
28వ తేదీన ఆకాశంలో కనువిందు చేయనున్న ఏడు గ్రహాలు
న్యూఢిల్లీ: కోట్లాది మంది భక్తుల రాకతో మహాకుంభమేళా ఘాట్లు, ప్రాంగణాలు కన్నుల పండువగా కనిపిస్తే ఆ కుంభమేళా ముగిసిన తర్వాత సైతం ఆ కన్నుల పండువ కొనసాగనుంది. అయితే ఈసారి నేలపై కాకుండా వినీలాకాశంలో ఓ అద్భుత దృశ్యం చూపరులకు కనువిందు చేయనుంది. అదే సౌరమండలంలోని ఏడు గ్రహాల సాక్షాత్కారం.
యురేనస్, నెప్ట్యూన్ మినహా మిగతా అన్ని సౌరకుటుంబ గ్రహాలను నేరుగా మనం కంటితోనే చూడొచ్చు. ఫిబ్రవరి 28వ తేదీన ఇవి అత్యంత స్పష్టంగా కనిపించి మనల్ని ఆశ్చర్యంలో ముంచెత్తనున్నాయి. కాస్తంత దూరంగా ఉండటంతో యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలను మనం చూడలేము. టెలిస్కోప్, బైనాక్యులర్ సాయంతో ఈ రెండింటిని చూడొచ్చు. భూమి సూర్యుని చుట్టూ తిరిగే సూర్యగమన పథమార్గంలోనే ఈ అన్ని గ్రహాలను మనం ఒకేసారి చూడొచ్చు.
మహాకుంభమేళా వంటి అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అద్భుతంగా జరుపుకుని పూర్తిచేసుకుంటున్న వేళ గ్రహాలన్నీ సాక్షాత్కారం కావడం అనిర్వచనీయ అనుభూతిని ఇస్తుందని కొందరు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. హిందూ ఆచార సంప్రదాయాల్లో గ్రహకూటమిని విశేషమైనదిగా చెప్పుకుంటారు. భారత్‌లో రాత్రి వేళ బుధుడు, శుక్రుడు, అంగారకుడు, గురుడు, శని గ్రహాలను నేరుగా చూడొచ్చు. ఇలా ఎక్కువ గ్రహాలు ఒకేసారి మహాకుంభమేళా కాలంలో దర్శనమివ్వడంతో దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక శక్తి ప్రసరణ మరింత తేజోవంతమవుతుందని కొందరు భక్తులు విశ్వసిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment