కరెంటు బిల్లుపై సోలార్‌ అస్త్రం! | Renewable energy solutions for residential users | Sakshi
Sakshi News home page

కరెంటు బిల్లుపై సోలార్‌ అస్త్రం!

Published Mon, Jun 3 2019 5:08 AM | Last Updated on Mon, Jun 3 2019 5:11 AM

Renewable energy solutions for residential users - Sakshi

కరెంటు బిల్లు వందల్లో ఉండటం ఒకప్పటి మాట. ఎండలు పెరిగి... ఇంట్లో రెండు మూడు ఏసీల వాడకం మొదలయ్యాక కనీస బిల్లు నెలకు ఏడెనిమిది వేలకు తగ్గటం లేదు. ఒక ఏసీ ఉన్నవారికి సైతం మూడు నాలుగువేల రూపాయలకన్నా తగ్గటం లేదు. మరి ఇలాంటి వాళ్లు బిల్లు తగ్గించుకోవటం ఎలా? ఈ ప్రశ్నకు సమాధానంగానే వస్తున్నాయిపుడు రూఫ్‌ టాప్‌ సోలార్‌ ప్యానెళ్లు. ఇంటి పైకప్పు మీద సోలార్‌ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేసుకోవడం ద్వారా మీ ఇంటి విద్యుత్‌ అవసరాలను స్వయంగా తీర్చుకోవటమే కాదు!! మిగిలితే గ్రిడ్‌కు సరఫరా చేసి... పర్యావరణ అనుకూల ఇంధన సరఫరాలో మనమూ భాగం కావచ్చు. దీర్ఘకాలంలో కాస్త డబ్బులు ఆదా చేయాలనుకున్న వారికి... తరచూ విద్యుత్‌ కోతలను అనుభవించేవారికి రూఫ్‌టాప్‌ సోలార్‌ మంచి ఆప్షనే. విద్యుత్‌ ఉత్పత్తి అయిన చోటే వినియోగం కూడా ఉంటుంది కనక సరఫరా నష్టాలూ ఉండవు. మొత్తం మీద సోలార్‌ రూఫ్‌టాప్‌ విద్యుత్‌ ప్లాంట్‌ గృహ వినియోగదారులకు మంచి ఎంపికే. కాకపోతే దీన్ని ఎంచుకునే ముందు దీన్లో ఉన్న ఇతర అంశాలనూ తెలుసుకోవాలి.
– సాక్షి, పర్సనల్‌ ఫైనాన్స్‌ విభాగం

రూఫ్‌టాప్‌ సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్లకు సంబంధించి ప్రస్తుతం మూడు విధానాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నది... ఓనర్‌షిప్‌ మోడల్‌. ఈ విధానంలో ఇంటి యజమాని స్వయంగా తన ఖర్చులతో ఎక్విప్‌మెంట్‌ను కొనుగోలు చేసి ప్లాంటు ఏర్పాటు చేసుకోవడంతో పాటు, దీనిద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్‌ను తనే వినియోగించుకుంటారు. ఇలా చేయటం వల్ల కిలోవాట్‌ సామర్థ్యానికి 18వేల రూపాయలు సబ్సిడీగా లభిస్తాయి. కేంద్ర సంప్రదాయేతర ఇంధన వనరుల విభాగం ఈ సబ్సిడీని ఆఫర్‌ చేస్తోంది. అలాగే, తమిళనాడు తదితర రాష్ట్ర ప్రభుత్వాలు సొంతంగా కూడా సబ్సిడీ పథకాలు నిర్వహిస్తున్నాయి.  

రెండో విధానంలో... ఇంటి యజమాని తన పైకప్పు స్థలాన్ని ప్రభుత్వం లేదా ప్రైవేటు కంపెనీకి లీజుకు ఇవ్వాల్సి ఉంటుంది. దాంతో వారు సోలార్‌ విద్యుదుత్పత్తి ఎక్విప్‌మెంట్‌ను ఏర్పాటు చేస్తారు. దీనివల్ల వారికి కొంత ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి. ఉదాహరణకు కేరళలో అయితే ఈ విధానంలో ఉత్పత్తయ్యే విద్యుత్‌లో 10 శాతాన్ని ఉచితంగా యజమానికి ఇస్తున్నారు. మిగిలిన విద్యుత్‌ను కావాలనుకుంటే ఆ యజమానే ఫిక్స్‌డ్‌ రేటుకు కొనుగోలు చేసుకునే సౌలభ్యం కూడా ఉంది.  

