వెలుగులోకి టీడీపీ మరో అవినీతి బాగోతం.. | TDP Irregularities In Employment Guarantee Scheme Krishna District | Sakshi
Sakshi News home page

మొక్కల సొమ్ము మెక్కేశారు 

Published Sat, Jan 18 2020 8:31 AM | Last Updated on Sat, Jan 18 2020 8:31 AM

TDP Irregularities In Employment Guarantee Scheme Krishna District - Sakshi

పెనుగంచిప్రోలులో నాటకుండా వదిలేయడంతో ఎండిపోయిన మొక్కలు(ఫైల్‌)

సాక్షి, అమరావతి బ్యూరో: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌ఈజీఎస్‌) కింద వివిధ పనులకు ఏటా నిధులు విడుదలవుతాయి. ఈ నిధులతో వివిధ పనులు చేపట్టం ద్వారా కూలీలకు ఉపాధి కల్పిస్తారు. అయితే జిల్లాలో  చేపట్టిన పనుల్లో నిధులు పెద్ద ఎత్తున దురి్వనియోగం అయినట్టు వెలుగులోకి వచ్చింది. ఈ పథకంలో ప్రధానంగా ఎవెన్యూ ప్లాంటేషన్‌ (రోడ్డు పక్కల మొక్కల నాటడం)కు ఎక్కువ నిధులు విడుదలయ్యాయి. 2017–18 ఆర్థిక సంవత్సరానికి 1,083 ఎకరాల్లో ఉద్యాన మొక్కల పెంపకానికి రూ.2.60 కోట్లు, 2018–19కి 2,987 ఎకరాల్లో నాటడానికి రూ.5.79 కోట్లు ఖర్చు పెట్టారు.

2017–18లో ఎవెన్యూ ప్లాంటేషన్‌కు సంబంధించి 1,008 కిలోమీటర్ల మేర రోడ్ల వెంబడి మొక్కలు నాటేందుకు రూ.21.47 కోట్లు వెచ్చించారు. ఈ మొక్కలు నాటేందుకు గొయ్యి తవ్వడం, నిర్వహణ, సంరక్షణ, కాపలా వంటి వాటికి ఉద్యాన మొక్కలకు నెలకు 2017–18లో రూ.3 లక్షలు, 2018–19లో రూ.6 లక్షల చొప్పున, ఎవెన్యూ ప్లాంటేషన్‌కు నెలకు రూ.3 లక్షల చొప్పున మూడేళ్ల పాటు నిధులు మంజూరు చేశారు. ఉదాహరణకు జిల్లాలో 2017–18లో ఎవెన్యూ ప్లాంటేషన్‌ కింద 4,50,370 మొక్కలు నాటాలని అంచనా వేయగా 4,31,110 మొక్కల నాటేందుకు పరిపాలనా ఆమోదం లభించింది. ఇందులో 4,03,176 మొక్కలు నాటినట్టు రికార్డుల్లో చూపారు.

ఇలా స్వాహా..! 
మొక్కలు కొనుగోలు చేయకుండానే చేసినట్టు.. నాటకుండానే నాటినట్టు.. నిర్వహణ చేయకుండానే చేసినట్టు.. మొక్కలు చనిపోయినా బతికే ఉన్నట్టు.. రికార్డుల్లో నమోదు చేశారు. విచిత్రమేమిటంటే.. మొక్కల రక్షణకు వేసే ట్రీగార్డులను మొబైల్‌ ట్రీగార్డులుగా వాడారు. ఒకచోట వేసిన ట్రీగార్డులనే అధికారులు తనిఖీలకు వస్తున్నారంటే ఆ ప్రాంతానికి తీసుకెళ్లి చూపేవారు. ఇలా కోట్లాది రూపాయలను స్వాహా చేశారు. ఇలా జిల్లాలోని అన్ని మండలాల్లోనూ అక్రమాలకు పాల్పడినట్టు సామాజిక తనిఖీ(సోషల్‌ అడిట్‌)ల్లో వెలుగు చూసింది. ఇందులో వెలుగు అసిస్టెంట్‌ ప్రాజెక్టు మేనేజర్లు (ఏపీఎంలు), కమ్యూనిటీ కోఆర్డినేటర్లు(సీసీలు), వీవోలు, గ్రామైఖ్య సంఘాల సభ్యులు ఉన్నారని గుర్తించారు. 

రూ. 10కోట్లకు పైగానే.. 
ఈ మొత్తం వ్యవహారంలో రూ.10 కోట్లకు పైగానే అవినీతి జరిగినట్టు తెలుస్తోంది. ఇప్పటిదాకా జిల్లాలోని 49 మండలాలకు గాను 38 మండలాల్లో రూ.2.38 కోట్లు స్వాహా అయినట్టు అధికారులు ప్రాథమికంగా తేల్చారు. ఇంకా 11 మండలాల్లో సోషల్‌ ఆడిట్‌ పూర్తి కాలేదు. వాటిలో కూడా లెక్క తేలితే ఈ మొత్తం ఇంకా పెరుగుతుంది. కేవలం సోషల్‌ ఆడిట్‌ ద్వారానే రూ.2.38 కోట్లు స్వాహా జరిగినట్టు నిర్థారణ కాగా ఇంకా లోతుగా దర్యాప్తు జరిపితే ఆ మొత్తం రూ.10 కోట్లకు పైగా ఉండవచ్చని అధికార వర్గాలే చెబుతున్నాయి.  

రికవరీ మొదలు.. 
ఈ స్వాహా పర్వంలో భాగస్వాములపై చర్యలు తీసుకోవడమే గాక వారు తిన్న సొమ్మును కూడా రికవరీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సంబంధిత బాధ్యులకు నోటీసులు జారీ చేశారు. దీనిపై ఇప్పటివరకు రూ.66 లక్షలకు వారు వివరణ ఇచ్చారు. రూ.8.69 లక్షల సొమ్ము రికవరీ చేశారు. మిగిలిన సొమ్ము రికవరీ కావలసి ఉంది.

విజిలెన్స్‌తో విచారణ.. 
ఈ అవినీతి వ్యవహారంపై ప్రభుత్వం విజిలెన్స్‌తో విచారణ జరిపిస్తోంది. దీనిపై విజిలెన్స్‌ అధికారులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు. త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు.  

అవకతవకలు నిజమే..  
జిల్లాలో ఉపాధి హామీ పనుల్లో అవినీతి జరిగినట్టు సామాజిక తనిఖీల్లో తేలింది. ఇంకా తనిఖీలు జరుగుతున్నాయి. దీనిపై బాధ్యులకు నోటీసులు జారీ చేశాం. వీరిలో కొందరు తమ వివరణ ఇచ్చారు. ఇంకొందరి నుంచి రికవరీ చేస్తున్నాం. ఇప్పటికే విజిలెన్స్‌ విచారణ జరుగుతోంది. నివేదిక వస్తే అక్రమాలకు బాధ్యులపై చర్యలు          తీసుకుంటాం.  
– శ్రీనివాస్, ప్రాజెక్టు డైరెక్టర్, డీఆర్‌డీఏ  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement