
‘అంతరిక్షం నుండి భారతదేశం ఎలా ఉంది?’ ఈ ప్రశ్నకు నాడు భారత వ్యోమగామి రాకేష్ శర్మ(Indian astronaut Rakesh Sharma) ప్రముఖ కవి ముహమ్మద్ ఇక్బాల్ రాసిన ‘సారే జహాన్ సే అచ్చా’ అంటూ సమాధానం చెప్పారు. నాలుగు దశాబ్దాల తర్వాత ఇదే ప్రశ్నకు భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ సమాధానమిచ్చారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి అద్భుతమైన హిమాలయాలను చూసిన సంగతిని ఆమె గుర్తుచేసుకున్నారు.
286 రోజుల అంతరిక్ష యాత్ర తర్వాత సునీతను.. భారతదేశం అంతరిక్షం నుండి ఎలా కనిపించింది? అని అడిగినప్పుడు ఆమె ‘అద్భుతం.. అత్యద్భుతం’ అనే సమాధానం ఇచ్చారు. ‘భారతదేశం అద్భుతమైనది. మేము హిమాలయాల(Himalayas) మీదుగా వెళ్లిన ప్రతిసారీ అద్భుత దృశ్యాలను చూశాం’ అని సునీతా విలియమ్స్ అన్నారు. తన భారతీయ మూలాల గురించి తరచూ మాట్లాడే అమెరికా వ్యోమగామి సునీత అంతరిక్షం నుంచి భారత్‌కు సంబంధించిన ప్రకృతి దృశ్యాలను చూసి మంత్రముగ్ధురాలయ్యారు.
పశ్చిమాన ఉన్న నౌకాదళాల నుండి ఉత్తరాన మెరుస్తున్న హిమాలయాల వరకు అంతా అద్భుతంగా కనిపించింది. తూర్పు నుండి గుజరాత్ మీదుగా ముంబైకి వెళ్ళినప్పుడు అద్భుత దృశ్యం కనిపించింది. భారతదేశం అంతటా రాత్రిపూట లైట్ల నెట్‌వర్క్ అమోఘంగా ఉంది. పగటిపూట కనిపించిన హిమాలయాల సౌందర్యం భారతదేశానికే తలమానికంగా నిలిచింది. భారత అంతరిక్ష విమానయాన కార్యక్రమానికి సహాయం చేస్తారా? అని ఆమెను అడిగినప్పుడు ఎప్పుడో ఒకప్పుడు భారతదేశానికి వస్తాను. మా అనుభవాలను అక్కడివారితో పంచుకుంటాను. భారత్ ఒక గొప్ప దేశం. అద్భుతమైన ప్రజాస్వామ్యం(Democracy) ఇక్కడుంది. భారత్ అంతరిక్షయానంలో ముందడుగు వేస్తోంది. దానిలో భాగం కావడానికి, వారికి సహాయం చేయడం తనకు ఇషమేనని ఆమె సమాధానం చెప్పారు.
భారతదేశంలో జన్మించిన విలియమ్స్ తన తండ్రి పూర్వీకుల ప్రాంతానికి రావాలని అనుకుంటోంది. తన సహ వ్యోమగామి బుచ్ విల్మోర్‌ను కూడా భారత్‌కు తీసుకురావాలని భావిస్తోంది. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ గత ఏడాది జూన్‌లో బోయింగ్ స్టార్‌లైనర్‌లో ఎనిమిది రోజుల మిషన్ కోసం అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. సాంకేతిక సమస్యల కారణంగా అంతరిక్ష నౌక సిబ్బంది లేకుండా తిరిగి వచ్చింది. దీంతో ఈ ఇద్దరు వ్యోమగాములు అంతరిక్షంలో చిక్కుకుపోయారు. వారు చివరికి మొన్న మార్చి 19న స్పేస్‌ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌకలో భూమికి తిరిగి వచ్చారు.
ఇది కూడా చదవండి: మరుభూమిగా మయన్మార్.. దారుణమైన పరిస్థితులు