అక్రమార్కులకు ఉపాధి
– ఉపాధి హామీ పథకంలో యథేచ్ఛగా అక్రమాలు
– సామాజిక తనిఖీల్లో బయటపడుతున్న వైనం
– ఇప్పటిదాకా రూ.3.69 కోట్లు దుర్వినియోగమైనట్లు నిర్ధారణ
– రికవరీ మాత్రం రూ 47.55 లక్షలే
అనంతపురం టౌన్ : వలసలను నివారించి ఉన్న ఊరిలోనే ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో తీసుకొచ్చిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అక్రమార్కులకు వరంగా మారుతోంది. ఉపాధి పనుల మాటున భారీ కుంభకోణానికి పాల్పడుతున్నారు. కింది స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు ముడుపుల భాగస్వామ్యం ఉండడంతో రికవరీలపై దృష్టి సారించడం లేదు. సామాజిక తనిఖీల్లో బయటపడుతున్న అవినీతిని పరిశీలిస్తే దోపిడీ ఏ స్థాయిలో ఉంటోందో అర్థమవుతోంది. జిల్లాలో 7,81,124 లక్షల మందికి జాబ్‌కార్డులు అధికారులు జారీ చేశారు.
శ్రమశక్తి సంఘాలు 47,226 వేల వరకు ఉన్నాయి. అందులో సభ్యులుగా 7,77,176 లక్షల మంది ఉన్నారు. కరువుకు నిలయంగా మారిన ఈ జిల్లాలో పనులను పూర్తి స్థాయిలో కల్పించాల్సిన అధికారులు ఏటా విఫలమవుతున్నారు. అన్ని దశల్లో నిధులను దోచుకోవడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా కూలీలకు ఉపాధి కల్పించాల్సిన పథకం కాస్తా సిబ్బంది, అధికారుల జేబులు నింపుకునే పథకంగా మారుతోంది. సామాజిక తనిఖీ బృందాలు క్షేత్రస్థాయికి వెళ్లి ‘లెక్క’లు తోడితే అక్రమార్కుల నుంచి తిరిగి రాబట్టి ప్రభుత్వ ఖజానాకు జమ చేసే పరిస్థితి కన్పించడం లేదు.
దీంతో రూ.కోట్ల మొత్తం ఉపాధి సిబ్బంది జేబుల్లో మూలుగుతోంది. అక్రమాల పరంపర ఇంతగా సాగుతున్నా అధికారులు మాత్రం నోటీసులు జారీ చేశామని, చర్యలు తీసుకుంటామన్న ధోరణిలోనే వెళ్తున్నారు. అక్రమాల బాగోతం వెనుక ఉన్నతాధికారుల హస్తం ఉండడం వల్లే వారు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అందువల్లే దుర్వినియోగమైన మొత్తానికి తిరిగి స్వాధీనం చేసుకున్న మొత్తానికి పొంతన ఉండడం లేదన్నది బహిరంగ సత్యం.
రూ.కోట్లలో స్వాహా..రూ.లక్షల్లో రికవరీ
జిల్లాలోని 63 మండలాలున్నాయి. ఇప్పటి వరకు ఎనిమిది విడతలుగా సామాజిక తనిఖీలు నిర్వహించారు. ప్రస్తుతం తొమ్మిదో విడత తనిఖీలు జరుగుతున్నాయి. ఈ ఎనిమిది విడతల సామాజిక తనిఖీల్లో రూ. 3,69,89,246 కోట్ల మొత్తం దుర్వినియోగం అయినట్లు డ్వామా అధికారులు చెబుతున్నారు. ఇందులో రూ 47,55,998 లక్షలను మాత్రమే వసూలు చేశాశారు. దుర్వినియోగమైన మొత్తానికి, వసూలు చేసిన మొత్తానికి ఎక్కడా పోంతన లేదు. ఎనిమిది విడతలల్లో బయట పడిన అవినీతిలో ఇంకా రూ.3,22,23,257 రికవరీ చేయాల్సి ఉందని అధికారులే చెబుతున్నారు.
కాగా అధికారులు ధ్రువీకరించిన మొత్తం ఇలా ఉంటే సామాజిక తనిఖీ బృందం తేల్చిన లెక్కలు రూ.40 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది. తనిఖీలు పెరిగే కొద్దీ అక్రమాల వాటా కూడా పెరుగుతోంది. తాజాగా జరుగుతున్న తొమ్మిదో విడతలో కూడా భారీ ఎత్తున ‘ఉపాధి’ సొమ్ము స్వాహా చేస్తున్నట్లు తనిఖీల్లో వెల్లడవుతోంది. ఈ విషయమై డ్వామా పీడీ నాగభూషణంను ‘సాక్షి’ సంప్రదించగా.. ‘ఉపాధి పనుల్లో అవినీతికి పాల్పడుతున్న వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. సామాజిక తనిఖీల్లో తేలిన సొమ్మును రికవరీ చేస్తాం. నోటీసులు జారీ చేసి చర్యలు చేపడతాం. అక్రమాలకు పాల్పడుతున్న వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు’ అని చెప్పారు.