మూడో విధానం కమ్యూనిటీ యాజమాన్యం కిందకు వస్తుంది. అంటే ఓ సొసైటీ లేదా కాలనీ వాసులు కలసి సామూహికంగా తమ ప్రాంతంలో ఇళ్లపై ప్యానెళ్లు ఏర్పాటు చేసుకుని... ఉమ్మడిగా విద్యుత్తును వినియోగించుకోవడం.  

మరి ఖర్చెంతవుతుంది?
ఈ ప్యానెళ్లు, ప్లాంట్లకు అయ్యే ఖర్చు ఎంతనేది సామర్థ్యంపైనే ఆధారపడి ఉంటుంది. మీకు ఎంత స్థలం అందుబాటులో ఉంది? అందులో ఎంత సామర్థ్యానికి సరిపడా ఎక్విప్‌మెంట్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు? అనే అంశాలే పెట్టుబడిని నిర్ణయిస్తాయి. సాధారణంగా అయితే కిలోవాట్‌ సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి కోసం కనీసం 220 చదరపు అడుగుల విస్తీర్ణం కావాలి. దీనివల్ల ఒక రోజులో 5 యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తవుతుంది. అది కూడా కనీసం ఐదారు గంటల పాటు సూర్యరశ్మి ఉంటేనే!!. ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశారు? సూర్యరశ్మి తీవ్రత కూడా ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి. ఇక కాంపోనెంట్, ఇన్‌స్టలేషన్‌ చార్జీలనూ పరిగణనలోకి తీసుకోవాలి. మొత్తం సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తికి అయ్యే ఖర్చులో సగ భాగం ఫొటో వోల్టాయిక్‌ మాడ్యూల్స్‌కే అవుతుంది. కాకపోతే గత కొన్ని సంవత్సరాల్లో ఈ ఖర్చు గణనీయంగా తగ్గుతూ వచ్చింది. ఉదాహరణకు ఐదేళ్ల క్రితం కిలోవాట్‌ విద్యుత్‌ తయారీ ఎక్విప్‌మెంట్‌కు రూ.లక్ష పెట్టుబడి అవసరమయ్యేది. ఇది ప్రస్తుతం రూ.40,000– 60,000కు దిగొచ్చింది. సోలార్‌ ప్యానెల్స్‌ జీవిత కాలం 25– 35 సంవత్సరాల వరకూ ఉంటుంది. పెద్దగా మెయింటెనెన్స్‌ అవసరం ఉండదు.
 
ఇలా ఇంటి పైకప్పు మీద సోలార్‌ ప్యానెల్స్‌ సాయంతో తయారైన విద్యుత్‌ను గృహ వినియోగానికి అనుకూలంగా మార్చాలంటే ఇన్వర్టర్లు అవసరం. మొత్తం ఖర్చులో పావు వంతుకు వీటికి వెచ్చించాల్సి ఉంటుంది. వైరింగ్, ఇతర పరికరాలు, ఇన్‌స్టలేషన్‌ తదితరాలకు మిగిలిన పావు శాతం వ్యయం అవుతుంది. అన్ని రకాల ఐటమ్స్‌తో కూడిన కిట్స్‌ కూడా లభిస్తాయి. సాధారణంగా కిలోవాట్‌ సామర్థ్యం నుంచి ఇవి లభిస్తాయి. విద్యుత్‌ ఉత్పత్తిని పర్యవేక్షించేందుకు మొబైల్‌ యాప్స్‌తో వచ్చేవీ ఉన్నాయి. అదనపు కాలానికి పొడిగించిన వారంటీ, సర్వీస్‌ గ్యారంటీ ఆఫర్లూ ఉన్నాయి. ఈ వ్యయాలన్నీ గ్రిడ్‌ అనుసంధానిత విద్యుత్‌ తయారీ సిస్టమ్‌లకు సంబంధించినవి. వాడుకోగా మిగిలే అదనపు విద్యుత్‌ను నెట్‌ మీటరింగ్‌ ద్వారా విద్యుత్‌ గ్రిడ్‌కు సరఫరా చేయవచ్చు.

బ్యాటరీ బ్యాకప్‌ కోరుకుంటే, ఇందుకోసం ఆఫ్‌ గ్రిడ్‌ సొల్యూషన్స్‌ అవసరం అవుతాయి. దీంతో వ్యయాలు పెరుగుతాయి. బెంచ్‌ మార్క్‌ ధరలను గమనిస్తే.. గ్రిడ్‌ అనుసంధానిత ప్లాంటుకు ఒక వాట్‌ సామర్థ్యానికి రూ.60 ఖర్చు అయితే, ఆఫ్‌ గ్రిడ్‌ వ్యవస్థకు రూ.100 వరకు అవుతుంది. ఈ అదనపు ఖర్చల్లా 6 గంటల బ్యాటరీ స్టోరేజీకే. పెట్టుబడి ఎన్నాళ్లలో తిరిగి వస్తుందన్నది.. ప్లాంట్‌ ఎక్విప్‌మెంట్‌కు మీ ప్రాంతంలో లభించే సబ్సిడీ, స్థానికంగా ఉండే విద్యుత్‌ చార్జీలపై ఆధారపడి ఉంటుంది. యూనిట్‌కు రూ.8 చెల్లిస్తున్న వారికి కిలోవాట్‌ యూనిట్‌పై ఏడాదికి రూ.9,600 ఆదా అవుతుంది. కనీసం ఏడాదిలో 8 నెలలైనా రోజూ 5 వాట్ల యూనిట్ల చొప్పున ఉత్పత్తి జరుగుతుందనే అంచనా ఆధారంగా వేసిన లెక్కలివి. సబ్సిడీపోను కిలోవాట్‌ యూనిట్‌కు రూ.50,000 వరకు పెట్టు బడి అవుతుంది. అంటే ఐదేళ్లలో పెట్టుబడి తిరిగివస్తుంది. ఆ తర్వాత మరో 20–30 ఏళ్లు నామమాత్రపు నిర్వహణ వ్యయాలతో విద్యుత్‌ను ఉచితంగా పొందొచ్చు.

గమనించాల్సిన కీలక అంశాలివే...
► రూఫ్‌ టాప్‌ సోలార్‌ యూనిట్‌ ఏర్పాటు చేసుకునే ముందు గమనించాల్సిన ముఖ్యమైన అంశాలు చాలానే ఉన్నాయి. కేవలం సూర్యరశ్మి సమృద్ధిగా ఉండే ప్రాంతాల్లోనే ఇది అనుకూలం. తమ ప్రాంతంలో సూర్యరశ్మి తీవ్రతను ఒక్కసారి తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి.  

► బ్యాటరీ సిస్టమ్స్‌లో వచ్చే సమస్యల పట్ల అవగాహన ఉండడం కూడా అవసరమే. వీటికి సంబంధించి క్రమానుగత నిర్వహణ, నిర్ణీత కాలం తర్వాత బ్యాటరీలను మార్చడం వంటి చార్జీలు భరించాల్సి ఉంటుంది. అలాగే, చార్జింగ్‌ సమయంలో విద్యుత్‌ నష్టం, డిశ్చార్జ్‌ అవడం కూడా విద్యుత్‌ తయారీ వ్యయంపై ప్రభావం చూపుతాయి.  

► కేవలం సబ్సిడీనే నమ్ముకుని దిగితే కష్టం. రాష్ట్రాల వారీగా నిబంధనల్లో మార్పులున్నాయి. అలాగే, గ్రిడ్‌ కనెక్టెడ్‌ యూనిట్‌కు సంబంధించి నియంత్రణలు, విధి, విధానాలు కూడా తెలుసుకోవాలి. యూనిట్‌ ఏర్పాటు చేసుకున్న తర్వాత దాని తనిఖీ, నెట్‌ మీటర్లను అధికారులు తనిఖీ చేసేందుకు సమయం పడుతుంది.

► నెట్‌ మీటరింగ్‌కు సంబంధించి ప్రభుత్వ విధానాలు ఇప్పటికీ ఆకర్షణీయంగా లేవు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తరహా నిబంధనలు ఉన్నాయి. కనుక వాటి విషయమై స్పష్టత తీసుకోవాలి.

► ఇన్‌స్టలేషన్‌ , సర్వీస్‌ అంశాలు కూడా ఉన్నాయి. నైపుణ్యం లేని వారు ఇన్‌స్టాల్‌ చేసినా, అందులో తేడాలొచ్చినా ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది. ఇక దిగుమతి చేసుకున్న ప్యానెల్స్, కాంపోనెంట్స్‌ దెబ్బతింటే, వాటి స్థానంలో తిరిగి కొత్తవి ఏర్పాటు చేసుకోవాలంటే అవి వెంటనే దొరకటమన్నది ఇప్పటికీ సమస్యగానే ఉంది.

► ఉన్న వాటిల్లో ప్రస్తుతానికి గ్రిడ్‌ అనుసంధానం కాని, సొంత అవసరాలకు, బ్యాటరీ ఆధారిత యూనిట్‌ ఏర్పాటు చేసుకోవడం నయం. కాకపోతే పెట్టుబడి వ్యయం ఎక్కువ అవుతుంది. ఈ విషయంలో ఓసారి కన్సల్టెంట్‌ను సంప్రదించి అంచనాల తర్వాత తుది నిర్ణయం తీసుకుంటే మంచిది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement