నిరుపేదకు నీడ కోసం..  | Funds Provided For Accommodation For Home Places | Sakshi
Sakshi News home page

నిరుపేదకు నీడ కోసం.. 

Published Mon, Dec 30 2019 8:58 AM | Last Updated on Mon, Dec 30 2019 9:03 AM

Funds Provided For Accommodation For Home Places - Sakshi

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: నిరుపేదకు నీడ కల్పించాలని వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం శతథా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఏర్పాట్లను కూడా శరవేగంగా చేస్తోంది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీ సుకున్నప్పటి నుంచి పేదల సంక్షేమం కోసం వరుసగా పథకాలు తీసుకువస్తున్నారు. ఇదే క్రమంలో నిరుపేదలకు ఇళ్ల పట్టాలను రిజిస్ట్రేషన్‌ చేసి ఇచ్చేందుకు కూడా రూపకల్పన చేశారు. ఈ పట్టాలను రానున్న ఉగాది నాటికి కుటుంబంలో మహిళ పేరిట అందజేసేందుకు చర్యలు చేపట్టారు. ఎలాంటి పరిమితి లేకుండా అర్హులందరికీ సంతృప్త స్థాయి లో ఇళ్ల పట్టాలను మంజూరు చేసేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. ఈ క్రమంలో ఇప్పటికే జిల్లాలో 56 వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలను మంజూరు చేసేందుకు జాబితాలను సిద్ధం చేశారు. వీరందరికీ తెలుగు నూతన సంవత్సరం సందర్భంగా ఉగాదికి పట్టాలు అందజేయనున్నారు. వీరి కోసం ఎక్కువగా ప్రభుత్వ స్థలాలను గుర్తించారు. ప్రభుత్వ స్థలాలు అందుబాటులో లేని చోట్ల కొనుగోలు చేసేందుకు కూడా భూములు గుర్తించారు. ఈ కొనుగోలు ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. అర్హులకు ఇళ్లు ఇచ్చే ప్రక్రియ ఐదేళ్లూ కొనసాగుతుంది. ఈ ఐదేళ్లలో  సొంతిల్లు లేని వారు ఉండకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది.

నిధులు రెడీ.. 
పేదల ఇళ్ల పట్టాలకు ఇళ్ల స్థలాల సేకరణ దాదాపు పూర్తయ్యింది. ప్రభుత్వ స్థలాల గుర్తింపుతో పాటు ఆ స్థలాలు అందుబాటులో లేని గ్రామాల్లో రైతుల వద్ద నుంచి అనువైన ఇళ్ల స్థలాలను కొనుగోలు చేసేందుకు కూడా సర్కారు చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో గుర్తించిన ప్రభుత్వ స్థలాలను సేకరించి ఆ స్థలాలను చదును చేయడం, కాలువలు, రోడ్లను కల్పించడం, లే ఔట్‌గా తయారు చేసేందుకు సన్నాహాలు చురుగ్గా సాగుతున్నాయి. వీటికి గాను మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హా మీ పథకంలో మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిధులు సమకూర్చారు. ఇప్పటికే అవసరమైన నిధులు అంచనాలు వేయడం ద్వారా పనులు ప్రారంభమైన ప్రాంతాలకు నిధుల మంజూరుకు పరిపాలనా ఆమోదం కూడా పూర్తయింది. జిల్లాలో పేదల ఇళ్ల కోసం ప్రభుత్వ స్థలాలు 891.84 ఎకరాలను గుర్తించారు. ఈ భూములు 810 నివాస ప్రాంతాల్లో ఉన్నాయి. వీటిని బాగు చేసేందుకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు రూ.74.54 కోట్లతో అంచనాలను సిద్ధం చేశారు. జిల్లాలో 38 మండలాల్లో ఈ స్థలాలను లే ఔట్‌లు వేయడం, ఆ స్థలంలో ఉపాధి హామీ నిధులతో చదును చేయడం వంటివి చేస్తారు. తొలివిడతలో జిల్లాలో 301 లే ఔట్‌లలో(ప్రాంతాల్లో) 357.63 ఎకరాల్లో చదును చేయడానికి గాను రూ.24.95 కోట్లకు పరిపాలన ఆమోదం పొంది పనులు చేసేందుకు అనుమతులు ఇచ్చారు. ఈ పనులు ఇప్పుడిప్పుడే జిల్లాలో ప్రారంభమవుతున్నాయి.  

పనులు ప్రారంభించాం 
పేదల ఇళ్ల పట్టాలకు సంబంధించి ప్రభుత్వ భూములు చదును చేసేందుకు నిధులు కేటాయించడం జరిగింది. అంచనాగా రూ.74.54 కోట్లు వేశాం. ఇప్పటికే పరిపాలనా ఆమోదం సుమారుగా రూ.25 కోట్లకు ఇచ్చారు. ఉపాధి హామీ పనుల నిధులతో ఇప్పటికే ఎచ్చెర్ల తదితర మండలాల్లో చదును చేసే కార్యక్రమం ప్రారంభమైంది. జనవరి 3వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా అన్ని పరిపాలన ఆమోదం పొందిన భూముల్లో చదును చేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ఫిబ్రవరి చివరి నాటికి నిర్దేశించిన అన్ని స్థలాలను చదును చేసేందుకు పూర్తిస్థాయి చర్యలు తీసుకుంటాం.
– హెచ్‌.కూర్మారావు, డ్వామా పీడీ

  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement