జిల్లాలో ఖరీఫ్ వరి పనులు పూర్తికావస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో ఉపాధి హామీ పనుల జాతర ఆరంభం కానుంది. వేతనదారులకు చేతినిండా పనిదొరకనుంది. ఈ మేరకు పనుల గుర్తింపు ప్రక్రియను అధికార యంత్రాంగం పూర్తి చేసింది. వాటి ఆమోదానికి గ్రామ సభలు చురుగ్గా నిర్వహిస్తోంది. ఆమోదం తెలిపిన పనులు చేపట్టేందుకు ఉత్తర్వులు జారీ చేస్తోంది.
విజయనగరం: ఉన్న ఊరిలో ఉపాధి కల్పించి వలసలు నివారించాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగాస్వామ్యంతో అమలవుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకం సత్ఫలితాలు ఇస్తోంది. ఏడాదికి ఏడాదికి పెరుగుతోన్న లక్ష్యాలే దీనికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో ‘ఉపాధి’ జాతర ప్రారంభం కానుంది. కొత్త ఆర్థిక సంవత్సరంలో వేతనదారుల్లో నూతన ఉత్సాహాన్ని నింపనుంది. లక్షలాది మంది వేతనజీవులకు అధిక పనిదినాలు దొరకనున్నాయి. దీనికోసం ఇప్పటికే పనుల గుర్తింపు ప్రక్రియ పూర్తయింది. ఇక పనుల ఆమోదానికి గ్రామసభలు కొనసాగుతున్నాయి. అవి ఆమోదం పొందడమే తరువాయి.
పనుల కల్పన ఇలా...
2020–21 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో ఉపాధిహామీ పనులు చేపట్టేందుకు అధికారులు కార్యాచరణను ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా రూ.1800 కోట్లతో అభివద్ధి పనులు చేపట్టేందుకు జిల్లా అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది. సుమారు 3.50 లక్షల మంది వేతనదారులకు 3 కోట్ల పనిదినాలు కలి్పంచేందుకు చర్యలు చేపడుతున్నారు. క్షేత్రస్థాయిలో గ్రామసభలు నిర్వహించి ప్రజలకు అవసరమైన పనులను జియోట్యాగింగ్ సాయంతో గుర్తించారు. ఇలా గుర్తించిన పనుల ప్రజామోదానికి మరోసారి గ్రామసభలు నిర్వహిస్తున్నారు. కొద్దిరోజుల్లో గ్రామసభలు ముగియనున్నాయి.
పనుల నిర్ణయం ఇలా...
గతంలో ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పనులు గుర్తించి అవసరమైన మేరకు పనులు చేసేవా రు. ఈ సారి మాత్రం గ్రామసభల్లో గుర్తించిన పనులకు గ్రామసభ ఆమోదం పొందుతారు. దీనికి సంబంధించి గ్రామసభ తీర్మానం అవసరం. గతంలో పంచాయతీ సర్పంచి తీర్మానించేవారు. కొత్త విధానం ప్రకారం ఉపాధిహామీ పథకంలో చేపట్టిన అన్ని పనులు కంప్యూటర్‌లో క్రోడీకరించాలి. అలా క్రోడీకరించిన అనంతరం తీర్మానాన్ని ఉపాధిహామీ పథకం వెబ్‌సైట్ నుంచి డౌన్Œలోడ్ చేసుకోవాలి. ఇలా తీసుకున్న తీర్మానాలను మండల పరిషత్ కార్యాలయానికి పంపించాలి. మండల పరిషత్ అధికారులు ఒక తీర్మానం చేసి జిల్లా నీటి యాజమాన్య సంస్థకు పంపాలి. అక్కడ పనులను పరిశీలించి జిల్లాస్థాయిలో తీర్మానం చేసి కలెక్టర్‌కు పంపుతారు. కలెక్టర్ పరిపాలన ఆమోదం లభించిన అనంతరం రానున్న ఆర్థిక సంవత్సరంలో పనులు చేపడతారు.
30 కేటగిరీల్లో 196 రకాల పనులు గుర్తింపు..
ఉపాధిహామీ పథకంలో 30 కేటగిరీల్లో 196 రకాల పనులను రానున్న ఆర్థిక సంవత్సరంలో చేపట్టేందుకు నిర్ణయించారు. ఈ పనుల్లో ఆయా గ్రామాల్లోని ప్రజలకు అవసరమైన 1.17 లక్షల పనులు గుర్తించారు. ఈ ఏడాది కొత్తగా గ్రామీణ పార్కులు, నర్సరీలు పెంచడం తదితర పనులకు ప్రాధాన్యమిచ్చారు. ప్రభుత్వ సంస్థల అభివృద్ధి, పిల్లకాలువలను మెరుగుపరచడం, భూ అభివృద్ధి పనులు, రహదారుల అభివృద్ధి తదితర పనుల గుర్తింపు ప్రక్రియ ముగిసింది. పనులను గ్రామ సభల్లో తీర్మానించే ప్రక్రియ చేపడుతున్నారు.
అధిక పనుల గుర్తింపు
2020–21 ఆర్థిక సంత్సరంలో జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకంలో రూ.1800 కోట్ల విలువ చేసే పనులను గుర్తించాం. ఆయా గ్రామ సభ ల్లో చర్చించి ఆమోదం పొందిన తరువాత పనుల మంజూరు ఆదేశాలు జారీ చేస్తాం. మొత్తం 1.17 లక్షల పనులు గుర్తించగా... 3 కోట్ల పనిదినాలు వేతనదారులకు కలి్పంచాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. ప్రస్తుత ఏడాది 2.65 కోట్ల పని దినాలు లక్ష్యం చేసుకోగా.. ఇప్పటి వరకు 1.86 కోట్ల పని దినాలు కలి్పంచాం.
– ఎ.నాగేశ్వరరావు, పీడీ, డ్వామా, విజయనగరం
Comments
Please login to add a commentAdd a comment