ఆలూరులో సీసీ రోడ్డు వేస్తున్న దృశ్యం
పల్లె రోడ్లకు గ్రహణం వీడడం లేదు. నిధులొచ్చినా మహర్దశ పట్టడం లేదు. సర్కారు అశ్రద్ధ, అధికారుల అలసత్వం మూలంగా అలాగే ఉండిపోతున్నాయి. ఎప్పటికి బాగుపడతాయో తెలియక గ్రామీణులు నిట్టూరుస్తున్నారు. జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ రోడ్ల నిర్మాణ పనులు నత్తతో పోటీ పడుతున్నాయంటే అతిశయోక్తి కాదు. నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాల్సిన పనులు తీవ్ర ఆలస్యం కావడంతో రాష్ట్ర స్థాయిలో జిల్లా ప్రగతి ఏకంగా 11వ స్థానానికి పడిపోయింది.
కర్నూలు(అర్బన్): గ్రామీణ రోడ్ల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. నిధులు రావడంతో రోడ్లు బాగుపడతాయని ఆశించిన పల్లెవాసులకు నిరాశే ఎదురవుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని అన్ని పంచాయతీరాజ్ సబ్ డివిజన్లలో రూ.51.22 కోట్ల వ్యయంతో 225 కిలోమీటర్ల (కి.మీ) మేర సీసీ రోడ్లు నిర్మించాల్సి ఉంది. అయితే, ఇప్పటి వరకు రూ.31.14 కోట్ల వ్యయంతో 103.80 కి.మీ. మేర మాత్రమే నిర్మించారు. గతంలో ఇచ్చిన 225 కి.మీ. లక్ష్యానికి అదనంగా ఈ నెల 24వ తేదీన మరో 139 కి.మీ. మేర సీసీ రోడ్లను నిర్మించాలని పంచాయతీ రాజ్ కమిషనరేట్ నుంచి ఉత్తర్వులు అందాయి. ఈ నేపథ్యంలో సీసీ రోడ్ల నిర్మాణాల్లో జిల్లా ప్రగతి చివరి స్థానానికి చేరుకున్నట్లు తెలుస్తోంది.
ఇక బీటీ రోడ్ల నిర్మాణాల్లోనూ ఎనలేని జాప్యం చోటు చేసుకుంటోంది. జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.132 కోట్ల వ్యయంతో 221 కి.మీ. మేర బీటీ రోడ్లు నిర్మించాల్సి ఉంది. ఇప్పటి వరకు రూ.66.39 కోట్ల వ్యయంతో 110.65 కి.మీ. మేర మాత్రమే పూర్తి చేశారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, పార్లమెంట్ సభ్యుల నిధులు, 14వ ఆర్థిక సంఘం నిధులు, స్పెషల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్, స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్స్, డిస్ట్రిక్ట్ మైనింగ్ ఫండ్స్ తదితర మ్యాచింగ్ గ్రాంట్లతో ఈ రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. వీటి ప్రగతిలో జిల్లా స్థానం 11కు పడిపోవడంతో కలెక్టర్ సత్యనారాయణ పీఆర్ ఎస్‌ఈపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పనుల్లో వేగం పెంచాలంటూ ఇటీవల జరిగిన సమీక్షలో
పీఆర్ ఎస్‌ఈ సుబ్బరాయుడుకు నోట్ కూడా పంపినట్లు సమాచారం.
జిల్లాలో మొత్తం 13 పీఆర్ సబ్ డివిజన్లు ఉన్నాయి. నాలుగింటిలో సీసీ రోడ్ల నిర్మాణాలు తీవ్ర జాప్యం అవుతున్నాయి. కోడుమూరు సబ్ డివిజన్‌లో 17.50 కి.మీ మేర సీసీ రోడ్లు వేయాల్సి ఉండగా.. కేవలం 6.16, పత్తికొండ సబ్ డివిజన్‌లో 18.31 కి.మీకి గాను 6.25, నందికొట్కూరులో 17.50 కి.మీకి గాను 6.94, ఆదోని సబ్ డివిజన్‌లో 8.20 కి.మీకి గాను కేవలం 1.67 కి.మీ మేర మాత్రమే రోడ్లు వేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
వేగం పెంచేందుకు చర్యలు
సీసీ, బీటీ రోడ్ల నిర్మాణాలు వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పలు ప్రాంతాల్లో మెటల్ లభించడం కొంత కష్టసాధ్యంగా మారింది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో చేపట్టిన పనుల్లో కొంత జాప్యం జరుగుతున్నట్లు సంబంధిత ఇంజినీర్లు మా దృష్టికి తెచ్చారు. కలెక్టర్ ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని కింది స్థాయి ఇంజినీర్లను ఆదేశించాం. దీంతో రెండు రోజుల్లోనే ఏడు కిలోమీటర్ల మేర సీసీ రోడ్ల నిర్మాణాలు పూర్తి చేసినట్లు రిపోర్టులు వచ్చాయి. నిర్ణీత సమయంలోగా అన్ని పనులను పూర్తి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నాం. – కేవీ సుబ్బరాయుడు, పీఆర్ ఎస్‌ఈ
Comments
Please login to add a commentAdd a comment