భువన్ నిఘా
Published Mon, Jan 9 2017 1:52 AM | Last Updated on Fri, Oct 5 2018 6:29 PM
ఏలూరు (మెట్రో) : ‘భువన్’ భారత ప్రభుత్వం ఇస్రోతో తయారు చేయించిన ప్రత్యేక మొబైల్ యాప్. మహాత్మాగాంధీ జాతీ య గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం దీనిని అమలులోకి తీసుకొచ్చింది. ఇక నుంచి ఉపాధి హామీ పనులపై సాంకేతిక పర్యవేక్షణ కొనసాగనుంది. పూర్తి చేసిన పనుల వివరాలను భువన్ యాప్ ద్వారా అంతర్జాలంలో నమోదు చేస్తారు. దీనిని ‘జియో మన్రె’గా పిలుస్తారు. ఇప్పటివరకూ పూర్తి చేసిన పనులను జియో మన్రెలో నమోదు చేయకపోవడంతో కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధుల మం జూరు ఆగిపోయింది. అందుకే ఆగమేఘాలపై పనుల వివరాలు భువన్ యాప్ ద్వారా జియోమన్రెగా వెబ్‌లోకి అప్‌లోడ్ చేస్తున్నారు. వచ్చే ఏప్రిల్ నుంచి రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం పనులన్నింటినీ తప్పనిసరిగా భువన్ యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది.
జిల్లాలో కోటిపైనే పనిదినాలు
జిల్లాలో 5 లక్షల 37 వేల మంది జాబ్‌కార్డుల ద్వారా ఉపాధి హామీ పనులు పొందుతున్నారు. వీరికి రు.194 కనీస వేతనంగా రోజుకు చెల్లిస్తున్నారు. ఇప్పటి వరకూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 96 లక్షల పనిదినాలు కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించారు. అయితే వాటికి మించి 1.06 కోట్ల పనిదినాలు కల్పించారు. ఈ పనులన్నింటినీ గత నెల మొదటి నుంచి భువన్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. దీనిని ఉద్యమంలా చేపడుతున్నట్టు డ్వామా అధికారులు చెబుతున్నారు.
ఎవరైనా చూడొచ్చు
ఇప్పటివరకూ జిల్లాలో పూర్తి చేసిన ఉపాధి పనులన్నీ భువన్ యాప్ ద్వారా వెబ్‌లోకి అప్‌లోడ్ చేయాలి. ఈ పనిని సాంకేతిక సహాయకులు (టీఏ), క్షేత్ర సహాయకులు (ఎఫ్‌ఏ)లకు అప్పగిం చారు. వీరందరకూ ఇప్పటికే ఈ భువన్ యాప్‌లోకి జిల్లాలోని పనులను అప్‌లోడ్ చేస్తున్నారు.
అవినీతిని అడ్డుకునేలా..
ఇప్పటి వరకూ నిర్వహించిన గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనులను ఇకనుంచి ఫొటో తీసి భువన్ యాప్ ద్వారా అప్‌లోడ్ చేయాల్సిందే. దీని వల్ల ఎటువంటి అవినీతికి ఆస్కారం ఉండదు. జిల్లాలో సిమెంట్ రోడ్లు నిర్మాణం చేపట్టినా, చెరువు పనులు నిర్వహించినా ప్రతి పనీ ఫొటోలు తీసి, దానికి సంబంధించిన వివరాలు యాప్ ద్వారా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. – ఎం.వెంకటరమణ, డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్
Advertisement
Advertisement