ఉర్దూ అకాడమీలో అంతులేని అక్రమాలు | Endless irregularities in Urdu Academy | Sakshi
Sakshi News home page

ఉర్దూ అకాడమీలో అంతులేని అక్రమాలు

Published Mon, Feb 3 2025 3:52 AM | Last Updated on Mon, Feb 3 2025 3:52 AM

Endless irregularities in Urdu Academy

2014–19 మధ్య టీడీపీ పాలనలో పెద్దఎత్తున నిధులు గోల్‌మాల్‌

రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఉర్దూ అకాడమీకి కేటాయించిన రూ.కోట్లు కొట్టేశారు

లోకాయుక్త ఆదేశాలతో రూ.3.15 కోట్ల గోల్‌మాల్‌పై తాజాగా విచారణకు కమిషన్‌ 

మరో రూ.3.92 కోట్లను వ్యక్తిగత ఖాతాలకు మళ్లించడంపై గతంలోనే సీఐడీ కేసు నమోదు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ఉర్దూ అకాడమీని గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014–19 మధ్య అక్రమాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మార్చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ ఉర్దూ అకాడమీకి కేటాయించిన రూ.కోట్లాది రూపాయలను ఇష్టాను­సారం కొల్లగొట్టేశారు. అప్పట్లో ఉర్దూ అకాడమీకి కేటాయించిన దాదాపు రూ.30కోట్లలో ఎంత సద్వి­నియోగం అయ్యాయి? ఎంత అక్రమార్కుల జేబు­ల్లోకి వెళ్లాయి? అనే కోణాల్లో దృష్టిసారిస్తే మరిన్ని అక్రమాలు వెలుగు చూస్తాయని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ముస్లిం సమాజం కోరుతోంది.

విజయవాడలో ఆఫీస్‌... కర్నూలులో బ్యాంక్‌ అకౌంట్‌ 
విజయవాడలో ఏపీ ఉర్దూ అకాడమీ రాష్ట్ర కార్యాలయం ఉంది. అయితే కర్నూలులోని ఎన్‌ఆర్‌ పేట కెనరా బ్యాంకు బ్రాంచిలో ఏపీ ఉర్దూ అకాడమీ పేరుతో అకౌంట్‌ (33941010001054)ను తెరిచి అక్రమాలకు పాల్పడ్డారు. ఉర్దూ అకాడమీ ఉన్నత ఉద్యోగులు రకరకాల కార్యక్రమాల పేరుతో రూ.కోట్లు కొల్లగొట్టారు. ముస్లింలు లేని చోట కూడా ఉర్దూ భాషాభివృద్ధి సాకుతో ముసాయిరా(కవి సమ్మేళనం) నిర్వహించినట్టు చెబుతూ నిధులు స్వాహా చేశారు.

రూ.3.15 కోట్ల స్కామ్‌పై కమిషనర్‌ ఆరా..
తెలంగాణ ఉర్దూ అకాడమీకి రూ.3.15 కోట్లను ఏపీ ఉర్దూ అకాడమీ నుంచి అప్పు ఇచ్చినట్లు ఆడిట్‌ రిపోర్ట్‌లో వెలుగు చూసిన వ్యవహారంపై రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్‌ సీహెచ్‌ శ్రీధర్‌ ఇటీవల ఆరా తీశారు. తన కార్యాలయానికి పలువురు సిబ్బందిని పిలిచి ఈ విషయంపై వివరాలు తెలుసుకున్నారు. ఆ నిధుల మళ్లింపు వ్యవహారానికి సంబంధించి అప్పట్లో రికార్డులు సైతం తారుమారు చేశారని, ఆధారాలు ధ్వంసం చేశారని పలువురు ఉద్యోగులు చెప్పినట్లు తెలిసింది.  

నిధుల మళ్లింపు కేసులో గతంలోనే ఇద్దరి అరెస్టు
తెలంగాణ ఉర్దూ అకాడమీకి 2016–17లో ఆంధ్రప్రదేశ్‌ ఉర్దూ అకాడమీ అప్పు ఇచ్చినట్లు చూపించి రూ.3.15కోట్ల మేర అవకతవకలకు పాల్ప­డి­న­ట్లు ఏపీ లోకాయుక్త ఇటీవల ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు తాజాగా కూటమి ప్రభుత్వం విచారణకు కమిషన్‌ను నియమించిన విషయం తెలిసిందే. 

అయితే, ఎన్నికల ముందు 2018–19లో ఉర్దూ అకాడమీకి చెందిన దాదాపు రూ.4కోట్లను వ్యక్తిగత ఖాతాలకు మళ్లించిన వ్యవహారంపై గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే సీఐడీ 2021లో ఐపీసీ సెక్షన్‌ 420, 409 రెడ్‌విత్‌120(బి) కింద కేసు నమోదు చేసింది. 

అప్పటి ఉర్దూ అకాడమీ డైరెక్టర్‌ మస్తాన్‌వలీ (ప్రస్తుతం రిటైర్డ్‌), సూపరింటెండెంట్‌ జాఫర్‌ (ప్రస్తుతం తెలంగాణ ఉర్దూ అకాడమీలో పని చేస్తున్నారు)లను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచడంతో రిమాండ్‌ విధించారు. అనంతరం వారు బెయిల్‌ పొందారు.

67 మంది వ్యక్తిగత ఖాతాలకు నిధుల మళ్లింపు 
ఏపీ ఉర్దూ అకాడమీలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన కొందరు ఉన్నతాధికారులు అడ్డగోలుగా తమ బంధువులు, అనుయాయుల వ్యక్తిగత బ్యాంక్‌ ఖాతాలకు నిధులు మళ్లించి, ఆ తర్వాత వారి నుంచి తమ ఖాతాలకు బదిలీ చేయించుకున్నారు. ఇలా 2019 ఎన్నికల ముందు హడావుడిగా రూ.3,92,21,500లను ఏకంగా 67 మంది వ్యక్తిగత ఖాతాలకు జమ చేశారు. ఆ డబ్బులను వారి నుంచి తిరిగి తమ ఖాతాలకు మళ్లించుకున్నారు. 

వారిలో ప్రధానంగా ఉన్నతాధికారులుగా పనిచేసిన షాహిదుల్లా బేగ్‌ ఖాతాకు రూ.2.2కోట్లు, సోహెల్‌ పాషా ఖాతాకు రూ.15లక్షలు, బీఎస్‌కే సైదా–పి.ఇస్మాయల్‌ల ఖాతాలకు రూ.3,77,700, షేక్‌ జాఫర్‌ బంధువులు, స్నేహితుల ఖాతాలకు రూ.95,22,906 మళ్లించినట్లు అధికారులు గుర్తించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement