
నిధుల గోల్‌మాల్‌లో ఇంటి దొంగల కలవరం
త్వరలో విచారణ షురూ?
దీంతో మంత్రి ఫరూక్‌తో మంత్రాంగం
టీడీపీ మైనార్టీ నాయకుడి మధ్యవర్తిత్వం
రూ.3.15 కోట్ల గోల్‌మాల్‌పై విచారణ
కమిషన్ వేసిన కూటమి ప్రభుత్వం
టీడీపీ హయాంలో రూ.4 కోట్లు మళ్లింపుపై సీఐడీ కేసు పెట్టిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం
ఆ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్టు చేసిన సీఐడీ
మరో 11 మంది అరెస్టుకూ రంగం సిద్ధం
సాక్షి, అమరావతి: ఏపీ ఉర్దూ అకాడమీ నిధుల గోల్‌మాల్ వ్యవహారంలో విస్తుపోయే పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రూ.కోట్లాది నిధుల అవకతవకల వ్యవహారం ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటుందోనని ఇంటి దొంగల్లో కలవరం తీవ్రమైంది. ‘‘ఉర్దూ అకాడమీలో అంతులేని అక్రమాలు’’ శీర్షికన ‘‘సాక్షి’’ ప్రచురించిన కథనంతో అకాడమీలో అలజడి మొదలైంది. తాజాగా రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌తో కొందరు అకాడమీ ఉద్యోగులు టీడీపీకి చెందిన మైనార్టీ నాయకుడి మధ్యవర్తిత్వంలో మంత్రాంగం సాగించడం చర్చనీయాంశమైంది.
త్వరలో విచారణ
గత టీడీపీ హయాం(2016–17)లో రూ.3.15 కోట్లు తెలంగాణ ఉర్దూ అకాడమీకి అప్పుగా ఇచ్చినట్టు ఏపీ ఉర్దూ అకాడమీ ఆడిట్ రిపోర్టులో లెక్కలు చూపించారు. దీనిపై ఏపీ ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నాగుల్‌మీరా తెలంగాణ ఉర్దూ అకాడమీని సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు కోరగా తాము ఏపీ నుంచి ఎలాంటి అప్పు తీసుకోలేదని తేల్చిచెప్పింది. దీంతో చర్యలు తీసుకోవాలని నాగుల్‌మీరా లోకాయుక్తను ఆశ్రయించారు.
ఫిర్యాదును క్షుణ్నంగా పరిశీలించి విచారణకు స్వీకరించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లోకాయుక్త రిజిస్ట్రార్ గతేడాది నవంబర్ 26న ఏపీ మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శికి నోటీసు జారీ చేశారు. కూటమి ప్రభుత్వం జనవరి 6న విచారణ కమిషన్‌ను నియమించింది. రూ.3.15 కోట్ల గోల్‌మాల్‌పై రహస్యంగా విచారణ చేసి 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
తాను ఎమ్మెల్సీ ఎన్నికల విధుల్లో ఉన్నందున.. విచారణ పూర్తికి మరికొంత గడువు కావాలని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్ సీహెచ్ శ్రీధర్ ప్రభుత్వాన్ని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ పూర్తికావడంతో విచారణ ప్రారంభించే అకాశం ఉంది.
దూకుడు తగ్గేలా చూడండి..
మరోవైపు 2018–19 మధ్య టీడీపీ హయాంలో దాదాపు రూ.4 కోట్లు ఉర్దూ అకాడమీ నిధులను 67 మంది వ్యక్తిగత ఖాతాలకు మళ్లించిన వ్యవహారంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 2021లో సీఐడీ కేసు నమోదు చేసి.. నలుగురిని అరెస్టు చేసింది. ఐపీసీ సెక్షన్ 420, 409 రెడ్ విత్ 120(బి) కేసులో ఉర్దూ అకాడమీ డైరెక్టర్ మస్తాన్ వలీ (ప్రస్తుతం రిటైర్డ్), సూపరింటెండెంట్ జాఫర్ (ప్రస్తుతం తెలంగాణ ఉర్దూ అకాడమీలో పనిచేస్తున్నారు)లను అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరచగా రిమాండ్ అనంతరం బెయిల్‌పై వచ్చారు.
తాజాగా ఏపీకి చెందిన ఉర్దూ అకాడమీ ఉద్యోగితో పాటు బయటి వ్యక్తిని సీఐడీ అరెస్టు చేసింది. మరో 11 మందిని సీఐడీ అరెస్టు చేస్తుందనే లీకులు ఇవ్వడంతో వారంతా టీడీపీ మైనార్టీ నేత మధ్యవర్తిత్వంతో ప్రభుత్వ పెద్దల శరణు కోరుతున్నారు. ఎవరి మెడకు చుట్టుకుంటుందోనని కలవరపడుతున్నారు.
సీఐడీ దూకుడుకు కళ్లెం వేసి తమను కాపాడాలని మంత్రిని కోరినట్టు విశ్వసనీయంగా తెలిసింది. కాగా, గత టీడీపీ హయాంలో ఉర్దూ అకాడమీని హద్దులేని అక్రమాలకు అడ్డాగా మార్చేశారని, రూ.30కోట్ల నిధులు ఎవరెవరు కొల్లగొట్టారో తేల్సాలని ముస్లిం సమాజం కోరుతోంది.
Comments
Please login to add a commentAdd a comment