హైదరాబాద్: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారం అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలోని బండ్లపల్లిలో పర్యటించనున్నారు. మహాత్మా గాంధీ ఉపాధిహామీ పథకాన్ని ప్రారంభించి ఫిబ్రవరి 2 నాటికి పదేళ్లు అవుతోంది. అప్పట్లో ఈ పథకాన్ని నాటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీలు దేశంలోనే మొట్టమొదటి సారిగా బండ్లపల్లిలో ప్రారంభించారు.
ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం ఉపాధి హామీ పథకం చట్టాన్ని నీరుకార్చే ప్రయత్నం చేస్తున్నందున మేమున్నామంటూ పథకం మొదట ప్రారంభించిన గ్రామం నుంచే పేదలకు భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ రానున్నట్లు పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి వెల్లడించారు. సోమవారం ఇందిర భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ వలసలు నివారించి, స్థానికంగా పనులు కల్పించాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. పనులు కావాలని అడిగిన వారికి పనులు కల్పించకపోతే సంబంధిత అధికారులకు అపరాధ రుసుంతో పాటు జైలు శిక్ష పడేలా చట్టం రూపొందించి సమర్థవంతంగా అమలయ్యేలా యూపీఏ ప్రభుత్వం చర్యలు తీసుకుంటే.. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నం చేస్తోందన్నారు.
భవిష్యత్తులో కూడా ఈ చట్టం నీరుకారకుండా మేమున్నామంటూ పేదల్లో ధైర్యం నింపేందుకు వీలుగా భారీ ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు 6000 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించి పనులు కల్పించకుండా చేశారని తద్వారా అనంతపురం జిల్లాలోనే 4 లక్షల మంది కూలీలు ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లినట్లు పేర్కొన్నారు.