కర్నూలు (అర్బన్): ‘నాసిరకంగా రోడ్లు నిర్మించి..ప్రజా ధనాన్ని అధికార పార్టీ నేతలు దోచుకుతింటున్నా ప్రభుత్వానికి పట్టదా’ అంటూ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ భవనంలో బుధవారం.. జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు జరిగాయి. జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశాల్లో ఎమ్మెల్సీ గంగుల మాట్లాడుతూ.. ఆళ్లగడ్డ పరిధి లో వేస్తున్న రోడ్లలో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదన్నారు. నాసిరకం కంకర వేస్తుండడంతో వేసిన కొద్దిరోజులకే పాడైపోతున్నాయని సమావేశం దృష్టికి తీసుకువచ్చారు.
ఎర్రగుంట్ల– యు.కొత్తపల్లి రోడ్డు పూర్తిస్థాయిలో శిథిలావస్థకు చేరిందన్నారు. డోన్ జెడ్పీటీసీ సభ్యుడు శ్రీరాములు మాట్లాడుతూ.. రోడ్ల నిధుల కోసం కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్నా నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని ఆరోపించారు. వ్యవసాయానికి 12గంటలు నిరంతరాయంగా విద్యుత్‌ను సరఫరా చేయాలని చిప్పగిరి జెడ్పీటీసీ మీనాక్షి నాయుడు కోరారు. జెడ్పీటీసీలకు పది నెలలుగా వేతనాలు అందలేదని బేతంచెర్ల జెడ్పీటీసీ సభ్యురాలు పద్మావతి సమావేశం దృష్టికి తీసుకొచ్చారు.
సీఈఓ విశ్వేశ్వరనాయుడు స్పందిస్తూ.. ఈ ఏడాది జూన్ నెల వరకు జెడ్పీటీసీ సభ్యులకు సంబంధించిన వేతనాలు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. డోన్ మండలంలో ఫీల్డ్ అసిస్టెంట్లు తమకు కావాల్సిన వారికి మాత్రమే ఉపాధి పనులు కల్పించినట్లు చూపించి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, దీనిపై వెంటనే విచారణ జరిపించాలని జెడ్పీటీసీ సభ్యుడు శ్రీరాములు కోరారు. గూడూరు మండలంలో నిర్మించుకున్న గృహాలకు సంబంధించి ఇంతవరకూ రెండు నెలలుగా బిల్లులు రావడం లేదని జెడ్పీటీసీ సభ్యురాలు నాగజ్యోతి సమావేశం దృష్టికి తీసుకువచ్చారు.
కరువుపై నిర్లక్ష్యం వద్దు..
కరువు పరిస్థితులను అంచనా వేయడంలో అధికారులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని జెడ్పీ చైర్మన్ రాజశేఖర్ మండిపడ్డారు. అధికారులు ఇచ్చిన తప్పుడు సమాచారంతో జిల్లా అంతటా కరువు తాండవిస్తున్నా.. 37 మండలాలను మా త్రమే కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించిందన్నారు. జిల్లా మొత్తాన్ని కరువు ప్రాంతం గా ప్రకటించాలని తీర్మానం చేస్తున్నట్లు చెప్పారు. మైనింగ్ నిధులను ఒక్కో మండలానికి రూ.10 లక్షల ప్రకారం తాగునీటి అవసరాలకు కేటాయించామని, ఏయే మండలాల్లో పనులు ప్రారంభించారని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను ప్రశ్నించారు. ప్యాపిలి జెడ్పీటీసీ సభ్యుడు దిలీప్ చక్రవర్తి మాట్లాడుతూ ఆయా పనులకు సంబంధించి వర్క్ ఆర్డర్లు ఇవ్వకపోవడంతో పనులు ప్రారంభించలేకపోతున్నామన్నారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగే నాటికి జిల్లాలోని క్వారీలు, క్రషర్ యూనిట్ల వివరాలను అందించాలని మైనింగ్ అధికారులను జడ్పీ చైర్మన్ ఆదేశించారు. సీపీఓ ఆనంద్‌నాయక్, ఎస్‌ఎస్‌ఏ పీఓ తిలక్ విద్యాసాగర్, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment