సాక్షి, తాడేపల్లి: కూటమి పాలనలో యథేచ్ఛగా ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధుల దుర్వినియోగం జరుగుతోందని, గ్రామాల్లో సర్పంచ్‌ల తీర్మానం లేకుండానే పనులకు ఆమోదం లభిస్తోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి ఆక్షేపించారు.
ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులను కూటమి పార్టీ నేతలు తమ సొంత నిర్మాణాలకు వాడుకుంటున్నారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఆరోపించారు. దీనిపై ఇప్పటికే హైకోర్టులో పిటిషన్లు వేసినట్లు చెప్పారు. కూటమి నేతలకు దమ్ముంటే, ఉపాధి హామీ నిధుల వినియోగంపై చర్చకు రావాలని రవీంద్రారెడ్డి సవాల్ చేశారు.
వెన్నపూస రవీంద్రారెడ్డి ఇంకా ఏమన్నారంటే..
కూటమి ప్రభుత్వం తన ఏడు నెలల పాలనలో రాష్ట్రానికి గుండెకాయ లాంటి పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసింది. ఎన్‌ఆర్‌ఈజీఎస్ పనులకు సంబంధించి గ్రామ పంచాయతీలో తీర్మానం చేసి ఎంపీపీకి పంపితే, వారు జిల్లా పరిషత్‌కి పంపితే జిల్లా పరిషత్ అధికారులు కలెక్టర్‌కు పంపడం అనేది నిబంధన. కానీ చట్టాన్ని యథేచ్ఛగా ఉల్లంఘించి అధికార పార్టీ ఎమ్మల్యేలు చెప్పిన వారికే పనులు కేటాయిస్తున్నారు. చివరకు ఉపాధి హమీ పథకంలో పని చేసే దాదాపు 12 వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించి వారి స్థానంలో టీడీపీ కార్యకర్తలను తెచ్చుకుంటున్నారు.
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ప్రతి పంచాయతీకి రూ.10 వేలు ఇస్తామని ఆర్బాటంగా ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, ఒక్క పంచాయతీకి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లుగానే కేంద్రం, ఆంధ్రప్రదేశ్‌కు కూడా రూ.1800 కోట్లు ఇస్తే, అది వారి ఘనత అన్నట్లు సీఎం, డిప్యూటీ సీఎం నిసిగ్గుగా ప్రచారం చేసుకున్నారు. వారికి నిజంగా గ్రామాల అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే 15వ ఆర్థిక సంఘం నుంచి వచ్చే నిధుల్లో అదనంగా ఒక్క రూపాయైనా తెచ్చారా?
ఇదీ చదవండి: ఇదీ వాస్తవం.. గణాంకాలతో సహా వివరించిన మార్గాని భరత్
గ్రామాల్లో సర్పంచ్‌ల తీర్మానం లేకుండా ఎమ్మెల్యేల సిఫార్సులతో ఎన్‌ఆర్‌ఈజీఎస్ పనులకు సంబంధించి నిధులు దుర్వినియోగం చేస్తున్నారు. అలా స్థానిక సంస్థల వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధుల విషయంలో తమ వైఖరి ఏమిటో ప్రభుత్వం ఇప్పటికైనా స్పష్టంగా చెప్పాలి.
అదే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో ప్రతి గ్రామంలో దాదాపు రూ.2 కోట్ల వరకు వెచ్చించి సచివాయాలు, హెల్త్ సెంటర్లు, ఆర్బీకేలు, మిల్క్ చిల్లింగ్ సెంటర్లు, డిజిటల్ లైబ్రరీల నిర్మాణం చేపట్టడం జరిగింది. అలా గ్రామాల్లో ప్రభుత్వ భవనాలు నిర్మించి సంపద సృష్టించాం. టీడీపీ కూటమి పాలనలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధుల దుర్వినియోగంపై మూడు జిల్లాల పరిధిలో జరిగిన పనులకు సంబంధించి ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించాం’’ అని వెన్నపూస రవీంద్రారెడ్డి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment