంతమంది పెద్దలు వివిధ పేర్లతో 80 గజాల స్థలాలను సొంతం చేసుకున్న దాఖలాలు ఉన్నాయి. ఊపందుకోనున్న మెట్రో పనులు సుల్తాన్‌బజార్, అసెంబ్లీ ప్రాంతాల్లో మెట్రో అలైన్మెంట్ మార్పునకు విపక్షాలు అంగీకరించడంతో ఆయా ప్రాంతాల్లో మెట్రో పనులు ఊపందుకోనున్నాయి. సుల్తాన్‌బజార్ నుంచి కాకుండా కోఠి ఉమెన్స్ కళాశాల మీదుగా మెట్రో మార్గం మళ్లనుంది. అసెంబ్లీ వెనక వైపు నుంచి మెట్రో మార్గాన్ని మళ్లించేందుకు అన్ని పక్షాలూ అంగీకారం తెలిపాయి. ఇక జేబీఎస్-ఫలక్‌నుమా (కారిడార్-2) రూట్లో అలైన్మెంట్ మార్పు చేయాల్సిందేనంటూ ఎంఐఎం పట్టుబట్టినట్లు తెలిసింది. లేనిపక్షంలో పాత నగరంలో వెయ్యికి పైగా నిర్మాణాలకు నష్టం వాటిల్లుతుందని స్పష్టం చేసింది. ఈ విషయమై ఈనెల 16న నిర్వహించనున్న అఖిలపక్ష సమావేశంలో మరోమారు అన్ని రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలు తెలపాలని సీఎం సూచించారు. దీంతో ఈ మార్గంలో అలైన్మెంట్ మార్పుపై వేచిచూడక తప్పని పరిస్థితి నెలకొంది. కాసుల పంట నగరంలోని యూఎల్సీ భూములను ఆక్రమించుకొని 1400 ఎకరాల్లో నిర్మించుకున్న 33,127 ఇళ్లు, భవనాలు, 200 ఎకరాల్లోని 1927 వాణిజ్య సంస్థలను క్రమబద్ధీకరించడం ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం ఈ సమావేశంలో సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీంతో సర్కారుకు కాసుల పంట పండనుంది. నగరంలో రెవెన్యూ శాఖ ఇప్పటికే గుర్తించిన యూఎల్సీ భూమి 114.22 ఎకరాలు, ప్రభుత్వ భూమి 25 ఎకరాలను విక్రయించాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రైవేటు వ్యక్తులు, సంస్థల కబంధ హస్తాల్లో ఉన్న ఆక్రమిత భూములను స్వాధీనం చేసుకోవాలని సీఎం అధికార యంత్రాగాన్ని ఆదేశించినట్లు తెలిసింది సాగర్ చుట్టూ ఆకాశ హర్మ్యాలు హుస్సేన్‌సాగర్ చుట్టూ బహుళ అంతస్తుల భ వన నిర్మాణానికి అన్ని పార్టీల నుంచి మద్దతు లభించడంతో ప్రభుత్వం త్వరలోనే ఈ దిశగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసే అవకాశాలు ఉన్నాయి. అఖిలపక్ష సమావేశంలో ఇతర అంశాలపై కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ, సాగర్ చుట్టూ ఆకాశహర్మ్యాల నిర్మాణానికి మాత్రం ఎవరి నుంచీ వ్యతిరేకత వ్యక్తం కాలేదు. అంతేకాకుండా నగర కీర్తిని ఇనుమడింపజేసేందుకు వాటిని నిర్మించాలని అభిప్రాయపడ్డారు. దీంతో పాటు పాటిగడ్డ, నర్సింగ్ కాలేజీ, దిల్కుష్ గెస్ట్ హౌస్, రాఘవ టవర్స్, లుంబినీ పార్కు, ఎన్టీఆర్ గార్డెన్స్, బుద్ధభవన్ తదితర ప్రాంతాల్లో భారీ టవర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వినాయక సాగర్ నిర్మాణంపై ప్రతిష్టంభన హుస్సేన్‌సాగర్‌లోనే వినాయక నిమజ్జనం చేపట్టాలని బీజేపీ సహా పలు పార్టీలు అఖిలపక్ష సమావేశంలో పట్టుబట్టిన నేపథ్యంలో ఇందిరాపార్క్ దగ్గర వినాయకసాగర్ నిర్మాణంపై ప్రతిష్టంభన నెలకొంది. ఈ అంశంపైనా ఈనెల 16న జరగనున్న సమావేశంలో స్పష్టత రానుంది. -
హోంగార్డులకు ఇళ్ల స్థలాలు
