అధ్వానంగా మారిన కోడుమూరు మండలం కృష్ణాపురం మీదుగా కృష్ణగిరి మండలానికి వెళ్లే రోడ్డు
సాక్షి, కర్నూలు: తెలుగుదేశం ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో గ్రామీణ రోడ్లకు నయా పైసా విడుదల చేయలేదు. ‘ రహదారులు నాగరికతకు చిహ్నాలు ’ అంటారు కానీ.. వాటి ఏర్పాటును మాత్రం అప్పటి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. కేంద్ర ప్రభుత్వ పుణ్యమా అని గ్రామాల్లో ఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద కొంత మేర సీసీ రోడ్లు వేశారే కానీ.. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలోని గ్రామీణ రోడ్లను మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. దీంతో జిల్లాలోని అనేక గ్రామాలకు సంబంధించిన రోడ్లు అధ్వానంగా మారాయి. పలు ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో ఛిద్రమై పోవడంతో రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత వర్షాకాలంలో గతుకుల రోడ్లపై ప్రయాణం గ్రామీణులకు నరకప్రాయంగా మారింది. కనీసం గుంతలు పడిన ప్రాంతాల్లో మట్టితో పూడ్చేందుకు కూడా గత ప్రభుత్వం నిధులను విడుదల చేయలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఆర్‌ఆర్‌ఎం–2 ప్రతిపాదనలు బుట్టదాఖలు
గ్రామీణ ప్రాంతాల్లో కొత్త రోడ్లు వేసేందుకు, పాత రోడ్లకు మరమ్మతులు చేపట్టేందుకు అవసరమైన ప్రతిపాదనలు పంపితే రూరల్ రోడ్స్ మెయింటెనెన్స్(ఆర్‌ఆర్‌ఎం)–2 కింద నిధులు విడుదల చేస్తామని అప్పటి ప్రభుత్వం తెలిపింది. దీంతో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ వర్గాలు ఆగమేఘాలపై జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 1,682.01 కిలోమీటర్ల మేర 503 రోడ్డు పనులు చేపట్టేందుకు రూ.189.95 కోట్లతో అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. అయితే..ఈ ప్రతిపాదనలకు అవసరమైన నిధులు ప్రభుత్వం వద్ద లేకపోవడంతో బ్యాంకుల నుంచి రుణంగా తీసుకోవాలని అప్పటి పాలకులు పీఆర్ ఈఎన్‌సీకి సూచించారు. దీంతో రుణం తీసుకునేందుకు ఆంధ్రా బ్యాంకును సంప్రదించగా, వారు చేతులెత్తేయడంతో నాడు పంపిన ప్రతిపాదనలు బుట్టదాఖలయ్యాయి.
బడ్జెట్ రాలేదు
ఆర్‌ఆర్‌ఎం–2 కింద జిల్లాలోని గ్రామీణ రోడ్లకు సంబంధించి గతంలో ఎలాంటి బడ్జెట్ రాలేదు. అప్పటి ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని గ్రామాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రోడ్ల నిర్మాణాలకు రూ.189.95 కోట్లతో ప్రతిపాదనలు పంపాం. పనులు ప్రారంభించని వాటిని, 25 శాతంలోపు చేసిన పనులను ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా రద్దు చేస్తున్న నేపథ్యంలో ఆర్‌ఆర్‌ఎం–2 కింద పంపిన ప్రతిపాదనలు కూడా రద్దవుతాయి. – సీవీ సుబ్బారెడ్డి, పీఆర్ ఎస్‌ఈ
Comments
Please login to add a commentAdd a comment