ఆయిల్‌ ఫెడ్‌కు బీచుపల్లి ఫ్యాక్టరీ  | Agreement to pay Rs 8 Crore to NDDB | Sakshi
Sakshi News home page

ఆయిల్‌ ఫెడ్‌కు బీచుపల్లి ఫ్యాక్టరీ 

Published Thu, May 16 2019 1:39 AM | Last Updated on Thu, May 16 2019 1:39 AM

Agreement to pay Rs 8 Crore to NDDB - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉమ్మడి ఏపీలో తాళం పడిన గద్వాల జిల్లా బీచుపల్లి ఆయిల్‌ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు వేగంగా అడుగులు పడుతున్నాయి. దీనికోసం తెలంగాణ ఆయిల్‌ఫెడ్‌ జాతీయ పాడి అభివృద్ధి మండలి (ఎన్‌డీడీబీ)తో వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ చేసుకుంది. ఆయిల్‌ఫెడ్‌ రూ.8 కోట్లు చెల్లించి స్వాధీ నం చేసుకోవాల్సి ఉండగా, ఇందులో రూ.2.11 కోట్లు బుధవారం ఆన్‌లైన్‌ పేమెంట్‌ ద్వారా చెల్లించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అలాగే రూ.3 కోట్లు చెక్కుల రూపంలో చెల్లించారు. ఇంకా మిగిలిన మొత్తాన్ని మూడు నెలల్లో చెల్లించేందుకు ఎన్‌డీడీబీతో ఆయిల్‌ఫెడ్‌ అవగాహన కుదుర్చుకుంది.

వాస్తవానికి 2011లో ఈ బీచుపల్లి మిల్లు స్థలం, బిల్డింగ్స్, ప్లాంట్, ఇతర మిషనరీ విలువ రూ.2.37 కోట్లుగా ఉందని, ఇప్పుడు రూ.8 కోట్లకు సెటిల్‌మెంట్‌ చేసుకోవడంపై మతలబు ఏముందని టీఎస్‌ ఆయిల్‌ఫెడ్‌ రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ప్రశ్నించింది. అలాగే బీచుపల్లి ఫ్యాక్టరీ ఉమ్మడి ఆస్తిగా ఉంది. మొదట్లో ఏర్పాటు చేసిన నాడే ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందినదిగా నెలకొల్పారు. అయితే రాష్ట్రం విడిపోయిన తరువాత దాని విభజన జరగలేదు. విభజన జరగకుండానే ఎన్‌డీడీబీకి అప్పులు చెల్లించడం ద్వారా భవిష్యత్‌లో న్యాయపరమైన చిక్కులు వస్తాయని పలువురు పేర్కొంటున్నారు.  

2003లో మూసివేత.. 
వేరుశనగ నుంచి నూనె తీసి విజయవర్ధనే ఆయిల్‌ ప్యాకెట్లతో పేరుగాంచిన ఈ మిల్లును 2003లో అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మూసివేశారు. ఈ మిల్లును నమ్ముకుని పంటలు సాగు చేసిన రైతులు ఎంతోకాలం ఆందోళన చేశారు. ఎన్‌డీడీబీ ఆర్థిక సహకారంతో నిర్మించారు. ఈ ఫ్యాక్టరీని అప్పట్లోనే రూ.11.26 కోట్లతో నిర్మించారు. 2003లో మూతపడినా ఎన్‌డీడీబీ నుంచి తీసుకున్న అప్పును పూర్తిస్థాయిలో చెల్లించలేదు. దీంతో ఇప్పుడు దీనిని తెరవాలని, అప్పును చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఫ్యాక్టరీని పునరుద్ధరించిన తరువాత మళ్లీ వేరుశనగ నూనెతోపాటు పామాయిల్‌ సహా ఇతరత్రా నూనెలను కూడా ఉత్పత్తి చేస్తామని ఆయిల్‌ఫెడ్‌ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అక్కడ పాత ఫ్యాక్టరీ యంత్రాలు బాగానే ఉన్నాయని, మరో రూ.కోటిన్నర ఖర్చు చేస్తే ఫ్యాక్టరీ పూర్తి స్థాయిలో నడుస్తుదని అంటున్నారు. ఇందుకోసం కొందరు ఉద్యోగులను కూడా తీసుకోనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement