ఉరకలు వేస్తున్న ‘ఉపాధి’ | Employment By NREGS During Lockdown | Sakshi
Sakshi News home page

ఉరకలు వేస్తున్న ‘ఉపాధి’

Published Fri, Jul 17 2020 8:06 AM | Last Updated on Fri, Jul 17 2020 8:06 AM

Employment By NREGS During Lockdown - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఆర్థిక సంవత్సరం మొదలైన ఏప్రిల్‌ 1 నుంచి ఈ నెల 15వ తేదీ వరకు 106 రోజులు... ఈ కొద్దికాలంలోనే గ్రామీణ జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌ఈజీఎస్‌) కింద వేతనదారులు ఆర్జించిన మొత్తం ఎంతో తెలుసా? రూ.416.72  కోట్లు.! కరోనా మహమ్మారి విజృంభణతో అన్ని రంగాల్లో పనులు కోల్పోతున్న విపత్తు సమయంలో ఇది ఎంతో చెప్పలేనంత ఊరట! రోజూ ‘ఉపాధి’ పనికి వెళితే.. సగటున రూ.236.70 చొప్పున దక్కిందంటే అంతకన్నా చెప్పేదేముంది? లాక్‌డౌన్‌  సమయంలో చేతి నిండా పని దొరకడం వారి జీవనానికి ఇబ్బంది లేకుండాపోయింది. జిల్లాలో ఉన్న వేతనదారులతో పాటు లాక్‌డౌన్‌ ప్రభావంతో ఎక్కడెక్కడి నుంచో  స్వస్థలాలకు తిరిగివచ్చిన వారికీ ‘ఉపాధి’ కల్పించాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి.

జిల్లాలో ఆర్థిక సంవత్సరం ప్రారంభం నాటికి ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ జాబ్‌ కార్డు పొందిన కుటుంబాల సంఖ్య 3,18,773 ఉండేది. లాక్‌డౌన్‌ ప్రభావం వల్ల వివిధ రాష్ట్రాలు, మన రాష్ట్రంలోని పలు పట్టణాల్లో ఉపాధి కోల్పోయి స్వస్థలాలకు చేరిన వారిలో ఎవరు కోరినా వెంటనే జాబ్‌కార్డు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు కొత్త జాబ్‌కార్డులను ప్రభుత్వం జారీ చేసింది. దీంతో జిల్లాలో జాబ్‌కార్డు ఉన్న కుటుంబాల సంఖ్య 3,65,648కు చేరింది. జిల్లా చరిత్రలో ఇదొక రికార్డు. మరో విశేషమేమిటంటే ఈ మూడున్నర నెలల కాలంలోనే వంద రోజుల పని దినాలను 22,078 కుటుంబాలు పూర్తి చేసేయడం విశేషం. మొత్తంమీద ‘ఉపాధి’ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న వారి సంఖ్య జిల్లాలో 6,10,098 మందికి చేరింది. ఇప్పటి వరకు ఇంతపెద్ద సంఖ్యలో గతంలో ఎప్పుడూ ఉపాధి పనులకు వచ్చిందే లేదు. మూడున్నర నెలల గణాంకాల ప్రకారం చూస్తే 1.76 కోట్ల పనిదినాలను కల్పించారు. ఒక్కో కుటుంబానికి సగటున 48.15 రోజుల పాటు పని దొరికింది. 

నెమ్మదిగా ప్రారంభమైనా...
మార్చి 25 నుంచి లాక్‌డౌన్‌ నిబంధనలు అమల్లోకి రావడంతో ‘ఉపాధి’పనులు నిలిచిపోయాయి. ఏప్రిల్‌ మూడో వారం వరకూ అదే పరిస్థితి. తర్వాత ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇవ్వడంతో ఏప్రిల్‌ ఆఖరు వారంలో పనులు పునఃప్రారంభమయ్యాయి. కరోనా వైరస్‌ భయంతో ఎక్కువ మంది పనులకు దూరంగానే ఉంటూ వచ్చారు. డ్వామా అధికారులు అవగాహన కల్పించడం, పని ప్రదేశాల వద్ద శానిటైజర్లు ఏర్పాటు చేయడం, మరో వైపు ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ మాస్కులు ఉచితంగా అందించడంతో వేతనదారుల్లో కాస్త ధైర్యం కలిగింది. దీంతో మే ప్రారంభం నుంచి నెమ్మదిగా మొదలయ్యాయి. కొద్ది రోజుల్లోనే రికార్డు స్థాయిలో వేతనదారులు పనులకు హాజరుకావడం ప్రారంభమైంది. మే ఒకటో తేదీన కేవలం 68 వేల మందే పనులకు రాగా.. అది జూన్‌ ఒకటో తేదీకి 5.10 లక్షలకు చేరింది. జిల్లా చరిత్రలో ఇదొక రికార్డు. జూలైలో 30 లక్షల పని దినాలు కల్పించి రాష్ట్రంలో జిల్లా మొదటిస్థానంలో నిలిచింది.
 

సులభంగా పనుల గుర్తింపు..
ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద అనేక అభివృద్ధి పనులు చేపట్టడానికి అవకాశం ఉన్నా.. గతంలో వాటిని తక్కువగానే గుర్తించేవారు. ఏవో కొన్ని రకాల పనులే చేపట్టేవారు. ఇప్పుడా విధానం మారింది. తక్షణ ప్రజోపయోగ పనులను గుర్తించడమే గాకుండా వెనువెంటనే చేపట్టేందుకు గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా మార్గం సుగమమైంది. ప్రజలకు వారి గడప వద్దకే ప్రభుత్వ సేవలను చేరువ చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ వ్యవస్థకు అంకురార్పణ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడదే ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ను ప్రజలకు మరింత చేరువ చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో తక్షణమే పనులు గుర్తిస్తున్నారు. వేతనాలు కూడా ఒకటీ రెండు వారాల్లోనే చెల్లింపు ప్రక్రియ కూడా పూర్తి చేస్తున్నారు. ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు రూ.416.72 కోట్లను వేతనదారులకు కూలి రూపేణా చెల్లించారు. ఒక్కొక్కరికీ రోజుకు సగటున రూ.236.70 చొప్పున కూలి గిట్టుబాటు కావడం మరో విశేషం. మెటీరియల్‌ కాంపొనెంట్‌ కింద రూ.21.88 కోట్లను ఖర్చు చేశారు. మొత్తంమీద ఇప్పటి వరకు ఈ పథకం కింద రూ.444.52 కోట్లు వ్యయం అయ్యింది. 

కోరిన అందరికీ పని కల్పిస్తాం 
ఉపాధి హామీ పథకంలో రాష్ట్రానికి అదనంగా నాలుగు కోట్ల పని దినాలను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. కోరిన అందరికీ పని కల్పిస్తాం. ప్రభుత్వం ఆదేశాల ప్రకారం జాబ్‌కార్డులు కోరిన వెంటనే ఇస్తున్నాం. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా భౌతికదూరం పాటించేలా పనులకు మార్కింగ్‌ చేయిస్తున్నాం. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. వేతనదారులు కూడా కొన్ని స్వీయ జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్యం బాగోకపోతే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలని చెబుతున్నాం.
– ఇ.సందీప్, ప్రాజెక్టు అధికారి, డ్వామా 

ఉపాధి పనులే ఆదుకున్నాయి 
లాక్‌డౌన్‌ వేళ పరిశ్రమలు మూత పడటంతో ఉపాధి పనులు ఆదుకున్నాయి. నేను రాజమండ్రిలో ఓ దారాల కంపెనీలో పనిచేసేవాడిని. లాక్‌డౌన్‌తో దాన్ని మూసే శారు. సొంతూరు వచ్చేశాను. కొత్తగా జాబ్‌ కార్డులు ఇవ్వడంతో మాకు ఉపాధి మార్గం కనిపించింది. రోజూ పనులకు వెళ్లి భార్యాపిల్లలను పోషించుకుంటున్నాను. 
– గనిశెట్టి రమణ, తాడపాల, మాకవరపాలెం మండలం 

ప్రభుత్వం ‘ఉపాధి’తో ఆదుకుంది 
నేను డిగ్రీ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని. లాక్‌డౌన్‌ విధించిన తొలి రోజుల్లో ఆర్థికంగా చాలా ఇబ్బంది పడ్డాం. మా నాన్న ఉపాధి పనికి వెళ్లేవారు. ఆ వచ్చే డబ్బుతోనే కుటుంబం గడిచేది. ముఖ్యమంత్రి ఆదేశాలతో నాకు కూడా ఉపా«ధి కలిగింది. నాన్నకు ఆసరా ఉండాలనే తలంపుతో నేనూ జాబ్‌కార్డుకు దరఖాస్తు చేసుకున్నాను. నెల రోజులుగా పనికి వెళుతున్నాను. ప్రభుత్వం ఉపాధి పనులను కల్పించి పేదలను ఎంతో ఆదుకుంది.  
– కన్నూరు శ్రీను, యండపల్లి, కోటవురట్ల మండలం  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement