NREGS
-
నేనూ కూలీ బిడ్డనే: ఎమ్మెల్యే బాబూరావు
కోటవురట్ల: నేనూ కూలీ బిడ్డనే..కష్టమంటే ఏమిటో నాకు బాగా తెలుసు..కష్టపడి చదివా..మంచి ఉద్యోగం చేశా..ఉన్నతాధికారిగా ఊరూరూ తిరిగా..మీ సమస్యలు నాకు తెలుసు..మీ బిడ్డలకు మంచి భవిష్యత్ ఇవ్వాలంటే బాగా చదివించండి.. అంటూ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ఉపాధి హామీ పథకం వేతనదారులను పలకరించారు. మండలంలోని నీలిగుంట, జి.సన్యాసిరాజుపాలెం గ్రామాల్లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మార్గంమధ్యలో టి.జగ్గంపేటలో ఉపాధి పనులు చేస్తున్న వేతనదారులతో మాట్లాడారు. వారితో చేయి కలిపి పలుగూ పారా చేత బట్టారు. గునపంతో మట్టి తవ్వి వారి సమస్యలు తెలుసుకుంటూ పరిష్కారానికి వెనువెంటనే అధికారులకు ఆదేశాలిచ్చారు. పిల్లల భవిష్యత్‌పై దృష్టి సారించాలని విద్యతోనే ఉన్నతమైన జీవితం వస్తుందని వారికి హితబోధ చేశారు. పిల్లలను కూలీలుగా మార్చొద్దని, వారిని బడికి పంపి మంచి జీవితాన్ని ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పిల్లల బంగారు భవితకు నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను సమూలంగా అభివృద్ధి చేసిందన్నారు. చదవండి: (రక్తపింజర పామును మింగేసిన నాగుపాము) -
ఏపీలోని రహదారులపై 466 బ్లాక్ స్పాట్స్: నితిన్ గడ్కరీ
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ నుంచి అందిన సమాచారం ప్రకారం 2016-2018 మధ్య రాష్ట్రంలోని జాతీయ రహదారులపై 466 ప్రమాదకరమైన స్థలాలు (బ్లాక్ స్పాట్స్) గర్తించినట్లు రాజ్యసభలో బుధవారం రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. జాతీయ రహదారులపై బ్లాక్ స్పాట్లను నిర్ధారించేందుకు తమ మంత్రిత్వ శాఖ ఒక ప్రోటోకాల్‌ను రూపొందించిందని మంత్రి తెలిపారు. జాతీయ రహదారిపై 500 మీటర్ల భాగంలో మూడేళ్లలో ఐదు రోడ్డు ప్రమాదాలు జరిగినా లేదా ఈ ప్రమాదాలలో 10 మంది మరణించినా ఆ ప్రాంతాన్ని బ్లాక్ స్పాట్‌గా గుర్తిస్తారు. ఆ విధంగా గుర్తించిన బ్లాక్ స్పాట్లను సరిదిద్దేందుకు తాత్కాలిక చర్యలతోపాటు శాశ్వత చర్యలు చేపట్టడం జరుగుతుందని చెప్పారు. జాతీయ రహదారులపై తరచుగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించడానికి ముందుగానే వాటిని నిర్మూలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సంబంధిత ఉన్నతాధికారులందరికీ తమ మంత్రిత్వ శాఖ గత ఏడాది సెప్టెంబర్‌లో లేఖ రాసినట్లు తెలిపారు. జాతీయ రహదారులు అభివృద్ధి చేయడానికి ముందుగానే రోడ్డు సేఫ్టీపై ఆడిట్ నిర్వహించి ఆయా నివేదికలను జాతీయ రహదారుల నిర్మాణంలో పాలుపంచుకునే సంస్థలతో పంచుకోవడం జరుగుతుందని అన్నారు. కొత్తగా చేపట్టబోయే రోడ్డు ప్రాజెక్ట్‌లు ఏవైనా ముందుగా రోడ్డు సేఫ్టీ ఆడిట్ పూర్తయిన తర్వాతే నిర్మాణం ప్రారంభించాలని కూడా మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో గుర్తించిన బ్లాక్ స్పాట్లలో దాదాపు 80 శాతం వరకు శాశ్వత ప్రాతిపదికన సరిదిద్దినట్లు మంత్రి వెల్లడించారు. ఉపాధి పథకం కింద కాఫీ ప్లాంటేషన్ అనుమతించం న్యూఢిల్లీ: మహత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కాఫీ ప్లాంటేషన్ కార్యకలాపాలను అనుమతించబోమని గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి రాజ్యసభలో స్పష్టం చేశారు. విశాఖపట్నంలోని పాడేరు ప్రాంతంలో నిరుపేద గిరిజన రైతుల ప్రయోజనం కోసం ఉపాధి హామీ పథకం కింద కాఫీ ప్లాంటేషన్ అభివృద్ధికి ప్రభుత్వం అనుమతిస్తుందా అని వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబుగా మంత్రి ఈ విషయం చెప్పారు. ఉపాధి హామీ పథకం అనేది డిమాండ్‌ను బట్టి ఉపాధి కల్పించే కార్యక్రమం. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల పేదలకు జీవనోపాధి భద్రత కల్పించాలన్నది ఉద్దేశం. ఈ పథకం కింద ప్రతి ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ పేదలకు వంద రోజులపాటు వేతనంతో కూడిన ఉపాధికి హామీ ఇవ్వడం జరుగుతుందని మంత్రి చెప్పారు. ఉపాధి హామీ పథకం కింద తమ సొంత భూమిలో వ్యక్తిగత ఆస్తులు సృష్టించుకోవడానికి ప్రభుత్వం అనుమతిస్తుంది. అందులో భాగంగా భూమి అభివృద్ధి పనులు, సాగు చెరువుల తవ్వకం, వ్యవసాయ బావుల తవ్వకం, ఉద్యానవన పంటలకు అవసరమైన మౌలిక వసతుల కల్పన పనులు, కోళ్లు, మేకల షెడ్లు వంటి పనులను చేపట్టవచ్చని మంత్రి తెలిపారు. -
ఫలించిన ముందుచూపు: చేతినిండా.. పని..మనీ!
ప్రభుత్వం, అధికారుల ముందుచూపు ఫలించింది. కరోనా కష్టకాలంలోనూ ఉపాధి హామీ పథకం కింద చేతినిండా పని కల్పించడంతో పేదలకు భరోసా లభించింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎప్పటికప్పుడు కిందిస్థాయి సిబ్బందితో సమీక్షలు నిర్వహించి కూలీలకు అత్యధిక పనిదినాలు కల్పించారు. రికార్డు స్థాయిలో పనులు చేపట్టి లక్ష్యాన్ని అధిగమించారు. రాష్ట్రంలో జిల్లాను రెండో స్థానంలో నిలిపారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రెండేళ్లుగా కరోనా పట్టిపీడిస్తోంది. ఇలాంటి క్లిష్ట సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం ప్రతి ఇంటికి చేదోడు వాదోడుగా నిలిచింది. చేతి నిండా పని కల్పించి.. కడుపు నింపింది. జిల్లాలో లక్షలాది కుటుంబాలకు లబ్ధి చేకూర్చింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలు సత్ఫలితాలిచ్చాయి. పల్లెల్లో వేకువజామునే లేచి తెలతెలవారే సమయంలో వందల సంఖ్యలో కూలీలు పనుల బాట పట్టడమంటే పండుగే మరి. ఐదు నెలల్లోనే లక్ష్యానికి మించి... పేదలకు ఉపాధి కల్పించటడంలో జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిపింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే ఇచ్చిన లక్ష్యాలను అధిగమించింది. ఈ ఏడాదికి 1.95 కోట్ల పనిదినాలు కూలీలకు కల్పించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఐదు నెలల్లోనే లక్ష్యాన్ని దాటేసి 1.97 కోట్ల పనిదినాలు కల్పించారు. రాష్ట్రంలోనే అత్యధిక పనిదినాలు కల్పించిన విజయనగరం జిల్లా తర్వాత ప్రకాశం రెండో స్థానంలో నిలిచింది. జిల్లాలో 6.40 లక్షల కుటుంబాలకు జాబ్ కార్డులను జిల్లా యంత్రాంగం కల్పించింది. ఇప్పటి వరకు మొత్తం వేతనాల రూపంలో రూ. 484 కోట్లు కూలీలకు చెల్లించారు. ఈ పథకం ద్వారా 4.51 లక్షల కుటుంబాల్లోని దాదాపు 7.65 లక్షల మందికి ఉపాధి కల్పించినట్లయింది. అత్యధికంగా యర్రగొండపాలెం మండలంలో... జిల్లాలో ఉపాధి పనులు అత్యధికంగా యర్రగొండపాలెం మండలంలో జరిగాయి. ఈ ఒక్క మండలంలోనే ఈ సంవత్సరంలో కూలీలకు 7,60,279 పనిదినాలు కల్పించారు. యర్రగొండపాలెం మండలం తర్వాతి స్థానంలో పెద్దారవీడు మండలంలో 6,60,093 పనిదినాలు, బేస్తవారిపేట 6,36,217, కొనకనమిట్ల 5,86,579, మార్టూరు 5,84,959, మర్రిపూడి 5,68,653, దోర్నాల 5,67,703, పొన్నలూరు 5,24,938, కొండపి 5,23,484, దర్శి మండలంలో 5,21,033 పనిదినాలు కల్పించారు. మా కుటుంబానికి ఉపాధి పని ఊరటనిచ్చింది కరోనా సమయంలో పనులు లేక ఇబ్బంది పడాల్సి వస్తుందని భయపడ్డాం. ఈ ఏడాది ఉపాధి హామీ పథకం ద్వారా నేను, నా భర్త కలిసి 136 రోజులు పని చేశాం. రోజుకు రూ.145 చొప్పున మొత్తం రూ.19,720 మా బ్యాంకు ఖాతాలో జమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దయవల్ల అమ్మ ఒడి పథకం ద్వారా రూ.14 వేలు, ఆసరా ద్వారా రూ.18,500 నా ఖాతాలో జమయ్యాయి. దీంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా హాయిగా బతుకుతున్నాం. – మమ్ము రమణ, ఉపాధి హామీ కూలీ, యర్రగొండపాలెం కరోనా సమయంలోనూ ఉపాధి కరోనా మహమ్మారి ఒక పక్క వేధిస్తున్నా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పనులకు ఎటువంటి అడ్డంకులు కలగకుండా చూశాం. ఇతర పనులు లేక ఇబ్బంది పడుతున్న పేదలకు ఉపాధి హామీ పథకం ద్వారా చేతినిండా పని కల్పించాం. ఒక్కో కూలీ అకౌంట్లో వారానికి రూ.1,300 నుంచి రూ.1,500 వరకు కూలి డబ్బు పడింది. వేలాది కుటుంబాల్లో 100 రోజుల చొప్పున కూడా ఉపాధి కల్పించాం. దీంతో కూలీలకు ఉపాధి దొరకడమే కాకుండా, గ్రామాల్లో అభివృద్ధి పనులు కూడా వేగం పుంజుకున్నాయి. – కె.శీనారెడ్డి, డ్వామా పీడీ -
మరోసారి బట్టబయలైన రఘురామ, చంద్రబాబు బంధం
సాక్షి, అమరావతి: తమ స్వార్థ రాజకీయాల కోసం పేదల నోటికాడ కూడును సైతం లాగేసే స్థాయికి రాష్ట్రంలోని ప్రతిపక్షాల రాజకీయం దిగజారింది. నిబంధనల ప్రకారం రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు ప్రతిపక్ష నేతలు మోకాలడ్డుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో కొంతకాలంగా సన్నిహితంగా మెలుగుతున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఏకంగా రాష్ట్రానికిచ్చిన నిధులను వెనక్కి తీసుకోవాలంటూ కేంద్ర మంత్రికి లేఖ రాశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బెయిల్‌కు సంబంధించి సీబీఐ కోర్టులో రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ వ్యవహారంలో చంద్రబాబు–రఘురామకృష్ణరాజు మధ్య గల సంబంధాలు ఆధారాలతో సహా ఇటీవల బయటపడిన విషయం తెలిసిందే. పేదలకు ‘ఉపాధి’ని దూరం చేసే కుట్ర ఉపాధి హామీ పథకం కింద మన రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులను వెనక్కి తీసుకోవాలంటూ రఘురామకృష్ణరాజు ఈ ఏడాది మార్చి 16న కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌కు లేఖ రాశారు. దీంతో ఆ లేఖకు సంబంధించి సమగ్ర నివేదిక పంపాలంటూ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అండర్ సెక్రటరీ స్థాయి అధికారి రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌కు లేఖ రాశారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా గత ఏడాది రూ.1,700 కోట్లు బకాయిల రూపంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు రావాల్సి ఉండగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే రూ.3 వేల కోట్లు అందాల్సి ఉంది. ఈ నిధులను రాబట్టేందుకు వైఎస్సార్సీపీ ఎంపీలు ఎప్పటికప్పుడు కేంద్ర మంత్రులను కలిసి నిధులను రప్పించేందుకు ప్రయత్నిస్తుండగా.. రాష్ట్రానికి చెందిన కొందరు ప్రజాప్రతినిధులే ఆ నిధులను వెనక్కి తీసుకోవాలని లేఖలు రాస్తుండటం కేంద్ర ప్రభుత్వ అధికారులకు అలుసుగా మారిందని చెబుతున్నారు. ఇలాంటి లేఖల ద్వారా పేదల కడుపు కొట్టడమే కాకుండా.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అల్లరి పాల్జేయాలని ప్రయత్నించడంపై ప్రజలు ఛీ కొడుతున్నారు. ఈ పరిస్థితుల వల్ల రాష్ట్రానికి ఇవ్వాల్సిన దాదాపు రూ.4,700 కోట్లను విడుదల చేయకుండా కేంద్రం తాత్సారం చేస్తోందని అధికార వర్గాల్లో చర్చ నడుస్తోంది. కరోనా రోజుల్లో 80 లక్షల మందికి లబ్ధి చేకూర్చేలా.. కరోనా మహమ్మారి వేళ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న పనులు పేదలకు ఊరటనిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంతోపాటు ఈ ఏడాది కూడా పట్టణాల్లో చిన్నచిన్న పనులు చేసుకుని జీవించే వారు కరోనా కారణంగా తమ గ్రామాలకు తిరిగి వెళ్లారు. ఇలాంటి పరిస్థితుల్లో పేదలకు ఉపాధి హామీ పథకం పనులే కొండంత ఆసరాగా నిలుస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రంలో 79.80 లక్షల మంది ఉపాధి హామీ పనులు చేసుకుని ఆదాయం పొందగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 72.64 లక్షల మంది పేదలు ఆ పనులు చేసుకుని లబ్ధి పొందారు. రాష్ట్రంలో ప్రస్తుతం వివిధ శాఖల నిధులకు తోడు ఉపాధి హామీ పథకం మెటీరియల్ కేటగిరీ నిధుల అనుసంధానంతో గ్రామీణ ప్రాంతాల్లో 46,861 భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రాతినిధ్యం వహిస్తున్న నరసాపురం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లోనే రూ.311 కోట్ల విలువ చేసే 1,408 భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. కేంద్రానికి రఘురామకృష్ణరాజు రాసిన లేఖ ప్రతులు ‘స్లీపర్ సెల్స్’ ద్వారా మాటువేసి విధ్వంసానికి తెగబడటం ఉగ్రవాద సంస్థలు అనుసరించే పన్నాగం. వ్యవస్థలు, సంస్థల్లో తనవారిని జొప్పించి రాజకీయ లబ్ధికి వాడుకోవడం చంద్రబాబు అనుసరించే వ్యూహం. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీయడానికి.. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడానికి బాబు ప్రస్తుతం ఇదే ఎత్తుగడలను అమలు చేస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఈ విషయాన్ని ఎంపీ రఘురామ కేంద్రానికి రాసిన లేఖ తేటతెల్లం చేస్తోంది. ఓట్లేసిన వారిని కాదని టీడీపీ అవినీతికి మద్దతు రఘురామకృష్ణరాజు ఓట్లు వేసి తనను గెలిపించిన ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టి తన నియోజకవర్గంలో గ్రామాల్లో జరుగుతున్న 1,408 పనులకు సంబంధించి రూ.311 కోట్ల నిధులు రాకుండా కేంద్ర మంత్రికి లేఖ రాయడంపై రాజకీయ, అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. 2019 ఎన్నికలకు 8 నెలల ముందు అప్పటి టీడీపీ సర్కారు నిధులు అందుబాటులో లేకపోయినా ఆ పార్టీ కార్యకర్తలకు రూ.2 వేల కోట్ల విలువ చేసే పనులను మంజూరు చేసి, అవి పూర్తయినట్టు బిల్లులు కూడా సిద్ధం చేసింది. దానిపై తీవ్ర ఆరోపణలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. అప్పట్లో జరిగిన 11,573 పనులను తనిఖీ చేయగా.. 7,326 పనుల్లో అవినీతి జరిగినట్టు నిర్ధారణ అయింది. అందులో దాదాపు సగం పనులు నూటికి నూరు శాతం నాసిరకమైనవిగా తేలింది. టీడీపీ నేతల అవినీతికి మద్దతుగా నిలిచిన రఘురామకృష్ణరాజు వారికి ఈ ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదంటూ ఫిర్యాదు చేస్తూ.. రాష్ట్రానికిచ్చిన నిధులను వెనక్కి తీసుకోవాలని కేంద్ర మంత్రికి రాసిన లేఖలో కోరడాన్ని చూసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. -
‘ఉపాధి’లో ఏపీనే ఫస్ట్
సాక్షి, అమరావతి: ‘ఈ కరోనా కష్టాలలో ప్రభుత్వం దయ చూపించకపోయి ఉంటే మా బతుకులు ఏమి అయి ఉండేవో’ అని ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం నేకునాంబాద్ గ్రామానికి చెందిన మానుకొండ సుబ్బారత్నం (49) అంటున్నాడు. ఇతని కుటుంబం తమకున్న 70 సెంట్ల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ.. అదనంగా ఇంట్లో కుట్టు మిషన్ పెట్టుకొని పని దొరికనప్పుడు టైలరింగ్ చేసుకుంటూ, మిగిలిన రోజులలో కూలి పనులు చేసుకుంటుంది. ఇద్దరు పిల్లలు చదువుకుంటున్నారు. ఆ చిన్నపల్లెటూరిలో మాములు రోజుల్లోనే టైలరింగ్ ద్వారా నెలకు నాలుగు వేల ఆదాయం దాటేది కాదు. కరోనా కాలంలో టైలరింగ్ జరగడమే లేదు. వ్యవసాయ పనులు తగ్గిపోయాయి. ఈ స్థితిలో ప్రభుత్వం కల్పించే ‘ఉపాధి’ పనులే దిక్కు అయ్యాయి. సుబ్బారత్నం భార్య మోకాళ్ల నొప్పులతో కూలీ పనులు చేసే పరిస్థితిలో లేదు. దీంతో అతనొక్కడే ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు 40 రోజుల పాటు పని చేసి, రూ.9,203 సంపాదించుకున్నాడు. దీనికి తోడు రైతు భరోసా పథకం ద్వారా రూ.5,500 అందింది. ఈ గ్రామంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మే 12వ తేదీ నుంచి దాదాపు నెల రోజుల పాటు ప్రభుత్వం కూలీ పనులు కూడా నిలిపివేసింది. మొత్తంగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇప్పుటి వరకు మొత్తం 9 వారాల పాటు ఆ గ్రామంలో ప్రభుత్వం పనులు కల్పించింది. తద్వారా దాదాపు 271 కుటుంబాలు సరాసరిన రూ.8,586 చొప్పున సంపాదించుకున్నాయి. ఈ ఒక్క గ్రామంలోనే ప్రభుత్వం రూ.23.27 లక్షలు కూలీలకు వేతనంగా చెల్లించింది. నెల రోజులుగా నిత్యం 40 లక్షల మందికి పని రాష్ట్రంలో ప్రస్తుతం ప్రతి రోజూ దాదాపు 40 లక్షల మంది కూలీలు ప్రభుత్వం కల్పించే పనులకు హాజరవుతున్నారు. గత నెల రోజులుగా ఇదే సంఖ్యలో కూలీల హాజరు ఉందని అధికార వర్గాలు తెలిపాయి. గత మూడు నెలల్లో గ్రామాల్లో పని కావాలి.. అని అడిగిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం పనులు కల్పించింది. ఇందుకోసం రూ.3,613.35 కోట్లను కూలి రూపంలో చెల్లించింది. కరోనా రెండో విడత విజృంభణతో గత మూడు నెలల్లో పట్టణాలు సహా గ్రామాల్లో చాలా చోట్ల ప్రజలు బయటకు రావాలంటేనే భయపడిపోయారు. అలాంటి పరిస్థితులలో కూలీల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఈ మూడు నెలల్లో మొత్తం 16.7 కోట్ల పనిదినాలు కల్పించింది. తద్వారా 42.43 లక్షల కుటుంబాలు లబ్ధి పొందాయి. అనంతపురం, విజయనగరం, ప్రకాశం వంటి జిల్లాల్లో ప్రతి చోటా కోటిన్నర పనిదినాల పాటు పనులు కల్పించగా.. మరో 7 జిల్లాల్లో కోటికి పైబడి పనిదినాల్లో పనులు కల్పించింది. దేశంలోనే ఫస్ట్.. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ప్రభుత్వ పరంగా కూలీ పనులు కల్పించడంలో దేశంలోనే మన రాష్ట్రం మొదటి స్థానం దక్కించుకుంది. గ్రామీణ పేదలకు ప్రభుత్వ పరంగా పనుల కల్పనలో మన రాష్ట్రం తర్వాత మధ్యప్రదేశ్ రెండో స్థానంలో ఉండగా.. రెండు రాష్ట్రాల మధ్య భారీ వ్యత్యాసమే ఉంది. మన రాష్ట్రం 16.7 కోట్ల పనిదినాలు గత మూడు నెలల కాలంలో కల్పిస్తే.. రెండో స్థానంలో ఉన్న మధ్యప్రదేశ్ ఇదే సమయంలో 11.23 కోట్ల పనిదినాలను మాత్రమే కల్పించింది. కరోనా కారణంగా గ్రామాల్లో పేదల జీవనోపాధికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతి 15 రోజులకొకసారి నిర్వహించే స్పందన సమీక్షలో ప్రత్యేకించి జిల్లా కల్లెక్టర్లతో స్వయంగా సమీక్షిస్తున్నారు. ఇందులో భాగంగా జూన్ ఆఖరు నాటికి 16 కోట్ల పనిదినాలు లక్ష్యంగా నిర్ణయించుకోగా, 16.7 కోట్ల పనిదినాల పాటు పేదలకు పనులు కల్పించడం విశేషం. మూడు నెలలుగా పేదలకు కల్పించిన పనిదినాల సంఖ్య (లక్షల్లో) జిల్లా పనిదినాలు అనంతపురం 196.20 విజయనగరం 185.15 ప్రకాశం 163.30 విశాఖపట్నం 140.23 శ్రీకాకుళం 140.10 పశ్చిమగోదావరి 124.15 తూర్పుగోదావరి 123.03 కృష్ణా 122.36 గుంటూరు 111.18 కర్నూలు 102.45 వైఎస్సార్ 94.49 చిత్తూరు 91.18 నెల్లూరు 63.88 మొత్తం 1,657.7 గత ఎనిమిది రోజులుగా రోజు వారీ పనులకు హాజరవుతున్న కూలీల సంఖ్య (లక్షల్లో) రోజు కూలీలు 21–06–2021 42.46 22–06–2021 42.59 23–06–2021 42.30 24–06–2021 40.85 25–06–2021 41.47 26–06–2021 41.83 28–06–2021 37.15 29–06–2021 37.48 రాష్ట్రంలో గత 8 ఏళ్లలో ఏప్రిల్–జూన్ మధ్య పేదలకు పనులు కల్పన ఆర్థిక సంవత్సరం కల్పించిన పని దినాలు 2014–15 9.34 కోట్లు 2015–16 10.44 కోట్లు 2016–17 11.14 కోట్లు 2017–18 12.97 కోట్లు 2018–19 12.31 కోట్లు 2019–20 12.06 కోట్లు 2020–21 15.10 కోట్లు 2021–22 16.70 కోట్లు రాష్ట్రం పేదలకు కల్పించిన పని దినాలు ఆంధ్రప్రదేశ్ 16.70 కోట్లు మధ్యప్రదేశ్ 11.97 కోట్లు తెలంగాణ 9.30 కోట్లు ఒడిషా 7.05 కోట్లు బీహార్ 7.01 కోట్లు చత్తీస్‌గఢ్ 6.68 కోట్లు రాజస్థాన్ 5.98 కోట్లు పశ్చిమ బెంగాల్ 5.30 కోట్లు తమిళనాడు 5.13 కోట్లు ఉత్తరప్రదేశ్ 4.68 కోట్లు -
అభివృద్ధిలో ఉపాధి హామీ నిధులు కీలకం: పెద్దిరెడ్డి
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో పేదలకు ఇచ్చే స్థలాలకు సంబంధించి పదివేల లేఅవుట్లను గుర్తించామని, ఈ లేఅవుట్లలో ఉపాధి హామీ కింద అవెన్యూ ప్లాంటేషన్ చేస్తున్నామని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. పంచాయతీరాజ్ కమిషనర్ క్యాంప్ కార్యాలయంలో మంత్రి అధ్యక్షతన గురువారం ఉపాధి హామీ మండలి సమావేశం నిర్వహించారు. పీఆర్ అండ్ ఆర్డీ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, పీఆర్ కమిషనర్ గిరిజా శంకర్, డైరెక్టర్ (ఇజీఎస్) చిన్నతాతయ్య, వాటర్‌షెడ్ డైరెక్టర్ వెంకటరెడ్డి, ఉపాధి హామీ మండలి (ఎస్ఇజిసి) సభ్యులు హాజరయ్యారు. (చదవండి: ‘ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయి’) రాష్ట్ర అభివృద్ధిలో ఉపాధి హామీ నిధులు కీలకమని, ఇతర రాష్ట్రాల్లో ఉపాధి హామీ ఏ రకంగా జరుగుతుందో మండలి సభ్యులు పరిశీలించేలా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ‘‘ప్రస్తుతం జరుగుతున్న పనులతో పాటు నియోజకవర్గానికి రూ.10 కోట్లు కేటాయించబోతున్నాం. నూరు శాతం ఉపాధి హామీ నిధులతోనే పనులు చేపట్టేందుకు వీలుగా చర్యలు తీసుకుంటున్నాం. వైఎస్సార్ క్లినిక్, ఆర్బీకే, నాడు-నేడు, సచివాలయ భవనాల నిర్మాణం పనులను వేగవంతం చేయాలని’’ అధికారులను మంత్రి ఆదేశించారు. గ్రామాల్లో ఉపాధి హామీ కింద ఈ నాలుగు రకాల పనులను అక్టోబర్ నెల నాటికి పూర్తి చేస్తే నియోజకవర్గానికి ఇంకా అదనంగా మరో రూ.5 కోట్లు ఇస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. (చదవండి: చంద్రబాబు కుప్పంలో కూడా ఓడిపోతారు..) -
ప్రకృతి వ్యవసాయానికి ‘ఉపాధి’ బాసట
సాక్షి, అమరావతి బ్యూరో: లక్షల రూపాయలు ఖర్చు చేసి ఎరువులు, పురుగులు మందులు వాడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. నేల స్వభావానికి కూడా తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. తక్కువ పెట్టుబడితో ఒకే వ్యవసాయ క్షేత్రంలో ఐదు వరుసల నమూనాలో పంటలు సాగు చేసే అవకాశాన్ని పరిచయం చేస్తోంది. రైతులను ఈ దిశగా వ్యవసాయం చేసేలా ప్రోత్సహించడానికి జాతీయ ఉపాధి హామీ నిధులతో వందశాతం సబ్సిడీ కల్పిస్తోంది. ఒకే నేలలో ఒకేసారి 5 రకాల పంటల సాగు.. ఐదు వరుసల ప్రకృతి వ్యవసాయం పద్ధతిని జిల్లా నీటి యాజమాన్య సంస్థ(డ్వామా), పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయ విభాగం సంయుక్తంగా రైతులకు పాటించేలా ప్రోత్సహిస్తాయి. ఐదు వరుసల వ్యవసాయంలో రైతు ఒకే నేలలో ఐదు రకాలదాకా పంటలను ఒకేసారి సాగు చేస్తారు. ఇందులో పండ్ల మొక్కలు, కూరగాయలు, తీగ జాతి మొక్కలు నాటుతారు. సేంద్రియ పద్ధతిలో సాగు చేయటం వల్ల ఖర్చు తగ్గుతుంది. పండ్ల మొక్కలు నాటిన మూడేళ్లకు పంట చేతికి వస్తుంది. ఆలోగా వాటి మధ్యలో అంతర పంటగా నాటిన కూరగాయలు, తీగజాతి మొక్కల పంట చేతికి వచ్చి రైతుకు ఆదాయ వనరుగా మారుతుంది. ఐదు వరుసలలో ఏదో ఒక పంట దిగుబడి బాగా వచ్చినా నష్టపోయే ప్రమాదం ఉండదు. భూసారం పెరుగుతుంది. మూడేళ్ల తర్వాత పండ్ల మొక్కలతో ఎలాగో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. పంట సాగుచేసిన నెల రోజుల నుంచి ఏడాది పొడవునా రైతుకు ఆదాయం లభిస్తుంది. జిల్లాలో 210 పంచాయతీల్లో అమలు ఐదు వరుసల ప్రకృతి వ్యవసాయం జిల్లాలో ఈ ఏడాది 210 గ్రామ పంచాయతీలలో అమలు చేయనున్నారు. ఉపాధి హామీ జాబ్ కార్డు కలిగి ఉన్న రైతులు ఈ పథకానికి అర్హులు. ఒక్కో రైతుకు కనిష్టంగా 0.25 ఎకరాల నుంచి గరిష్టంగా ఒక ఎకరం వరకు సాగు చేసుకొనే అవకాశం ఉంది. రైతు పొలం భూసార పరీక్ష, గుంతలు తవ్వటం, మొక్కల నాటడం, మూడేళ్ల వరకు వాటి సంరక్షణకు అయ్యే ఖర్చునంతా జాతీయ ఉపాధిహామీ పథకం ద్వారా ప్రభుత్వం భరిస్తుంది. రెండు వరుసలలో సాగు చేసే పండ్ల మొక్కలను డ్వామా అందజేస్తుంది. మామిడి, సపోటా, జామ, కొబ్బరి, నేరేడు, ఊసిరి, సీతాఫలం, రేగి, నిమ్మ వంటి మొక్కలు నాటుతారు. మిగిలిన మూడు వరుసలలో కంది, బొప్పాయి, కూరగాయలు, దుంపజాతి, తీగ జాతి మొక్కలు నాటుతారు. ఇలా ఒక్కో రైతుకు మూడేళ్లలో గరిష్టంగా రూ.2.21 లక్షల దాకా ప్రయోజనం కలుగుతుంది. తక్కువ పెట్టుబడితో, నష్టపోకుండా ఐదు వరుసల పంట సాగుకు ఉపాధి హామీ నిధులను ఇవ్వటంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు ఎంతో మేలు పెట్టుబడిలేని ఐదు వరుసల ప్రకృతి వ్యవసాయం సాగును జాతీయ ఉపాధిహామీ పథకంలోకి తీసుకురావటం రైతులకు ఎంతో ప్రయోజనకరం. దీన్ని ఉపయోగించుకొని రైతులు నష్టపోకుండా, ఏడాది పొడవునా ఆదాయం పొందొచ్చు. పొలంలో భూసార పరీక్షలు మొదలు, గుంతలు తవ్వటం, మొక్కలు, వాటిని నాటుకోవటానికి, పరిరక్షణకు ఇలా వివిధ రూపాల్లో ఉపాధి హామీ పథకం కింద నిధులు మంజూరవుతాయి. ఇది రైతులకు ఎంతో తోడ్పాటుగా ఉంటుంది. ఈ ఏడాది జిల్లాలో 210 గ్రామ పంచాయతీలలో అమలు చేయనున్నాం. – గజ్జెల శ్రీనివాసరెడ్డి, పీడీ, డ్వామా, గుంటూరు -
ఉరకలు వేస్తున్న ‘ఉపాధి’
సాక్షి, విశాఖపట్నం: ఆర్థిక సంవత్సరం మొదలైన ఏప్రిల్ 1 నుంచి ఈ నెల 15వ తేదీ వరకు 106 రోజులు... ఈ కొద్దికాలంలోనే గ్రామీణ జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్ఆర్ఈజీఎస్) కింద వేతనదారులు ఆర్జించిన మొత్తం ఎంతో తెలుసా? రూ.416.72 కోట్లు.! కరోనా మహమ్మారి విజృంభణతో అన్ని రంగాల్లో పనులు కోల్పోతున్న విపత్తు సమయంలో ఇది ఎంతో చెప్పలేనంత ఊరట! రోజూ ‘ఉపాధి’ పనికి వెళితే.. సగటున రూ.236.70 చొప్పున దక్కిందంటే అంతకన్నా చెప్పేదేముంది? లాక్డౌన్ సమయంలో చేతి నిండా పని దొరకడం వారి జీవనానికి ఇబ్బంది లేకుండాపోయింది. జిల్లాలో ఉన్న వేతనదారులతో పాటు లాక్డౌన్ ప్రభావంతో ఎక్కడెక్కడి నుంచో స్వస్థలాలకు తిరిగివచ్చిన వారికీ ‘ఉపాధి’ కల్పించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. జిల్లాలో ఆర్థిక సంవత్సరం ప్రారంభం నాటికి ఎన్ఆర్ఈజీఎస్ జాబ్ కార్డు పొందిన కుటుంబాల సంఖ్య 3,18,773 ఉండేది. లాక్డౌన్ ప్రభావం వల్ల వివిధ రాష్ట్రాలు, మన రాష్ట్రంలోని పలు పట్టణాల్లో ఉపాధి కోల్పోయి స్వస్థలాలకు చేరిన వారిలో ఎవరు కోరినా వెంటనే జాబ్‌కార్డు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు కొత్త జాబ్‌కార్డులను ప్రభుత్వం జారీ చేసింది. దీంతో జిల్లాలో జాబ్‌కార్డు ఉన్న కుటుంబాల సంఖ్య 3,65,648కు చేరింది. జిల్లా చరిత్రలో ఇదొక రికార్డు. మరో విశేషమేమిటంటే ఈ మూడున్నర నెలల కాలంలోనే వంద రోజుల పని దినాలను 22,078 కుటుంబాలు పూర్తి చేసేయడం విశేషం. మొత్తంమీద ‘ఉపాధి’ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న వారి సంఖ్య జిల్లాలో 6,10,098 మందికి చేరింది. ఇప్పటి వరకు ఇంతపెద్ద సంఖ్యలో గతంలో ఎప్పుడూ ఉపాధి పనులకు వచ్చిందే లేదు. మూడున్నర నెలల గణాంకాల ప్రకారం చూస్తే 1.76 కోట్ల పనిదినాలను కల్పించారు. ఒక్కో కుటుంబానికి సగటున 48.15 రోజుల పాటు పని దొరికింది. నెమ్మదిగా ప్రారంభమైనా... మార్చి 25 నుంచి లాక్డౌన్ నిబంధనలు అమల్లోకి రావడంతో ‘ఉపాధి’పనులు నిలిచిపోయాయి. ఏప్రిల్ మూడో వారం వరకూ అదే పరిస్థితి. తర్వాత ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇవ్వడంతో ఏప్రిల్ ఆఖరు వారంలో పనులు పునఃప్రారంభమయ్యాయి. కరోనా వైరస్ భయంతో ఎక్కువ మంది పనులకు దూరంగానే ఉంటూ వచ్చారు. డ్వామా అధికారులు అవగాహన కల్పించడం, పని ప్రదేశాల వద్ద శానిటైజర్లు ఏర్పాటు చేయడం, మరో వైపు ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ మాస్కులు ఉచితంగా అందించడంతో వేతనదారుల్లో కాస్త ధైర్యం కలిగింది. దీంతో మే ప్రారంభం నుంచి నెమ్మదిగా మొదలయ్యాయి. కొద్ది రోజుల్లోనే రికార్డు స్థాయిలో వేతనదారులు పనులకు హాజరుకావడం ప్రారంభమైంది. మే ఒకటో తేదీన కేవలం 68 వేల మందే పనులకు రాగా.. అది జూన్ ఒకటో తేదీకి 5.10 లక్షలకు చేరింది. జిల్లా చరిత్రలో ఇదొక రికార్డు. జూలైలో 30 లక్షల పని దినాలు కల్పించి రాష్ట్రంలో జిల్లా మొదటిస్థానంలో నిలిచింది. సులభంగా పనుల గుర్తింపు.. ఎన్ఆర్ఈజీఎస్ కింద అనేక అభివృద్ధి పనులు చేపట్టడానికి అవకాశం ఉన్నా.. గతంలో వాటిని తక్కువగానే గుర్తించేవారు. ఏవో కొన్ని రకాల పనులే చేపట్టేవారు. ఇప్పుడా విధానం మారింది. తక్షణ ప్రజోపయోగ పనులను గుర్తించడమే గాకుండా వెనువెంటనే చేపట్టేందుకు గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా మార్గం సుగమమైంది. ప్రజలకు వారి గడప వద్దకే ప్రభుత్వ సేవలను చేరువ చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ వ్యవస్థకు అంకురార్పణ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడదే ఎన్ఆర్ఈజీఎస్ను ప్రజలకు మరింత చేరువ చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో తక్షణమే పనులు గుర్తిస్తున్నారు. వేతనాలు కూడా ఒకటీ రెండు వారాల్లోనే చెల్లింపు ప్రక్రియ కూడా పూర్తి చేస్తున్నారు. ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు రూ.416.72 కోట్లను వేతనదారులకు కూలి రూపేణా చెల్లించారు. ఒక్కొక్కరికీ రోజుకు సగటున రూ.236.70 చొప్పున కూలి గిట్టుబాటు కావడం మరో విశేషం. మెటీరియల్ కాంపొనెంట్ కింద రూ.21.88 కోట్లను ఖర్చు చేశారు. మొత్తంమీద ఇప్పటి వరకు ఈ పథకం కింద రూ.444.52 కోట్లు వ్యయం అయ్యింది. కోరిన అందరికీ పని కల్పిస్తాం ఉపాధి హామీ పథకంలో రాష్ట్రానికి అదనంగా నాలుగు కోట్ల పని దినాలను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. కోరిన అందరికీ పని కల్పిస్తాం. ప్రభుత్వం ఆదేశాల ప్రకారం జాబ్‌కార్డులు కోరిన వెంటనే ఇస్తున్నాం. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా భౌతికదూరం పాటించేలా పనులకు మార్కింగ్ చేయిస్తున్నాం. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. వేతనదారులు కూడా కొన్ని స్వీయ జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్యం బాగోకపోతే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలని చెబుతున్నాం. – ఇ.సందీప్, ప్రాజెక్టు అధికారి, డ్వామా ఉపాధి పనులే ఆదుకున్నాయి లాక్డౌన్ వేళ పరిశ్రమలు మూత పడటంతో ఉపాధి పనులు ఆదుకున్నాయి. నేను రాజమండ్రిలో ఓ దారాల కంపెనీలో పనిచేసేవాడిని. లాక్‌డౌన్‌తో దాన్ని మూసే శారు. సొంతూరు వచ్చేశాను. కొత్తగా జాబ్ కార్డులు ఇవ్వడంతో మాకు ఉపాధి మార్గం కనిపించింది. రోజూ పనులకు వెళ్లి భార్యాపిల్లలను పోషించుకుంటున్నాను. – గనిశెట్టి రమణ, తాడపాల, మాకవరపాలెం మండలం ప్రభుత్వం ‘ఉపాధి’తో ఆదుకుంది నేను డిగ్రీ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని. లాక్డౌన్ విధించిన తొలి రోజుల్లో ఆర్థికంగా చాలా ఇబ్బంది పడ్డాం. మా నాన్న ఉపాధి పనికి వెళ్లేవారు. ఆ వచ్చే డబ్బుతోనే కుటుంబం గడిచేది. ముఖ్యమంత్రి ఆదేశాలతో నాకు కూడా ఉపా«ధి కలిగింది. నాన్నకు ఆసరా ఉండాలనే తలంపుతో నేనూ జాబ్‌కార్డుకు దరఖాస్తు చేసుకున్నాను. నెల రోజులుగా పనికి వెళుతున్నాను. ప్రభుత్వం ఉపాధి పనులను కల్పించి పేదలను ఎంతో ఆదుకుంది. – కన్నూరు శ్రీను, యండపల్లి, కోటవురట్ల మండలం -
మారుతున్న పల్లె రూపురేఖలు
మన పల్లె ప్రగతి బాట పయనిస్తోంది. కోట్లాది రూపాయల ఎన్ఆర్ఈజీఎస్ (జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం) నిధులతో గ్రామాలు అభివృద్ధి పథాన పయనిస్తున్నాయి. గ్రామ సచివాలయాలు, వెల్నెస్ సెంటర్లు, రైతు భరోసా కేంద్రాలతోపాటు అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు చేకూరుతున్నాయి. మరోవైపు ఎప్పటిలాగే రోడ్లు, కాలువల నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఉపాధి హామీ కన్వర్జెన్సీ పనులతో గ్రామాల రూపురేఖలు శరవేగంగా మారిపోతు న్నాయి. సాక్షి ప్రతినిధి, విజయనగరం: మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పాలనలో పెద్ద ఎత్తున సంస్కరణలు చేపట్టింది. ఒకవైపు పాలనా వ్యవస్థలో మార్పులు, మరోవైపు మౌలిక సదుపాయాల కల్పన భారీగా జరుగుతోంది. గ్రామ సచివాలయాల ద్వారా ప్రభుత్వ పాలనా వ్యవస్థ ప్రజల ముంగిటకే అందుబాటులోకి వచ్చింది. చాలాచోట్ల రైతు భరోసా కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ప్రజారోగ్యమే పర మావధిగా వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు కాబోతున్నా యి. ప్రభుత్వ కార్యాలయాలన్నిటికీ దశలవారీగా సొంత భవనాల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకం సహాయంతో ఈ భవనాల నిర్మాణం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ఉద్యమంలా సాగుతోంది. పనుల్లో పురోగతి జిల్లాకు రూ.243.82కోట్లతో 663 గ్రామ సచివాలయ భవనాలు నిర్మించాల్సి ఉండగా 436 భవనాల నిర్మా ణం ప్రారంభమయ్యింది. రూ.130.36కోట్లతో 567 రైతు భరోసా కేంద్రాలు నిర్మించాల్సి ఉండగా తొలివిడతలో 384 భవనాల నిర్మాణాన్ని చేపడుతుండగా, వీటి లో ఇప్పటికే 68 భవనాల పనులు ప్రారంభమయ్యా యి. 585 వెల్నెస్ సెంటర్ల నిర్మాణానికి రూ.74కోట్లు మంజూరుకాగా 41 సెంటర్ల నిర్మాణం కొనసాగుతోంది. జిల్లాకు ఇదివరకే 702 అంగన్వాడీ కేంద్రాలు మంజూరు కాగా, వీటిలో 687 కేంద్రాల నిర్మాణం వివిధ దశల్లో ఉన్నాయి. ఈ పనులకోసం రూ.32.89కోట్లు మంజూరవ్వగా రూ.32.70కోట్లు నిర్మాణ సామగ్రికి, రూ.19.96లక్షలు వేతనదారులకు కేటాయించారు. మనబడి నాడు–నేడు పనుల్లో భాగంగా 1145 పాఠశాలలకు రూ.70.54కోట్లతో ప్రహరీలు మంజూరు చేయగా, వీటిలో 634 పనులు వివిధ దశల్లో ఉన్నా యి. మరోవైపు గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన కూడా జోరందుకుంది. గ్రామాలకు వెళ్లే లింకురోడ్లు, అప్రోచ్ రోడ్ల నిర్మాణాన్ని ఉపాధిహామీ భాగస్వామ్యంతో చేపట్టారు. ముఖ్యంగా ఈ ఏడాది గిరిజన ప్రాంతంపై దృష్టిసారించి రహదారి సౌకర్యాన్ని కలి్పస్తున్నారు. గ్రామాల్లో డ్రైనేజీ నిర్మాణాన్ని కూడా మరోవైపు చేపడుతున్నారు. ఉపాధిహామీ కన్వర్జెన్సీ పనుల్లో భా గంగా జిల్లా వ్యాప్తంగా 17,904 సిమ్మెంటు కాంక్రీట్ రోడ్లు మంజూరు చేశారు. వీటి అంచనా విలువ సుమారుగా రూ.673.37కోట్లు కాగా, ఇప్పటివరకు 13,394 పనులు మొదలు పెట్టారు. అలాగే 81.46 కోట్లతో 117 బీటీ రోడ్లను మంజూరు చేయగా, ఈ పనులన్నీ ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. రూ.156.17కోట్ల తో 548 డబ్ల్యూబీఎం రోడ్లను మంజూరు చేయగా, వీటిలో 234 రహదారుల నిర్మాణం ప్రారంభమయ్యింది. ఆగస్టు నాటికి అన్నీ పూర్తి గ్రామ పరిపాలనకు కేంద్రస్థానమైన గ్రామ సచివాలయానికి తగిన వసతులతో, అవసరమైన విస్తీర్ణంతో భవనాలను నిర్మిస్తున్నాం. చాలాచోట్ల వీటిని ఆనుకునే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. అక్కడక్కడా కొన్నిచోట్ల ప్రభుత్వ భవనాలకు స్థలం కొరత కారణంగా ఇంకా ప్రారంభం కానప్పటికీ, వీటన్నిటినీ ఆగస్టు నాటికి పూర్తి చేయాలన్న కతనిశ్చయంతో జిల్లా యంత్రాంగం పనిచేస్తోంది. – డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్, జిల్లాకలెక్టర్ -
సాంకేతిక సహాయకుల అధికారాల కోత
సాక్షి, హైదరాబాద్ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్ఆర్ఈజీఎస్)లో కీలకంగా వ్యవహరిస్తున్న సాంకేతిక సహాయకుల (టెక్నికల్ అసిస్టెంట్లు) అధికారాలకు ప్రభుత్వం కత్తెర వేసింది. ఇంజనీరింగ్ పనులను దాదాపుగా తొలగించి కేవలం కూలీలతో సంబంధం ఉన్న పనులకే పరిమితం చేసింది. చెరువుల్లో పూడికతీత, కొత్త ఫీడర్ చానళ్ల నిర్మాణం, కొత్త ఫీల్డ్ చానళ్ల ఏర్పాటు, కాల్వల్లో మట్టి తొలగింపు, చెక్ డ్యామ్‌లలో పూడికతీత, గ్రామ పంచాయతీల్లో వైకుంఠధామం నిర్మాణ పనుల నుంచి వీరిని తప్పించింది. ఈ పనులను నేరుగా ఇంజనీరింగ్ అధికారి (ఎన్ఈవో)కి అప్పగించింది. పంచాయతీరాజ్‌శాఖ పరిధిలో పనిచేసే మండల ఇంజనీరింగ్ అధికారి పోస్టును ఇటీవల ఎన్‌ఈవోగా నిర్వచిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఉపాధి పనులను పూర్తిస్థాయిలో వీరే పర్యవేక్షించనున్నారు. ఇప్పటివరకు ఉపాధి హామీ పథకం కింద చేపట్టే ప్రతి పని అంచనా వ్యయం, కూలీలు చేసే పని మదింపు, ఎంబీ రికార్డు టెక్నికల్ అసిస్టెంట్లు చూస్తున్నారు. ఆపై మండల స్థాయిలో ఉండే ఇంజనీరింగ్ కన్సల్టెంట్ (ఈసీ) చెక్కు జారీ చేస్తున్నారు. వీరిరువురిపై ఏపీవో అజమాయిషీ చేసేవారు. అయితే, తాజాగా టెక్నికల్ అసిస్టెంట్ సహా ఈసీ, ఏపీవో పనులకు కూడా కోత పడింది. ఇంజనీరింగ్ పనుల గుర్తింపు, అంచనా ప్రతిపాదనలు, ఈ–మస్టర్ తయారీ, ఎంబీ రికార్డు మొదలు చెక్కు జారీ చేసే విధులను ఎన్ఈవో, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు ప్రభుత్వం కట్టబెట్టింది. తద్వారా కోట్ల విలువైన పనుల నుంచి ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న టీఏ, ఈసీ, ఏపీవోలను వ్యూహాత్మకంగా తప్పించింది. ఆ మేరకు ఎన్‌ఈవోలకు ప్రత్యేక లాగిన్ ఐడీని కూడా జారీ చేసింది. క్షేత్ర సహాయకుల దారిలో.. ప్రభుత్వ నిర్ణయాన్ని ధిక్కరించి సమ్మెబాట పట్టిన 7,500 మంది క్షేత్ర సహాయకుల (ఫీల్డ్ అసిస్టెంట్లు)పై ప్రభుత్వం వేటు వేసింది. పనితీరును గ్రేడింగ్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఎఫ్‌ఏలు మార్చి మాసంలో ఆందోళన బాట పట్టారు. వీరి ఆందోళనకు ఏ మాత్రం వెరవని ప్రభుత్వం.. అదే నెల చివరి వారంలో ఎఫ్‌ఏలకు ఉద్వాసన పలికింది. మేం మళ్లీ విధుల్లో చేరుతాం మొర్రో అని మండల కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొట్టినా పట్టించుకోకుండా..వీరి విధులను గ్రామ పంచాయతీ కార్యదర్శులకు అప్పగించింది. తాజాగా తమ విధుల్లోనూ కోత పెడుతుండడంతో టెక్నికల్ అసిస్టెంట్లలోనూ ఆందోళన నెలకొంది. గడువులోగా చేయాల్సిందే ఉపాధి హామీ పనులను నిర్ణీత గడువులోపు పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్ర సర్కారు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రైతు వేదికలు, కల్లాలను నాలుగు నెలల్లో నిరి్మంచాలని స్పష్టం చేసింది. వైకుంఠధామం, డంపింగ్ యార్డుల నిర్మాణాలను రెండు నెలల్లోపు పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా మార్గదర్శకాలు జారీ చేశారు. గ్రామ పంచాయతీ రోడ్లు, కాల్వలను, అంతర్గత రోడ్లను ప్రతి రోజూ క్లీన్ చేయాలని స్పష్టం చేశారు. హరితహారం కింద ప్రతిపాదించిన ప్రకృతి వనాలను సాధ్యమైనంత త్వరగా నిరి్మంచాలని ఆదేశించారు. ఇప్పటివరకు ట్రాక్టర్లను సమీకరించుకోని పంచాయతీలు.. ఈ నెలాఖరులోపు కొనుగోలు చేయాలన్నారు. కాగా, గ్రామీణ ఉపాధి హామీని వ్యూహాత్మకంగా వాడుకోవాలని నిర్ణయించిన సర్కారు.. గ్రామ పంచాయతీల్లో చేపట్టాల్సిన ఇంజనీరింగ్ పనులను ఆయా శాఖలు గుర్తించాలని సూచించింది. తద్వారా అభివృద్ధి పనులకు నరేగా నిధులను విరివిగా వాడుకోవాలని యోచిస్తోంది. -
మన పల్లె సల్లగుండాలి: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: అవసరమైన నిధులు, విస్తృతమైన అధికారారాలు, కావాల్సినంత మంది అధికారులు, స్పష్టమైన విధానాలు, పాలనా సౌలభ్యంగా గ్రామాలు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలోని పల్లెలన్నీ బాగుపడి తీరాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ఇన్ని అనుకూలతలు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కాకపోతే, ఇంకెప్పుడూ గ్రామాలు బాగుపడవని పేర్కొన్నారు. వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో వసతుల కల్పనకు, అవసరమైన పనులు చేసుకోవడానికి మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకాన్ని వ్యూహాత్మకంగా వినియోగించుకోవాలని చెప్పారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా రైతుల భూముల్లో లక్ష కల్లాలను ఏర్పాటు చేయాలని కోరారు. ప్రతి గ్రామం.. ప్రతి రోజూ శుభ్రం కావాల్సిందేనని, సీఎం సహా రాష్ట్రంలో అధికార యంత్రాంగంలో ఎవరికైనా సరే గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడానికి మించిన పని మరోటి లేదని స్పష్టం చేశారు. రెండు నెలల్లో అన్ని గ్రామాల్లో వైకుంఠ ధామాల నిర్మాణం, 4 నెలల్లో రైతు వేదికల నిర్మాణం పూర్తి కావాలని ఆదేశించారు. జిల్లాల కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులతో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో మంగళవారం సమావేశమయ్యారు. గ్రామాల్లో కలెక్టర్లు, డీపీవో ఆధ్వర్యంలో జరగాల్సిన పనులపై సీఎం కేసీఆర్ మార్గదర్శనం చేశారు. మంగళవారం ప్రగతి భవన్లో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్. చిత్రంలో మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మహమూద్ అలీ, ఈటల రాజేందర్, సీఎస్ సోమేశ్ కుమార్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ ఆదేశాలు సీఎం మాటల్లోనే.. గ్రామాలు, పట్టణాలు బాగుపడితే రాష్ట్రం బాగుపడినట్లే. ప్లానింగ్ ఆఫ్ టౌన్, ప్లానింగ్ ఆఫ్ విలేజ్ అంటే ప్లానింగ్ ఆఫ్ స్టేట్ అన్నట్లే. వనరులు, అవసరాలను బేరీజు వేసుకుని గ్రామాల వారీగా నాలుగేళ్ల ప్రణాళిక తయారు కావాలి. దాని ఆధారంగా డిస్ట్రిక్ట్ ప్రోగ్రెస్ కార్డు రూపొందించాలి. దాని ప్రకారమే పనులు జరగాలి. కొత్త పంచాయతీరాజ్ చట్టం ద్వారా ప్రభుత్వం తన వద్ద ఉన్న అధికారాలను వదులుకుని కలెక్టర్లకు పూర్తి అధికారాలు అప్పగించింది. గ్రామ కార్యదర్శి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పంచాయతీరాజ్ శాఖలో ఖాళీలు భర్తీ చేసింది. కరోనా కష్టకాలంలో ఆర్థిక సంక్షోభం ఉన్నా ప్రతినెలా రూ.308 కోట్ల Æనిధులు ప్రభుత్వం విడుదల చేస్తోంది. అసెంబ్లీలో ఇచ్చిన హామీ మేరకు ఏడాదికి రూ.5 లక్షల కన్నా తక్కువ ఆదాయం కలిగిన గ్రామ పంచాయతీలకు అదనపు నిధులిచ్చి, 5 లక్షలకు చేరుకునేట్లు చేస్తాం. ఏటా రూ.10 వేల కోట్ల నిధులు, 13,993 మంది అధికారులు, 1,32,973 మంది ప్రజాప్రతినిధులు, 8,20,727 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులు, కలెక్టర్లకు విస్తృత అధికారాలున్నాయి. గ్రామాల వికాసాన్ని కాంక్షించే ప్రభుత్వం, అది తీసుకున్న విధానాలు గొప్పగా ఉన్నాయి. ప్రజల్లో అవగాహన, స్పూర్తి కలిగించి ఉద్యమ స్ఫూర్తితో గ్రామాలను అభివృద్ధి చేసే కార్యక్రమాలను కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు తమ భుజస్కంధాలపై వేసుకుని నడిపించాలి. ప్రతి గ్రామానికి ట్రాక్టర్, వైకుంఠ ధామం, నర్సరీ, డంపు యార్డు దేశంలో ఎక్కడా లేవు. తెలంగాణలో మాత్రమే అవి సమకూరుతున్నాయి. ట్యాంకర్లు, ట్రాలీలు కూడా వస్తున్నాయి. ఈ నెలాఖరుకు అన్నీ సమకూరుతాయి. సమావేశంలో భౌతిక దూరం పాటిస్తూ పాల్గొన్న వివిధ జిల్లాల కలెక్టర్లు ఆకస్మిక తనిఖీలు చేస్తా.. గ్రామాల్లో గుంతలు తొలగించాలి. పాడుపడిన బావులను, ఉపయోగించని బోర్లను పూడ్చాలి. పిచ్చి చెట్లను, సర్కారు తుమ్మను తొలగించాలి. నేను గ్రామాల్లో ఆకస్మిక తనిఖీ చేస్తాను. రాష్ట్రంలో ఏ మూలకు పోయి చూసినా అంతా శుభ్రంగా కనిపించాలి. అప్పుడు ఈ చెత్తా చెదారం, ముళ్ల పొదలు కన్పిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఆర్థిక కమిషన్ నిధుల్లో 10 శాతం మండల పరిషత్‌లకు, 5 శాతం జిల్లా పరిషత్‌లకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామాల్లో పచ్చదనం, పారిశుధ్యం విధుల నిర్వహణలో కానీ, ఇతర అభివృద్ధి పనుల నిర్వహణలో గానీ అలసత్వం ప్రదర్శిస్తే క్షమించొద్దు. జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం పూర్తి అధికారాలు ఇచ్చింది. ఎలాంటి రాజకీయ జోక్యం ఉండదు. ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడంలో రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్‌గా ఉంది. 2020–21లో తెలంగాణకు 13 కోట్ల పని దినాలను లక్ష్యంగా ఇస్తే, ఇప్పటికే 9.81 కోట్ల పనిదినాలను (75.5 శాతం) పూర్తి చేసి కూలీలకు ఉపాధి కల్పించింది. నరేగాను వాడుకోండి.. నర్సరీలు, మొక్కల పెంపకం, అన్ని రకాల రోడ్లపై చెట్లు, పొదల తొలగింపు, చెరువులో, చెరువు కట్టలపై చెట్ల తొలగింపు, కాల్వల మరమ్మతులు, పూడికతీత, వైకుంఠధామాలు, డంపు యార్డులు, అంతర్గత రహదారులు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో టాయిలెట్లు, కల్లాలు, పంట చేలకు పశువులు రాకుండా ట్రెంచ్, ఇంకుడు గుంతలు, గొర్రెలు, మేకలు, బర్రెలు, కోళ్ల కోసం షెడ్లు, వర్మి కంపోస్టు, కంపోస్టు తయారీ షెడ్ల నిర్మాణం, పాఠశాలల్లో ఆట స్థలాల ఏర్పాటు, మురుగు నీరు, నిల్వ ఉన్న నీటి తొలగింపు, వ్యవసాయ భూమిని చదను, పాడుపడిన బావుల పూడ్చివేత, మంచినీటి బావుల్లో పూడిక తీత పనులు తదితర ప్రజోపయోగ పనులను ఉపాధి హామీ పథకం (నరేగా) ద్వారా చేపట్టాలి. అన్ని గ్రామీణ నియోజకవర్గాల్లో మొత్తం లక్ష కల్లాలను ఈ ఏడాది నిర్మించాలని నిర్ణయించాం. ఒక్కో నియోజకవర్గానికి వెయ్యి కల్లాలు కేటాయిస్తాం. రైతులకున్న భూమి, అవసరాన్ని బట్టి 50, 60, 75 చదరపు అడుగుల విస్తీర్ణాల్లో కల్లాల నిర్మాణానికి అనుమతులు ఇస్తాం. ఎక్కువ మంది రైతులు ముందుకొస్తే, లాటరీ ద్వారా ఎంపిక చేస్తాం. రూ.750 కోట్ల వ్యయం అయ్యే కల్లాల నిర్మాణానికి నరేగా నిధులు వినియోగించాలి. ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం సబ్సిడీతో నిర్మించాలి. మిగతా వారు 10 శాతం లబ్ధిదారుడి వాటాగా చెల్లిస్తే, 90 శాతం సబ్సిడీ ఇస్తాం. ఈసారి ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, నీటిపారుదల లాంటి ఇంజనీరింగ్ శాఖలతో పాటు ఇతర ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో నరేగా పనులు చేయాలని నిర్ణయించినందున నరేగా ఇంజనీరింగ్ ఆఫీసర్స్ (ఎన్ఈవో)ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పీడీ యాక్టులు పెడతాం.. వెంటనే రైతులందరికీ రైతు బంధు డబ్బులు ఇవ్వాలని నిర్ణయించాం. ఏ ఒక్క రైతునూ మినహాయించకుండా డబ్బులు వచ్చేలా చూడాలి. ఎవరికి రాకున్నా వారి వివరాలు తీసుకుని అందేలా చూడాలి. నకిలీ, కల్తీ విత్తనాల వ్యాపారులపై పీడీ యాక్టు నమోదు చేయాలి. సమాచారం ఇచ్చిన వారికి రూ.5 వేల నగదు ప్రోత్సాహకం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారి పేర్లు గోప్యంగా ఉంచాలని అధికారులను ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్‌లు నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సెజ్‌లకు కనీసం 500 మీటర్ల దూరం వరకు నివాస గహాల నిర్మాణం కోసం లేఅవుట్లకు అనుమతి ఇవ్వొద్దు. జూన్ 25 నుంచి రాష్ట్రవ్యాప్తంగా హరితహారం కార్యక్రమం కరోనా నిబంధనలు పాటిస్తూ నిర్వహించాలి. అడవులను కాపాడుకోవాలి.. వైకుంఠధామం, డంపు యార్డుల చుట్టూ ప్రహరీగోడలు కాకుండా, చెట్లు పెంచాలి. అడవుల పునరుద్ధరణకు, ఉన్న అడవులను కాపాడటానికి ప్రాధాన్యం ఇవ్వాలి. నిర్మల్, ఆసిఫాబాద్, ఖమ్మం, కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, అచ్చంపేట, మెదక్ తదితర జిల్లాల్లో ఇంకా అడవి ఉంది. దాన్ని కాపాడాలి. స్మగ్లర్లను గుర్తించి, పీడీ యాక్టు నమోదు చేయాలి. జూన్ 25 నుంచి జూలై వరకు మరోసారి మిడతల దండు వచ్చే అవకాశం ఉంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, కొత్తగూడెం, నిర్మల్, నిజమాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలి. కరోనా వ్యాప్తి నివారణకు జిల్లా స్థాయిలో అన్ని చర్యలు తీసుకోవాలి. వర్షాకాలంలో వచ్చే అంటు వ్యాధుల నివారణకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. -
ఉపాధి హామీలో వేతన ‘విభజన’
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ పేదలకు ఏడాదికి 100 రోజుల పని కల్పించేందుకు ఉద్దేశించిన ఉపాధి హామీ పథకం అమల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొం టున్న ఫీల్డ్ అసిస్టెంట్లను దారి లోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా ఫీల్డ్ అసిస్టెంట్లకు నిర్దేశించిన నెలకు రూ.10 వేల వేతనాన్ని పనితీరు ఆధారంగా విభజించనుంది. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ రఘునందన్‌రావు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు కేటాయించిన పంచాయతీల్లోని జాబ్‌కార్డుదారులకు కల్పించే పనిదినాల ఆధారంగా వారిని విభజించాలని, మరీ తక్కువ పని దినాలు కల్పించిన ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే తొలగించాలని, ఫీల్డ్ అసిస్టెంట్ల కేటగిరైజేషన్తో పాటు తొలగింపు ప్రక్రియను ఈనెల 14కల్లా పూర్తి చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. మూడు కేటగిరీలుగా విభజన.. ఇప్పటివరకు రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం కింద కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న వారికి నెలకు రూ.10 వేల వేతనం ఇస్తున్నారు. ప్రతి యేటా జూలై 1 నుంచి వచ్చే ఏడాది జూన్ 30 వరకు వారిని రెన్యువల్ చేస్తుంటారు. వీరు ఈ పథకం కింద వారికి కేటాయించిన పంచాయతీల్లోని జాబ్‌కార్డు దారులందరికీ పనిదినాలు కల్పించాల్సి ఉంటుంది. అయితే, ఈ పనిదినాల కల్పన ఆధారంగానే ఫీల్డ్ అసిస్టెంట్లను ఇప్పుడు ప్రభుత్వం విభజిస్తోంది. పంచాయతీలోని జాబ్‌కార్డు ఉన్న వారికి కనీసం 30 అంతకన్నా ఎక్కువ పనిదినాలు కల్పించిన వారిని కేటగిరీ–1లో పెట్టి వారికి గతంలో ఇస్తున్న విధంగానే నెలకు రూ.8,900 వేతనం, రూ.1,100 అలయెన్సులు కలిపి రూ.10 వేలు చెల్లించనుంది. కేటగిరీ–1.. జాబ్‌కార్డుదారులకు కనీసం 30 అంతకన్నా ఎక్కువ పనిదినాలు కల్పించిన వారికి రూ.10 వేలు చెల్లించనుంది. వీరి కాంట్రాక్టును రెన్యువల్ చేయనుంది. కేటగిరీ–2ఏ.. 29–20 రోజుల పని దినాలు కల్పించగలిగిన ఫీల్డ్ అసిస్టెంట్లను ఈ కేట గిరీలో ఉంచి వారి రెన్యువల్‌ను పెండింగ్‌లో పెట్ట నున్నారు. వేతనం నెలకు రూ.9వేలకు పరిమితం చేయనున్నారు. కేటగిరీ–2బీ.. నెలకు 19–10 పని దినాలు కల్పించగలిగిన వారిని ఈ కేటగిరీలో పెట్టి వారి కాంట్రాక్టును కూడా రెన్యువల్ చేయరు. వారి వేతనాన్ని రూ.7,500గా నిర్ధారించనున్నారు. వీరి కాంట్రాక్టును గత ఏడాది జూలై నుంచి ఈ ఏడాది జూన్ వరకు రెన్యువల్ కూడా చేయనుంది. ఇక, 29–20 రోజుల పనిదినాలు కల్పించగలిగిన ఫీల్డ్ అసిస్టెంట్లను కేటగిరీ–2ఏలో ఉంచి వారి రెన్యువల్‌ను పెండింగ్‌లో పెట్టాలని, వారి వేతనాన్ని నెలకు రూ.9వేలకు పరిమితం చేయనున్నారు. అలాగే నెలకు 19–10 పనిదినాలు కల్పించగలిగిన వారిని కేటగిరీ–2బీలో పెట్టి వారి కాంట్రాక్టును కూడా రెన్యువల్ చేయవద్దని, వారి వేతనాన్ని రూ.7,500గా నిర్ధారించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక, సగటున కనీసం 10 పనిదినాలు కూడా కల్పించలేని వారిని వెంటనే తొలగించాలని, ఈ మేరకు వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించారు. ఈ పనిదినాల కల్పన పనితీరును 2018, జూలై 1 నుంచి 2019 జూన్ 30 మధ్య పరిగణనలోకి తీసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ల అసంతృప్తి.. ప్రభుత్వ నిర్ణయంపై ఫీల్డ్ అసిస్టెంట్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి పనుల కల్పన విషయంలో పంచాయతీల వారీగా వ్యత్యాసం ఉంటుందని అంటున్నారు. చిన్న పంచాయతీల్లో 50ఐ100 కార్డులు మాత్రమే ఉంటాయని, ఆయా కుటుంబాలకు సగటున ఏటా 30 పనిదినాల కల్పన అంత కష్టమేమీ కాదంటున్నారు. అలాగే 1000 జాబ్‌కార్డులున్న గ్రామాలు, వాటి హ్యామ్లెట్లలోని అన్ని కుటుంబాలకు సగటున 30 పనిదినాలు కల్పించడం అంత సులువైన కాదని చెబుతున్నారు. గత 14ఏళ్లుగా గ్రామాల్లో చాలా చేశామని, ఇప్పుడు కొత్తగా చేయడానికి పనులు కూడా లేవని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో 30 పనిదినాల ప్రాతిపదికన తమను విభజించడం సరైంది కాదని తెలంగాణ ఫీల్డ్ అసిస్టెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ముదిగొండ శ్యామలయ్య వ్యాఖ్యానించారు. ఈ సర్క్యులర్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఇప్పటికే సమ్మెకు నోటీసు ఇచ్చామని, సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ల ముట్టడి ఉందని, 11న చలో హైదరాబాద్ కార్యక్రమం చేపడతామని, అప్పటికీ ప్రభుత్వం ఈ ఉత్తర్వులను రద్దు చేయకపోతే ఈనెల 12 నుంచి విధులు బహిష్కరించి పూర్తిస్థాయి సమ్మెకు దిగిపోతామని హెచ్చరించారు. ఫీల్డ్ అసిస్టెంట్లపై వస్తున్న విమర్శలివే... గత 14 ఏళ్లుగా గ్రామాల్లో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ల పనితీరు విమర్శలకు కారణమవుతోంది. ప్రభుత్వం ఇచ్చే వేతనానికి తోడు కొన్ని నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా సంపాదిస్తున్నారని, పని దినాల కల్పనలో పేదలను తమ ఇళ్ల చుట్టూ తిప్పించుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. సొంత పనులు చక్కబెట్టుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, తమకు అనుకూలంగా ఉన్న వారికి, సన్నిహితులు, బంధువులకు పని కల్పించేలా వారి పేర్లను మస్టర్లలో రాస్తున్నారని, కొన్ని చోట్ల పని చేయకుండానే మస్టర్లను రాస్తున్నారని ప్రభుత్వం నిర్ధారించింది. ముఖ్యంగా గ్రామాల్లోని పేదలను, రాజకీయ నాయకులను తమ గుప్పిట్లో పెట్టుకుని ఆయా గ్రామాలను ఓ రకంగా శాసించే స్థాయికి కొందరు ఫీల్డ్ అసిస్టెంట్లు చేరిపోయారనే తీవ్ర ఆరోపణలు కూడా వారిపై ఉన్నాయి. -
వెలుగులోకి టీడీపీ మరో అవినీతి బాగోతం..
సాక్షి, అమరావతి బ్యూరో: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్ఆర్ఈజీఎస్) కింద వివిధ పనులకు ఏటా నిధులు విడుదలవుతాయి. ఈ నిధులతో వివిధ పనులు చేపట్టం ద్వారా కూలీలకు ఉపాధి కల్పిస్తారు. అయితే జిల్లాలో చేపట్టిన పనుల్లో నిధులు పెద్ద ఎత్తున దురి్వనియోగం అయినట్టు వెలుగులోకి వచ్చింది. ఈ పథకంలో ప్రధానంగా ఎవెన్యూ ప్లాంటేషన్ (రోడ్డు పక్కల మొక్కల నాటడం)కు ఎక్కువ నిధులు విడుదలయ్యాయి. 2017–18 ఆర్థిక సంవత్సరానికి 1,083 ఎకరాల్లో ఉద్యాన మొక్కల పెంపకానికి రూ.2.60 కోట్లు, 2018–19కి 2,987 ఎకరాల్లో నాటడానికి రూ.5.79 కోట్లు ఖర్చు పెట్టారు. 2017–18లో ఎవెన్యూ ప్లాంటేషన్‌కు సంబంధించి 1,008 కిలోమీటర్ల మేర రోడ్ల వెంబడి మొక్కలు నాటేందుకు రూ.21.47 కోట్లు వెచ్చించారు. ఈ మొక్కలు నాటేందుకు గొయ్యి తవ్వడం, నిర్వహణ, సంరక్షణ, కాపలా వంటి వాటికి ఉద్యాన మొక్కలకు నెలకు 2017–18లో రూ.3 లక్షలు, 2018–19లో రూ.6 లక్షల చొప్పున, ఎవెన్యూ ప్లాంటేషన్‌కు నెలకు రూ.3 లక్షల చొప్పున మూడేళ్ల పాటు నిధులు మంజూరు చేశారు. ఉదాహరణకు జిల్లాలో 2017–18లో ఎవెన్యూ ప్లాంటేషన్ కింద 4,50,370 మొక్కలు నాటాలని అంచనా వేయగా 4,31,110 మొక్కల నాటేందుకు పరిపాలనా ఆమోదం లభించింది. ఇందులో 4,03,176 మొక్కలు నాటినట్టు రికార్డుల్లో చూపారు. ఇలా స్వాహా..! మొక్కలు కొనుగోలు చేయకుండానే చేసినట్టు.. నాటకుండానే నాటినట్టు.. నిర్వహణ చేయకుండానే చేసినట్టు.. మొక్కలు చనిపోయినా బతికే ఉన్నట్టు.. రికార్డుల్లో నమోదు చేశారు. విచిత్రమేమిటంటే.. మొక్కల రక్షణకు వేసే ట్రీగార్డులను మొబైల్ ట్రీగార్డులుగా వాడారు. ఒకచోట వేసిన ట్రీగార్డులనే అధికారులు తనిఖీలకు వస్తున్నారంటే ఆ ప్రాంతానికి తీసుకెళ్లి చూపేవారు. ఇలా కోట్లాది రూపాయలను స్వాహా చేశారు. ఇలా జిల్లాలోని అన్ని మండలాల్లోనూ అక్రమాలకు పాల్పడినట్టు సామాజిక తనిఖీ(సోషల్ అడిట్)ల్లో వెలుగు చూసింది. ఇందులో వెలుగు అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్లు (ఏపీఎంలు), కమ్యూనిటీ కోఆర్డినేటర్లు(సీసీలు), వీవోలు, గ్రామైఖ్య సంఘాల సభ్యులు ఉన్నారని గుర్తించారు. రూ. 10కోట్లకు పైగానే.. ఈ మొత్తం వ్యవహారంలో రూ.10 కోట్లకు పైగానే అవినీతి జరిగినట్టు తెలుస్తోంది. ఇప్పటిదాకా జిల్లాలోని 49 మండలాలకు గాను 38 మండలాల్లో రూ.2.38 కోట్లు స్వాహా అయినట్టు అధికారులు ప్రాథమికంగా తేల్చారు. ఇంకా 11 మండలాల్లో సోషల్ ఆడిట్ పూర్తి కాలేదు. వాటిలో కూడా లెక్క తేలితే ఈ మొత్తం ఇంకా పెరుగుతుంది. కేవలం సోషల్ ఆడిట్ ద్వారానే రూ.2.38 కోట్లు స్వాహా జరిగినట్టు నిర్థారణ కాగా ఇంకా లోతుగా దర్యాప్తు జరిపితే ఆ మొత్తం రూ.10 కోట్లకు పైగా ఉండవచ్చని అధికార వర్గాలే చెబుతున్నాయి. రికవరీ మొదలు.. ఈ స్వాహా పర్వంలో భాగస్వాములపై చర్యలు తీసుకోవడమే గాక వారు తిన్న సొమ్మును కూడా రికవరీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సంబంధిత బాధ్యులకు నోటీసులు జారీ చేశారు. దీనిపై ఇప్పటివరకు రూ.66 లక్షలకు వారు వివరణ ఇచ్చారు. రూ.8.69 లక్షల సొమ్ము రికవరీ చేశారు. మిగిలిన సొమ్ము రికవరీ కావలసి ఉంది. విజిలెన్స్‌తో విచారణ.. ఈ అవినీతి వ్యవహారంపై ప్రభుత్వం విజిలెన్స్‌తో విచారణ జరిపిస్తోంది. దీనిపై విజిలెన్స్ అధికారులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు. త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. అవకతవకలు నిజమే.. జిల్లాలో ఉపాధి హామీ పనుల్లో అవినీతి జరిగినట్టు సామాజిక తనిఖీల్లో తేలింది. ఇంకా తనిఖీలు జరుగుతున్నాయి. దీనిపై బాధ్యులకు నోటీసులు జారీ చేశాం. వీరిలో కొందరు తమ వివరణ ఇచ్చారు. ఇంకొందరి నుంచి రికవరీ చేస్తున్నాం. ఇప్పటికే విజిలెన్స్ విచారణ జరుగుతోంది. నివేదిక వస్తే అక్రమాలకు బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాస్, ప్రాజెక్టు డైరెక్టర్, డీఆర్డీఏ -
నిరుపేదకు నీడ కోసం..
శ్రీకాకుళం పాతబస్టాండ్: నిరుపేదకు నీడ కల్పించాలని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం శతథా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఏర్పాట్లను కూడా శరవేగంగా చేస్తోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీ సుకున్నప్పటి నుంచి పేదల సంక్షేమం కోసం వరుసగా పథకాలు తీసుకువస్తున్నారు. ఇదే క్రమంలో నిరుపేదలకు ఇళ్ల పట్టాలను రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేందుకు కూడా రూపకల్పన చేశారు. ఈ పట్టాలను రానున్న ఉగాది నాటికి కుటుంబంలో మహిళ పేరిట అందజేసేందుకు చర్యలు చేపట్టారు. ఎలాంటి పరిమితి లేకుండా అర్హులందరికీ సంతృప్త స్థాయి లో ఇళ్ల పట్టాలను మంజూరు చేసేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. ఈ క్రమంలో ఇప్పటికే జిల్లాలో 56 వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలను మంజూరు చేసేందుకు జాబితాలను సిద్ధం చేశారు. వీరందరికీ తెలుగు నూతన సంవత్సరం సందర్భంగా ఉగాదికి పట్టాలు అందజేయనున్నారు. వీరి కోసం ఎక్కువగా ప్రభుత్వ స్థలాలను గుర్తించారు. ప్రభుత్వ స్థలాలు అందుబాటులో లేని చోట్ల కొనుగోలు చేసేందుకు కూడా భూములు గుర్తించారు. ఈ కొనుగోలు ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. అర్హులకు ఇళ్లు ఇచ్చే ప్రక్రియ ఐదేళ్లూ కొనసాగుతుంది. ఈ ఐదేళ్లలో సొంతిల్లు లేని వారు ఉండకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. నిధులు రెడీ.. పేదల ఇళ్ల పట్టాలకు ఇళ్ల స్థలాల సేకరణ దాదాపు పూర్తయ్యింది. ప్రభుత్వ స్థలాల గుర్తింపుతో పాటు ఆ స్థలాలు అందుబాటులో లేని గ్రామాల్లో రైతుల వద్ద నుంచి అనువైన ఇళ్ల స్థలాలను కొనుగోలు చేసేందుకు కూడా సర్కారు చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో గుర్తించిన ప్రభుత్వ స్థలాలను సేకరించి ఆ స్థలాలను చదును చేయడం, కాలువలు, రోడ్లను కల్పించడం, లే ఔట్‌గా తయారు చేసేందుకు సన్నాహాలు చురుగ్గా సాగుతున్నాయి. వీటికి గాను మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హా మీ పథకంలో మెటీరియల్ కాంపోనెంట్ నిధులు సమకూర్చారు. ఇప్పటికే అవసరమైన నిధులు అంచనాలు వేయడం ద్వారా పనులు ప్రారంభమైన ప్రాంతాలకు నిధుల మంజూరుకు పరిపాలనా ఆమోదం కూడా పూర్తయింది. జిల్లాలో పేదల ఇళ్ల కోసం ప్రభుత్వ స్థలాలు 891.84 ఎకరాలను గుర్తించారు. ఈ భూములు 810 నివాస ప్రాంతాల్లో ఉన్నాయి. వీటిని బాగు చేసేందుకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు రూ.74.54 కోట్లతో అంచనాలను సిద్ధం చేశారు. జిల్లాలో 38 మండలాల్లో ఈ స్థలాలను లే ఔట్లు వేయడం, ఆ స్థలంలో ఉపాధి హామీ నిధులతో చదును చేయడం వంటివి చేస్తారు. తొలివిడతలో జిల్లాలో 301 లే ఔట్లలో(ప్రాంతాల్లో) 357.63 ఎకరాల్లో చదును చేయడానికి గాను రూ.24.95 కోట్లకు పరిపాలన ఆమోదం పొంది పనులు చేసేందుకు అనుమతులు ఇచ్చారు. ఈ పనులు ఇప్పుడిప్పుడే జిల్లాలో ప్రారంభమవుతున్నాయి. పనులు ప్రారంభించాం పేదల ఇళ్ల పట్టాలకు సంబంధించి ప్రభుత్వ భూములు చదును చేసేందుకు నిధులు కేటాయించడం జరిగింది. అంచనాగా రూ.74.54 కోట్లు వేశాం. ఇప్పటికే పరిపాలనా ఆమోదం సుమారుగా రూ.25 కోట్లకు ఇచ్చారు. ఉపాధి హామీ పనుల నిధులతో ఇప్పటికే ఎచ్చెర్ల తదితర మండలాల్లో చదును చేసే కార్యక్రమం ప్రారంభమైంది. జనవరి 3వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా అన్ని పరిపాలన ఆమోదం పొందిన భూముల్లో చదును చేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ఫిబ్రవరి చివరి నాటికి నిర్దేశించిన అన్ని స్థలాలను చదును చేసేందుకు పూర్తిస్థాయి చర్యలు తీసుకుంటాం. – హెచ్.కూర్మారావు, డ్వామా పీడీ -
నిధులు ఫిట్.. విధులు సూపర్ హిట్
శ్రీకాకుళం పాత బస్టాండ్: జిల్లాలోని గ్రామాల్లో మౌలిక వసతులు మెరుగవుతున్నాయి. అభివృద్ధి పనులు కూడా వేగం పుంజుకున్నాయి. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం గ్రామాల పాలిట వరదాయినిగా మారింది. రెండేళ్లుగా జిల్లాలో ఉపాధి హామీ పనులు విస్తారంగా జరగడంతో వేతనదారుల సంఖ్య పెరిగింది. దీంతో పాటుగా మెటీరియల్ కాంపోనెంట్ నగదు కూడా పెరుగుతూ వచ్చింది. గత ఆర్థిక సంవత్సరంలో వేతన నగదు రూ. 480 కోట్లు చెల్లించగా, జిల్లాలో 5,50,000 మంది వేతన దారులకు పని దినాలు కల్పించారు. జిల్లా మొత్తం ఆర్థిక సంవత్సరంలో 2,42,00,000 పని దినాలు కల్పించారు. మెటీరియల్ కాంపోనెంటు నిధులు రూ.296 కోట్లు సాధించారు. ఈ ఏడాది ఇప్పటికే జిల్లాలో ఉపాధి పనుల్లో చాలా వరకు లక్ష్యాలు సాధించారు. ఇప్పటికే రూ.480.05 కోట్లకు చేరారు. అలాగే మెటీరియల్ కాంపోనెంట్ నిధులు రూ.296.77 కోట్లకి చేరాయి. ఈ ఏడాది గ్రామాల్లో పనులు చేసేందుకు ఈ కాంపోనెంట్ నిధులు కేటాయించారు. ఈ డబ్బుతోనే అన్ని శాఖల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంకా ఈ ఆర్థిక సంవత్సరం మరో మూడు నెలలు ఉన్నందున మరిన్ని పనులు జరిగే అవకాశం ఉందని జిల్లా నీటి యాజమాన్య సంస్థ అధికారులు చెబుతున్నారు. ముమ్మరంగా పనులు.. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పనుల ద్వారా వచ్చిన మెటీరియల్ కాంపోనెంట్ నిధులతో సీసీ రోడ్లు (487 కిలోమీటర్లు) వేసేందుకు పనులు జరుగుతున్నాయి. అంగన్వాడీ భవన నిర్మాణానికి 272 భవనాలు, గ్రామ పంచాయతీ భవనాలు 21, సచివాలయ భవనాలు 812, మండల మహిళా సమాఖ్యకు 3 భవనాలు, బీటీ రోడ్లు 130.24 కిలోమీటర్ల వరకు.. ఇలా మొత్తం రూ. 451.87కోట్లు ఖర్చు చేశారు. గ్రామీణ నీటి సరఫరా విభాగంలో ఒక్కో నియోజకవర్గానికి రూ.11.5 కోట్లు మంజూరు చేశారు. సర్వశిక్ష అభియాన్‌లో వివిధ పాఠశాలలకు ప్రహరీలు నిర్మించేందుకు రూ.30 కోట్లు కేటాయించారు. పశు సంవర్ధక శాఖలో 4025 మినీ గోకులాలు, గృహ నిర్మాణ సంస్థకు సంబంధించి 7475 వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, గిరిజన సంక్షేమం పరిధిలో 39 కాంపౌండ్ వాల్స్, 29 రోడ్లు (అన్ కనెక్టెడ్ హేబిటేషన్ రోడ్లు), 26 డబ్ల్యూఎంబీ రోడ్లకు నిధులు కేటాయించారు. మూడు నెలల గడువు ఉంది ఇప్పటికే గత ఏడాది కంటే వేతనదారుల పనులు, మెటీరియల్ కాంపోనెంట్ నిధుల సమీకరణ ఎక్కువగా సాధించాం. ఇంకా ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి గడువు మూడు నెలలు ఉంది. ఈ ఏడాది వేతనదారులు మెటీరియల్ కాంపోనెంట్ నిధులు రూ.వెయ్యి కోట్లు సాధించే దిశ గా పనులు చేస్తున్నారు. ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది, అనుబంధ శాఖల సమన్వయంతో మ రింత ప్రగతి సాధించే దిశగా ప్రయత్నాలు చేస్తు న్నాం. గత ఏడాది పనులకు గాను జాతీయ అవార్డు రావడంతో ఈ శాఖ, ఇతర అనుబంధ శాఖల ఉద్యోగుల్లో మరింత ఉత్సాహం, నమ్మకం వచ్చింది. – హెచ్.కూర్మారావు, పీడీ, జిల్లా నీటియాజమాన్య సంస్థ, శ్రీకాకుళం -
‘ఉపాధి’ జాతర..!
జిల్లాలో ఖరీఫ్ వరి పనులు పూర్తికావస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో ఉపాధి హామీ పనుల జాతర ఆరంభం కానుంది. వేతనదారులకు చేతినిండా పనిదొరకనుంది. ఈ మేరకు పనుల గుర్తింపు ప్రక్రియను అధికార యంత్రాంగం పూర్తి చేసింది. వాటి ఆమోదానికి గ్రామ సభలు చురుగ్గా నిర్వహిస్తోంది. ఆమోదం తెలిపిన పనులు చేపట్టేందుకు ఉత్తర్వులు జారీ చేస్తోంది. విజయనగరం: ఉన్న ఊరిలో ఉపాధి కల్పించి వలసలు నివారించాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగాస్వామ్యంతో అమలవుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకం సత్ఫలితాలు ఇస్తోంది. ఏడాదికి ఏడాదికి పెరుగుతోన్న లక్ష్యాలే దీనికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో ‘ఉపాధి’ జాతర ప్రారంభం కానుంది. కొత్త ఆర్థిక సంవత్సరంలో వేతనదారుల్లో నూతన ఉత్సాహాన్ని నింపనుంది. లక్షలాది మంది వేతనజీవులకు అధిక పనిదినాలు దొరకనున్నాయి. దీనికోసం ఇప్పటికే పనుల గుర్తింపు ప్రక్రియ పూర్తయింది. ఇక పనుల ఆమోదానికి గ్రామసభలు కొనసాగుతున్నాయి. అవి ఆమోదం పొందడమే తరువాయి. పనుల కల్పన ఇలా... 2020–21 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో ఉపాధిహామీ పనులు చేపట్టేందుకు అధికారులు కార్యాచరణను ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా రూ.1800 కోట్లతో అభివద్ధి పనులు చేపట్టేందుకు జిల్లా అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది. సుమారు 3.50 లక్షల మంది వేతనదారులకు 3 కోట్ల పనిదినాలు కలి్పంచేందుకు చర్యలు చేపడుతున్నారు. క్షేత్రస్థాయిలో గ్రామసభలు నిర్వహించి ప్రజలకు అవసరమైన పనులను జియోట్యాగింగ్ సాయంతో గుర్తించారు. ఇలా గుర్తించిన పనుల ప్రజామోదానికి మరోసారి గ్రామసభలు నిర్వహిస్తున్నారు. కొద్దిరోజుల్లో గ్రామసభలు ముగియనున్నాయి. పనుల నిర్ణయం ఇలా... గతంలో ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పనులు గుర్తించి అవసరమైన మేరకు పనులు చేసేవా రు. ఈ సారి మాత్రం గ్రామసభల్లో గుర్తించిన పనులకు గ్రామసభ ఆమోదం పొందుతారు. దీనికి సంబంధించి గ్రామసభ తీర్మానం అవసరం. గతంలో పంచాయతీ సర్పంచి తీర్మానించేవారు. కొత్త విధానం ప్రకారం ఉపాధిహామీ పథకంలో చేపట్టిన అన్ని పనులు కంప్యూటర్లో క్రోడీకరించాలి. అలా క్రోడీకరించిన అనంతరం తీర్మానాన్ని ఉపాధిహామీ పథకం వెబ్సైట్ నుంచి డౌన్Œలోడ్ చేసుకోవాలి. ఇలా తీసుకున్న తీర్మానాలను మండల పరిషత్ కార్యాలయానికి పంపించాలి. మండల పరిషత్ అధికారులు ఒక తీర్మానం చేసి జిల్లా నీటి యాజమాన్య సంస్థకు పంపాలి. అక్కడ పనులను పరిశీలించి జిల్లాస్థాయిలో తీర్మానం చేసి కలెక్టర్‌కు పంపుతారు. కలెక్టర్ పరిపాలన ఆమోదం లభించిన అనంతరం రానున్న ఆర్థిక సంవత్సరంలో పనులు చేపడతారు. 30 కేటగిరీల్లో 196 రకాల పనులు గుర్తింపు.. ఉపాధిహామీ పథకంలో 30 కేటగిరీల్లో 196 రకాల పనులను రానున్న ఆర్థిక సంవత్సరంలో చేపట్టేందుకు నిర్ణయించారు. ఈ పనుల్లో ఆయా గ్రామాల్లోని ప్రజలకు అవసరమైన 1.17 లక్షల పనులు గుర్తించారు. ఈ ఏడాది కొత్తగా గ్రామీణ పార్కులు, నర్సరీలు పెంచడం తదితర పనులకు ప్రాధాన్యమిచ్చారు. ప్రభుత్వ సంస్థల అభివృద్ధి, పిల్లకాలువలను మెరుగుపరచడం, భూ అభివృద్ధి పనులు, రహదారుల అభివృద్ధి తదితర పనుల గుర్తింపు ప్రక్రియ ముగిసింది. పనులను గ్రామ సభల్లో తీర్మానించే ప్రక్రియ చేపడుతున్నారు. అధిక పనుల గుర్తింపు 2020–21 ఆర్థిక సంత్సరంలో జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకంలో రూ.1800 కోట్ల విలువ చేసే పనులను గుర్తించాం. ఆయా గ్రామ సభ ల్లో చర్చించి ఆమోదం పొందిన తరువాత పనుల మంజూరు ఆదేశాలు జారీ చేస్తాం. మొత్తం 1.17 లక్షల పనులు గుర్తించగా... 3 కోట్ల పనిదినాలు వేతనదారులకు కలి్పంచాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. ప్రస్తుత ఏడాది 2.65 కోట్ల పని దినాలు లక్ష్యం చేసుకోగా.. ఇప్పటి వరకు 1.86 కోట్ల పని దినాలు కలి్పంచాం. – ఎ.నాగేశ్వరరావు, పీడీ, డ్వామా, విజయనగరం -
మరో ఛాన్స్!
విజయనగరం: జిల్లాను మరో జాతీయ అవార్డు ఊరిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకం అమలులో ఇప్పటికే రెండుసార్లు జాతీయ స్థాయిలో అవార్డు దక్కించుకున్న విజయనగరం జిల్లా మూడో సారి అవార్డు చేజిక్కించుకునేందుకు సమాయత్తమవుతోంది. కేంద్రం నిర్దేశించిన పలు ప్రామాణికాల్లో జిల్లా మెరుగైన ప్రతిభ కనబరచటంతో 2018–19 సంవత్సరానికి సంబంధించి ప్రదానం చేయనున్న అవార్డుకు జిల్లా పోటీ పడుతోంది. ఇప్పటికే 2011–12 ఆర్థిక సంవత్సరంలో ఒకసారి, 2015–16 ఆర్థిక సంవత్సరంలో రెండో సారి జాతీయ అవార్డులు దక్కించుకుని తాజాగా 2018–19 సంవత్సరానికి పోటీపడుతోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక బృందం జిల్లాలో ఆదివారం నుంచి క్షేత్ర స్థాయి పర్యటన చేస్తుండగా... మొత్తంగా మూడున్నర రోజులు ఈ పరిశీలన నిర్వహించనుంది. పోటీలో ఉత్తరాంధ్ర జిల్లాలు.. గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలులో జాతీయ అవార్డు రేసులో ఉత్తరాంధ్రకు చెందిన శ్రీకాకుళం, విశాఖ జిల్లాలతో పాటు విజయనగరానికి మరోసారి స్థానం దక్కింది. ఈ మేరకు కేంద్ర కమిటీ ఆదివారం నుంచి చేపట్టదలచిన మూడున్నర రోజుల క్షేత్ర స్థాయి పర్యటన ఆదివారం ప్రారంభమైంది. జాతీయ అవార్డుకు దేశంలో 13 జిల్లాలను కేంద్రం ఎంపిక చేయగా, మన రాష్ట్రం నుంచే ఆరు జిల్లాలు నామినేషన్‌కు వెళ్లాయి. ఆయా జిల్లాల కలెక్టర్లు, పీడీలు ఇప్పటికే జిల్లాల ప్రగతిని ఢిల్లీకి వెళ్లి వివరించగా, అందులో రాష్ట్రానికి చెందిన ఉత్తరాంధ్ర జిల్లాలే ఎంపిక కావడం విశేషం. ఈ నేపథ్యంలోనే జిల్లాలో కేంద్ర బందం పర్యటిస్తోంది. జిల్లాకు 2010–11 ఆర్థిక సంవత్సరంలో తొలిసారిగా జాతీయ పురస్కారం దక్కింది. అప్పటి నుంచి ఏటా అవార్డుకు జిల్లా నామినేట్ అవుతూనే ఉంది. 2015–16లో రెండోసారి జాతీయ పురస్కారం దక్కింది. ఈ సారి దేశంలోనే ఉపాధిహామీ అమలులో ఉత్తమ ప్రగతిని కనబరిచిన ఒకే ఒక్క జిల్లాను ఉత్తమ జాతీయ పురస్కారానికి కేంద్రం ఎంపిక చేయనుంది. ఈ నేపథ్యంలోనే దేశంలోని 13 జిల్లాలను నామినేట్ చేయగా, అందులో మన రాష్ట్రానికి చెందిన విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం, అనంతపురం, ప్రకాశం, కడప జిల్లాలు అవార్డు కమిటీ ముందు ప్రెజెంటేష¯న్ ఇచ్చాయి. అందులో ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు మాత్రమే ఎంపికయ్యాయి. అన్ని రంగాల్లో ముందంజ.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకంలో ఏటా వందల కోట్ల నిధులు వెచ్చించి పనులు చేపట్టడంతో పాటు పని లేని వారికి ఉన్న ఊరిలోనే ఉపాధి కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా 2018–19 ఆర్థిక సంవత్సరానికి పథకం అమలులో అన్ని రంగాల్లోనూ జిల్లా ప్రగతి కనిపిస్తోంది. 100 రోజుల పనికల్పనలో దేశంలోనే విజయనగరం జిల్లా నాలుగో స్థానంలో నిలవగా, మన రాష్ట్రంలో ప్రథమస్థానంలో నిలిచింది. 1.16లక్షల కుటుంబాలకు 100 రోజులు పని కల్పించారు. అత్యధికంగా జిల్లాలో రూ.507.45 కోట్లు ఉపాధి వేతనాలు చెల్లించి రాష్ట్రంలోనే విజయనగరం ద్వితీయ స్థానంలో నిలిచింది. 2.61 కోట్ల పనిదినాలతో రెండో స్థానం కాగా, సరాసరి 70.26 శాతం పని దినాలు కల్పించిన జిల్లాల్లో రాష్ట్రంలోనే మూడోది. 3.50 లక్షల మంది మహిళలు ఉపాధి పనులకు హాజరు కావడం మరో రికార్డుగా చెప్పవచ్చు. ఇలా అన్ని ప్రామాణికాల్లో జిల్లా ప్రతిభ కనబరిచింది. ప్రారంభమైన పరిశీలన జిల్లాలో ఉపాధి హామీ పథకం అమలు తీరును పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర బృందం తమ తొలిరోజు పర్యటన ఆదివారం పూర్తి చేసింది. మూడున్నర రోజులు ఈ బృందం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించనుంది. పరిశీలించిన అంశాలతో కేంద్రానికి నివేదిక అందజేస్తుంది. బృంద సభ్యులు ఇచ్చిన నివేదిక మేరకు ఒక్క జిల్లాకు మాత్రమే అవార్డు ప్రదానం చేస్తారు. జిల్లాలో ఈ బృందం 20 గ్రామాల్లో పర్యటించే అవకాశం ఉంది. –ఎ.నాగేశ్వరరావు, ప్రాజెక్ట్ డైరెక్టర్, డ్వామా -
సచివాలయాలకు సొంత గూడు
సాక్షి, చీపురుపల్లి: గ్రామస్వరాజ్య స్థాపనలో సచివాలయాలే కీలకం. ప్రజలకు చేరువగా పాలకులుండాలనీ... వారి సమస్యలు నేరుగా పరిష్కరించే ఓ చక్కని వేదిక కావాలనీ... అర్జీలు అందజేసేందుకు సుదూరంలో ఉన్న మండల కేంద్రాలకు వెళ్లాల్సిన పరిస్థితులు తలెత్తకూడదనీ... రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సంకల్పం. అందుకు అనుగుణంగా సచివాలయాలను రూపకల్పన చేశారు. అక్కడ అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలనీ... అందుకు అవసరమైన నిర్దిష్ట ప్రణాళికతో భవనం ఉండాలని యోచించారు. దశలవారీగా ప్రతి సచివాలయానికీ సొంత భవనం సమకూర్చేందుకు నిధులు విడుదల చేస్తున్నారు. తొలివిడతలో జిల్లాలో 150 భవనాల నిర్మాణానికి పరిపాలన అనుమతులు లభిం చాయి. గ్రామ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చాం... అక్కడితో తమ పని అయిపోయింద ని ముఖ్యమంత్రి వదిలేయలేదు. వాటికి సొంత భవనాలు సమకూరిస్తేనే అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని గట్టిగా విశ్వసిస్తున్నారు. అందుకోసం కార్యాచరణ రూపొందించారు. జిల్లాలో తొలి విడతలో 150 గ్రామ సచివాలయాలకు సొంత భవనాల నిర్మాణానికి జాతీయ ఉపాధిహామీ పథకం నిధులు రూ.52.50 కోట్లు కేటాయించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఎం.హరిజవహర్‌లాల్ పరిపాలన అనుమతులు కూడా మంజూరు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. కొద్ది రోజుల్లో గ్రామ సచివాలయాలకు సొంత భవనాల నిర్మాణ పనులు ప్రారంభంకానున్నాయని అధికార వర్గాలు నుంచి తెలుస్తోంది. సొంత భవనాలు మంజూరు... గ్రామ సచివాలయాల నిర్మాణానికి మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం నుంచి ఒక్కో భవనానికి రూ.35 లక్షలు కేటాయిస్తూ మంజూరు ఉత్తర్వులు వచ్చాయి. దీని ప్రకారం చీపురుపల్లి మం డలంలో 12 గ్రామ సచివాలయ భవన నిర్మాణాలు జరగనున్నాయి. స్థల పరిశీలన చేసి, తుప్పలు తొలగించి మార్కింగ్ ఇచ్చి నాలుగైదు రోజుల్లో పనులు ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నాం. – డి.రమేష్, పంచాయతీరాజ్ జేఈ, చీపురుపల్లి ఒక్కో సచివాలయానికి రూ.35 లక్షలు తొలి విడతలో భాగంగా జిల్లాలోని 150 గ్రామ సచివాలయాలకు సొంత భవనాలు నిర్మించేందుకు జిల్లా కలెక్టర్ పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని చీపురుపల్లి, గజపతినగరం, నెలిమర్ల, ఎస్.కోట నియోజకవర్గాల్లో వీటిని నిర్మించాలని యోచిస్తున్నారు. ఇందుకోసం ఒక్కో భవనానికి రూ.35 లక్షలు వెచ్చించనున్నారు. ఈ మేరకు ఉపాధిహామీ పథకం నిధులను మంజూరు చేశారు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు రంగంలోకి దిగారు. భవనాలు మంజూరైన పంచాయతీల్లో స్థల పరిశీలన చేసి జంగిల్ క్లియరెన్స్ చేపట్టి, మార్కింగ్ పనులు పూర్తి చేసి త్వరలో పనులు ప్రారంభించేందుకు సిద్ధం చేస్తున్నారు. వారం రోజుల్లో శంకుస్థాపనకు సన్నాహాలు చేస్తున్నారు. -
తెలియక మేశా.. విడిపించండి మహాప్రభో!
సాక్షి, గోపాల్పేట (వనపర్తి) : రోడ్డు పక్కన నాటిన మొక్కలను మేసిన ఓ మేకను పంచాయతీ కార్యదర్శి చెట్టుకు కట్టేశాడు. మండలంలోని ఏదుట్లలో ఎన్ఆర్ఈజీఎస్ కింద రోడ్డు వెంబడి నాటిన మొక్కలను మంగళవారం ఓ మేక తినేసింది. దీంతో ఇంత కష్టపడి మొక్కలు నాటుతుంటే మేకలు తింటున్నాయని మేకల యజమానిని హెచ్చరించేందుకు మేకను కట్టివేశానని కార్యదర్శి చంద్రశేఖర్ తెలిపారు. మేక మెడలో తెలియక మేశాను.. దయచేసి నన్ను విడిపించండి అని అట్టపై రాసి మేక మెడకు తగిలించాడు. -
అందని నిధులు.. అధ్వాన దారులు
సాక్షి, కర్నూలు: తెలుగుదేశం ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో గ్రామీణ రోడ్లకు నయా పైసా విడుదల చేయలేదు. ‘ రహదారులు నాగరికతకు చిహ్నాలు ’ అంటారు కానీ.. వాటి ఏర్పాటును మాత్రం అప్పటి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. కేంద్ర ప్రభుత్వ పుణ్యమా అని గ్రామాల్లో ఎన్ఆర్ఈజీఎస్ కింద కొంత మేర సీసీ రోడ్లు వేశారే కానీ.. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలోని గ్రామీణ రోడ్లను మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. దీంతో జిల్లాలోని అనేక గ్రామాలకు సంబంధించిన రోడ్లు అధ్వానంగా మారాయి. పలు ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో ఛిద్రమై పోవడంతో రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత వర్షాకాలంలో గతుకుల రోడ్లపై ప్రయాణం గ్రామీణులకు నరకప్రాయంగా మారింది. కనీసం గుంతలు పడిన ప్రాంతాల్లో మట్టితో పూడ్చేందుకు కూడా గత ప్రభుత్వం నిధులను విడుదల చేయలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆర్ఆర్ఎం–2 ప్రతిపాదనలు బుట్టదాఖలు గ్రామీణ ప్రాంతాల్లో కొత్త రోడ్లు వేసేందుకు, పాత రోడ్లకు మరమ్మతులు చేపట్టేందుకు అవసరమైన ప్రతిపాదనలు పంపితే రూరల్ రోడ్స్ మెయింటెనెన్స్(ఆర్ఆర్ఎం)–2 కింద నిధులు విడుదల చేస్తామని అప్పటి ప్రభుత్వం తెలిపింది. దీంతో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ వర్గాలు ఆగమేఘాలపై జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 1,682.01 కిలోమీటర్ల మేర 503 రోడ్డు పనులు చేపట్టేందుకు రూ.189.95 కోట్లతో అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. అయితే..ఈ ప్రతిపాదనలకు అవసరమైన నిధులు ప్రభుత్వం వద్ద లేకపోవడంతో బ్యాంకుల నుంచి రుణంగా తీసుకోవాలని అప్పటి పాలకులు పీఆర్ ఈఎన్సీకి సూచించారు. దీంతో రుణం తీసుకునేందుకు ఆంధ్రా బ్యాంకును సంప్రదించగా, వారు చేతులెత్తేయడంతో నాడు పంపిన ప్రతిపాదనలు బుట్టదాఖలయ్యాయి. బడ్జెట్ రాలేదు ఆర్ఆర్ఎం–2 కింద జిల్లాలోని గ్రామీణ రోడ్లకు సంబంధించి గతంలో ఎలాంటి బడ్జెట్ రాలేదు. అప్పటి ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని గ్రామాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రోడ్ల నిర్మాణాలకు రూ.189.95 కోట్లతో ప్రతిపాదనలు పంపాం. పనులు ప్రారంభించని వాటిని, 25 శాతంలోపు చేసిన పనులను ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా రద్దు చేస్తున్న నేపథ్యంలో ఆర్ఆర్ఎం–2 కింద పంపిన ప్రతిపాదనలు కూడా రద్దవుతాయి. – సీవీ సుబ్బారెడ్డి, పీఆర్ ఎస్ఈ -
బ్లూఫ్రాగ్.. ఫ్రాడ్
ప్రభుత్వ డేటా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉండడం నిబంధనలకు విరుద్ధం. దేశ వ్యాప్తంగా అమల్లో ఉన్న ఎన్ఆర్ఈజీఎస్ (జాతీయ ఉపాధి హామీ పథకం) డేటా అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ సర్వర్లలో ఉంది. మన రాష్ట్రంలో మాత్రం ప్రత్యేకం. గత ప్రభుత్వంలో దీనిని పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారు. అది కూడా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేష్‌కు సన్నిహితమైన బ్లూఫ్రాగ్ కంపెనీకి ఉపాధి హామీ పథకం డేటాను, యాప్ నిర్వహణ బాధ్యతను అప్పగించారు. పర్యవసానంగా సదరు కంపెనీకి గత ప్రభుత్వం నుంచి భారీగా ఆదాయం రావడంతో పాటు ప్రభుత్వం వద్ద ఉండాల్సిన ఉపాధి హామీ కూలీల డేటా మొదలుకుని యాప్ ద్వారా తీసుకునే హాజరు, చెల్లింపుల వరకు అంతా వారి పర్యవేక్షణలోనే జరుగుతోంది. ప్రైవేట్‌ది కావడంతో తరచూ సమస్యలు వస్తుండడంతో యాప్ నిర్వహణే ఇబ్బందిగా మారింది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలోని 46 మండలాల్లో 3,92,410 జాబ్ కార్డులున్నాయి. వీటి ఆధారంగా ఉపాధి హామీ పనులు కూలీలకు కేటాయిస్తుంటారు. రాష్ట్రంలోని 13 జిల్లాలో ఉన్న 661 మండలాల్లో 61,48,411 మందికి ఉపాధి హామీ కూలీల జాబ్ కార్డులున్నాయి. ఈ క్రమంలో ఏటా వీరిలో కొందరికి ఉపాధి హామీ పనులు ఆయా మండలాల్లోని గ్రామాల్లో కేటాయిస్తుంటారు. సగటున ఒక్క రోజుకు ఒక్కొకరికి కూలి రూ.200 వరకు ఇస్తుంటారు. రాష్ట్రంలో 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఉపాధి హామీ కూలీల నిర్వహణ, ఇతర వివరాలు నమోదు చేసే యాప్ తయారీ బాధ్యతలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారు. ఈ క్రమంలో నారా లోకేష్ మంత్రిగా ఉన్న సమయంలో ఆయన పర్యవేక్షించిన పంచాయతీ రాజ్ శాఖలోని వివిధ పథకాలు, యాప్స్ తయారీ బాధ్యతలు అప్పగించిన బ్లూఫ్రాగ్ కంపెనీకే దీనిని అప్పగించారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ పథకాలను ఆయా రాష్ట్రాల్లో అమలు చేయాల్సిన బాధ్యత, నిర్వహణ అంతా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదే. ఈ క్రమంలో గత ప్రభుత్వం ఉపాధి హామీ పథకం అమలు, జాబ్ కార్డుల జారీ, ఉపాధి కూలీల హాజరు ఇలా అన్నింటినీ ప్రైవేట్ కంపెనీ యాప్ ద్వారానే నిర్వహించేలా డిజైన్ చేశారు. దీనికి బ్లూఫ్రాగ్‌తో పాటు టీసీఎస్ జాయింట్ వెంచర్‌గా కేటాయించారు. దీనిలో బ్లూఫ్రాగ్ కంపెనీ ఉపాధి హామీ పథకం కోసం తొమ్మిది రకాల సేవలకు గానూ 15 యాప్స్‌ను సిద్ధం చేసి ప్రభుత్వం నుంచి యాప్స్ తయారీ కోసం బిల్లులు తీసుకున్నారు. ఈ క్రమంలో డేటా అంతా బ్లూఫ్రాగ్ సర్వర్ల ద్వారా మెయింటెనెన్స్ చేస్తూ సర్వర్‌లో వివరాలు నమోదు అయిన 24 గంటల్లో టీసీఎస్‌కు డేటా ట్రాన్స్ఫర్ అయ్యేలా ప్రత్యేకంగా డిజైన్ చేశారు. దీంతో రాష్ట్రంలోని ప్రతి జాబ్ కార్డు వివరాలు బ్లూఫ్రాగ్‌తో పాటు టీసీఎస్ వద్ద ఉంటాయి. పథకం అమలుకు సంబంధించి యూజర్ రిజిస్ట్రేషన్, వర్క్ డిమాండ్ రిజిస్ట్రేషన్, పని కేటాయింపు, పని నిర్వహణ, హాజరు నమోదు, హాజరును పరిశీలించిడం, పని విలువ, దాని పరిశీలన, తదితర సేవల కోసం 15 రకాల యాప్స్‌ను సిద్ధం చేశారు. ఈ క్రమంలో జిల్లాలో డ్వామా అధికారులు ఉపాధి హామీ వివరాలు యాప్‌లో నమోదులో సాంకేతిక పరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా ఒక రోజు ముందు యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం, టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ కనీసం రెండు మూడు గంటలు కసరత్తు చేస్తే కానీ వివరాలు నమోదు కాకపోవడం తదితర ఇబ్బందులు ఉన్నాయి. నిబంధనలు ఏం చెబుతున్నాయంటే.. విలువైన ప్రభుత్వ డేటా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉండకూడదు. కర్ణాటక. తమిళనాడు, కేరళతో పాటు అనేక రాష్ట్రాల్లో దీనిని ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ ఇన్ఫర్మేటివ్ సెంటర్ పర్యవేక్షిస్తుంది. సర్వర్ల, యాప్ నిర్వహణ అన్ని ఎన్‌ఐసీనే చూసుకుంటుంది. దానికి సంబంధించిన యాక్సెస్ కూడా ప్రభుత్వ ఉన్నతాధికారుల వద్ద మాత్రమే ఉండేలా చర్యలు తీసుకున్నారు. అయితే మన రాష్ట్రంలో మాత్రం సర్వర్లను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారు. ఉపాధి హామీ డేటాను సదరు ప్రైవేట్ సంస్థలు ఇతర అవసరాలకు కూడా వినియోగించుకునేలా యాక్సెస్ కంపెనీకి మాత్రమే ఉంది. ప్రభుత్వానికి యాక్సెస్ లేదు. అలాగే డేటా వేరే వారికి బదలాయించడం చట్టరీత్యా నేరం. మన రాష్ట్రంలో వివరాలు నమోదు అయిన 24 గంటల్లో డేటా టీసీఎస్‌కు ఆటోమెటిక్‌గా ట్రాన్స్ఫర్ అయ్యేలా చేశారు. దీనిని ప్రైవేట్ వ్యక్తుల నుంచి తీసుకుని ఎన్ఐసీకి అప్పగిస్తే ఖజానాకు భారం తగ్గడంతో పాటు డేటా అంతా ప్రభుత్వ అధీనంలోనే ఉంటుంది. పంచాయతీరాజ్ కమిషనర్‌కు నివేదిక ఇటీవల కలెక్టర్ ఎంవీ శేషగిరిబాబు డ్వామా అధికారులతో సమీక్ష నిర్వహించిన లోపాలపై చర్చించిన క్రమంలో విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో కలెక్టర్ పంచాయతీ రాజ్ కమిషనర్‌కు దీనిపై సమగ్ర నివేదిక పంపారు. యాప్‌లోని ఇబ్బందులు మొదలుకుని అన్ని అంశాలపై సమగ్ర నివేదిక పంపారు. -
లక్షల్లో అవినీతి... వందల్లో రికవరీ
సాక్షి, సోమశిల: జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో ఏడాది కాలంపాటు జరిగిన అభివృద్ధి పనులకు సంబంధించి గ్రామీణ స్థాయిలో నిర్వహించిన సామాజిక తనిఖీ బృందం లక్షల్లో అవినీతిని వెలికితీస్తే చర్యలు చేపట్టాల్సిన అధికారులు మమ అంటూ వందల్లో రికవరీలు చూపుతూ తూతూ మంత్రంగా ప్రజావేదికను నిర్వహించారు. అధికారుల తీరుపై సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అనంతసాగరం మండలంలో గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు ఉపాధిహామీ పథకం కింద 3,686 అభివృద్ధి పనులను 24 పంచాయతీల్లో చేపట్టారు. ఇందుకు సంబంధించి రూ.1,00,5,38,311 నిధులు విడుదల చేశారు. పది రోజులుగా స్టేట్ ఉపాధిహామీ సామాజిక తనిఖీ మానిటరింగ్ అధికారి దుర్గమ్మ పర్యవేక్షణలో మండలంలోని అన్ని గ్రామాల్లో సామాజిక తనిఖీలు నిర్వహించి ఆయా గ్రామాల్లో గ్రామసభలు ఏర్పాటు చేసి అవినీతిని వెలికితీశారు. అనంతసాగరంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద సామాజిక తనిఖీ ప్రజావేదికను సోమవారం ఏర్పాటు చేశారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ అడిషనల్ పీడీ నాసర్‌రెడ్డి పర్యవేక్షణలో గ్రామ పంచాయతీ స్థాయిలో జరిగిన విచారణను ఆడిట్ బృందం వెల్లడించారు. సోమశిల నుంచి మొదలుపెట్టి అన్ని గ్రామాలకు రాత్రి వరకు కొనసాగుతున్నాయి. ఉపాధిహామి పథకం కింద జరిగిన అభివృద్ధి పనుల వివరాలను ఆయా పనుల వద్ద బోర్డులు ఏర్పాటు చేసేందుకు ఆయా పంచాయతీల్లో బోర్డుల నిమిత్తం నగదు మళ్లించాల్సి ఉండగా మండలం మొత్తానికి ఒకే వ్యక్తి ఖాతాలో దాదాపు రూ.4 లక్షలు అప్పటి ఎంపీడీఓ ఐజాక్ ప్రవీణ్ మళ్లీంచడం ఏమిటంటూ మాజీ ఎంపీపీ కమతం శోభ అధికారులను ప్రశ్నించారు. రసాభాస ప్రజావేదికలో అమనిచిరువెళ్ల ఫీల్డ్ అసిస్టెంట్ అవినీతి అక్రమాలను తెలియచేసేందుకు అధిక సంఖ్యలో కూలీలు వచ్చి అధికారులకు వెల్లడించబోగా ఆయన వారించడంతో సభలో రసాభసా చోటు చేసుకుంది. కూలీలతో అసభ్యకరంగా మాట్లాడడంతోపాటు సొంత వాళ్లకు ఇష్టం వచ్చినంత కూలీలు వేస్తూ పనులకు రాకపోయినా వ్యాపారులు చేసుకునేవాళ్లకు కూడా ఉపాధి కూలీలుగా చిత్రీకరించడం, అవినీతిని ఆడిట్ బృందం వెల్లడి చేయగా అధికారులు అతనికి వంతు పాడడంతో ఒక్కసారి ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి సర్థుబాటు చేశారు. మాజీ సర్పంచ్ వనిపెంట రమణారెడ్డి, మాజీ ఎంపీపీ కమతం శోభలు గ్రామంలో జరుగుతున్న అవినీతిని నిగ్గుతేల్చాలంటూ పట్టుబట్టారు. దీంతో ఏపీడీ నాసరయ్య మరో 10 రోజుల్లో గ్రామంలో ప్రజావేదిక నిర్వహించి అందరికి న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇవ్వడంతో సభ సద్దుమణిగింది. అనంతసాగరం పంచాయతీలో పలు అవినీతి ఆరోపణలతోపాటు ఇరువురు ప్రభుత్వ ఉద్యోగులకు గృహ నిర్మాణశాఖ ద్వారా పక్కా ఇళ్లు మంజూరు చేసి ఉపాధి నిధులు మంజూరు చేయడం పట్ల మాజీ ఎంపీపీ అధికారులను నిలదీశారు. దీంతోపాటు ఇంకుడుగుంతల నిర్మాణంలో కూడా ఉపాధి సిబ్బంది చేతివాటం ప్రదర్శించారని, వాటిపై అధికారులు చర్యలు చేపట్టకపోవడం ఏమిటంటూ నిలదీశారు. శంకరనగరంలో లక్షలాది రూపాయల ఉపాధి, పంచాయతీరాజ్, ఐకేపీ, గృహ నిర్మాణశాఖ ద్వారా నిధులు మంజూరయ్యాయని వాటిలో లక్షల రూపాయల అవినీతి జరిగిందంటూ గ్రామ వైఎస్సార్సీపీ నాయకుడు పార్లపల్లి రవికుమార్‌రెడ్డి అధికారులకు తెలియచేశారు. ఆడిట్ బృందం గ్రామంలో చేపట్టిన నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అధికారులు ఉపాధి సిబ్బందికి వత్తాసు పలుకుతున్నారని రవికుమార్‌రెడ్డి ధృజమెత్తారు. రాత్రి వరకు పలు గ్రామాల్లో జరిగిన ఆడిట్‌పై ప్రజావేదిక కొనసాగింది. ఈ కార్యక్రమంలో జిల్లా డ్వామా విజిలెన్స్ అధికారి వెంకటేశ్వరరావు, ఏపిడి మృదుల ఆడిట్ బృందం కోనయ్య, లోకేష్, ఎంపీడీఓ మధుసూధన్, ఇతర మండలస్థాయి అధికారులు పాల్గొన్నారు. -
‘ఉపాధి’ ఊసేది!
సాక్షి, ధరూరు: వలసలను నివారించి ఉన్న ఊళ్లోనే ఉపాధి పనులు కల్పించాలనే సంకల్పంతో ప్రారంభమైన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు ఆ శాఖ అధికారులు తీరు కారణంగా నీరుగారిపోతోంది. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఉపాధి హామీ పనులు జోరుగా సాగుతుండగా.. మండలంలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ముందు నుంచి ఆ శాఖ అధికారులు మండలంలో కూలీలకు పనులు కల్పించడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. అసలే వర్షాలు లేక ఇళ్ల ఉంటున్నామని, దీంతో జీవనోపాధికి ఇబ్బందిగా ఉందని ఉపాధి పనులు ప్రారంభించాలని అధికారులను కోరుతున్నా పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల ఉపాధి కూలీలు ఆరోపిస్తున్నారు. మండలంలో ఇదీ పరిస్థితి... మండలంలో మొత్తం 28 పంచాయతీలకు గాను 18 వేల జాబ్ కార్డులు ఉన్నాయి. గ్రామాల్లో నామమాత్రంగా పనులు కల్పింస్తున్నారు. కూలీలకు పూర్తిస్థాయిలో పనులు కల్పించాలనే ఆలోచన కలగడం లే దు. 28 పంచాయతీలకు గాను దాదాపు స గం గ్రా మాల్లో పనులు జరగడం లేదు. పనులు కల్పించాలని ఉపాధి ఏపీఓను, ఫీల్డ్ అసిస్టెంట్లను కోరుతున్నా.. పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నా యి. వర్షాలు కురవకపోవడంతో కూలీలు ఇళ్లలో ఉంటున్నారు. కనీసం ఉపాధి పనులైనా కల్పిస్తే జీవనం గడుస్తుందని కూలీలు భావిస్తున్నారు. కలెక్టర్‌ను కలిసేందుకు.. ఉపాధి పనులు ప్రారంభించాలని రెండు నెలలుగా ఈజీఎస్ అధికారులను కోరుతున్నా.. ప్రారంభం చేయడం లేదని కోతులగిద్ద, అల్వాలపాడు, మైలగడ్డ గ్రామాల కూలీలు ఆరోపిస్తున్నారు. వర్షాలు లేక పనులు దొరక్క ఇబ్బందులు పడుతున్నామని పలుమార్లు, ఈజీఎస్ ఏపీఓ అనిల్, ఎంపీడీఓ జబ్రాను కోరుతున్నా వారి నుంచి ఎలాంటి స్పందన రావడం లేదని ఆరోపిస్తున్నారు. రేపు మాపు అంటూ పబ్బం గడుపుతున్న అధికారుల తీరును నిరసిస్తూ.. జిల్లా కేంద్రంలో నిర్వహించే ప్రజావాణిలో కలెక్టర్‌ను కలిసి తమ గోడును చెబుతామని కూలీలు వాపోతున్నారు. ఎమ్మెల్యే హెచ్చరించినా.. గత నెలలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఉపాధి అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. పనులు కల్పించకపోతే ఎదురయ్యే పరిణామాలకు తాము బాధ్యులం కాదని హెచ్చరించినా.. వారిలో మార్పు రావడం లేదు. కార్యాలయానికి వచ్చి కేవలం హాజరు వేసుకుని వెళ్తున్న ఆ శాఖ అధికారులకు నిద్ర మత్తు వీడడం లేదని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో.. వరుస ఎన్నికల నేపధ్యంలో కేవలం ఉపాధి శాఖలో మాత్రమే నిధులు ఉన్నాయని, కొన్ని వందల రకాల పనులు కల్పించే అవకాశాలు ఉన్నా.. ఎందుకు పనులు కల్పించడం లేదో అర్థం కావడంలేదని వారి తీరుపై సభలోనే ఎమ్మెల్యే గట్టిగా హెచ్చరించారు. కానీ ఈజీఎస్ అధికారులు మాత్రం పాత పద్ధతినే అవలంభిస్తున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదు నెల రోజులుగా ఉపాధి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. రేపు మాపు అంటూ కాలయాపన చేస్తున్నారు. గ్రామంలో పనులు లేక జీవనోపాధికి ఇబ్బందిరంగా ఉంది. ఈసారి వర్షాలు కురవలేదు. మున్ముందు ఇంకెన్ని ఇబ్బందులు పడాలో తెలియడం లేదు. ప్రజావాణిలో కలెక్టర్‌ను కలిసి గోడును వెళ్లబోసుకోవాలనుకుంటున్నాం. – సారంబండ వెంకటేష్, కోతులగిద్ద -
‘కూలి’పోతోంది
సాక్షి, రాజమహేంద్రవరం: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (ఎన్ఆర్ఈజీఎస్)లో పని చేస్తున్న కూలీల కష్టానికి సకాలంలో ఫలం దక్కడం లేదు. ఉపాధి లేని సమయంలో పేదలకు పనులు చూపించాలన్న ముఖ్య ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఎన్ఆర్ఈజీఎస్ జిల్లాలో ఒడుదొడుకులను ఎదుర్కొంటోంది. పని చేసిన వారం కూలి డబ్బు మరో వారం తిరిగేకల్లా రావాల్సి ఉండగా జిల్లాలో రెండున్నర నెలలుగా అందడం లేదు. జిల్లాలో ఇప్పటి వరకు రూ.52 కోట్ల మేర బకాయిలు పెడుతూ ‘ఇదిగో అదిగో’ అంటూ క్షేత్రస్థాయి సిబ్బంది చెబుతున్న మాటలతో బడుగుజీవులు బ్యాంకుల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. వీరి వెతలకు అండగా ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఈ నెల 13వ తేదీన రాజానగరం నియోజకవర్గంలో ఆ పార్టీ కేంద్రపాలక మండలి సభ్యురాలు, నియోజకవర్గ కో ఆర్డినేటర్ జక్కంపూడి విజయలక్ష్మి రాజానగరంలో కూలీలతో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలో అనూహ్య స్పందన రావడంతో జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ తరహా కార్యక్రమాలు చేపట్టడానికి శ్రీకారం చుడుతున్నారు. బకాయిలతో తగ్గిపోతున్న కూలీల సంఖ్య... ఆ వారంలో చేసిన మస్తర్లను అధికారులు వారాంతంలో నమోదు చేస్తున్నారు. వారం రోజుల కూలి డబ్బు మరో వారం తిరిగే కల్లా కూలీల ఖాతాల్లో జమకావాల్సి ఉంది. జిల్లాలో 6.5 లక్షల కుటుంబాలకు ఉపాధి జాబ్ కార్డులు జారీ చేశారు. ఇందులో గడచిన ఆరు నెలల్లో 3.61 లక్షల కుటుంబాలు ఉపాధి పనుల్లో పాల్గొన్నాయి. 2017–18 ఆర్థిక సంవత్సరంలో 1,86,75,000 పని దినాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకోగా ఈ నెల 11వ తేదీ వరకు 1,38,73,000 పని దినాలు కల్పించారు. ఇందుకుగాను రూ.225 కోట్లు కూలీలకు చెల్లించాల్సి ఉండగా రూ.173 కోట్లు మాత్రమే చెల్లింపులు జరిగాయి. జూలై ఆఖరి వారం నుంచి రెండున్నర నెలలుగా రూ.52 కోట్ల మేర చెల్లింపులు నిలిచిపోయాయి. బ్యాంకుల ముందు పడిగాపులు... గతంలో పోస్టాఫీసుల ద్వారా జరిగే ఉపాధి కూలీ నగదు చెల్లింపులు 2014 నుంచి కూలీల బ్యాంకు ఖాతాలకు జమ చేయడం ప్రారంభించారు. బ్యాంకు ఖాతా తీసుకున్న తర్వాతే కొత్తగా జాబ్ కార్డులు జారీ చేస్తున్నారు. కూలీల బ్యాంకు ఖాతాలకు వారి ఆధార్‌ను అనుసంధానం చేయాలన్న నిబంధనతో కూలీలకు కొత్త సమస్యలు వచ్చాయి. రెండు మూడు ఖాతాలున్న వారు అధికారులకు ఒక ఖాతా నంబరు ఇచ్చి బ్యాంకులో మరో ఖాతాకు తమ ఆధార్ నంబర్‌ను ఇవ్వడంతో సమస్య జటిలమవుతోంది. ఆధార్ నంబర్ అనుసంధానం కాలేదని అధికారులు చెబుతుండగా, తాము బ్యాంకులో ఇచ్చామని కూలీలు వాపోతున్నారు. ఆధార్ అనుసంధానం కాని కూలీలకు ఐదారు నెలలుగా చెల్లింపులు ఆగిపోయాయి. అందుకు సంబంధించిన నగదు కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలైనా అధార్ అనుసంధాన సమస్యతో కూలీలకు చేరడంలేదు. ఫలితంగా నగదు కోసం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కేంద్ర బృందం పర్యటించినా ఫలితం శూన్యం... జిల్లాలో ఉపాధి హామీ పనుల తీరు పరిశీలించేందుకు గత నెల్లో కేంద్ర బృందం జిల్లాలో పర్యటించింది. ఏజెన్సీ, ఆ తర్వాత మెట్ట ప్రాంతంలో ఉపాధి పనులు ఎక్కువగా జరుగుతున్నాయని గమనించింది. ఆ సమయంలో కూలీలు తమకు గతంలోలాగే పోస్టాఫీసుల ద్వారా నగదు చెల్లించాలని విన్నవించుకున్నారు. పనులు మానుకుని వారానికి ఓ రోజు పట్టణాల్లోని బ్యాంకుల వద్దకు వెళ్లాల్సి వస్తోందని వాపోయారు. గ్రామంలో ఉండే పోస్టాఫీసయితే రోజులో ఏదో ఒక సమయంలో వెళ్లి కూలీ డబ్బులు తెచ్చుకుంటామని కేంద్ర బృందానికి విన్నవించారు. ప్రతి వారం డబ్బులు చెల్లించాలని విన్నవించినా పరిస్థితి మారలేదు. వారంలో బకాయిల చెల్లింపులు జిల్లాలో రెండున్నర నెలలుగా ఉపాధి కూలీల నగదు బకాయిలు ఉన్నాయి. ఏ వారానికి ఆ వారం మేము బిల్లులు పంపిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కావాల్సి ఉంది. వారంలో వస్తాయని మాకు సమాచారం ఉంది. బ్యాంకు ఖాతాతో ఆధార్ లింకేజీ సమస్య ప్రభుత్వం దృష్టిలో ఉంది. సమస్యను పరిష్కరించేందుకు గత నెల నుంచి మండల అభివృద్ధి అధికారికి అధికారాలిచ్చాం. కంప్యూటర్ ఆపరేటర్లకు గత నెల 27, 28 తేదీల్లో ఈ విషయంపై శిక్షణ ఇచ్చాం. కూలీల ఆధార్ లింకేజీ సమస్య ఆయా మండలాల్లోని ఎంపీడీవో కార్యాలయాల్లోనే పరిష్కరించేలా చర్యలు చేపట్టాం. – జి.రాజకుమారి, ప్రాజెక్టు డైరెక్టర్, డ్వామా మొక్కలు నాటి ఏడావుతోంది... మొక్కలు నాటి ఏడాదవుతోంది..ఇంతవరకు కూలీ ఇవ్వలేదు, ఎప్పుడు అడిగినా అదిగో వస్తుంది, ఇదిగో వస్తుందంటున్నారేగాని కూలీ మాత్రం ఇవ్వడం లేదు. కూలీ ఇవ్వని పనికెందుకని ఉపాధికి పనికి పోవడం మానేశాను. – మేడిద శ్రీరాములు, రాధేయపాలెం, రాజానగరం మండలం. రెండు నెలల కూలీ రాలేదు బోదెలు పని చేశాం. రెండు నెలలవుతోంది. అధికారులను అడిగితే పై నుంచి డబ్బులు రాలేదని చెబుతున్నారు. కూలీ లేకపోతే మేము ఏం తినాలి. ఏం తాగాలి. అప్పులు చేసి తిని పనికి వెళుతున్నాం. డబ్బులు ఎప్పటికప్పుడు వస్తే మాకు ఇబ్బందులుండవు. – బి.ప్రేమ్ శేఖర్, ఉపాధి కూలీ, రంపచోడవరం -
‘ఉపాధి’ నిర్లక్ష్యంపై ఆగ్రహం
73 మందిపై వేటు 10 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, 63 మంది సీనియర్ మేట్స్ తొలగింపు అనంతపురం అగ్రికల్చర్: ఉపాధి హామీ పథకం అమలులో నిర్లక్ష్యం వహించిన 73 మందిపై వేటు వేస్తూ గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు బుధవారం కమిషనరేట్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏడాది కాలంలో ఒక గ్రామ పంచాయతీ పరిధిలో కనీసం 10 వేల పనిదినాలు కూడా కల్పించకపోయిన ఫీల్డ్ అసిస్టెంట్లు, సీనియర్ మేట్స్‌ను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు డ్వామా కార్యాలయ వర్గాలు తెలిపాయి. అందులో 10 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఉండగా మిగతా 63 మంది సీనియర్ మేట్స్ ఉన్నారు. జిల్లా అధికారుల ప్రమేయం లేకుండా ఆన్లైన్ నివేదికల ఆధారంగా వేటు వేసినట్లు చెబుతున్నారు. ఉపాధి హామీ పథకం అమలులో నిర్లక్ష్యం వహించిన 73 మందిపై వేటు వేస్తూ గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. బొమ్మనహాల్, గుత్తి, హిందూపురం, మడకశిర, శింగనమల, తాడిమర్రి, తనకల్లు, ఉరవకొండ మండలాల్లో ఒక్కరు చొప్పున, సోమందేపల్లి మండలంలో ఇద్దరు ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించారు. సీనియర్ మేట్స్ విషయానికి వస్తే... హిందూపురం మండలంలో ఆరుగురు, మడకశిరలో ఐదు మంది, అనంతపురం, రొద్దం, ఉరవకొండ, విడపనకల్లు మండలాల్లో నలుగురు చొప్పున, గుంతకల్లు, కనేకల్లు మండలాల్లో ముగ్గురు చొప్పున, బొమ్మనహాళ్, గుత్తి, కొత్తచెరువు, లేపాక్షి, పరిగి, పెద్దవడుగూరు, పుట్టపర్తి, శెట్టూరు, సోమందేపల్లి మండలాల్లో ఇద్దరు చొప్పన తొలగించారు. ఇక బ్రహ్మసముద్రం, గోరంట్ల, కుందుర్పి, గార్లదిన్నె, కంబదూరు, నల్లచెరువు, నార్పల, పెద్దపప్పూరు, పెనుకొండ, పుట్లూరు, రాప్తాడు, తాడిపత్రి మండలాల్లో ఒక్కొక్కరిని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి.