మరోసారి బట్టబయలైన రఘురామ, చంద్రబాబు బంధం | Once Again Exposed Raghurama Krishna Raju Chandrababu Bond | Sakshi
Sakshi News home page

ఏపీ ప్రయోజనాలకు ‘చంద్ర’ గ్రహణం

Published Mon, Aug 16 2021 3:27 AM | Last Updated on Mon, Aug 16 2021 9:16 AM

Once Again Exposed Raghurama Krishna Raju Chandrababu Bond - Sakshi

సాక్షి, అమరావతి: తమ స్వార్థ రాజకీయాల కోసం పేదల నోటికాడ కూడును సైతం లాగేసే స్థాయికి రాష్ట్రంలోని ప్రతిపక్షాల రాజకీయం దిగజారింది. నిబంధనల ప్రకారం రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు ప్రతిపక్ష నేతలు మోకాలడ్డుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో కొంతకాలంగా సన్నిహితంగా మెలుగుతున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఏకంగా  రాష్ట్రానికిచ్చిన నిధులను వెనక్కి తీసుకోవాలంటూ కేంద్ర మంత్రికి లేఖ రాశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్‌కు సంబంధించి సీబీఐ కోర్టులో రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌ వ్యవహారంలో చంద్రబాబు–రఘురామకృష్ణరాజు మధ్య గల సంబంధాలు ఆధారాలతో సహా ఇటీవల బయటపడిన విషయం తెలిసిందే.  

పేదలకు ‘ఉపాధి’ని దూరం చేసే కుట్ర 
ఉపాధి హామీ పథకం కింద మన రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులను వెనక్కి తీసుకోవాలంటూ రఘురామకృష్ణరాజు ఈ ఏడాది మార్చి 16న కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌కు లేఖ రాశారు. దీంతో  ఆ లేఖకు సంబంధించి సమగ్ర నివేదిక పంపాలంటూ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అండర్‌ సెక్రటరీ స్థాయి అధికారి రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌కు లేఖ రాశారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా గత ఏడాది రూ.1,700 కోట్లు బకాయిల రూపంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు రావాల్సి ఉండగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే రూ.3 వేల కోట్లు అందాల్సి ఉంది.

ఈ నిధులను రాబట్టేందుకు వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఎప్పటికప్పుడు కేంద్ర మంత్రులను కలిసి నిధులను రప్పించేందుకు ప్రయత్నిస్తుండగా.. రాష్ట్రానికి చెందిన కొందరు ప్రజాప్రతినిధులే ఆ నిధులను వెనక్కి  తీసుకోవాలని లేఖలు రాస్తుండటం కేంద్ర ప్రభుత్వ అధికారులకు అలుసుగా మారిందని చెబుతున్నారు. ఇలాంటి లేఖల ద్వారా పేదల కడుపు కొట్టడమే కాకుండా.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అల్లరి పాల్జేయాలని ప్రయత్నించడంపై ప్రజలు ఛీ కొడుతున్నారు. ఈ పరిస్థితుల వల్ల రాష్ట్రానికి ఇవ్వాల్సిన దాదాపు రూ.4,700 కోట్లను విడుదల చేయకుండా కేంద్రం తాత్సారం చేస్తోందని అధికార వర్గాల్లో చర్చ నడుస్తోంది. 

కరోనా రోజుల్లో 80 లక్షల మందికి లబ్ధి చేకూర్చేలా.. 
కరోనా మహమ్మారి వేళ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న పనులు పేదలకు ఊరటనిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంతోపాటు ఈ ఏడాది కూడా పట్టణాల్లో చిన్నచిన్న పనులు చేసుకుని జీవించే వారు కరోనా కారణంగా తమ గ్రామాలకు తిరిగి వెళ్లారు. ఇలాంటి పరిస్థితుల్లో పేదలకు ఉపాధి హామీ పథకం పనులే కొండంత ఆసరాగా నిలుస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రంలో 79.80 లక్షల మంది ఉపాధి హామీ పనులు చేసుకుని ఆదాయం పొందగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 72.64 లక్షల మంది పేదలు ఆ పనులు చేసుకుని లబ్ధి పొందారు.

రాష్ట్రంలో ప్రస్తుతం వివిధ శాఖల నిధులకు తోడు ఉపాధి హామీ పథకం మెటీరియల్‌ కేటగిరీ నిధుల అనుసంధానంతో గ్రామీణ ప్రాంతాల్లో 46,861 భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రాతినిధ్యం వహిస్తున్న నరసాపురం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లోనే రూ.311 కోట్ల విలువ చేసే 1,408 భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.  


కేంద్రానికి రఘురామకృష్ణరాజు రాసిన లేఖ ప్రతులు

‘స్లీపర్‌ సెల్స్‌’ ద్వారా మాటువేసి విధ్వంసానికి తెగబడటం ఉగ్రవాద సంస్థలు అనుసరించే పన్నాగం. వ్యవస్థలు, సంస్థల్లో తనవారిని జొప్పించి రాజకీయ లబ్ధికి వాడుకోవడం చంద్రబాబు అనుసరించే వ్యూహం. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీయడానికి.. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడానికి బాబు ప్రస్తుతం ఇదే ఎత్తుగడలను అమలు చేస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఈ విషయాన్ని ఎంపీ రఘురామ కేంద్రానికి రాసిన లేఖ తేటతెల్లం చేస్తోంది. 

ఓట్లేసిన వారిని కాదని టీడీపీ అవినీతికి మద్దతు 
రఘురామకృష్ణరాజు ఓట్లు వేసి తనను గెలిపించిన ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టి తన నియోజకవర్గంలో గ్రామాల్లో జరుగుతున్న 1,408 పనులకు సంబంధించి రూ.311 కోట్ల నిధులు రాకుండా కేంద్ర మంత్రికి లేఖ రాయడంపై రాజకీయ, అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. 2019 ఎన్నికలకు 8 నెలల ముందు అప్పటి టీడీపీ సర్కారు నిధులు అందుబాటులో లేకపోయినా ఆ పార్టీ కార్యకర్తలకు రూ.2 వేల కోట్ల విలువ చేసే పనులను మంజూరు చేసి, అవి పూర్తయినట్టు బిల్లులు కూడా సిద్ధం చేసింది. దానిపై తీవ్ర ఆరోపణలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్‌ విచారణకు ఆదేశించింది.

అప్పట్లో జరిగిన 11,573 పనులను తనిఖీ చేయగా.. 7,326 పనుల్లో అవినీతి జరిగినట్టు నిర్ధారణ అయింది. అందులో దాదాపు సగం పనులు నూటికి నూరు శాతం నాసిరకమైనవిగా తేలింది. టీడీపీ నేతల అవినీతికి మద్దతుగా నిలిచిన రఘురామకృష్ణరాజు వారికి ఈ ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదంటూ ఫిర్యాదు చేస్తూ.. రాష్ట్రానికిచ్చిన నిధులను వెనక్కి తీసుకోవాలని కేంద్ర మంత్రికి రాసిన లేఖలో కోరడాన్ని చూసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement