వాళ్లంతా రైతులు, గొర్రెల కాపరులు... వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్నారు కొందరు దళారులు... వడ్డీలేకుండా రుణాలు, తక్కువ ధరకు ప్లాట్లు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పారు. ఇందుకు రుణాన్ని బట్టి మొదట రూ.5వేల నుంచి రూ.20 వేల వరకు వసూలు చేశారు. ఇలా 800 మంది నుంచి డబ్బులు గుంజి చివరకు బురిడీ కొట్టించారు. ఇదీ.. ఎన్‌డీడీబీ పేరుతో జరిగిన మోసాల పరంపర..
చిలుకూరు, న్యూస్‌లైన్: ఎన్‌డీడీబీ (నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు) పేరుతో జిల్లాలో వెలుగుచూసిన అక్రమాల తంతు కొనసాగుతోంది. రోజుకో కొత్తమోసం బయటపడుతోంది. ఇటీవల కేవలం గేదెల రుణాల పేరుతో మాత్రమే అక్రమాలు జరిగినట్లుగా బయటపడగా ఇప్పుడు కొత్తగా గొర్రెల కాపరులకు రుణాలు ఇస్తామని, పట్టణాల్లో ప్లాట్స్ తక్కువ రేటుకు ఇప్పిస్తామని, సోలార్ సిస్టమ్స్‌కు తమ బ్యాంక్ ద్వారా రుణాలు ఇస్తామని చెప్పి భారీగా దండుకున్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీలకు మినీ లోన్లు ఇస్తామని చెప్పి వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేశారు. ప్రధానంగా ఈ వ్యవహారం అంతా నల్లగొండ, సూర్యాపేట, కోదాడ, నకిరేకల్, మిర్యాలగూడెం, చిట్యాల, చౌటుప్పల్ ప్రాంతాల్లో జరిగింది. ఆయా ప్రాంతాల్లో సుమారు 800మంది రైతుల దగ్గర సుమారు రూ.70 లక్షలకు పైగా వసూలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇటీవల కాలం వరకు అందుబాటులో ఉన్న దళారులు ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు తెలిసింది.
ఎన్‌డీడీబీ పేరుతో చేసిన నిర్వాకమిదీ..
కరువు రైతులను ఆదుకుంటామని, వడ్డీ లేకుండా రూ.50వేల నుంచి రూ.3లక్షల వరకు గేదెలకు, గొర్రెలకు రుణాలు ఇస్తామని కొంత మంది దళారులు నమ్మబలికారు. ఇందుకు ముందస్తుగా రూ.5వేలు చెల్లించాలని రైతుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేశారు. ఎన్‌డీడీబీ పేరుతో నల్లగొండ, సూర్యాపేట, నకిరేకల్, కోదాడ, మిర్యాల గూడ, చౌటుప్పల్, చిట్యాల పట్టణాలను అడ్డాగా చేసుకుని చుట్టుపక్కల గ్రామాల్లో కొంతమందిని ఏజెంట్లుకు నియమించుకున్నారు. ఇటు రైతులను, అటు ఏజెంట్లను నమ్మిం చేందుకు సూర్యాపేటలో కొంత మంది రైతులకు రుణాలు ఇప్పించామని ఏవో కొన్ని పేపర్లు చూయించారు. రుణాలు కూడా వడ్డీ లేకుండా ఇప్పిస్తామని, అయితే ముందుగా రూ.5వేలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని చెప్పారు. ప్రభుత్వ పాలకేంద్రాల ద్వారా వీరు రావడంతో రైతులు కూడా నమ్మి డబ్బులు కట్టారు.
వసూలు చేశారిలా..
గేదెల రుణాలు ఇప్పిస్తామని ఒక్కో రైతు వద్ద నుంచి రూ.5వేలు, గొర్రెల రుణాల కోసం గొర్రెల కాపర్ల సంఘాల నుంచి ఒక్కో కాపరి వద్ద నుంచి రూ.3వేలు వసూలు చేశారు. పట్టణాల్లో డిమాండ్ ఉన్న ప్రదేశాల్లో ప్లాట్లు ఇప్పిస్తామని వారి అవకాశాన్ని బట్టి రూ.20వేలు తీసుకున్నారు. అలాగే తమ బ్యాంక్ ద్వారా సోలార్ సిస్టమ్స్ ఇప్పిస్తామని ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.10 వేలు వసూలు చేశారు. వీటితోపాటు ఎస్సీ, ఎస్టీలకు పూర్తి సబ్సిడీ అని ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.3 వేల చొప్పున తీసుకున్నారు.
జిల్లా వ్యాప్తంగా 800 మందికి పైగా బాధితులు
జిల్లావ్యాప్తంగా ఎన్‌డీడీబీ బాధితులు సుమారు 800 మందికిపైగానే ఉన్నారు. ప్రధానంగా గేదెల రుణాల పేరుతో కోదాడ ప్రాంతంలో చిలుకూరు, రెడ్లకుంట, నారాయణపురం గ్రామాల్లో 185 మంది రైతులు, హుజూర్‌నగర్ పరిధి కట్టవారిగూడెంలో 15 మంది రైతుల వద్ద నుంచి రూ.5 వేల చొప్పున వసూలు చేశారు. అదే విధంగా కోదాడ రూరల్ పరిధిలోని తమ్మరలో ఒక రైతు వద్దనే రూ.30 లక్షల రుణం ఇస్తామని చెప్పి రూ.3 లక్షలు వసూలు చేశారు. మిర్యాలగూడెం పరిధిలో గోగులగూడెం గ్రామంలో 100 మంది రైతులు వద్ద నుంచి రూ.5 వేల చొప్పున తీసుకున్నారు. నల్లగొండ పరిధిలోని తుర్కపల్లి గ్రామంలో 60 మంది రైతుల వద్ద డబ్బులు వసూలు చేసినట్టు తెలిసింది. చౌటప్పల్ పరిధిలోని కొన్ని గ్రామాల్లో సబ్సిడీపై సోలార్ ఇన్వర్టర్లు ఇప్పిస్తామని చెప్పి ఒక్కొక్కరి వద్ద నుంచి 10 వేలు చొప్పున 10 మంది వద్ద డబ్బులు వసూలు చేశారు. ఇలా మరికొన్ని గ్రామాల్లో డబ్బులు అందినకాడికి పిండుకున్నారు. ఇలా సుమారు రూ.70 లక్షల వరకు వసూలు చేసినట్టు తెలిసింది. రైతులు చెల్లించిన డబ్బులకు ఎన్‌డీడీబీ పేరుతో రశీదు కూడా ఇచ్చారు. దీంతో రైతులు కూడా ఎటువంటి అనుమానమూ రాలేదు.
చెల్లని చెక్కులు ఇచ్చిన వైనం..
డబ్బులు చెల్లించి ఆరు నుంచి ఏడు నెలలు కావడంతో రైతులు అ పాల కేంద్రాల చైర్మన్లను, ఏజెంట్లను నిలదీయడంతో వారు ఎన్‌డీడీబీ అధికారులకు తెలియజేశారు. దీంతో మరోమారు రైతులను నమ్మించేందుకు ఇటీవల చిలుకూరులో మొదటి రూ.5 వేలు చెల్లించిన రైతులకు ఒక్కొక్కరికి రూ.50 వేలు చొప్పున రుణాలు ఇస్తున్నామని వారందరికి కలిపి చైర్మన్‌కు రూ.35లక్షల చెక్కు ఇచ్చారు. అ చెక్కును కూడా కంపెనీ పేరుతో యాక్సీస్ బ్యాంక్‌ది ఇచ్చారు. దీంతో సంఘం చైర్మన్ బ్యాంక్‌కు వెళ్లగా అ బ్యాంక్‌లో అకౌంట్ ఉన్నమాట వాస్తవమే కానీ, డబ్బులు లేవని చెప్పడంతో కంగుతిన్నాడు. తీరా ఆరాతీస్తే అక్రమాల డొంక కదిలింది. ఇదే విధంగా అన్ని చోట్ల చెల్లని చెక్కులు ఇచ్చినట్టు తెలిసింది.
పరారీలో దళారులు
రైతులు డబ్బులు చెల్లించి నెలలు గడవడం, ఇచ్చిన చెక్కులు చెల్లకపోవడంతో ఆయా ప్రాంతాల రైతులు హైదరాబాద్‌లోని వనస్థలిపురం వద్ద ఉన్న వీరి కార్యాలయానికి వెళ్లి సిబ్బందిని నిలదీశారు. కొన్ని రోజుల క్రితం వరకు త్వరలో ఇస్తామని చెప్పినట్టు పలువురు రైతులు తెలిపారు. ఇటీవల ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో తాము మళ్లీ కార్యాలయానికి వెళ్తే ఎవరూ లేరని వాపోయారు. అందరూ పరారీలో ఉన్నట్టు తెలిపారు. ఇప్పటికైనా ఈ విషయమై పోలీసులు స్పందించి దళారులను అరెస్టు చేసి తమకు న్యాయం చేయాలని పలువురు రైతులు కోరుతున్నారు.
రూ.5వేలు చెల్లించాను
గేదెలకు వడ్డీ లేకుండా రూ.50 వేల రుణం ఇస్తామని చెప్పడంతో చిలుకూరు చెన్నకేశవ పాల సంఘం ఆధ్వర్యంలో ఎన్‌డీడీబీ వారికి రూ.5వేలు చెల్లించాను. అందుకు రశీదు కూడ ఇచ్చారు. కానీ రుణం ఎప్పుడు ఇచ్చేది చెప్పలేదు. నాతో పాటుగా గ్రామంలో చాలా మంది డబ్బులు చెల్లించారు. ఇటీవల డబ్బులు వచ్చాయని, అందుకు సంబంధించి చెక్కు కూడ ఇచ్చారని తెలిపారు. అ తరువాత అ చెక్కు చెల్లలేదని చెప్పారు. రూ.5 వేలు చెల్లించి దాదాపుగా ఆరు నెలలు అవుతుంది. నేటి వరకు ఎలాంటి రుణాలూ రాలేదు.
- పూల వాసు, చిలుకూరు
రుణాల పేరుతో టోకరా
Published Mon, Sep 23 2013 3:49 AM | Last Updated on Fri, Sep 1 2017 10:57 PM