solar systems
-
ఈ మిస్టరీ ప్లానెట్‌పై కొత్త ఆశలు!
కొన్నాళ్లు నవగ్రహాల్లో ఒకటన్నారు! మరికొన్నాళ్లు అసలు గ్రహానివే కాదు పొమ్మన్నారు! తాజాగా మళ్లీ గ్రహం హోదా పరిశీలిస్తామంటున్నారు! ఈ మిస్టరీ ప్లానెట్‌పై ఐస్ వోల్కనోలు గుర్తించడంతో ప్లూటోకు పునరుజ్జీవం పోస్తున్నారు సైంటిస్టులు. సౌరకుటుంబంలోని చిన్నారి గ్రహం (?) ప్లూటో మనిషికి అంతుచిక్కడం లేదు. సూర్యుడికి సుదూరంగా ఉండే ప్లూటోను కనుగొని 92 సంవత్సరాలవుతోంది. దీన్ని కనుగొన్న తర్వాత చాలా సంవత్సరాలు నవగ్రహాల్లో ఒకటిగా లెక్కించారు. 16ఏళ్ల క్రితం కొత్త లెక్కలేసి దీని గ్రహహోదాను తీసిపారేశారు. ఇప్పుడు అదే సైంటిస్టులు ప్లూటో ఉపరితలంపై మంచు పర్వతాల జాడలున్నాయని చెబుతున్నారు. సౌర కుటుంబంలో మరే ఇతర గ్రహంలో కూడా ఇలాంటి మంచు వోల్కనోలు లేవు. దీంతో ఒక్కమారుగా ఖగోళ పరిశోధకుల దృష్టి ప్లూటోపైకి మరలింది. న్యూహారిజాన్స్ మిషన్ పంపిన చిత్రాలను విశ్లేషించిన సైంటిస్టుల బృందం ప్లూటోపై కొండలు, గుట్టలు మరియు పెద్ద గోపురాల్లాంటి ఆకారాలున్న ప్రాంతాన్ని గుర్తించింది. ఇవన్నీ ప్లూటో ఉపరితల అంతర్భాగం నుంచి విరజిమ్మిన మంచు తదితర పదార్ధాలతో ఏర్పడ్డాయని గమనించింది. ఇలాంటి భారీ నిర్మితీయ ప్రాంతాలు ఏర్పడాలంటే పలుమార్లు మంచు పర్వతాల విస్ఫోటనం జరిగి ఉండాలని అంచనా వేసింది. తమ తాజా పరిశోధన వివరాలను జర్నల్ నేచర్ కమ్యూనికేషన్స్‌లో ప్రచురించింది. ప్లూటో ఉపరితలానికి కింద దాదాపు 100– 200 కిలోమీటర్ల దిగువన నీటితో నిండిన సముద్రం ఉండి ఉండొచ్చని పరిశోధనలో పేర్కొన్నారు. ఉపరితలంపై ఉన్న పర్వతాల ఏర్పాటుకు అవసరమైన మంచుకు ఈ సముద్రమే ఆధారమని అంచనా వేస్తున్నారు. క్రయో వోల్కనోలు సాధారణంగా లావా వెదజల్లే అగ్నిపర్వతాన్ని వోల్కనో అంటారు. కానీ మంచును వెదజల్లే పర్వతాలను క్రయో వోల్కనోలు లేదా ఐస్ వోల్కనోలంటారు. రైట్ మోన్స్ మరియు పిక్కార్డ్ మోన్ అనే రెండు అతిపెద్ద మట్టి దిబ్బల ప్రాంతాన్ని ప్లూటోపై న్యూహారిజన్స్ మిషన్ ఫొటో తీసింది. ఈ మట్టి దిబ్బలు క్రయోవోల్కనోలని పరిశోధక బృందం ప్రస్తుతం నమ్ముతోంది. అలాగే ప్లూటో నైరుతి ప్రాంతంలో కనిపించే ప్రకాశవంతమైన ప్రాంతాన్ని (స్పుత్నిక్ ప్లానిటియా అంటారు) బృందం విశ్లేషించింది. ఇక్కడ 1–7 కిలోమీటర్ల ఎత్తున 30– 100 కిలోమీటర్ల వెడల్పున వ్యాపించిన భారీ దిబ్బలున్నాయని తెలిపింది. ఇవి కేవలం ప్లూటోపైనే కనిపించాయని, ఇవి క్రయో వోల్కనోలు వెదజల్లిన మంచుతో ఏర్పడి ఉంటాయని శాస్త్రవేత్త డాక్టర్ కెల్సి సింగర్ చెప్పారు. ఇలాంటి దిబ్బల్లో కొన్నింటి వయసు తక్కువ కావడంతో ఇటీవల కాలం (అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం) వరకు కూడా ప్లూటోలో ఐస్ వోల్కనోలు పేలి మంచు వెదజల్లడం జరిగి ఉండొచ్చన్నారు. అయితే ఈ వోల్కనోలు పేలడానికి అవసరమైన వేడి ప్లూటోకి ఎక్కడినుంచి వచ్చిందనే ప్రశ్నకు ఇంకా సమాధానం దొరకలేదు. అలాగే ఈ వాతావరణం జీవి పుట్టుకకు కొంతమేర అనువుగానే ఉన్నట్లు సైంటిస్టులు భావిస్తున్నారు. ప్లూటో పరిశోధనకు న్యూహారిజన్స్ మిషన్‌ను నాసా 2006లో ప్రయోగించింది. అదే సంవత్సరం ప్లూటోకు గ్రహహోదా తీసివేశారు. 2015లో ఈ మిషన్ ప్లూటోను చేరింది. అప్పటినుంచి ప్లూటోకు సంబంధించిన ఆసక్తికర సమాచారాన్ని పంపుతోంది. తాజా పరిశోధనలకు మరిన్ని ఆధారాలు లభిస్తే తిరిగి సౌర కుటుంబంలో ప్లూటోకు గ్రహ హోదా కల్పించే అవకాశాలున్నాయి. మరిన్ని విశేషాలు.. ► 1930లో కుపర్ బెల్ట్ (నెప్ట్యూన్ చుట్టూ ఉండే శకలాలు)లో ప్లూటోను కనుగొన్నారు. అప్పుడే దీన్ని తొమ్మిదో గ్రహంగా ప్రకటించారు. ► 1990ల్లో తొలిసారి ప్లూటో గ్రహ హోదాపై ప్రశ్నలు తలెత్తాయి. ► 2006లో ఇంటర్నేషనల్ ఆస్ట్రనాటికల్ యూనియన్ ప్లూటో గ్రహం కాదని, డ్వార్ఫ్ ప్లానెట్ (మరుగుజ్జు గ్రహం) అని ప్రకటించింది. ► భూమి చుట్టూ తిరిగే చంద్రుడిలో మూడోవంతుండే ప్లూటో ఉపరితలం మీద ఐస్, రాళ్లు ఉన్నాయి. ► ప్లూటోకి ఐదు చందమామలున్నాయి. ► సూర్యుడికి దూరంగా ఉండడంతో దీనిపై ఉష్ణోగ్రత దాదాపు మైనస్ 200 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. – నేషనల్ డెస్క్, సాక్షి -
కరెంటు బిల్లుపై సోలార్ అస్త్రం!
కరెంటు బిల్లు వందల్లో ఉండటం ఒకప్పటి మాట. ఎండలు పెరిగి... ఇంట్లో రెండు మూడు ఏసీల వాడకం మొదలయ్యాక కనీస బిల్లు నెలకు ఏడెనిమిది వేలకు తగ్గటం లేదు. ఒక ఏసీ ఉన్నవారికి సైతం మూడు నాలుగువేల రూపాయలకన్నా తగ్గటం లేదు. మరి ఇలాంటి వాళ్లు బిల్లు తగ్గించుకోవటం ఎలా? ఈ ప్రశ్నకు సమాధానంగానే వస్తున్నాయిపుడు రూఫ్ టాప్ సోలార్ ప్యానెళ్లు. ఇంటి పైకప్పు మీద సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేసుకోవడం ద్వారా మీ ఇంటి విద్యుత్ అవసరాలను స్వయంగా తీర్చుకోవటమే కాదు!! మిగిలితే గ్రిడ్‌కు సరఫరా చేసి... పర్యావరణ అనుకూల ఇంధన సరఫరాలో మనమూ భాగం కావచ్చు. దీర్ఘకాలంలో కాస్త డబ్బులు ఆదా చేయాలనుకున్న వారికి... తరచూ విద్యుత్ కోతలను అనుభవించేవారికి రూఫ్‌టాప్ సోలార్ మంచి ఆప్షనే. విద్యుత్ ఉత్పత్తి అయిన చోటే వినియోగం కూడా ఉంటుంది కనక సరఫరా నష్టాలూ ఉండవు. మొత్తం మీద సోలార్ రూఫ్‌టాప్ విద్యుత్ ప్లాంట్ గృహ వినియోగదారులకు మంచి ఎంపికే. కాకపోతే దీన్ని ఎంచుకునే ముందు దీన్లో ఉన్న ఇతర అంశాలనూ తెలుసుకోవాలి. – సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం రూఫ్‌టాప్ సోలార్ విద్యుత్ ప్లాంట్లకు సంబంధించి ప్రస్తుతం మూడు విధానాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నది... ఓనర్షిప్ మోడల్. ఈ విధానంలో ఇంటి యజమాని స్వయంగా తన ఖర్చులతో ఎక్విప్మెంట్ను కొనుగోలు చేసి ప్లాంటు ఏర్పాటు చేసుకోవడంతో పాటు, దీనిద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్‌ను తనే వినియోగించుకుంటారు. ఇలా చేయటం వల్ల కిలోవాట్ సామర్థ్యానికి 18వేల రూపాయలు సబ్సిడీగా లభిస్తాయి. కేంద్ర సంప్రదాయేతర ఇంధన వనరుల విభాగం ఈ సబ్సిడీని ఆఫర్ చేస్తోంది. అలాగే, తమిళనాడు తదితర రాష్ట్ర ప్రభుత్వాలు సొంతంగా కూడా సబ్సిడీ పథకాలు నిర్వహిస్తున్నాయి. రెండో విధానంలో... ఇంటి యజమాని తన పైకప్పు స్థలాన్ని ప్రభుత్వం లేదా ప్రైవేటు కంపెనీకి లీజుకు ఇవ్వాల్సి ఉంటుంది. దాంతో వారు సోలార్ విద్యుదుత్పత్తి ఎక్విప్మెంట్ను ఏర్పాటు చేస్తారు. దీనివల్ల వారికి కొంత ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి. ఉదాహరణకు కేరళలో అయితే ఈ విధానంలో ఉత్పత్తయ్యే విద్యుత్‌లో 10 శాతాన్ని ఉచితంగా యజమానికి ఇస్తున్నారు. మిగిలిన విద్యుత్‌ను కావాలనుకుంటే ఆ యజమానే ఫిక్స్డ్ రేటుకు కొనుగోలు చేసుకునే సౌలభ్యం కూడా ఉంది. మూడో విధానం కమ్యూనిటీ యాజమాన్యం కిందకు వస్తుంది. అంటే ఓ సొసైటీ లేదా కాలనీ వాసులు కలసి సామూహికంగా తమ ప్రాంతంలో ఇళ్లపై ప్యానెళ్లు ఏర్పాటు చేసుకుని... ఉమ్మడిగా విద్యుత్తును వినియోగించుకోవడం. మరి ఖర్చెంతవుతుంది? ఈ ప్యానెళ్లు, ప్లాంట్లకు అయ్యే ఖర్చు ఎంతనేది సామర్థ్యంపైనే ఆధారపడి ఉంటుంది. మీకు ఎంత స్థలం అందుబాటులో ఉంది? అందులో ఎంత సామర్థ్యానికి సరిపడా ఎక్విప్మెంట్ను ఏర్పాటు చేసుకోవచ్చు? అనే అంశాలే పెట్టుబడిని నిర్ణయిస్తాయి. సాధారణంగా అయితే కిలోవాట్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం కనీసం 220 చదరపు అడుగుల విస్తీర్ణం కావాలి. దీనివల్ల ఒక రోజులో 5 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తవుతుంది. అది కూడా కనీసం ఐదారు గంటల పాటు సూర్యరశ్మి ఉంటేనే!!. ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశారు? సూర్యరశ్మి తీవ్రత కూడా ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి. ఇక కాంపోనెంట్, ఇన్స్టలేషన్ చార్జీలనూ పరిగణనలోకి తీసుకోవాలి. మొత్తం సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అయ్యే ఖర్చులో సగ భాగం ఫొటో వోల్టాయిక్ మాడ్యూల్స్కే అవుతుంది. కాకపోతే గత కొన్ని సంవత్సరాల్లో ఈ ఖర్చు గణనీయంగా తగ్గుతూ వచ్చింది. ఉదాహరణకు ఐదేళ్ల క్రితం కిలోవాట్ విద్యుత్ తయారీ ఎక్విప్మెంట్కు రూ.లక్ష పెట్టుబడి అవసరమయ్యేది. ఇది ప్రస్తుతం రూ.40,000– 60,000కు దిగొచ్చింది. సోలార్ ప్యానెల్స్ జీవిత కాలం 25– 35 సంవత్సరాల వరకూ ఉంటుంది. పెద్దగా మెయింటెనెన్స్ అవసరం ఉండదు. ఇలా ఇంటి పైకప్పు మీద సోలార్ ప్యానెల్స్ సాయంతో తయారైన విద్యుత్‌ను గృహ వినియోగానికి అనుకూలంగా మార్చాలంటే ఇన్వర్టర్లు అవసరం. మొత్తం ఖర్చులో పావు వంతుకు వీటికి వెచ్చించాల్సి ఉంటుంది. వైరింగ్, ఇతర పరికరాలు, ఇన్స్టలేషన్ తదితరాలకు మిగిలిన పావు శాతం వ్యయం అవుతుంది. అన్ని రకాల ఐటమ్స్‌తో కూడిన కిట్స్ కూడా లభిస్తాయి. సాధారణంగా కిలోవాట్ సామర్థ్యం నుంచి ఇవి లభిస్తాయి. విద్యుత్ ఉత్పత్తిని పర్యవేక్షించేందుకు మొబైల్ యాప్స్‌తో వచ్చేవీ ఉన్నాయి. అదనపు కాలానికి పొడిగించిన వారంటీ, సర్వీస్ గ్యారంటీ ఆఫర్లూ ఉన్నాయి. ఈ వ్యయాలన్నీ గ్రిడ్ అనుసంధానిత విద్యుత్ తయారీ సిస్టమ్‌లకు సంబంధించినవి. వాడుకోగా మిగిలే అదనపు విద్యుత్‌ను నెట్ మీటరింగ్ ద్వారా విద్యుత్ గ్రిడ్‌కు సరఫరా చేయవచ్చు. బ్యాటరీ బ్యాకప్ కోరుకుంటే, ఇందుకోసం ఆఫ్ గ్రిడ్ సొల్యూషన్స్ అవసరం అవుతాయి. దీంతో వ్యయాలు పెరుగుతాయి. బెంచ్ మార్క్ ధరలను గమనిస్తే.. గ్రిడ్ అనుసంధానిత ప్లాంటుకు ఒక వాట్ సామర్థ్యానికి రూ.60 ఖర్చు అయితే, ఆఫ్ గ్రిడ్ వ్యవస్థకు రూ.100 వరకు అవుతుంది. ఈ అదనపు ఖర్చల్లా 6 గంటల బ్యాటరీ స్టోరేజీకే. పెట్టుబడి ఎన్నాళ్లలో తిరిగి వస్తుందన్నది.. ప్లాంట్ ఎక్విప్మెంట్కు మీ ప్రాంతంలో లభించే సబ్సిడీ, స్థానికంగా ఉండే విద్యుత్ చార్జీలపై ఆధారపడి ఉంటుంది. యూనిట్‌కు రూ.8 చెల్లిస్తున్న వారికి కిలోవాట్ యూనిట్‌పై ఏడాదికి రూ.9,600 ఆదా అవుతుంది. కనీసం ఏడాదిలో 8 నెలలైనా రోజూ 5 వాట్ల యూనిట్ల చొప్పున ఉత్పత్తి జరుగుతుందనే అంచనా ఆధారంగా వేసిన లెక్కలివి. సబ్సిడీపోను కిలోవాట్ యూనిట్‌కు రూ.50,000 వరకు పెట్టు బడి అవుతుంది. అంటే ఐదేళ్లలో పెట్టుబడి తిరిగివస్తుంది. ఆ తర్వాత మరో 20–30 ఏళ్లు నామమాత్రపు నిర్వహణ వ్యయాలతో విద్యుత్‌ను ఉచితంగా పొందొచ్చు. గమనించాల్సిన కీలక అంశాలివే... ► రూఫ్ టాప్ సోలార్ యూనిట్ ఏర్పాటు చేసుకునే ముందు గమనించాల్సిన ముఖ్యమైన అంశాలు చాలానే ఉన్నాయి. కేవలం సూర్యరశ్మి సమృద్ధిగా ఉండే ప్రాంతాల్లోనే ఇది అనుకూలం. తమ ప్రాంతంలో సూర్యరశ్మి తీవ్రతను ఒక్కసారి తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. ► బ్యాటరీ సిస్టమ్స్‌లో వచ్చే సమస్యల పట్ల అవగాహన ఉండడం కూడా అవసరమే. వీటికి సంబంధించి క్రమానుగత నిర్వహణ, నిర్ణీత కాలం తర్వాత బ్యాటరీలను మార్చడం వంటి చార్జీలు భరించాల్సి ఉంటుంది. అలాగే, చార్జింగ్ సమయంలో విద్యుత్ నష్టం, డిశ్చార్జ్ అవడం కూడా విద్యుత్ తయారీ వ్యయంపై ప్రభావం చూపుతాయి. ► కేవలం సబ్సిడీనే నమ్ముకుని దిగితే కష్టం. రాష్ట్రాల వారీగా నిబంధనల్లో మార్పులున్నాయి. అలాగే, గ్రిడ్ కనెక్టెడ్ యూనిట్‌కు సంబంధించి నియంత్రణలు, విధి, విధానాలు కూడా తెలుసుకోవాలి. యూనిట్ ఏర్పాటు చేసుకున్న తర్వాత దాని తనిఖీ, నెట్ మీటర్లను అధికారులు తనిఖీ చేసేందుకు సమయం పడుతుంది. ► నెట్ మీటరింగ్‌కు సంబంధించి ప్రభుత్వ విధానాలు ఇప్పటికీ ఆకర్షణీయంగా లేవు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తరహా నిబంధనలు ఉన్నాయి. కనుక వాటి విషయమై స్పష్టత తీసుకోవాలి. ► ఇన్స్టలేషన్ , సర్వీస్ అంశాలు కూడా ఉన్నాయి. నైపుణ్యం లేని వారు ఇన్స్టాల్ చేసినా, అందులో తేడాలొచ్చినా ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది. ఇక దిగుమతి చేసుకున్న ప్యానెల్స్, కాంపోనెంట్స్ దెబ్బతింటే, వాటి స్థానంలో తిరిగి కొత్తవి ఏర్పాటు చేసుకోవాలంటే అవి వెంటనే దొరకటమన్నది ఇప్పటికీ సమస్యగానే ఉంది. ► ఉన్న వాటిల్లో ప్రస్తుతానికి గ్రిడ్ అనుసంధానం కాని, సొంత అవసరాలకు, బ్యాటరీ ఆధారిత యూనిట్ ఏర్పాటు చేసుకోవడం నయం. కాకపోతే పెట్టుబడి వ్యయం ఎక్కువ అవుతుంది. ఈ విషయంలో ఓసారి కన్సల్టెంట్‌ను సంప్రదించి అంచనాల తర్వాత తుది నిర్ణయం తీసుకుంటే మంచిది. -
తోకచుక్కా.. ఏలియనా..!!
-
తోకచుక్కా.. ఏలియనా..!!
వాషింగ్టన్ : మన సౌర కుటుంబంలో తోకచుక్కలు తిరుగుతుండటం సర్వసాధారణం. ఇవి ఎక్కువగా సూర్యుడి చుట్టూ తిరుగుతుంటాయి. భూమికి చేరువలో తిరుగడం మాత్రం తక్కువ సార్లు మాత్రమే జరుగుతుంటుంది. కానీ, మరో సౌర వ్యవస్థ నుంచి వచ్చి భూమి చుట్టూ తిరిగిన ఓ తోకచుక్క శాస్త్రవేత్తలను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తోంది. ఈ ఘటన గత నెల 18వ తేదీన చోటు చేసుకుంది. ఆ తర్వాత వారం రోజుల్లో మరో 34 సార్లు అలా మన సౌర కుటుంబంలో తిరుగాడిందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. హవాయిలోని టెలిస్కోప్ ఆ తోకచుక్కను గుర్తించినట్లు చెప్పారు. దానికి తోకచుక్క సీ/2017 అని పేరు పెట్టినట్లు వెల్లడించారు. ఇలా ఓ తోకచుక్క ఇతర సౌర వ్యవస్థ నుంచి మన సౌర వ్యవస్థలోకి రావడం ఇదే తొలిసారని సైంటిస్టులు చెప్పారు. ఈ తోకచుక్కకు సంబంధించిన విషయాలను ‘ఇంటర్నేషనల్ యూనియన్స్ మైనర్ ప్లానెట్ సెంటర్’ ప్రచురించింది. ఇలాంటి సంఘటనల వల్ల ఇప్పటికిప్పుడు వచ్చే ప్రమాదాలేవీ లేవని అభిప్రాయపడింది. వేరే నక్షత్ర మండలం నుంచి వచ్చిన తోకచుక్క అని కొందరు అభిప్రాయపడుతున్నా.. మరికొందరు మాత్రం అది తోకచుక్క కాదని.. ఏలియన్ కావొచ్చని భావిస్తున్నారని చెప్పింది. వేరే నక్షత్ర విను వీధుల నుంచి వచ్చిన ఈ తోకచుక్క మధ్యలో జుపిటర్, మార్స్ల మీదుగా ప్రయాణించి ఉండొచ్చని యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లారిడాకు చెందిన ప్లానెటరీ సైంటిస్ట్ డా. మారియా వొమాక్ తెలిపారు. -
రుణాల పేరుతో టోకరా
వాళ్లంతా రైతులు, గొర్రెల కాపరులు... వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్నారు కొందరు దళారులు... వడ్డీలేకుండా రుణాలు, తక్కువ ధరకు ప్లాట్లు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పారు. ఇందుకు రుణాన్ని బట్టి మొదట రూ.5వేల నుంచి రూ.20 వేల వరకు వసూలు చేశారు. ఇలా 800 మంది నుంచి డబ్బులు గుంజి చివరకు బురిడీ కొట్టించారు. ఇదీ.. ఎన్డీడీబీ పేరుతో జరిగిన మోసాల పరంపర.. చిలుకూరు, న్యూస్‌లైన్: ఎన్డీడీబీ (నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు) పేరుతో జిల్లాలో వెలుగుచూసిన అక్రమాల తంతు కొనసాగుతోంది. రోజుకో కొత్తమోసం బయటపడుతోంది. ఇటీవల కేవలం గేదెల రుణాల పేరుతో మాత్రమే అక్రమాలు జరిగినట్లుగా బయటపడగా ఇప్పుడు కొత్తగా గొర్రెల కాపరులకు రుణాలు ఇస్తామని, పట్టణాల్లో ప్లాట్స్ తక్కువ రేటుకు ఇప్పిస్తామని, సోలార్ సిస్టమ్స్‌కు తమ బ్యాంక్ ద్వారా రుణాలు ఇస్తామని చెప్పి భారీగా దండుకున్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీలకు మినీ లోన్లు ఇస్తామని చెప్పి వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేశారు. ప్రధానంగా ఈ వ్యవహారం అంతా నల్లగొండ, సూర్యాపేట, కోదాడ, నకిరేకల్, మిర్యాలగూడెం, చిట్యాల, చౌటుప్పల్ ప్రాంతాల్లో జరిగింది. ఆయా ప్రాంతాల్లో సుమారు 800మంది రైతుల దగ్గర సుమారు రూ.70 లక్షలకు పైగా వసూలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇటీవల కాలం వరకు అందుబాటులో ఉన్న దళారులు ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు తెలిసింది. ఎన్డీడీబీ పేరుతో చేసిన నిర్వాకమిదీ.. కరువు రైతులను ఆదుకుంటామని, వడ్డీ లేకుండా రూ.50వేల నుంచి రూ.3లక్షల వరకు గేదెలకు, గొర్రెలకు రుణాలు ఇస్తామని కొంత మంది దళారులు నమ్మబలికారు. ఇందుకు ముందస్తుగా రూ.5వేలు చెల్లించాలని రైతుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేశారు. ఎన్డీడీబీ పేరుతో నల్లగొండ, సూర్యాపేట, నకిరేకల్, కోదాడ, మిర్యాల గూడ, చౌటుప్పల్, చిట్యాల పట్టణాలను అడ్డాగా చేసుకుని చుట్టుపక్కల గ్రామాల్లో కొంతమందిని ఏజెంట్లుకు నియమించుకున్నారు. ఇటు రైతులను, అటు ఏజెంట్లను నమ్మిం చేందుకు సూర్యాపేటలో కొంత మంది రైతులకు రుణాలు ఇప్పించామని ఏవో కొన్ని పేపర్లు చూయించారు. రుణాలు కూడా వడ్డీ లేకుండా ఇప్పిస్తామని, అయితే ముందుగా రూ.5వేలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని చెప్పారు. ప్రభుత్వ పాలకేంద్రాల ద్వారా వీరు రావడంతో రైతులు కూడా నమ్మి డబ్బులు కట్టారు. వసూలు చేశారిలా.. గేదెల రుణాలు ఇప్పిస్తామని ఒక్కో రైతు వద్ద నుంచి రూ.5వేలు, గొర్రెల రుణాల కోసం గొర్రెల కాపర్ల సంఘాల నుంచి ఒక్కో కాపరి వద్ద నుంచి రూ.3వేలు వసూలు చేశారు. పట్టణాల్లో డిమాండ్ ఉన్న ప్రదేశాల్లో ప్లాట్లు ఇప్పిస్తామని వారి అవకాశాన్ని బట్టి రూ.20వేలు తీసుకున్నారు. అలాగే తమ బ్యాంక్ ద్వారా సోలార్ సిస్టమ్స్ ఇప్పిస్తామని ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.10 వేలు వసూలు చేశారు. వీటితోపాటు ఎస్సీ, ఎస్టీలకు పూర్తి సబ్సిడీ అని ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.3 వేల చొప్పున తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 800 మందికి పైగా బాధితులు జిల్లావ్యాప్తంగా ఎన్డీడీబీ బాధితులు సుమారు 800 మందికిపైగానే ఉన్నారు. ప్రధానంగా గేదెల రుణాల పేరుతో కోదాడ ప్రాంతంలో చిలుకూరు, రెడ్లకుంట, నారాయణపురం గ్రామాల్లో 185 మంది రైతులు, హుజూర్నగర్ పరిధి కట్టవారిగూడెంలో 15 మంది రైతుల వద్ద నుంచి రూ.5 వేల చొప్పున వసూలు చేశారు. అదే విధంగా కోదాడ రూరల్ పరిధిలోని తమ్మరలో ఒక రైతు వద్దనే రూ.30 లక్షల రుణం ఇస్తామని చెప్పి రూ.3 లక్షలు వసూలు చేశారు. మిర్యాలగూడెం పరిధిలో గోగులగూడెం గ్రామంలో 100 మంది రైతులు వద్ద నుంచి రూ.5 వేల చొప్పున తీసుకున్నారు. నల్లగొండ పరిధిలోని తుర్కపల్లి గ్రామంలో 60 మంది రైతుల వద్ద డబ్బులు వసూలు చేసినట్టు తెలిసింది. చౌటప్పల్ పరిధిలోని కొన్ని గ్రామాల్లో సబ్సిడీపై సోలార్ ఇన్వర్టర్లు ఇప్పిస్తామని చెప్పి ఒక్కొక్కరి వద్ద నుంచి 10 వేలు చొప్పున 10 మంది వద్ద డబ్బులు వసూలు చేశారు. ఇలా మరికొన్ని గ్రామాల్లో డబ్బులు అందినకాడికి పిండుకున్నారు. ఇలా సుమారు రూ.70 లక్షల వరకు వసూలు చేసినట్టు తెలిసింది. రైతులు చెల్లించిన డబ్బులకు ఎన్డీడీబీ పేరుతో రశీదు కూడా ఇచ్చారు. దీంతో రైతులు కూడా ఎటువంటి అనుమానమూ రాలేదు. చెల్లని చెక్కులు ఇచ్చిన వైనం.. డబ్బులు చెల్లించి ఆరు నుంచి ఏడు నెలలు కావడంతో రైతులు అ పాల కేంద్రాల చైర్మన్లను, ఏజెంట్లను నిలదీయడంతో వారు ఎన్డీడీబీ అధికారులకు తెలియజేశారు. దీంతో మరోమారు రైతులను నమ్మించేందుకు ఇటీవల చిలుకూరులో మొదటి రూ.5 వేలు చెల్లించిన రైతులకు ఒక్కొక్కరికి రూ.50 వేలు చొప్పున రుణాలు ఇస్తున్నామని వారందరికి కలిపి చైర్మన్‌కు రూ.35లక్షల చెక్కు ఇచ్చారు. అ చెక్కును కూడా కంపెనీ పేరుతో యాక్సీస్ బ్యాంక్ది ఇచ్చారు. దీంతో సంఘం చైర్మన్ బ్యాంక్‌కు వెళ్లగా అ బ్యాంక్‌లో అకౌంట్ ఉన్నమాట వాస్తవమే కానీ, డబ్బులు లేవని చెప్పడంతో కంగుతిన్నాడు. తీరా ఆరాతీస్తే అక్రమాల డొంక కదిలింది. ఇదే విధంగా అన్ని చోట్ల చెల్లని చెక్కులు ఇచ్చినట్టు తెలిసింది. పరారీలో దళారులు రైతులు డబ్బులు చెల్లించి నెలలు గడవడం, ఇచ్చిన చెక్కులు చెల్లకపోవడంతో ఆయా ప్రాంతాల రైతులు హైదరాబాద్‌లోని వనస్థలిపురం వద్ద ఉన్న వీరి కార్యాలయానికి వెళ్లి సిబ్బందిని నిలదీశారు. కొన్ని రోజుల క్రితం వరకు త్వరలో ఇస్తామని చెప్పినట్టు పలువురు రైతులు తెలిపారు. ఇటీవల ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో తాము మళ్లీ కార్యాలయానికి వెళ్తే ఎవరూ లేరని వాపోయారు. అందరూ పరారీలో ఉన్నట్టు తెలిపారు. ఇప్పటికైనా ఈ విషయమై పోలీసులు స్పందించి దళారులను అరెస్టు చేసి తమకు న్యాయం చేయాలని పలువురు రైతులు కోరుతున్నారు. రూ.5వేలు చెల్లించాను గేదెలకు వడ్డీ లేకుండా రూ.50 వేల రుణం ఇస్తామని చెప్పడంతో చిలుకూరు చెన్నకేశవ పాల సంఘం ఆధ్వర్యంలో ఎన్డీడీబీ వారికి రూ.5వేలు చెల్లించాను. అందుకు రశీదు కూడ ఇచ్చారు. కానీ రుణం ఎప్పుడు ఇచ్చేది చెప్పలేదు. నాతో పాటుగా గ్రామంలో చాలా మంది డబ్బులు చెల్లించారు. ఇటీవల డబ్బులు వచ్చాయని, అందుకు సంబంధించి చెక్కు కూడ ఇచ్చారని తెలిపారు. అ తరువాత అ చెక్కు చెల్లలేదని చెప్పారు. రూ.5 వేలు చెల్లించి దాదాపుగా ఆరు నెలలు అవుతుంది. నేటి వరకు ఎలాంటి రుణాలూ రాలేదు. - పూల వాసు, చిలుకూరు