సాక్షి, హైదరాబాద్: బీజేపీ పార్లమెంటు ఎన్నికల కసరత్తు తెలంగాణ నుంచే ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా ఎంపీ సీట్లను 143 క్లస్టర్లు (మూడు, నాలుగేసి సీట్ల చొప్పున)గా, రాష్ట్రంలోని 17 సీట్లను 5 క్లస్టర్లుగా పార్టీ విభజించింది. ఈ నేపథ్యంలో దేశంలోనే మొట్టమొదటిసారిగా మహబూబ్ నగర్‌లో ఆదివారం నిర్వహించనున్న క్లస్టర్ (మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నల్లగొండ ఎంపీ సీట్లు) ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీ సమావేశానికి బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. అలాగే కరీంనగర్ క్లస్టర్ (కరీంనగర్, జహీరాబాద్, మెదక్, చేవెళ్ల స్థానాలు)కు చెందిన కరీంనగర్ ఎంపీ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ బూత్, ఆ పైస్థాయి కార్యకర్తలు దాదాపు 20 వేల మందితో భేటీ కానున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో మహిళా వృత్తి నిపుణులు, వివిధ రంగాల ప్రముఖులు, మేధావులతోనూ సమావేశం కానున్నారు.
29న భేటీలకు ఛుగ్, మీనన్ వచ్చే ఏప్రిల్ లేదా మేలో లోక్‌సభ ఎన్నికలు జర గొచ్చుననే అంచనాల నేపథ్యంలో పూర్తిస్థాయి సన్న ద్ధతపై పార్టీ నాయకత్వం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఆదివారం అమిత్ షా పాలమూరులో వచ్చే ఎన్నికల్లో పార్టీ అనుచరించాల్సిన కార్యాచరణ, వ్యూహంపై నాయకులు, కార్యకర్తలకు వివరించనున్నారు. కరీంనగర్‌లో.. పోలింగ్ బూత్ కమిటీ, ఆ పైస్థాయి కార్యకర్తలు ఇంటింటికీ (జనసంపర్క్ అభియాన్) వెళ్లి పదేళ్లలో మోదీ సర్కార్ సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రచారం నిర్వహించి, కమలం గుర్తుకు ఓటేయాల్సిందిగా కోరేలా దిశానిర్దేశం చేయనున్నారు.
హైదరాబాద్‌లో జరిగే మహిళా వృత్తినిపుణుల సమ్మేళనంలోనూ బీజేపీ అధికారంలోకి వచ్చాక చేపట్టిన కార్యక్రమాలు వివరించడం ద్వారా మహిళల మద్దతును కూడగట్టే ప్రణాళికను అమలు చేయనున్నారు. దీనికి కొనసాగింపుగా ఈ నెల 29న జరిగే కరీంనగర్ క్లస్టర్ ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీ సమావేశానికి పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి, రాష్ట్ర ఇన్‌చార్జి తరుణ్‌ఛుగ్ హాజరుకానున్నారు. అదేరోజు ఆదిలాబాద్ ఎంపీ క్లస్టర్ (ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్ సీట్లు) పరిధిలో నిర్వహించనున్న ఎన్నికల నిర్వహణ కమిటీ భేటీలో జాతీయ కార్యదర్శి, రాష్ట్ర సహ ఇన్‌చార్జి అర్వింద్ మీనన్ పాల్గొననున్నారు.
టికెట్లకు పోటీ
ఒకవైపు పార్టీ ఎన్నికలకు సమాయత్తం అవుతుంటే మరో టికెట్ల కోసం పారీ్టలో తీవ్ర పోటీ నెలకొంది. అయితే సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్‌లో సిట్టింగ్ ఎంపీలనే మళ్లీ పోటీకి దింపే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మిగతా 13 స్థానాల్లో వివిధ రూపాల్లో నిర్వహించే సర్వేల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారని సమాచారం. మోదీ ఆకర్షణ, అభివృద్ధి నినాదం పనిచేస్తుందన్న అంచనాల నేపథ్యంలో.. తెలంగాణలో మెజారిటీ ఎంపీ సీట్లలో బీజేపీ గెలిచే అవకాశాలున్నాయని పార్టీ నాయకత్వం ధీమా వ్యక్తం చేస్తోంది. రాష్ట్రంలోని అయిదారు మంది సిట్టింగ్ ఎంపీలు బీజేపీ వైపు చూస్తున్నట్టు బీజేపీ నేతలు చెబుతున్నారు. వారు ఇప్పటికే పార్టీ నాయకత్వంతో టచ్‌లోకి వచి్చనట్టు ప్రచారం జరుగుతోంది. ఇలావుండగా రాష్ట్రంలోని మొత్తం 17 సీట్లలో 5 బీసీలకు, 3 రెడ్డి, 5 ఎస్సీ.. ఎస్టీ, వెలమ, కమ్మ, బ్రాహ్మణ, లింగా యత్ లేదా వైశ్య సామాజిక వర్గాలకు ఒక్కొక్కటి చొప్పున కేటాయించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల విశ్వసనీయ సమాచారం.
అమిత్ షా పర్యటన షెడ్యూల్
- ఆదివారం ఢిల్లీ నుంచి ఐఏఎఫ్ ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 1.05 నిమిషాలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
- అక్కడి నుంచి బీఎస్‌ఎఫ్ హెలికాప్టర్‌లో 1.40కి మహబూబ్‌నగర్‌కు చేరుకుంటారు.
- 2.40 దాకా సుదర్శన్ ఫంక్షన్ హాల్లో జరిగే క్లస్టర్ మీటింగ్‌లో పాల్గొంటారు
- తర్వాత హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 3.55కు కరీంనగర్‌కు చేరుకుంటారు.
- సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య ఎస్‌ఆర్‌ఆర్ కాలేజీలో జరిగే సమావేశంలో పాల్గొంటారు.
- 6 గంటలకు హైదరాబాద్ చేరుకుని, 6.15 నుంచి 7.05 వరకు జేఆర్‌సీ కన్వెన్షన్ హాలు లో మహిళా వృత్తి నిపుణులు, ఇతరులతో భేటీ అవుతారు.
- రాత్రి 7.45 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళతారు.
Comments
Please login to add a commentAdd a comment