ఎస్పీ రఘురామ్‌రెడ్డి కృషి చేస్తున్నారని హోంగార్డుల డీఎస్పీ ఎస్ఎస్కేవీ కృష్ణారావు వెల్లడి భీమవరం అర్బన్ : జిల్లాలో పనిచేస్తున్న హోంగార్డులందరికీ ఇళ్లస్థలాలు ఇచ్చేందుకు ఎస్పీ కె.రఘురామ్‌రెడ్డి కృషి చేస్తున్నారని హోంగార్డుల డీఎస్పీ (తూర్పు, పశ్చిమ, కృష్ణా జిల్లాలు) ఎస్ఎస్కేవీ కృష్ణారావు తెలిపారు. చాలామంది హోంగార్డులకు ఉండేందుకు సొంత ఇళ్లు లేవని, వారు పడుతున్న ఇబ్బందులను గమనించిన ఎస్పీ ఆ దిశగా కృషి చేస్తున్నారన్నారు. స్థానిక లూథరన్ హైస్కూల్ క్రీడామైదానంలో సోమవారం నరసాపురం డివిజన్లోని హోంగార్డులకు డ్రిల్ నిర్వహించి పలు సూచనలు చేశారు. శాంతి భద్రతలను కాపాడటంలో, ట్రాఫిక్ సమస్యల పరిష్కారంలో, ప్రభుత్వరంగ ఆస్తుల పరిరక్షణలో హోంగార్డులు కీలకపాత్ర పోషిస్తున్నారని చెప్పారు. విధి నిర్వహణలో ఎక్కడా రాజీ పడవద్దని, డ్రెస్ కోడ్‌ను తప్పనిసరిగా పాటించాలని వారికి సూచించారు. ఓఎన్జీసీ, బీఎస్ఎన్ఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో మరింతమంది హోంగార్డులను నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. హోంగార్డ్స్ ఏఆర్ ఎస్సై ఎ.హనుమంతరావు ఆయన వెంట ఉన్నారు. -
ఇళ్ల స్థలాల పేరుతో వసూళ్లు
పోలీసుల అదుపులో నిందితుడు రాంగోపాల్‌పేట్: ప్రభుత్వం నుంచి ఇంటి స్థలాలు ఇప్పిస్తానని అమాయకులను మోసం చేస్తున్న కేటుగాడిని స్థానికుల చొరవతో తహసీల్దార్ పట్టుకొని పోలీసులకు అప్పగించారు. రాంగోపాల్‌పేట్ ఇన్స్పెక్టర్ గంగారెడ్డి కథనం ప్రకారం... తిరుమలగిరికి చెందిన సంపత్‌కుమార్(42) ఎంజీరోడ్‌లోని బుద్ధభవన్ మొదటి అంతస్తులో మూడు నెలల క్రితం తెలంగాణ శ్రామిక సంఘాల సమాఖ్య పేరుతో సంస్థను ప్రారంభించారు. పత్రికల్లో ప్రకటనలు, కొంత మంది యువకుల ద్వారా కొత్త ప్రభుత్వం నుంచి ఇంటి స్థలం ఇప్పిస్తామని బస్తీల్లో ప్రచారం చేయించాడు. దీంతో బన్సీలాల్‌పేట్, చాచానెహ్రూనగర్, రామస్వామి కాంపౌండ్ తదితర బస్తీల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు కార్యాలయానికి వస్తున్నారు. వారి నుంచి సభ్యత్వం పేరుతో రూ.200, దరఖాస్తు పేరుతో రూ.50 వసూళ్లు చేస్తున్నారు. నెల రోజుల తర్వాత రూ.1000 చెల్లించాలని, ఒకటిన్నర సంవత్సరం తర్వాత ఇంటి స్థలం మంజూరు చేయిస్తామని నమ్మిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న బన్సీలాల్‌పేట్‌కు చెందిన స్థానిక నాయకులు దేశపాక శ్రీనివాస్, నాగభూషణం తదితరులు సదరు కార్యాలయానికి వెళ్లి ఆరా తీయగా ప్రతి రోజు పెద్ద సంఖ్యలో ప్రజల నుంచి డబ్బు వసూలు చేస్తున్నట్టు తేలింది. ఈ విషయాన్ని శనివారం సికింద్రాబాద్ తహసీల్దార్ విష్ణుసాగర్ దృష్టికి తీసుకుని వెళ్లగా ప్రభుత్వం ఎలాంటి దరఖాస్తులు అందించడం లేదని చెప్పారు. వెంటనే ఆయన బుద్దభవన్‌కు వెళ్లి ఇంటి స్థలాల దరఖాస్తుల పేరుతో డబ్బు వసూలు చేస్తున్న వ్యక్తిని ప్రశ్నించగా... తాను ప్రజలకు సేవ చేసేందుకే వచ్చానని చెప్పాడు. దీంతో తహసీల్దార్ నిందితుడిని రాంగోపాల్‌పేట్ పోలీసులకు అప్పగించి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంపత్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇలా సుమారు 8 వేల మంది దగ్గర రూ.20 లక్షల వరకు వసూళ్లు చేసినట్లు ఇన్స్పెక్టర్ గంగారెడ్డి తెలిపారు.