కుట్రలు, కుతంత్రాలు, అవినీతే చంద్రబాబు, రామోజీ నీతి
40 ఏళ్లుగా ఒకరికొకరు సహకరించుకుంటూ వేల కోట్ల సామ్రాజ్యాల నిర్మాణం
జీజే రెడ్డి దగ్గర గుమస్తాగా పనిచేసి ఆయన కంపెనీ మార్గదర్శిని కొట్టేసిన రామోజీ
సొంత మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి టీడీపీని కబ్జా చేసిన బాబు
రామోజీ సామ్రాజ్య విస్తరణకు సహకరించిన చంద్రబాబు..
టీడీపీ కబ్జాలు, అవినీతి, అక్రమాలకు అండదండలందించిన రామోజీ
సాక్షి, అమరావతి: నారా చంద్రబాబునాయుడు, చెరుకూరి రామోజీరావు.. అందరికీ చిరపరిచితమైన ఈ తోడు దొంగలు పైకి అత్యంత సత్యవంతులుగా, నీతీ నిజాయితీల గురించి ఒకరు మాటల్లో, మరొకరు రాతల్లో లెక్కలేనన్ని పాఠాలు చెబుతూ సమాజ నిర్దేశకులుగా కనిపిస్తారు. వారి చరిత్ర చూస్తే అంతా అవినీతి, అక్రమాలే. కుట్రలు, కుతంత్రాలు, మోసాలు, నయవంచనలే పరమపద సోపానాలుగా ఎదిగిన వారు.
రాజకీయ నాయకుడిగా చంద్రబాబు, మీడియా అధిపతిగా రామోజీరావు 40 ఏళ్లుగా ఒకరికొకరు సహకరించుకుంటూ రెండు తెలుగు రాష్ట్రాల్లో వేల కోట్ల సామ్రాజ్యాలు నిర్మించుకున్నారు. రాజకీయంగా చంద్రబాబును ఉన్నత స్థాయిలో నిలబెట్టడానికి రామోజీరావు అన్ని రకాలుగా అండదండలు అందించారు. రామోజీ వ్యాపార సామ్రాజ్య విస్తరణకు చంద్రబాబు బరితెగించి సహకరించారు. చంద్రబాబు కోసం రామోజీ తన మీడియాను విశృంఖలంగా ఉపయోగించారు. ఈ ఎన్నికల్లోనూ సిగ్గు విడిచి, బట్టలూడదీసుకుని మరీ అబద్ధాల యుద్ధం చేశారు.
జీజే రెడ్డి అనే ప్రముఖుడి దగ్గర గుమస్తాగా చేరి ఆయన ఆస్తులన్నింటినీ కొట్టేసిన ఘరానా దొంగ రామోజీ. మార్గదర్శి చిట్‌ఫండ్స్, ఈనాడు కూడా జీజే రెడ్డి ఆలోచనలే. జీజే రెడ్డిపై దేశద్రోహం కేసు నమోదవడంతో ఆయన దేశం విడిచి పారిపోయారు. దీంతో ఆయన ఆస్తులన్నింటినీ రామోజీరావు సొంతం చేసుకున్నారు. మార్గదర్శిలో రామోజీ వాటా కేవలం రూ.10 మాత్రమే. మిగిలిన పెట్టుబడి అంతా జీజే రెడ్డిదే. దీనిపై ఇటీవల ఆయన కుమారుడు యూరీ రెడ్డి కోర్టుకెక్కిన విషయం తెలిసిందే.
జీజే రెడ్డే కాదు.. సొంత బంధువులను కూడా మోసం చేసి విజయవాడ, విశాఖలో వారి ఆస్తులు కొల్లగొట్టారు రామోజీ. ఇలా దోపిడీ మార్గాల్లో సమకూర్చుకున్న ఆస్తులను రక్షించుకునేందుకు రాజకీయాలను ఉపయోగించుకున్నారు. ఆ క్రమంలోనే తెలుగుదేశం పార్టీని గుప్పిట్లో పెట్టుకున్నారు. దీనికి ఎన్టీఆర్ అంగీకరించకపోవడంతో అధికారం కోసం గుంట నక్కలా వేచి చూస్తున్న చంద్రబాబును చేరదీశారు. ఎన్టీఆర్‌ను గద్దె దించడానికి చంద్రబాబుతో కలిసి కుట్ర పన్నారు.
రామోజీ అండదండలతో చంద్రబాబు సొంత మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి, తెలుగుదేశం పార్టీని చేజిక్కించుకున్నారు. చంద్రబాబు సీఎం అయ్యాక రామోజీరావు వ్యాపారాలకు అన్ని రకాలుగా సహకరించారు. చంద్రబాబు అవినీతికి రామోజీ సహకరించారు. ఈనాడు విస్తరణ, మార్గదర్శి ద్వారా వేల కోట్లు దోచుకోవడానికి, ఫిలిం సిటీకి వేలాది ఎకరాల పేదల భూములు కొట్టేయడానికి సహకరించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే రామోజీ సంస్థలు వేల కోట్లకు ఎదిగాయి.
చంద్రబాబు ఏలేరు, ఐఎంజీ భారత్ కుంభకోణాలకు రామోజీ మద్దతు
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు చేసిన కుంభకోణాలు, అక్రమాలకు రామోజీ కప్పెట్టేశారు. బాబు ఎంత భయంకరమైన స్కాములు చేసినా ఈనాడులో ఒక్క అక్షరం రాయలేదు సరికదా, ఆయన్నో గొప్ప విజనరీగా చిత్రీకరించారు. ఐఎంజీ భారత్, ఏలేరు భూముల కుంభకోణాలు బయటకు రాకుండా తొక్కిపెట్టారు.
హైదరాబాద్‌లో స్టేడియంలు నిర్మించి, ఒలింపిక్ క్రీడాకారులను తయారు చేసే పేరుతో ఐఎంజీ భారత్‌కి 2004లో ఆపద్ధర్మ సీఎంగా ఉండగా చంద్రబాబు 800 ఎకరాలను అక్రమంగా కేటాయించాడు. దీన్ని కోర్టు తప్పు పట్టింది. ఆ భూములు ప్రభుత్వానికే చెందుతాయని ఇటీవల తీర్పు కూడా ఇచ్చింది. ఇలాంటి ఎన్నో అక్రమాలను కప్పి పుచ్చి చంద్రబాబును గొప్ప నేతగా చూపించే ప్రయత్నం చేశారు రామోజీ. 2004లో ఓడిపోయిన తర్వాత కూడా చంద్రబాబుకు రాజకీయంగా సహకారం అందించారు.
రామోజీ బంటుగానే చంద్రబాబు
తన రాజకీయ ఎదుగుదలకు ఉపయోగపడిన రామోజీకి చంద్రబాబు ఎప్పుడూ బంటుగానే ఉన్నారు. ఈనాడు గ్రూపు ఆర్థిక కష్టాల్లో చిక్కుకుని దివాలా తీసే పరిస్థితులకు వెళ్లినప్పుడు చంద్రబాబు సహకారం అందించారు. మార్గదర్శి అక్రమాలు బయటపడి రామోజీ జైలుకు వెళ్లే పరిస్థితి వచ్చినప్పుడు ఆయన కోసం నిలబడి తెరవెనుక నుంచి మద్దతు పలికారు. దీనికి ప్రతిగా రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు 2014లో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు రామోజీ శాయశక్తులా ప్రయత్నించారు.
2014–19 సంవత్సరాల మధ్య ప్రపంచమే నివ్వెరపోయేలా జరిగిన అమరావతి భూముల కుంభకోణం సహా ఆయన చేసిన అరాచకాలని్నంటినీ రామోజీ కప్పిపుచ్చారు. ఈ ఎన్నికల్లో మళ్లీ చంద్రబాబును గెలిపించేందుకు సిగ్గు ఎగ్గు వదిలేసి ప్రజల మెదళ్లలో విషం ఎక్కించేందుకు సర్వశక్తులూ ఒడ్డారు.
ఇలా ఆది నుంచి తోడు దొంగల్లా బాబు, రామోజీ ఒకరికొకరు ఆలంబనగా నిలబడి మోసాలు, కుట్రలతో ప్రజలను వంచిసూ్తనే ఎదిగారు. ఇప్పుడు కూడా వాటినే అస్త్రాలుగా ఉపయోగించుకుని ఈ దొంగలిద్దరూ మళ్లీ అధికారంలోకి వచ్చి దోపిడీని కొనసాగించాలని తహతహలాడుతున్నారు. కానీ నమ్మకం, నయవంచనలకు నిలువెత్తురూపాలైన ఈ ఇద్దరు రాక్షసుల ఆటలు సాగే పరిస్థితులు కనిపించట్లేదు.
Comments
Please login to add a commentAdd a comment