సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ తెలంగాణలో మూడు రోజుల పర్యటన ఖరారైంది. ఈనెల 18న కాంగ్రెస్ బస్సుయాత్రను ప్రారంభించేందుకు రానున్న ఆయన మూడు రోజులపాటు ఇక్కడే ఉండనున్నారు. ముందుగా కొండగట్టు నుంచి బస్సుయాత్రను ప్రారంభించాలని భావించినా, రాహుల్ షెడ్యూల్‌లో కొంత మార్పు జరిగింది. దీని ప్రకారం రామప్ప ఆలయం వద్ద రాహుల్ కాంగ్రెస్ బస్సుయాత్రను ప్రారంభిస్తారు.
ఏఐసీసీ వర్గాలు వెల్లడించిన ఈ షెడ్యూల్ ప్రకారం 18, 19, 20 తేదీల్లో ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో రాహుల్ బస్సుయాత్రలో పాల్గొంటారు. ఈ సందర్భంగా పాదయాత్రలు చేయనున్న ఆయన పలువురు కారి్మకులు, ఇతర వర్గాలతో సమావేశం కానున్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని సందర్శించనున్నారు. ములుగు, పెద్దపల్లి, ఆర్మూర్ బహిరంగ సభల్లో పాల్గొంటారు.
మూడు దశల్లో బస్సు యాత్ర
ప్రతి రోజు మూడు నియోజకవర్గాల చొప్పున 12 రోజులపాటు రాష్ట్రంలోని 36 నియోజకవర్గాల్లో బస్సుయాత్ర నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగా తొలి విడతలో రాహుల్ మూడు రోజులపాటు 8 నియోజకవర్గాల్లో యాత్ర నిర్వహించనున్నారు. మూడు రోజుల పర్యటనతో తొలి విడత యాత్ర ముగియనుండగా, దసరా తర్వాత రెండో విడత ప్రారంభించనున్నారు. ఆ సమయంలో ప్రియాంకా గాంధీ హాజరయ్యే అవకాశముంది. ఇక, నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిశాక మూడో విడత నిర్వహించాలని, ఈ యాత్రకు సోనియాతో సహా కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యేలా టీపీసీసీ ప్రణాళిక రూపొందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment